నేను అమ్మ పెట్టిన ప్రసాదంతినే భోక్తనే కానీ వక్తను కాను. ఆ రోజుల్లో ఆత్మీయత అనురాగం జిల్లెళ్ళమూడిలో వెల్లివెరిశాయి. జిల్లెళ్ళమూడి వదలి వెళ్ళేవాళ్ళని 7వ మైలుదాకా సాగనంపి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఎప్పుడువస్తారో చూస్తామో అనే దిగులుతో పంపేవాళ్ళు ఏడుపు, వెళ్ళేవాళ్ళు ఏడుపు.
మనందరం ఏక గర్భవాసులం. కోటానుకోట్ల మానవుల్లో అమ్మను దర్శించుకున్నవాళ్ళు ఎందరు? అమ్మచేతి అన్నంముద్ద తినే భాగ్యం కలవారు ఎందరు? అమ్మతో సంభాషించే ధన్యత కల వారెందురు? అట్టి కొద్దిమందిలో మనం ఒకళ్ళం.
‘అంఆ’ అనేది బీజాక్షరాల సంపుటి మూల మంత్రం అంటే నాకు తెలియదు. నా దృష్టిలో ‘అంఆ’ అంటే అందరికీ ఆహారం, అందరికీ ఆహార్యం (బట్టలు), అందరికి ఆరోగ్యం, అందరికీ ఆనందం. అన్నపూర్ణాలయం, మాతృశ్రీ మెడికల్ సెంటర్… సేవా సంస్థలన్నీ అందుకే.
అమ్మ లీలా వినోదం: 1980 లో బి.కాం పాస్ అయి అమ్మ దగ్గరకు వెళ్ళా. ఉన్నట్టుండి అమ్మ “నాన్నా! నువ్వు సి.ఎ. చెయ్యరా” అంది. అది అమ్మ ఆర్డర్ కాబట్టి సి.ఎ. లో చేరాను. ఫస్ట్ ఎక్సామ్ పేపర్లో ఒక compulsory question. అది 4 పేజీలు ఉంది. మిగిలిన ప్రశ్నలకి సమాధానం వ్రాసి దానికి ఎదో ఒక లైన్ వ్రాసి వచ్చా జిల్లెళ్ళమూడికి. అమ్మ నా గడ్డ పట్టుకుని “నాన్నా! ఫస్ట్ ది పాస్ అయినావా?” అని అడిగింది. ‘నిన్ననే కదా Exams వ్రాశా. ఇవాళ పాస్ అయ్యావా అని అడుగుతుందేమిటి?’ అనుకున్నా. అది నా బుద్ధిహీనత. రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయిన అతికొద్దిమందిలో నేనూ ఒకడిని. అమ్మ అన్నందువలన పాస్ అయినానా, రాసినందువలన పాస్ అయినానా అంటే అది నాకు తెలుసు, అమ్మకి తెలుసు. నేను పాస్ అయినానని అమ్మ ఆ రోజుననే చెప్పింది – నేను అర్థం చేసుకోలేకపోయాను. నాకు చదువులో ఏదైనా complicated problem వస్తే పదిమంది స్నేహితులతో చర్చించినా తేలనప్పుడు, అమ్మని తలచుకున్న నిముషంలో దానికి సొల్యూషన్ వచ్చేది. అమ్మ ధీశక్తి రూపంలో పరిష్కారం ఇచ్చేది. pass అయినప్పుడు అమ్మ ఫొటో ముందు చెప్పుకునేవాడిని ‘అమ్మా! నువ్వు pass చేశావు’ అని. 2 సార్లు ఫైల్ అయినా. fail అయినానమ్మా అనీ చెప్పుకున్నా. fail చేసిందీ, fail చేసిందీ అమ్మే. నాకేమి అర్థమవుతుంది?
శిక్షణకూడా రక్షణే: 2014 లో మా నాన్నగారికి, 80 వ పడిలో, తుంటిదగ్గర కాలు ఫ్రాక్చర్ అయింది. ఎక్కడా పడలేదు. సర్జరీ చేశారు. ‘అమ్మని నమ్ము కున్నారు. ఈ వయస్సులో ఈ టార్చర్ ఏమిటి? అనుకున్నా. ఎందుకు ఫ్రాక్చర్ అయిందని డాక్టర్స్ పరీక్షలు చేశారు. multiple myeloma అనే ఒక రకమైన కాన్సర్ వల్ల అని తేలింది. ఇక దానికి ట్రీట్మెంట్ తీసుకుని 7 ఏళ్ళపాటు హాయిగా ఆరోగ్యంగా తిరుగుతున్నారు. దీనిని బట్టి ఏమి అర్థమవుతోంది – శిక్షణకూడా రక్షణే అని. “అన్నీ మనం అనుకున్నట్లు జరగాలనేది కూడా ఒక జబ్బే నాన్నా!” అని అన్నది అమ్మ అని శ్రీకామరాజు అన్నయ్యగారు అన్నారు. అమ్మ అనుకున్నట్లు జరుగుతుంది కాని మనం అనుకున్నట్లు జరగాలనేది అర్థరహితం.
