1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సమాజానికి నడక నేర్పిన అమ్మ

సమాజానికి నడక నేర్పిన అమ్మ

Boppudi RamBrahmam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : June
Issue Number : 11
Year : 2012

అమ్మగా విశ్వవిఖ్యాతి గాంచిన మాతృశ్రీ అనసూయాదేవి గుంటూరు జిల్లాలోని బాపట్లకు 14 కి.మీ.ల దూరములో ఉన్న జిల్లెళ్ళమూడి కార్యక్షేత్రంగా సమాజానికి వినూత్న సందేశాన్ని ఆచరణాత్మకంగా ప్రబోధించింది.

అమ్మకు ప్రేమించడమూ, కరుణించడమూ సహజం. కానీ మన అర్హతను బట్టి కాదు. కారణం తల్లికి బిడ్డ అవసరమే కనిపిస్తుంది గానీ, యోగ్యతాయోగ్యతలు పరిగణనలోకి రావు. అమ్మ సకలసృష్టినీ తన సంతానంగా భావించింది. “మీరంతా నా బిడ్డలే కాదు, నా అవయవాలు” అంటూ నిజజగన్మాతృస్వరూపాన్ని దర్శింపచేసింది.

బిడ్డలందరినీ తన స్థితికి తీసుకు వెళ్ళాలనేది అమ్మ అపూర్వ ఆకాంక్ష. “మీరే నా ఆరాధ్యమూర్తులు” అంటూ వ్యక్తుల గుణాల్ని మాత్రమే శ్లాఘిస్తూ, దోషాల్ని ఎంచని అకారణ కారుణ్యమూర్తి. అట్టి సర్వత్రా పరివ్యాప్తమైన మమకారమే మాధవత్వం; అని అసలైన విశ్వజనీన ప్రేమ, మమకారం; స్వపరభేదమెరుగని నిస్సీమస్థితి; అతులిత అద్వైత పరాకాష్ఠ

తొలిరోజులలో జిల్లెళ్ళమూడి వచ్చినవారికి చూపింది. నాన్నగారింట్లోనే భోజనాలు; అమ్మయే స్వయంగా వండి వడ్డించేది. క్రమేణా వచ్చేవారి సంఖ్య వందలు, వేలు దాటింది. 1958 సంవత్సరం ఆగష్టు 15వ తేదీన అమ్మ పవిత్ర హస్తాలతో అన్నపూర్ణాలయం స్థాపించబడింది. నేటికి లక్షల మంది అక్కడ అమ్మ ప్రసాదం – అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అమ్మ అంటుంది, “అన్ని బాధల కంటే ఆకలి బాధ ఎక్కువ. ఆకలికి బీదవాడనీ, భాగ్యవంతుడనీ భేదం ఏమున్నది ? వచ్చినవాడి డ్రస్సుని చూచి, అడ్రసు చూచి కాకుండా ఆకలే అర్హతగా అన్నం పెట్టాలి. విసుగు, విరామం లేకుండా ఆదరణ, ఆప్యాయతతో వడ్డించాలి. ఇక్కడికి ఆకలితో రావచ్చును, నాన్నా, కానీ ఇక్కడ నుండి ఎవరూ ఆకలితో వెళ్ళకూడదు” అని.

అమ్మ ఆహారం తీసుకోదు. కానీ “తినకపోతే మీరు చిక్కి పోతారు. మీకు పెట్టుకోకపోతే నేను చిక్కిపోతాను” అని అంటుంది. ప్రేమైక రసామృతమూర్తి అమ్మ. “మీకు పెట్టడం మీ చేత పెట్టించడం కోసమే” అంటూ పారమార్థిక విలువల్ని ఉగ్గుపాలతో రంగరించి పోస్తుంది.

వర్గాలకూ, వర్ణాలకూ, కులాలకూ, మతాలకూ అతీతంగా అందరూ ఒకే పంక్తిన ఆసీనులై భోజనం చేసే వ్యవస్థ సుందరమే కాదు, సర్వజగతికీ ఆదర్శం కూడా.

కూడు – గుడ్డల తర్వాత అందరికి అవసరం వసతి. అమ్మ బాల్యంలోనే “అన్ని గ్రామాల్లో అందరూ అందరి ఆస్తులు కలుపుకొని ఎవరి వృత్తి వారు చేసుకుంటూ ఒకే చోట ఉంటే ఒకే రకంగా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది” అని మనసారా ఆశించింది. “అందరిల్లు” ఆవిర్భావంతో అమ్మ అపురూప సంకల్పం క్రియారూపం ధరించింది. అక్కడ ఆడపని, మగపనీ అని తేడా లేక అందరూ అన్ని పనులూ చేస్తారు; కలిసి మెలిసి కష్ట సుఖాల్ని పంచుకుంటూ సహజీవనం చేస్తారు. నిజమైన కమ్యూనిజం, సెక్యులరిజం, సమానత్వాలను అమ్మ ఆచరణలో సాధించి చూపింది. 

