(గత సంచిక తరువాయి)
మనం అనుకున్నవి అన్నీ జరగవు: ఒకసారి సంక్రాతికి మా అమ్మ, నాన్నగారు, చెల్లెళ్ళు అందరం జిల్లెళ్ళమూడి వెళ్ళాం. అమ్మ అమితానందంతో భోగి పళ్ళు పోసింది. అనంతరం అమ్మవద్దకు వెళ్ళాం. ‘ఈమని (మా అమ్మమ్మ గారు ఊరు) వెళ్ళొస్తాం, అమ్మా” అన్నారు నాన్నగారు. “వద్దు, నాన్నా! ఇవాల్టికి ఉండండి” అంది అమ్మ. “కాదమ్మా, వెళ్ళాలి” అన్నారు నాన్న. “సరే, నాన్నా! నీ యిష్టం” అని మా అమ్మకి చీర పెట్టి “రేపు పండుగ కదా! కట్టుకుని వెళ్ళమ్మా” అన్నది. సరే. ఆ క్షణంలో mind వెలగలేదు ఎవరికీ. బయటికి వచ్చాం. వెళ్ళొస్తామంటే ఒక చిరునవ్వు నవ్వింది. కారు ఎక్కి కూర్చున్నాం; air lock పడింది. ఇంక ఎక్కడికి వెడతాం? రాత్రి నాన్న వెళ్ళి అమ్మ మంచం దగ్గర పడుకున్నారు. “ఏం, నాన్నా! వెడతానన్నావు కదా?” అడిగింది అమ్మ. “అమ్మా! air lock పడింది” అంటే, “నాన్నా! మనం అనుకున్నవి అన్నీ జరగవు” అని అన్నది. ఆ మర్నాటి ఉదయం కారు డ్రైవరు బాపట్ల వెళ్ళి ఒక మెకానిక్ని తీసుకొచ్చాడు. అతను వచ్చి కారు స్టార్టు చేసినంతలో air lock లేదు, ఏమీ లేదు, కారు స్టార్టు అయింది. ఎందుకు ఆగిపోయిందో, ఎందుకు స్టార్టు అయిందో అంతుపట్టని సంగతి, అమ్మకే తెలియాలి.
మహిమలు (Miracles) : ఒకసారి నాన్నగారు అడిగారు “అమ్మా! Miracles ఉన్నాయా?” అని. “miracles అంటే ఏమిటి, నాన్నా?” ప్రశ్నించింది అమ్మ. “అద్భుత శక్తులు” అన్నారాయన. “నాన్నా! ఒకడు తాడి చెట్టు ఎక్కుతాడు. నువ్వ ఎక్కలేవు. అది నీకు మిరకిలా? ఒకడు అందంగా బొమ్మగీస్తాడు. నువ్వు గీయలేవు. అది నీకు మిరకిలా? ఒకడు పూటు వాయిస్తాడు. నువ్వు వాయించలేవు. అది నీకు మిరకిలా!” అని ప్రశ్నించింది.
నువ్వు చెప్పమ్మా అని కోరారు నాన్న. “ఆ శక్తి ఉన్నవాడికి ఆసక్తి ఉండొద్దా, నాన్నా!” అన్నది. మిరకిల్స్ అనేవి సహజంగా జరుగుతుంటాయి.
పరకాయ ప్రవేశం: సో|| మన్నవ దత్తాత్రేయశర్మ (దత్తు అన్నయ్య) ని అడిగాను “అన్నయ్యా! అమ్మ ఎప్పుడైనా వరకాయప్రవేశ విద్య గురించి మాట్లాడిందా?” అని. ఒకసారి దత్తు అన్నయ్య అమ్మని అడిగాడట “అమ్మా! పరకాయ ప్రవేశం అనేది ఉన్నదా?” అని. “పరకాయ ప్రవేశం అంటే ఏమిటిరా?” అమ్మ ప్రశ్నించింది. “తన శరీరం విడిచి వేరొక శరీరంలో ప్రవేశించటం” అన్నాడు అన్నయ్య. “ఒరేయ్! ఈ శరీరం వదలి ఇంకొక శరీరంలోకి వెడితే అది పరకాయం ఎందుకు అవుతుంది, తనకాయమే అవుతుంది కాని” అన్నది అమ్మ. ‘చెప్పమ్మా’ అని వేడుకుంటే, “ఏమో, నాన్నా! నాకు అలాంటి అనుభవాలు లేవు. నేను నమ్మను కూడా” అన్నది.
నీకు వచ్చే ప్రతి ఆలోచన ముందుగానే నిర్ణయించబడింది : ఒకసారి నాన్నగారు (శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు) అమ్మ పతిదేవులు అస్వస్థతతో చీరాలలో ఉన్నారు. రామకృష్ణ అన్నయ్య వారిని చూడటానికి వెళ్ళాడు. ఆయన “ఒరేయ్! మీ అమ్మను తీసుకురా” అన్నారు. ‘అలాగేనండి’ అని తిరుగు ప్రయాణంలో అన్నయ్య బాపట్ల బస్టాండ్లో దిగి ఒక గంటసేపు ఇలా మధనపడ్డాడు ‘అయ్యో! అమ్మను అడగకుండా నాన్నగారికి మాట ఇచ్చాను. ఇప్పుడేం చేయాలి? (బాడుగ కారు తీసుకువెడితే అమ్మ వస్తుందో, రాదో! నేను కారు తీసుకువెళ్ళాలా, వద్దా?’ అని. చివరకు “కారు తీసుకు వెడతాను. అమ్మ వస్తే సరేసరి. లేకుంటే కారు పంపేద్దాం” అని నిర్ణయించుకుని కారు తీసుకుని బయలుదేరాడు. ఈలోగా వసుంధర అక్కయ్య ‘చీకటి పడింది. అన్నయ్య రాలేదు’ అని ఆందోళన పడుతుంటే, ‘వాడు కారులో వస్తున్నాడు’ అని చెప్పి స్నానానికి వెళ్ళింది.
