సర్వాత్మ దర్శనము భగవత్ గీతకు మూల సిద్ధాంతము. కనుపించేదంతా ఆత్మగా తోచడమే ఆత్మాసాక్షాత్కారం అంటుంది అమ్మ. ఈస్థితి అనుభవానికి రావాలంటే- శత్రువుల ఎడల మిత్రులఎడల సమత్వ భావంఉండాలి. అంతేకాదు మానావమానముల యందు కూడా సమత్వ స్థితి ఉండాలి. అందుకు అమ్మ తన బిడ్డలను ఎలా మలుచుకుంటుందో ఆ శిక్షణ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
1975వసంశత్సరంలో గోపాల్ అన్నయ్య (కెబిజి గోపాల్ కృష్ణమూర్తిగారు) కొన్ని అపనిందలకులోనై మానసికంగా బాధపడుతున్నాడు. తల్లిగదా! బిడ్డబాధను చూడలేక పోయింది. మానావమానాలు, శతృత్వ తృత్వాలు మనోధర్మాలు గాని ఆత్మధర్మాలు కావుగదా. అందుకే ఒకరోజు గోపాలన్నయ్యను వాత్సల్యాలయానికి పిలిపించి గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతూ నీకు బ్రహ్మోపదేశం చేస్తాను. దానిని నీవు ఆచరించు అన్నది. అన్నయ్య బ్రహ్మపదేశం అనగానే ఆనందపడుతూ యేమిచెబుతుందో అని ఎదురు చూస్తున్నాడు కాని అమ్మ చెప్పింది మంత్రం కాదు – మంత్రం లాంటి మాటలు.
“గంగాళం పాలలో ఒక్కచుక్క విషం పడ్డాపాలు మొత్తం విషపూరితం అవుతాయి. నీ హృదయం పాలలాంటిది. అందులో ఒక్క విషబిందువు పడనీయబోకు” అన్న అమ్మ మాటలు అన్నయ్య మీద మంత్రం లాగా పనిచేయడం మొదలైంది. ఆక్షణం నుండి ఎవరు ఏమి అన్నా ఏమిచేసినా వారిని ప్రేమించడం అలవాటయింది. ఒకవేళ ఆవేశంలో కోపం వచ్చినా, తనతో మాట్టాడక పోయినా తనేవారితో మాట్లాడితే ప్రేమిచడం కూడా అలవాటయింది. అపుడు విరోధులంటూ ఎవరుంటారు? ఈ విధంగా మారిన అన్నయ్యకు శత్రువులయందును, మిత్రుల యందును సోదర భావాన్ని కలిగించి మానవ మానముల యందుకూడా సమస్థితిని కలిగించి ఆత్మాను భవానికి ఆయత్తపరిచింది అమ్మ. మరొక సంఘటన ద్వారా నిందాస్తుతులకు ఎలా ఉండాలో అన్నయ్యకు తెలియచేసింది. అదీ 1973 స్వర్ణోత్వవాల సమయం. అందుకు కావలసిన ఆర్థిక వనరులు కొరకు సోదరులందరు తమవంతు ప్రయత్నంగా చందాలుకోసం తిరుగుతున్నారు. సోదరులు కొండముది రామకృష్ణ, గోపాల్ అన్నయ్య అమ్మ ఆశీస్సులకై అమ్మకు నమస్కరించారు. వారిద్దరికి నుదుట కుంకుమదిద్ది కుంకుమ పొట్లాలు యిచ్చి ధోవతులు. ఉత్తరీయములు పెట్టి ఆశీర్వదించింది. అందులో గోపాల్ అన్నయ్య నాకు ఉత్తరీయమువేసుకునే అలవాటులేదు కదమ్మా! అంటూ అక్కడే పెట్టారు. అదిచూచిన అమ్మ “నీవు” ఉత్తరీయం వేసుకొని కులకటానికి పోవటంలేదు. అందరి దగ్గర ఒడి పట్టడానికి వెళుతున్నావు. ఆ ఒడిలోఎవరు ఏమివేస్తారో తెలియదు. ఒకరు రూ 10/ వేయవచ్చు. ఒకరు రూ1116/- వెయ్యవచ్చు, ఒకరు ఏమీవేయకుండానే “నీకే మైనా పనిపాటాలేదా? లక్షమందికి అన్నం పెట్టడమేమిటి? అందరిని అడుక్కోడమేమిటి? ఉంటేపెట్టాలి లేకపోతే మానెయ్యాలి. అమ్మ పేరుతో ఇలా అడుక్కుంటానికి వచ్చారా?” అని తిట్టవచ్చు. ఏది వచ్చినా ఒడి పట్టటానికే మీకు ఈ ఉత్తరీయము ఇస్తున్నాను. అంటూ ఆ ఉత్తరీయము గోపాల్ అన్నయ్య మెడలో వేసింది అమ్మ గోపాల్ అన్నయ్య చెప్పినట్లు నిందా స్తుతులను ఎదుర్కుంటున్న అమ్మ ఆశీర్వచనం ప్రభావం చేత వాటిని తట్టుకొని స్థిత ప్రజ్ఞుడుగా తయారయ్యాడు – ఇది అమ్మ గురువుగా అందించే శిక్షణ గదా!
పదిమందికోసం అడగటం అది అడగటం, తనకోసం అడగటం – అడుక్కోవటం”. “అమ్మ”.