అన్నం పెట్టినట్లు అందరికీ ఉచిత విద్యను అందజేయాలనేది అమ్మ సత్సంకల్పం. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, మాతృశ్రీ సంస్కృత పాఠశాలలను స్థాపించింది. అక్కడ 8వ తరగతిలో చేర్చుకున్న విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యములు కల్పించి పవిత్ర ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణంలో తెలుగు లేక సంస్కృత భాషలలో పట్టభద్రులయ్యే అవకాశం కల్గించింది.

విద్యాలయం తర్వాత వైద్యాలయం వైపు అమ్మ దృష్టిని సారించింది. అచిరకాలంలోనే ‘మాతృశ్రీ మెడికల్ సెంటర్’ ఆవిర్భవించింది. “వైద్యునికి రోగీ నారాయణ స్వరూపుడే” అనే విలక్షణ విశిష్ట లక్ష్యంతో అలోపతి, హోమియో, ఆయుర్వేద వైద్యసేవలు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.

మారుతున్న నవీన సమాజంలో విలువలు కూడా మారుతున్నాయి. అర్ధబలం ఉన్నా వృద్ధులకు ఆదరణ కొరవడుతోంది. అట్టివారి ఆలన, పాలన నిమిత్తం అమ్మ ఆదరణాలయాన్ని స్థాపించింది. “సర్వ సమ్మతమైనదే నా మతం” అంటుంది అందరమ్మ. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలూ అమ్మ సన్నిధిలో జరుపుకుంటారు. అన్నపూర్ణా లయంలో రంజాన్ విందులో వందలాది ముస్లిం సోదరులు ఆతిథ్యం స్వీకరిస్తారు. కులమతాలతో ప్రసక్తి లేకుండా, గాయత్రీ యాగ సందర్భంగా, గాయత్రీ మంత్రాన్ని ఆసక్తి ఉన్న అందరికీ ప్రసాదించింది అమ్మ. జగన్మాత దర్శనంతోనే ; అది ఆధ్యాత్మిక పునర్జన్మ.

“చేసే ప్రతిపనీ దైవసేవేననీ, సంసార బాధ్యతలూ ఆధ్యాత్మిక సాధనే” అనేది అమ్మ దివ్య ప్రబోధం. ఒక సోదరునితో, “నువ్వు బ్రతుకుతున్నది నా కోసమే. ఉద్యోగం చేస్తున్నదీ నా కోసమే. ఇది నీకు తెలియకపోవచ్చు. అంత మాత్రం చేత నష్టం లేదు. నువ్వు ఏం చేసినా నా కోసమే. అది నాకే చెందుతుంది. ఈ విషయంలో దిగులుపడకు. ఈ కనిపించేవన్నీ దైవస్వరూపాలే. దైవం కాని ప్రాణి, వస్తువు ఏమీ లేదు. నువ్వూ దైవమే. ఈ సృష్టిలో ఏ ప్రాణికీ – నీకూ కాకుండా నీ శక్తీ, సేవలూ పోతున్నాయ్? ఇందులో ఎవరికి చెందినా, అది దైవానికి చెందినట్లే. కనుక ఇందులో స్వార్థం అన్న ప్రసక్తే లేదు. అంతా పరమార్థమే” అని అమ్మ అపూర్వ సత్యాన్ని ఆవిష్కరించింది. అమ్మ ధర్మ స్వరూపిణి. టివి, కమ్యూనికేషన్స్ ఇంజనీరుగా వేదవిహిత కర్మానుష్ఠానాన్ని నిర్వర్తించలేకపోతున్నానని బాధపడుతున్న ఒక సోదరునితో, “కాలం మారిపోయింది, నాన్నా, కాలాన్ని అనుసరించి మన ఆలోచనలూ, పద్ధతులూ మారాలి. నువ్వు పుట్టిన కులాన్ని బట్టి జపతపాలు నీ స్వధర్మం అనుకుంటున్నావు. కులాలు వృత్తిని బట్టి ఏర్పడ్డవే. ఇప్పుడు నీ వృత్తి వేరు. దాన్ని బట్టే నీ ధర్మం. నీ ఉద్యోగంలో నీవు నీతి నిజాయితీతో ఉండటమే నీ ధర్మం. దాన్ని సక్రమంగా పాటిస్తే మరింకేమీ అవసరం లేదు” అంటూ స్వధర్మనిరతిని విశ్లేషించింది; నిర్వచించింది. అమ్మ వాక్కులు ఆప్తవచనాలు, అవి మనుషులను బాధ్యతాయుత పౌరులుగా అమృతపుత్రులుగా తీర్చిదిద్దుతాయి.

