కావ్యరచనలో గాని, పద్యరచనలో గాని ఔచిత్యప్రాధాన్యత లేకపోతే రససిద్ధి కలగదు. అమ్మవారిని తలచుకున్నప్పుడు అయ్యవారు కూడా స్ఫురించాలి. అది సమయాచార పద్ధతి. ఆదిశంకరులు సౌందర్యలహరి స్తోత్రం రచించినా, శివానందలహరి రచించినా, కనకధారా స్తోత్రం రచించినా సమయాచార సంప్రదాయాన్ని పాటించిన విధానం కమనీయం. అలాగే పూర్వకవులు అనేకమంది ఈ సంప్రదాయాన్ని గౌరవించి పాటించారు తమ రచనలలో.
అల్లసాని పెద్దన రచించిన ప్రబంధం మనుచరిత్రలో ప్రార్థనా పద్యాలలో ఒక అందమైన పద్యం వుంది. చాలామందికి పరిచయం వున్న పద్యమే అది.
అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధము లానువేళ బా
ల్యాంక విచేష్ట తొండమున నవ్వలిచన్ కబళింపబోయి యా
వంక కుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడు గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్ ॥
ఈ పద్యం ప్రధానంగా వినాయకుని ప్రార్ధన. పార్వతీ తనయుడైన వినాయకుడు తల్లి ఒడిచేరి స్తన్యపానము చేస్తున్నాడట. గణపతి, కుమారస్వామి వీరిద్దరూ నిత్య శిశుప్రాయులు. శిశువైన వినాయకుడు అమ్మవారి స్తన్యపానము చేస్తున్నప్పుడు, ఇతర పిల్లల వలెనే అవతలి స్తనమును తడమటం సామాన్యంగా జరుగుతూ వుంటుంది. ఇక్కడ పరమేశ్వరుని తలచుకునే అవకాశం కవికి వచ్చింది. అమ్మవారిని అర్ధనారీశ్వర రూపంలో తలచుకున్నాడు. అమ్మవారు అర్ధనారీశ్వర రూపంలో వున్నప్పుడు కుడిభాగం పరమేశ్వరుడు కదా! అక్కడ వక్షోజం వుండదు. పరమేశ్వరుని కంఠాభరణం సర్పం. బాలుడైన వినాయకుడు అటువేపు తడిమితే సర్పం తగిలింది. వినాయకుడు గజాననుడు. ఏనుగులు సరస్సులలో దిగినప్పుడు తామరతూడులను తొండంతో తెంపివేయటం సాధారణంగా జరుగుతుంటుంది. ఆ విధంగా చేతికి తగిలిన పాములను తామరతూడులని అనుకున్నాడట వినాయకుడు.
ఇక్కడ ఇంకొక చమత్కారం కూడా వుంది. పరమేశ్వరుని మెడలో వుండేది మామూలు సర్పం కాదు. సర్పరాజైన వాసుకి. “నమత్ సురాసుర మకుటాగ్ర రత్నరుచి శోభిత పాదునకు, అద్రినందనేశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడున్” అంటారు నన్నయ్య గారు మహాభారతం ఆది పర్వంలో. క్షీరసాగర మథనంలో మందర పర్వతం కవ్వంగా వుంటే ఆ కవ్వానికి తాడు వాసుకి. అంతటి మహాసర్పం వాసుకి వినాయకుడి తొండానికి తామరతూడులా తోచాడుట!! గణపతి విరాట్ తత్త్వానికి సూచన అది.
ఏనుగుల స్వభావాన్ని స్ఫురింపచేయటానికి గజాస్యుడు అనే పదం వాడటం, పరమేశ్వరుని స్ఫురింపచేయటానికి ‘అహి వల్లభ హారం’ అనే పదం వాడటం, కవి సమయస్ఫూర్తికి ఉదాహరణ. ఈ విధంగా గణపతి ప్రార్ధన చేసే ఒక్క పద్యంలో అమ్మవారిని, అయ్యవారిని కూడా తలచుకునే విధంగా రచించటం కవి ప్రతిభకు తార్కాణం.
జగన్మాత బిడ్డకు పాలిస్తున్న వాత్సల్యపూరిత దృశ్య వర్ణన, పార్వతీ పరమేశ్వరులనూ, వారి తనయుడైన గజాననుడినీ ఈ విధంగా ధ్యానిస్తే అభీష్ట సిద్ధి కలగకుండా ఎలా వుంటుంది?
పైన వివరించిన ప్రార్ధనలో గాని, వర్ణనలో గాని మనం ముఖ్యంగా అర్థం చేసుకోవలసింది సమయాచారం. అమ్మవారిని స్మరించినప్పుడు అయ్యవారిని కూడా స్మరించాలి. ఒకరిని విడిచి ఒకరిని మాత్రమే ధ్యానిస్తే అది పరిపూర్ణం కాదు ‘శ్రీచక్రం శివయోర్వపుః’ అనే ఉపనిషద్వాక్యాన్ని గుర్తుంచుకోవాలి. శ్రీ చక్రం శివాశివుల శరీరమే!
అమ్మ మనకు దేవుడైతే, అమ్మకు నాన్నగారు దేవుడు. అమ్మను తలచుకున్నప్పుడల్లా నాన్నగారిని కూడా తలచుకోవాలి. అలాగే హైమక్కయ్యను కూడా. హైమక్కయ్య గణపతి, కుమారస్వామి, ఆంజనేయ స్వామి వారల సమిష్టి రూపమని అమ్మే స్వయంగా చెప్పిన వాక్యం ఇక్కడ సంస్కరణీయం.
అమ్మను ప్రార్థించిన దానికన్నా అమ్మను నాన్నగారిని సమిష్టిగా స్మరిస్తే అమ్మ ఎక్కువగా కరుణిస్తుంది. అది మనం మరచిపోకుండా వుండటానికే అమ్మ తన ఆలయానికి “అనసూయేశ్వరాలయము” అని పేరుపెట్టింది. అంటే అనసూయా సమేత నాగేశ్వర ఆలయము అని గానీ, లేక నాగేశ్వర సహిత అనసూయా ఆలయమని గానీ వివరణ ఇవ్వవచ్చు. అది సమయాచారానికి ప్రతీక. ఆలయంలో దర్శనమిచ్చేది అమ్మ స్వరూపమే అయినా అప్రకటిత శక్తి నాన్నగారు. ప్రకాశ విమర్శాత్మక స్వరూపమే అనసూయేశ్వరాలయం. ఆ పక్కనే హైమాలయం. మానవాళి అభీష్ట సిద్ధికి ఇంతకన్నా సులభమార్గం వేరే ఏముంది?
—
ఆధారం
“అమ్మ అంతులేనిది; అడ్డులేనిది; ఆధారమైనది. ఆధారమంటే ఇప్పుడు మీరున్నారు. ఉయ్యాల 5 మీద కూర్చున్నారు. మీకు బల్ల ఆధారం; బల్లకు గొలుసు ఆధారం; గొలుసుకు దూలం; దూలానికి గోడలు; గోడలకు భూమి; భూమికి ఆకాశం – ఇట్లా ఆధారం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
పూలు ఉన్నాయనుకో వాటికి దారం ఆధారం; దండ గుచ్చటానికి పూలకు కొమ్మ; కొమ్మకు చెట్టు; చెట్టుకు భూమీ ఆధారం. దీనికి ఆధారత్వానికి అంతు ఏముంది? సర్వానికీ సర్వమూ ఆధారం.”
– అమ్మ