జిల్లెళ్ళమూడి చేరి అమ్మతో “నేను కారు తీసుకువస్తే సరిపోతుంది కదా, ఇంత గుంజాటన ఎందుకు?” అన్నాడు. అందుకు అమ్మ, “నాన్నా! నీకు వచ్చే ప్రతి ఆలోచన ముందుగానే నిర్ణయించబడి ఉన్నది” అని చెప్పిందట; “నువ్వు అక్కడ నిలబడి గంటసేపు ఆలోచించాలి అనీ ముందే నిర్ణయించబడి ఉన్నది” అనీ చెప్పిందట. దీనిని బట్టి ఏమి అర్థమవుతుందంటే మన మాటకి, చేతకి దేనికీ స్వతంత్రత లేదు అని. అలాంటప్పుడు ‘నేనేదో జిల్లెళ్ళమూడిలో సేవ చేశానని చెప్పుకోవటం’ ఎంతవరకు సబబు? అసలు వ్యక్తిత్వం అన్నమాటే లేదు. జరిగేది అంతా జగన్మాత అమ్మ నిర్ణయం ప్రకారమే, అనుగ్రహం మేరకే.
మరొక ఉదాహరణ : డా॥ మఱి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో నాన్న ఒకసారి జిల్లెళ్ళమూడి వెళ్ళారు. వారు అమ్మ దగ్గర సెలవు తీసుకుంటూ ‘అమ్మా! డాక్టర్ గారికి కూడా ప్రసాదం ఇవ్వమ్మా. వారికి ఇస్తాను’ అన్నారు. అందుకు అమ్మ రెండు పటికబెల్లం పాకెట్లు ఇచ్చి “ఇదిగో, నాన్నా! ఇది నీకు ప్రసాదం” అన్నది; ఇంకొకటి ఇచ్చి, “ఇది పారేసుకోవటానికి’ అన్నది. పారేసుకోవటానికి అంటే ఆ క్షణంలో మాకు ఎవరికీ ఏమీ అర్థంకాలేదు. ఎవరికో ఇవ్వటానికేమో అమ్మ ఇచ్చి ఉండవచ్చు అనుకున్నారు. కారులో వెడుతున్నాం. కారు బాపట్ల దాటి పొన్నూరు రోడ్లో పోతోంది. నాన్న మా అమ్మని అడిగారు, “అమ్మ డాక్టర్ గారికి ఇచ్చిన ప్రసాదం ఎక్కడ పెట్టావు?” అని. అందుకు మా అమ్మ “అది మీ దగ్గరే పెట్టుకున్నారు కదా! అమ్మ మీకు ఇచ్చిన ప్రసాదం నాకు ఇచ్చారు. డాక్టర్ గారికి ఇచ్చిన ప్రసాదం మీదగ్గరే ఉంది” అన్నది. మా నాన్న జేబులన్నీ వెతుకున్నారు. ఆ క్షణంలో గుర్తుకు వచ్చింది. ‘అది జిల్లెళ్ళమూడిలోనే మరచిపోయాను. అమ్మ ముందే చెప్పింది కదా! పారేసుకోవటానికి అని అన్నారు నాన్న.
హైమ సజీవంగా దైవత్వంతో ఉన్నది : ఒకసారి రాజుబావని అడిగాను, “హైమ అక్కడే ఆలయంలో సశరీరంగానే ఉందా? సమాధిలోపల ఏముంది? ఏముంటుంది?” అని. ఒకసారి రాధ అన్నయ్య ఆర్తితో నామం చేస్తూంటే, అమ్మ 3వ అంతస్తులో అటూ ఇటూ తిరుగుతూ “నాన్నా! వాడిని తీసుకురండి. హైమ లేచి వస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు లేచి వస్తే ఏంచేయాలి మనం?” అన్నది. అమ్మ మాటనే నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. హైమలేచి రావాలంటే శరీరం ఉంటేనేగా! హైమ సశరీరంగా దైవత్వంతో ఉన్నది అని నేను నమ్ముతున్నాను. మనందరం ఎంత అదృష్టవంతులం? దేవతలు అశరీరులు అంటారు. మనం శరీరంతో ఉన్న దేవతను పూజిస్తున్నాం. మనంతటి అదృష్టం ఇంకొకరికి ఉన్నదా?
అమ్మ అవ్యాజ కరుణామూర్తి: జగన్మాత అమ్మ. విశ్వగర్భ అమ్మ. ఎందరో మహర్షులు మనస్సుని నిగ్రహించి, శరీరాన్ని కఠినమైన పరీక్షలకి గురిచేసి సంవత్సరాల తరబడి తపస్సుచేస్తే అమ్మవారు క్షణకాలం దర్శనం ఇచ్చేదట. మరి మనం ఏ సాధనా ఏ తపస్సూ చేయలేదు కదా! అయినా, గంటలు రోజులు సంవత్సరాలు అమ్మతో గడపటం, అమ్మ చేతి మహాప్రసాదం తినటం అనే మహద్భాగ్యం మనకి కలిగించిందంటే అమ్మ అవ్యాజకరుణామూర్తి కదా! మహర్షుల కంటే మనం ఏం తక్కువ అనిపిస్తుంది.
అమ్మ శ్రీచరణాలకు శతసహస్రాధిక ప్రణామములు.