సిరికింజెప్పఁడు; శంఖ చక్రయుగముం జేదోయి సంధింపఁ డే
పరివారంబును జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్కనొత్తఁడు వివాద ప్రోతిత శ్రీకుచో
పరి చేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై
శ్రీమద్భాగవతంలో, భక్తరక్షణ సందర్భంలో భగవంతుని ఆత్రుతను తెలియజేసే గజేంద్రమోక్ష ఘట్టములోని రసరమ్యగీతం. భాగవత రచనా ప్రారంభం లోనే పోతనగారు చెప్పిన మాటలివి.
పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నే
పలికిని భవహర మగునట
పలికెద వేరొండు గాథ పలుకగ నేలా !
అనగా రాముడు చెప్పినదే భాగవతం. అది రాముని బాట- మాట, పోతన భాగవతం చదువుకున్నవారు అనగా పండితులు పై పద్యాని కీ విధంగా వివరణ ఇస్తారు. సిరికింజెప్పడు అనే పద్యానికి. బాధలో వున్న గజేంద్రుడిని రక్షించాలనే తొందరలో విష్ణుమూర్తి అన్నీ మరచిపోయి వేగంగా పరిగెత్తుకుంటూ దివి నుండి భువికి దిగివచ్చాడు. ‘సిరికింజెప్పడు” అనే పద్యాన్ని వేరొక కోణంలో కూడా అర్థం చేసుకోవచ్చని నా అభిప్రాయం.
మహానుభావులు ఎప్పుడూ పదాలు ఎంతో జాగత్తగా ఉపయోగిస్తారు. వ్యర్థంగా వాడరు. అందుకే అంఆ అన్నది
“నాది తోలు నోరు కాదు …. తాలు మాట రాదు”. దీనిలో ప్రధానమైనది “తాలు మాట రాదు” అన్న. మాట కాదు. అమ్మది తోలు నోరు కాదు. అమ్మది దివ్యమైననోరు
ఇంకో ఉదాహరణ చూద్దాం. ఇది రామాయణం లోని విషయం. సీతను చూచిన హనుమంతుడు సముద్రం లంఘించి తిరిగి తన వారిని (వానరులను) కలుస్తాడు. అప్పుడు మొట్టమొదటగా వారితో అన్నమాట “దృష్టా” చూసాను. సీత అని కూడా మొదట అనలేదు. సీత అంటేతోటివారలకు ఏదైనా అనుమానం కలుగవచ్చు. తాను వెళ్ళింది సీతను చూడటానికే గనుక “చూసాను” అంటే వెళ్లిన పని నెరవేరిందని వాళ్లకు సంతోషం, ధైర్యం కలుగు తాయని చెప్పాడు. మహాజ్ఞాని అయిన హనుమంతుడు ఎదుటివారి మనస్తత్వాన్ని అర్థం చేసుకొని పని సానుకూలమైనదని ఒక్క మాటలో చెప్పాడు. ఇది కూడా పదాల ఎంపికకు మహానుభవాలు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, ఇవ్వాలో మనం తెలుసుకోవాలి.
ఇంకొక ఉదాహరణ. భగవద్గీతలోని శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
ఈ శ్లోకానికి తెలుగులో చెప్పే వివరణ ఇలా వుంటుంది. దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు పరమాత్మ తిరిగి తిరిగి ప్రతియుగంలో అవతరిస్తాడు. దీనిని ఇంకో లాగా చెప్పుకోవచ్చు. భగవంతునికి దుష్టశిక్షణా కన్నా ప్రధానమైనది. అత్యంత ప్రియమైనది ‘శిష్టరక్షణ’ కాబట్టి తెలుగులో “శిష్టరక్షణకు, దుష్టశిక్షణకు భగవంతుడు మళ్లీ మళ్లీ అవతారమెత్తుతాడు” (Sequence of words) పదాల వరుసకు ఎంపికకు ప్రాధాన్యత మారుతుంది. అర్థం వివరణలో మార్పు ఉంటుంది.
శ్రీకృష్ణపరమాత్మ తాను ఏమి చేస్తాడు, ఎలా చేస్తాడోముందు ఏమి జరుగనున్నదో వివరించి, ఒక క్రమంలో
చెప్పాడు.
భగవంతుడు శిష్టరక్షణకై పరుగెత్తుకొస్తాడు. పసిపిల్లవాడిపై పాము కాని, అగ్నిలాంటిది కాని పడ్తుంటే ముందు మనం పసిపిల్లవాడిని దూరంగా తీసుకొని వెళ్తాము. తరువాతనే పామును చంపే ప్రయత్నం అగ్ని నార్పే ప్రయత్నం చేస్తాము. అలాగే పరమాత్మకు శిష్టరక్షణే ప్రధానమని మనం తెలుసుకోవాలి.
ఇంకొక ఉదాహరణ చూద్దాం. లలితా సహస్ర నామాలలో 162శ్లోకం
“అజా క్షయవినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ
అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా”||
ఈ శ్లోకములో “ఆంఆ” ఈ విధంగా చెస్తోంది. నన్ను లోపల పూజించే వారికి సులభంగా లభిస్తాను. బహిర్ముఖంగా (ధ్యానం లేకుండా పూజచేసేవారికి లభించదు. అంటే మనపై ప్రేమతో అంత తాను ఎలా లభ్యమవుతుందో ముందుగా చెప్పింది. ఏమి చేయకూడదో తర్వాత చెప్పింది. ఇక్కడ కూడా పదాల వరుసకు ప్రాధాన్యత
గమనించాలి.
