మా బామ్మ వల్లూరు సావిత్రమ్మ. 1965 ప్రాంతాలలో తరుచు జిల్లెళ్ళమూడి వెళ్లి కొద్ది రోజులు ఉండి వస్తూ ఉండేది. ఆమె కాస్త అనారోగ్యంగా వుండేది. ఆకలికి ఆగలేక పొద్దున్నే కాస్త ఫలహారం చేసేది. మొదటి సారి జిల్లెళ్ళమూడి వెళ్ళినప్పుడు అమ్మ సన్నిధిలో వున్నది. ధ్యానం చేసుకుని అప్పుడు ఏకంగా భోజనం చేద్దాం అనుకుని అమ్మ దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఓ మూల ధ్యానం చేసుకుంటూ కూర్చుందట.
కాసేపటికి ఆకలి, నీరసం, మొండిగా అలాగే కూర్చుని వుంది. ఎవరో వచ్చి అమ్మ రమ్మంటున్నారు అని చెప్తే లోపలికి వెళ్ళిందిట బామ్మ. అమ్మ “రా అమ్మా నాదగ్గర కూచో” అని మంచం దగ్గర కూర్చో పెట్టుకున్నారుట. ఎవరో ఆకులో వేడి ఉప్మా, నెయ్యి, పంచదార వేసి తీసుకు వచ్చారుట. “ఇదుగో తీసుకో నువ్వు ఆకలికి ఆగలేవు.” అని అందించారుట అమ్మ. బామ్మకు ఉప్మాలో చక్కెర వేసుకుని తినటం అలవాటు. ఆకలి, నీరసంతో వుందేమో ఆవురావురుమంటూ తినేసిందిట. ఆకలి తీరాక అమ్మ ప్రేమ చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుందిట. అమ్మ ఆప్యాయంగా తలనిమిరి “ఇక్కడ ఖాళీ కడుపుతో పూజ, ధ్యానం చెయ్యాలి అని నియమం ఏమీ లేదు. కడుపునిండా తిని ధ్యానం చేసుకో. పొద్దున పూట ఇక్కడ ఇడ్లీలు చేసి అమ్ముతారు. నాలుగు ఇడ్లీలు కొనుక్కుని తిను.” అందిట ఆదరంగా.
ఆ తర్వాత కూడా బామ్మ అక్కడ వున్నన్ని రోజులు ఆవరణలో ఎవరో ఒకరు ఆవిడ ఫలహారం చేసిందా లేదా అని కనుక్కుంటూనే వున్నారుట. బామ్మ ఎన్నో సార్లు ఆ సంఘటన మాతో చెప్పింది. జీవితం సరళం చేసింది అమ్మ అని సంతోష పడింది. యథార్థం అంతేగా. అమ్మ సన్నిధిలో తడి బట్టలు, మడి బట్టలు కట్టుకోవాలి ఈ విధంగా ఇన్ని రోజులు పూజ చెయ్యాలి, ఉపవాసం వుండాలి అలా చెయ్యకపోతే దైవానికి ఆగ్రహం కలుగుతుంది, అరిష్టం కలుగుతుంది అనేటువంటి నియమాలు నిష్టలు లేవు. ఆంక్షలు ఏమీ లేవు. ఆర్తిగా అమ్మా అని పిలిస్తే చాలు అక్కున చేర్చుకుని అడగ కుండానే ఆపదలు తీర్చే చల్లని తల్లి. సమాజంలో ఎన్నో రకాల మంది వుంటారు. – దుర్బలమైన వారు వుంటారు. వృద్ధులు ఉంటారు. గృహకృత్యాలలో నిమగ్నులై సమయం లేని స్త్రీలు వుంటారు. నీకు కష్టాలు తీరాలి అంటే ఈ పని చేయాలి ఇన్ని రోజులు ఈ నియమాలు పాటించాలి. అని ఆంక్షలు విధిస్తే అవి చేయటం వారికి సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు. చేయలేక పోయాను అనే భయంతో మానసికమైన ఒత్తిడి కలిగి వారి బాధలు మరింత అధికం కావచ్చు.
అవి ఏమీ లేకుండా “నీకు వున్నది తృప్తిగా తిని ఇతరులకు పెట్టుకో. సర్వమూ దైవమే చేస్తున్నాడు అనుకో. ధ్యాసే ధ్యానం. మీ పిల్లలకు స్నానం చేయిస్తే నాకు అభిషేకం చేసినట్లు. నీ భర్తకు పెట్టే భోజనం నాకు నైవేద్యం” అన్నది. అదే అమ్మ సిద్ధాంతం. ఎంత సరళమైన మార్గం! ఎంత నిరాడంబరమైన సాధన! అలా అని అవన్నీ ఏమీ వద్దు అని కూడా చెప్పలేదు అమ్మ. తమ శక్తిని బట్టి పూజలు, హోమాలు, దీక్షలు, అభిషేకాలు ఏవైనా చేసుకోవచ్చు. అదీ అమ్మకు ఆనందమే.
తనను నమ్ముకున్న వారికి తృణమో, పణమో వస్తువో వాహనమో కాకుండా అమిత సరళమైన రీతిలో జీవన యానం సాగిస్తూ మోక్ష మార్గాన్ని పొందే వరం ఎవరు ప్రసాదించ గలరూ విశ్వజనని తప్ప! ఎన్ని జన్మల పుణ్యఫలమో ఆ తల్లి నీడన చేరాం. జన్మ ధన్యం.