సర్వశక్తిసమన్విత అయిన అమ్మ పూర్ణత్వాన్ని, ఏకత్వాన్ని దర్శించింది. ప్రశాంత తేజ స్వరూపిణి. సృష్టి మాయామయం. నానాత్వం దాని లక్షణం. నిత్య వ్యవహారంలో సంకుచిత స్వార్థానికి వంచనకు తావు లేకుండా ఉండడం సమన్వయం, ఘర్షణ లేకుండా జీవించడం ఎందువల్లనంటే నానాత్వం స్థిరం కాదు. మారిపోవడం తప్పదు. తరంగ, ఫేన, బుద్బుదాలు సముద్రంలో కలవడం సత్యం. మనోవాక్కాయములకు భేదం లేకపోవడం సమన్వయం. అమ్మస్థితి అదే. పూర్ణత్వం. ఏకత్వం. శోక మోహాలకు చోటులేని సిద్ధావస్థ. అందరమ్మ – అందరిల్లు – అన్నపూర్ణాలయం సమన్వయానికి ఉదాహరణలు. మన కన్నతల్లులు వేరైనా అందరం అనసూయమాతను అమ్మగా భావిస్తాం ఆరాధిస్తాం. అమ్మ మీరందరూ నా ‘ బిడ్డలే కాదు, నా అవయవాలు అన్నది. అంటే మనందరిలో ఏకత్వాన్ని చూస్తున్నది అనుభవ పూర్వకంగా.
విభిన్న మనస్తత్వాలు కలవాళ్ళు కలిసిమెలిసి జీవిస్తున్న దేవాలయం అందరిల్లు, ఏ భేదం పాటించకుండా ఎల్లవేళలా ఎందరికైనా అన్నంపెట్టే అన్నపూర్ణాలయం, మనశ్శాంతికి నిలయాలు దేవాలయాలు. ఇది అమ్మ ఆచరించి చూపించిన సమన్వయ స్వరూపం. తన బిడ్డలు పూర్ణమానవులుగా పరిణమించడానికి సామరస్యపూర్వక సహజీవనాన్ని సమన్వయసూత్రంగా అనుగ్రహించింది.