1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సమస్త భక్త సుఖదా

సమస్త భక్త సుఖదా

Mallapragada Srivalli
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : May
Issue Number : 10
Year : 2012

“భక్తులందరికీ సుఖాన్నిచ్చేది. ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అని భక్తులు నాలుగు విధాలు. వారందరికీ సుఖాన్నిచ్చి, సంతోషింప చేసే లలితాదేవి సమస్త భక్త సుఖద” – భారతీవ్యాఖ్య.

ఇంచుమించుగా ఒకే అర్థం కలిగిన రెండు పదాలు – ప్రేమ, భక్తి. “ప్రేమ ఒక్కటే. స్థానాన్ని బట్టి పేర్లు మారుతుంటాయి” “అమ్మ”. భగవంతునిపై భక్తునికి గల ప్రేమే భక్తి. భక్తుడు తన సర్వస్వాన్నీ భగవంతునికి సమర్పించి, ఆరాధించడమే భక్తి. అంటే, ప్రేమ యొక్క పరిపక్వ స్థితే భక్తి. ప్రేమలో కంటే భక్తిలో సేవాభావం కూడా కనిపిస్తుంది. భక్తి పరాకాష్ఠకు చేరితే అదే జ్ఞానం. ప్రేమ – పిందె అయితే భక్తి – కాయ. పండిన పండే జ్ఞానం. అంటే ఒకే భావానికి గల మూడు స్థితులే – ప్రేమ, భక్తి, జ్ఞానం. “భక్తి బాల్యం వంటిది. జ్ఞానం వృద్ధాప్యం వంటిది” – “అమ్మ”. మానవజీవితంలోని వివిధ మైనాడు. దశలలో ఒకటి బాల్యం, మరొకటి వృద్ధాప్యం. బాల్యం అంటే తెలియనితనం. వృద్ధాప్యం అంటే తలపండిన దశ.

సత్యభామ శ్రీకృష్ణుణ్ణి భర్తగా ప్రేమించింది. రుక్మిణిప్రేమ భక్తిగా పరిణమించి, శ్రీకృష్ణుణ్ణి భగవంతునిగా ఆరాధించింది. “ప్రేమకంటె భక్తి గొప్పది” – “అమ్మ” ప్రేమ, భక్తి మధ్య గల తారతమ్యాన్ని చక్కగా తెలియజెప్పే ఇతివృత్తమే శ్రీకృష్ణతులాభారం. ఇది కల్పితకథే. అయినా, భక్తి గొప్పదనాన్ని సామాన్య మానవులకు స్పష్టం చేసే సన్నివేశం ఇది. సత్యభామకు గల ఏడువారాల నగలూ, శ్యమంతకమణి ద్వారా లభించిన ఏడు బారువుల బంగారమూ కూడా శ్రీకృష్ణునితో తులతూగలేకపోయాయి. కాని, రుక్మిణీదేవి భక్తితో సమర్పించిన ఒకే ఒక్క తులసిదళం వైపు మొగ్గుచూపి, భగవంతుడు భక్తికి వశుడై పోతాడని నిరూపించిన ఘట్టం శ్రీకృష్ణతులాభారం.

శ్రీరామునిపై హనుమంతునికి గల భక్తి అనన్య సామాన్యం. హనుమ రోమరోమమున రామనామం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. “నామంతో గుండెలో గుడికట్టుకో నాన్నా!” – “అమ్మ”. అవును. ఆంజనేయుడు చేసిన పని ఇదే. నిరంతర రామనామజపం కారణంగా హనుమ హృదయమనే కోవెలలో సీతారాములు నిండుగా కొలువుతీరి ఉన్నారు. “మీరు కానిది నేనేదీ కాదు నాన్నా!” “నేను మాత్రంమీకంటే భిన్నంగా దేవుణ్ణి చూడలేదు” – “అమ్మ”. ఈ వాక్యాల్లో “అమ్మ” – భక్తునికీ, భగవంతునికీ అభేదమనే సూచన చేసింది. భగవంతుని కంటే భక్తుడు వేరు కాదు అనే విషయ నిరూపణకు నిలువెత్తు నిదర్శనమే హనుమంతుడు. శ్రీరామచంద్రునికి బంటు మాత్రమే కాదు, గొప్ప రామభక్తుడు ఆంజనేయుడు. శ్రీరామునిపై గల నిరుపమానమైన భక్తి వల్లనే మారుతి మనకు ఆరాధ్యదైవమైనాడు 

“శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం…” అని భాగవతంలో ప్రహ్లాదుడు తన తండ్రికి నవవిధాలైన భక్తిలక్షణాలను గురించి వివరించాడు. ఇలా తొమ్మిది లక్షణాలతో విలసిల్లే భక్తి కలిగిన సమస్త భక్తులకు, సుఖాలను అనుగ్రహించే శ్రీమాత సమస్త భక్తసుఖద. తన భక్తులందరికీ వారు కోరుకున్న సుఖాలను ప్రసాదించే శ్రీదేవి సమస్త భక్త సుఖద.

 “అమ్మ” సమస్తభక్తసుఖద. “అమ్మ” శ్రీరామచంద్రమూర్తి అయితే, హైమక్క – హనుమ. నిర్విరామరామనామజపంతో ఆంజనేయస్వామి శ్రీరామభద్రునితో తాదాత్మ్యం చెంది భగవంతుని స్థానాన్ని పొంది, మన పూజలను అందుకుంటున్నాడు. “అమ్మ” నామపారాయణప్రీత అయిన హైమక్క మనకు కొంగు బంగారంగా, ఆరాధ్యదేవతగా, వాంఛితార్థ ప్రదాయినిగా ఆలయంలో ‘సుప్రతిష్ఠ’యై, తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది.

హైమక్క తన జీవితకాలంలో ఎప్పుడూ, ఏదో ఒక శారీరక వ్యాధితో బాధపడుతూ ఉండేది. అయినా, ఏనాడూ “అమ్మ”ను పల్లెత్తు మాట అని ఎరుగదు. “అమ్మ”ను ఒకే ఒక్క కోరిక కోరుకునేది. “అమ్మా! నన్ను ముందు పంపించి, తర్వాత నువ్వు” అని. జబ్బుతో బాధపడుతూ “అమ్మా! వీళ్ళెవ్వరూ లేకుండా నువ్వూ నేనూ ఉండే చోట ఉండాలని ఉంది” అని అర్థించి, “అమ్మ” నుంచి “అట్లాగే” అని మాట తీసుకుంది. దివ్యమైన వరాన్ని పొందింది. ఇహలోక బాధల నుంచి హైమక్కకు విముక్తి కలిగించిన “అమ్మ”, తాను ఉండే చోటులో హైమక్కకు స్థానం కల్పించి, తన మాట నిలబెట్టుకుంది. సమస్తభక్తసుఖదగా మనకు సాక్షా త్కరించింది.

నిరుద్యోగులకు జీవనభృతిని, అవివాహితులకు వివాహాన్ని, పిల్లలను కోరుకున్న వారికి సంతానాన్ని, రోగగ్రస్తులకు ఆరోగ్యాన్ని, శాంతిభద్రతలను ఆశించిన వారికి ప్రశాంతతను, జ్ఞానం, మోక్షం ఆకాంక్షించిన వారికి “సుగతి”ని ప్రసాదించిన “అమ్మ” – సమస్త భక్తసుఖద. “అడిగినవాళ్ళకు అడిగినదే ఇస్తాను. ఆడగని వాళ్ళను అవసరమైనది ఇస్తాను” అని స్పష్టంగా ప్రకటించిన “అమ్మ” సమస్త భక్త సుఖద.

అర్కపురీశ్వరి అనసూయా మహాదేవిని సమస్త భక్త సుఖదగా భావించి, భజించడం కంటే భవ్యమైనది మన జీవితాలకు మరొకటి ఏమున్నది ? జయహోమాతా! శ్రీ అనసూయా!

 (అమ్మా, అమ్మ వాక్యాలు సంకలనకర్తకు కృతజ్ఞతలు.)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!