మరియొక ఉదాహరణ లక్ష్మీ అష్టోత్తరం లోనిది. లక్ష్మీ అష్టోత్తరం చివర ఫలశృతి ఈ విధంగా ఉంది.
రోజుకు ఒకసారి చదివితే పాపాలు నశిస్తాయి. రెండుసార్లు చదివితే సంపదలు లభిస్తాయి. మూడుసార్లు చదివితే శత్రునాశనం జరుగుతుంది.
అంటే అర్థం లక్ష్మీ అష్టోత్తరం ఎన్నిసార్లు చదివినా ముందుగా లభించేది పాపవినాశనం. తర్వాత ధన దాన్యాలు. చివరకు జరిగేది శత్రువినాశనం. ధన ధాన్యాలతో పాటు శత్రువులు కూడా వస్తారని. శత్రువులను నాశనం చేయడం అతి కష్టమైన పని. అంత సులభం కాదు. అందుకే చివరగా జరుగుతుంది. ఇది తెలుసుకోమని చెప్తోంది లక్ష్మీ అష్టోత్తరం. శత్రువులు బయట నుంచే రానవసరం లేదు. అంతఃశత్రువులు ఎందరో. కావాలనే కోరికయే ఒక శత్రువు. పైపై కోరికలను తగ్గించుకుంటూ పోతే లోపలి శత్రువులు చివరగా అణచబడతాయి.
ఇక మనం మొదటి పద్యానికి తిరిగి వద్దాము. “సిరికింజెప్పడు” ఎందుకు రామభద్రుడు (పోతన ద్వారా) ఈ పదాలను ముందుగా చెప్పాడు.
“అలవైకుంఠపురంబులో, నగరిలో లక్ష్మీదేవితో వినోదిస్తున్న సమయంలో. విష్ణుమూర్తి ఒకవేళ ‘సిరికి’ చెప్పి ‘నేను గజేంద్రమోక్షం కోసం వెళ్తున్నాను అన్నప్పుడు ఆ లక్ష్మీదేవి అలిగి ఆగ్రహిస్తే గజేంద్రుని ప్రాణాలు మిగలవేమో. దేవతలు తమ ఆపదల కోసం ఎప్పుడూవిష్ణుమూర్తిని ప్రార్థించడం విష్ణుమూర్తి అనేకరూపాలు ధరించడం, పడరాని పాట్లు పడటం ఆమెకు తెలుసు. ఆమెకు తెలుసని అతనికి తెలుసు. భృగుమహర్షి కథలో ఆమెకు విసుగువచ్చి ఆవిడ వెళ్ళిపోయింది కూడాను. అందువల్ల ఆమెకు చెప్పకుండానే బయలుదేరాడు. ఆవిడకు కథ అంతా చెప్తూ ఉంటే ద్రౌపదిని కాపాడలేకపోయే వాడేమో. అందుకే అలాగే వెళ్ళిపోయాడు.
అంటే ఒక మంచి పని చేయాల్సివచ్చినపుడు, ఒక దైవకార్యం చేయాలని సంకల్పించినపుడు, ఒక దీనుణ్ణి కాపాడవలసిన అవకాశం లభించినపుడు పై పద్యం ఏం చేయాలో చెప్తోంది.
దైవ కృపకోరుతూ, దైవం మీద భారం వుంచి దైవకార్యం నిర్వహించాల్సి వచ్చినపుడు, ఏపుణ్య కార్యాని కయినా, అత్యవసరమైనపుడు, ఆపదలో ఆదుకోవాల్సి వచ్చినపుడు (సిరికి) ఇంట్లో వాళ్లకు భార్యా కావచ్చు, మరెవరైనా కావచ్చు, చెప్పాలా ? చెప్పలేకపోయానే అనే సంకోచం అవసరం లేదు.
అలా సంకోచిస్తూ ఆలోచిస్తుంటే, ఆ దైవ కార్యం చేసే అవకాశం మళ్లీ రాదేమో, రాకపోవచ్చు కూడా. అందుకే దానం కుడిచేత్తో చేస్తే ఎడమ చేతికి కూడా తెలియనీయవద్దంటారు.
గజేంద్రుని రక్షణకు తనకు చెప్పకుండా వెళ్లిపోయినా లక్ష్మీదేవి ఆగ్రహానికి బదులు అనుగ్రహం కురిపించింది అలా వుండాలని సిరి కూడా ఆర్తుల రక్షణ కార్యంలో, అలాగే మనవాళ్ళు కూడా మనం చేసేది దైవకార్యం దీనరక్షణ యని తెలిస్తే ముందు ఆగ్రహించినాతరువాత అనుగ్రహిస్తారు. అనుగ్రహించాలి కూడాను.
దీనరక్షణకు అంతటి ప్రాధాన్యత నిచ్చిందీ పద్యం. దీనరక్షణ ఎంత ముఖ్యం అంటే ఇంటిలోని వాళ్ల ఆగ్రహానికన్నా వేయిరెట్లు గొప్పదని తెలుపుతోందీ పద్యం.
దీనరక్షణ అంత ప్రధానమైనది పవిత్రమైనది కనుకనే రామభద్రుడు ఇలా పలికించాడు.