“మీరు బురద పూసుకున్నా, ఇంకేమన్నా పూసుకున్నా శుభ్రం చేయాల్సిన బాధ్యత నాదే” – అన్నది వాత్సల్యామృత వర్షిణి అమ్మ. ఆ వాక్యం ఒక హామీ, వరం, రక్షణ; సముద్ధరణకి సంకేతం.
సృష్ట్యాదిగా ప్రవక్తలు, అవతార మూర్తులు, ఆధ్యాత్మిక గ్రంథకర్తలు – వికారాలు, వాసనలు, అరిషడ్వర్గాలు అవిద్యాహేతువులని వాటిని నిర్మూలం చేసుకోవాలని చెవిన ఇల్లు కట్టుకుని ఘోషిస్తున్నారు. కానీ అది ఎవరికో కానీ సాధ్యం కావట్లేదు. ఫలితంగా వాటి దుష్పరిణామాల్ని, ఫలితాన్ని స్వయంకృతాపరాధాలుగా అనుభవిస్తూ ఒక అభద్రతా భావంతో, ఆత్మన్యూనతా భావంతో నైరాశ్యోపహతులై జీవులు జీవచ్ఛవాల్లా బ్రతుకులు ఈడుస్తున్నారు.
ఆ తరుణంలో వారి నిస్సహాయస్థితిని గమనించి జాలితో అమ్మ ‘కఠోరమైన సాధన, తపస్సు, నియమనిష్ఠలు వీరి వల్ల కాదు’ అని – ‘రాగద్వేష అసూయలను ప్రారద్రోలే అనసూయ’గా బాధ్యత తీసుకుని అనసూయమ్మగా అవతరించింది.
ఇతః పూర్వం వచ్చిన అవతారమూర్తుల మరియు నేటి అవతారమూర్తి అమ్మయొక్క లక్ష్యాలను, తత్త్వాన్ని విశదపరుస్తూ డా॥ పన్నాల రాధార్నష్ణశర్మ గారు –
‘మహద్భి శ్శస్త్రాసై ర్జగత్ అపకృతః క్రూరదనుజాన్
నిహత్య క్షోణీం శ్రీరఘుపతి ముఖాః శాంతిం అనయన్
ఇయం మాతా వాచా హితమధురయా దుష్టవితతేః
వివర్తం యచ్ఛన్తీ జయతి నితరాం శాంతి సుఖదా!’ (శృంగారలహరీ, శ్లో 32)
– శ్రీరామచంద్రప్రభువు వంటి అవతారమూర్తులు … (బ్రహ్మాస్త్రాది) గొప్ప శస్త్రాస్త్రములచే క్రూర రాక్షస సమూహాన్ని సంహరించి, లోకంలో శాంతిని స్థాపించారు. ఈ అనసూయా మహాదేవి ప్రియమైన, శ్రేయస్కరములైన మృదుమధుర వాక్కులతో దుష్టత్వ సంహారం చేసి సంస్కరించి పరివర్తనం తెచ్చి శాంతిసౌఖ్యాలను అనుగ్రహిస్తున్న అమ్మకు జయము’ – అని శ్లాఘించారు.
ఈ క్రమంలో అమ్మ ‘మమకారం – ప్రేమ’ అనే బ్రహ్మాస్త్రాన్ని సమ్మెహనాస్త్రాన్ని ప్రయోగిస్తోంది. అమ్మ అనంత దివ్య మాతృ ప్రేమానుబంధ బంధితులై పాదాక్రాంతులై సన్మార్గగాములు అవుతున్నారు అనేకులు.
ఆ సమయంలో అమ్మ అందమైన అలతి అలతి పదాలతో మాట్లాడుతుంది; హితోక్తులను వినిపిస్తుంది. అందుకు కొన్ని ఉదాహరణలు
– ఒకనాడు నన్ను “నాన్నా! అన్నం తిన్నావా?” అని అడిగింది. ‘తిన్నానమ్మా’ అన్నాను. తదుపరి “నాన్నా! మనం తినటానికి పుట్టామా? పుట్టినందుకు తింటున్నామా?’ అని ప్రశ్నించింది. అలా ప్రశ్నించటమే ఒక బోధ, ధర్మ ప్రబోధం; ఏదో సమాధానాన్ని ఆశించి కాదు. నిజం చెప్పాలంటే – సమాధానం అక్కడే ఉంది. అది తెలిస్తే మన బ్రతుకులకి అర్థం, పరమార్థం బోధ పడతాయి. పుట్టినందుకే తింటున్నాం; జానెడు పొట్టను పోసుకోవటానికే కాని, తరతరాలు తిన్నా తరగని అమేయ ధనరాశుల్ని పోగుచేసుకోవటానికి కాదు. ఇవే బ్రతుకు విలువలు, సంస్కారము, మానవత్వం. ‘స్వాద్వన్నం న తు యాచ్యతాం, విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతామ్’- అనే శంకరుల వాణి అమ్మ మాటలో అణువణువునా ప్రతిధ్వనిస్తుంది.