గురువుకి శిష్యుడూ పరబ్రహ్మమేనని, భర్తకు భార్య దేవతఅనీ, శరీరం ఆత్మ కాకపోలేదనీ – అమ్మ సరిక్రొత్త విలక్షణ సత్యాలను ప్రకటించింది; సంపూర్ణత్వాన్ని చాటింది.

గృహస్థాశ్రమానికి అమ్మ ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. ‘సర్వాన్నీ అనుభవిస్తూ సర్వాన్నీ విడిపెట్టడమే వివాహం అనీ, ‘నడుం వంచి తాళి కట్టేది భర్త, తలవంచి తాళి కట్టించుకునేది భార్య’ అనీ, ‘కళంకరహితమైన మనస్సును కళంకరహితంగా అర్పించటం కళ్యాణమనీ’ నిర్వచించింది. భార్యకు భర్త ఎలా దైవమో, భర్తకు భార్య కూడా అలాగే దేవత అని వివరించింది. అమ్మ సన్నిధిలో వివాహ సమయంలో వధువు వరుని పాదాలు కడగటమే కాకుండా వరుడు వధువు పాదాలు కడగాలని అమ్మ ఆదేశం.

భార్యాభర్తలకు వియోగం అనేది లేదని అమ్మ భావన. మంగళసూత్రరూపేణా భర్తపాదాలు భార్య కంఠాన ఎలా ఉంటాయో, యజ్ఞోపవీతరూపేణా భార్య భర్తతోటే సదా ఉంటుందని అమ్మ అభిప్రాయం. “భర్త అంటే శరీరం కాదు, భావన” అనే విప్లవాత్మక సత్యాన్ని చాటింది అమ్మ. భర్తను గురించిన భావన, నిరంతర స్మరణ ఉన్న స్త్రీ భర్తృ విహీనకాదని అమ్మ అభిప్రాయం. కనుకనే అమ్మ సుమంగళీ చిహ్నాలను వేటినీ విసర్జించలేదు.

“కాలంతో పాటు మనమూ మారాలి. పూర్వం మనిషి ఒక రూపమో, నామమో, భావమో ఆధారం చేసుకొని సాధన చేసి తరించేవాడు. విధానం ఎప్పుడు ఒక్కలాగానే ఉండాల్సిన అవసరం లేదు. అది వ్యక్తిగత సాధన. అందులో ఎంతో కష్టం ఉంది. స్వార్థం ఉంది. దాన్ని కాదనను. కానీ అంతకంటే సులభమైన మార్గంఉంది. అది పదిమందితో కలిసి పనిచేయడం, పదిమంది కోసం పనిచేయడం; మమకారాన్ని చంపుకోవడం కాక పెంచుకోవడం, పరిమితమైన ప్రేమను విస్తృతం చేసుకోవడం…. నేటి మానవ ధర్మం ఇదేననుకుంటున్నాను. ఇదే మానవుడు మాధవునిగా మారడానికి మంచిదారి” అంటూ సనాతన ధర్మ యధార్థ స్వరూపానికి విశ్వజనీన మాతృత్వ మమకార మాధుర్యాన్ని మేళవించి గోరుముద్దలు చేసి జ్ఞాన సర్వస్వాన్ని నోటికి అందించింది. సనాతన ధర్మం అంటే వేల సంవత్సరాల నాటిది అని కాదు అర్థం; సదా నూతనమే సనాతనం.

అమ్మ ఎప్పుడూ తన అనుభవసారాన్నే గీతామృతంగా ప్రసాదిస్తుంది. తాను నడచిన బాటనే నడిపిస్తుంది. “నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో…అంతా దైవమే చేస్తున్నాడనుకో” “కరుణారసభరిత హృదయ స్పందనమే దైవత్వం”; “కూతురును, కోడలును సమంగా చూడటమే అద్వైతం”.. అనేవి అమ్మ దివ్యసందేశానికి ఉదాహరణలు. అవి సార్వకాలిక సత్యాలు; సర్వులకూ శిరోధార్యాలు; విశ్వమానవ కళ్యాణకారకాలు.

శ్రీ విశ్వజననీ పరిషత్, జిల్లెళ్ళమూడి, అమ్మ ప్రారంభించిన అన్ని సంస్థలనూ, కార్యక్రమాలనూ సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. జగన్మాత, మాతృశ్రీ అనసూయాదేవి 90వ జయంతిని పురస్కరించుకొని ది.3.4.2012 నుండి అనేక విశేష ప్రజాహిత కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!