ఒకనాడు ఒక సోదరుడు అమ్మ సన్నిధిలో తన కుమార్తెకు వివాహ సంబంధం కుదరటం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరుణం రావాలని, కాలం కలిసిరావాలని అమ్మ ఎన్నో రీతుల వారిని సాంత్వన పరిచే ప్రయత్నం చేసింది. వారు సమాధాన పడలేదు. పిమ్మట వారిని అమ్మ, “నాన్నా! నీకు బాధ ఎందుకు?” అని అడిగింది. అందుకు ఆయన “నా బిడ్డ, పేగు, రక్త సంబంధం, బంధం” అన్నారు. వెంటనే అమ్మ, “అది నీ బిడ్డ కాదు, నా బిడ్డ. దాని బాధ్యత నాది, నీది కాదు” అన్నది. దానితో అమ్మ మహనీయ దివ్య మాతృతత్వం బోధపడింది. కనుకనే, హాయిగా ఊపిరి పీల్చుకుని, చెంపలు వేసుకుని, ఆనంద బాష్పాలతో అమ్మ పాదాలను అభిషేకించి, మారుమాట లేక వారు నిష్క్రమించారు. “నేనే మిమ్మల్ని అందరినీ కన్నాను” అని అమ్మ పలుమార్లు స్పష్టం చేసింది. వాస్తవానికి తన అశేష సంతాన బాధ్యతలను వహిస్తున్నది తానే కదా! సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత కదా!!
ఒక ఏడాది డిసెంబరు 31 తేదీ రాత్రి ఆంగ్ల సంవత్సర ఆహ్వాన వేడుకకు శ్రీ B.V. వాసుదేవాచారి గారు సకుటుంబంగా కారులో జిల్లెళ్ళమూడి వస్తున్నారు. సాయంత్రం 7వ మైలు దగ్గర మలుపు తిరిగే సమయంలో కారుకి ఒక బర్రె అడ్డు వచ్చింది. డ్రైవర్ వెంటనే brake వేశాడు; అంతేకాదు, అదే సమయంలో Steering fail అయిందని గుర్తించాడు. తక్షణం వారంతా కారు దిగి, క్షేమంగా జిల్లెళ్ళమూడి చేరుకున్నారు.
అమ్మ దరిజేరి, “అమ్మా! కారు Steering fail అయింది. కాలువలో పడాల్సింది నీ దయవలన మేము బ్రతికాం’ అని విన్నవించుకున్నారు. అందుకు అమ్మ నవ్వుతూ “ఇక్కడ ఉందికదా Steering!” అన్నది. అమ్మమాట విని ఆయన ఆశ్చర్య అనందాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పగ్గాలు (Steering) సృష్టి సంచాలకశక్తి వద్దనే ఉంటాయి. పాలన, పోషణ, రక్షణ జగన్మాతృ ధర్మం కదా!
“శిక్షణ కూడా రక్షణే” – అన్నది అమ్మ. రామాచార్యులు, మాచెమ్మ, రామయ్య, పెమ్మరాజు సత్యనారాయణ మూర్తి, జాలరి, పోలీసు మస్తాన్… వంటి వారు ఎందరో దారితప్పి, దొంగతనం – స్త్రీలపై అత్యాచారాలు- అక్రమ సంబంధాలకు తెగించినపుడు, వారి అకృత్యాలను ఏకరువుపెట్టి, నిలబెట్టి గడ గడ లాడించి, మూడవకన్ను తెరచి భస్మం చేయకుండా వారిని క్షమించి, దోషాన్ని గుర్తింపజేసి సన్మార్గగాముల్ని చేసింది. అదీ అమ్మ సముద్ధరణ తత్వం.
‘అపారే గంభీరే భవజలనిధౌ మగ్న మబలం
సముద్దర్తుం కో వా ప్రభవతి వినా విశ్వజననీమ్
ప్రసన్న సాత ం కృపణజనరక్షా దృతమతే!
కరాలంబం మే దేహ్యయి జనని! రుద్రాణి సహసా’ – (శృంగారలహరీ, శ్లో 90)
అమ్మా! నువ్వు దీన జనావన దీక్షాతత్పరవు. శక్తిహీనుడనైన నేను గంభీరమైన భవసాగరంలో మునిగి అలమటిస్తున్నాను. జాగన్మాతవు నువ్వు తప్ప నన్ను ఎవరు రక్షిస్తారు? తక్షణం నీ చేయూత నియ్యమ్మా’ – అంటూ అమ్మను ఆశ్రయించడమే మనకి సాధన, మార్గం, గమ్యం; ఈ జన్మకు అర్థం, పరమార్థం.
‘సముద్ధరణ’ అంటే – అధోగతిపాలైన అనాథలను ఆదరించి, శక్తిమంతులుగా మలచి శ్రేష్ఠమైన స్థితిలో నిలబెట్టడం. అట్టి సముద్ధరణ తత్వమే అమ్మ – తరింపచేసే తల్లి.