అమ్మ ప్రసాదం – అనురాగ స్వరూపం: రైలు దిగి, బస్సు ఎక్కి, 7వ మైలు నుంచి నడిచి ఏదోరకంగా జిల్లెళ్ళమూడి వెళ్ళేవాళ్ళం. “నాన్నా! అన్నం తిన్నారా?” అని అడిగేది అమ్మ. ‘తిన్నా మమ్మా’ అని తల ఊపేవాళ్ళం. పొట్టపట్టుకునిచూచి “ఒరేయ్! మీ నోరు అబద్ధం చెప్పినా పొట్ట అబద్ధం చెప్పదు” అని గోంగూర పప్పు, ఆవకాయ, తియ్యటి పెరుగన్నం పెట్టేది. అదృష్టం నాకు దక్కింది. ఒకసారి జిల్లెళ్ళమూడి వెళ్ళాను. నాటి రాత్రి 104° జ్వరం తగిలింది. డా| సత్యం బావ హెూమియోమందు వేశాడు. ఒళ్ళు తెలియకుండా నిద్రపట్టింది. మర్నాడు ఉదయం “అమ్మ నీ కోసం ఎదురుచూస్తున్నదిరా’ అని చెప్పాడు సత్యం బావ. సరే. అమ్మ దగ్గరకి వెళ్ళాను. “నాన్నా! రాత్రి జ్వరం తగిలిందటకదా!” అంటూ పరమాన్నం, గారెలు తినిపించింది. “సహించకపోవటం ఉంటుంది కాని, పడకపోవటం ఉండదు, తిను” అన్నది. అమ్మ ప్రసాదం దెబ్బకి జ్వరం పారిపోయింది.
సర్వజ్ఞ సర్వసమర్థ: ఒకసారి అమ్మ దివ్యసన్నిధిలో ఉన్నాను. అమ్మ నాకు ఈ పద్యం చదివి వినిపించింది.
‘కలడందురు దీనుల యెడ
కలడందురు పరమయోగి గణములపాలన్
కలడందు రన్ని దిశలను
కలడు కలండనెడువాడు కలడో లేడో” అని. నా వైపు తిరిగి “నాన్నా! వాడికి (గజేంద్రునికి) విష్ణువుతప్ప వేరే భక్తితెలియదు. వీడు ప్రార్థిస్తున్నాడు, వాడు ఎంతకీ రాడు. అంతటి వాడికే సందేహం వచ్చింది కలడు కలండనెడివాడు కలడో లేడో అని’ అని నర్మగర్భంగా చిరునవ్వు చిందించింది.
“మళ్ళీ వెంటనే అన్నాడు కదా, నాన్నా! లావొక్కింతయు లేదు నీవే తప్ప నితః పరం బెరుగ” అనీ అన్నది. అలా ఎందుకు అన్నదో అప్పట్లో తెలియలేదు.
1990 లో నాకు రెండేళ్ళకుమారుడు ఇంటిముందు ఆడుకుంటూ పరుగెత్తుకు వస్తుంటే ఒక వాహనం కొట్టి on the spot చనిపోయాడు. నేను ఇంట్లోనే ఉన్నాను. ఏంటి అమ్మ ఇట్లా చేసిందని mind blank అయిపోయింది. ఏంచేయాలో తెలియదు, ఎవరిని ప్రార్థించాలో తెలియదు. నాకు అమ్మ తప్ప మరొకటి తెలియదు. బొట్టుపెట్టుకున్నా అమ్మ రక్షణే అని పెట్టుకునేవాళ్ళం.
రోజులు గడుస్తున్నాయి. అమ్మ ఫొటో ఉండకూడదనే అనిపించింది. తర్వాత అమ్మ ఫొటో దగ్గరకి వెళ్ళి “అమ్మా! నాకు దిక్కులేదు, గతిలేదు. నువ్వు తప్ప నాకు ఇంకేమీ తెలియదు. వాణ్ణి నాకు మళ్ళీ ఇచ్చేయమ్మా” అని ప్రార్థించాను. అర్థరాత్రి లేచికూర్చుని ‘వాడిని నాకు ఎందుకు ఇచ్చావు? ఎందుకు తీసుకెళ్ళావు? చెప్పు కనీసం – వాడిని ఇవ్వకపోయినా” అని హఠంచేసేవాడిని, 24 గంటలూ పోట్లాటే. అమ్మ కనిపిస్తుందా? ‘మరుగే నా విధానం’ అన్నది కదా!
తమాషా ఏమిటంటే అమ్మ ఎవరో ఒకరిని పంపిస్తుంది. ఒకసారి సద్గురు శ్రీ శివానన్దమూర్తి గారు వచ్చారు. వారు అన్నారు, “నాయనా! వాడు రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. మార్గం కల్పించండి” అని. కాగా, నా భార్యకి అప్పటికే 3 సిజేరియన్లు, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స (Tubectomy) అయిపోయాయి. అంటే అన్ని దారులూ మూసుకుపోయాయన్నమాట.
అమ్మయందలి ప్రగాఢ విశ్వాసంతో ప్రయత్నంచేశాను. మళ్ళీ పిల్లవాడు పుట్టాడు. వాడే పుట్టాడని మా అందరి నమ్మకం. ‘పునర్జన్మలు లేవు (వాడు/ఆశక్తి) ఇస్తేతప్ప’ అన్నారు శ్రీ పి.యస్.ఆర్. గారు. అదేమో నాకు తెలియదు. నా నమ్మకం ‘అమ్మ మళ్ళీవాడిని నాకు ఇచ్చింది’ అని.
1882 లో ఆనాడు అమ్మ నా వైపు తిరిగి ఈ పద్యాలు ‘కలడందురు’, ‘లావొక్కింతయు లేదు’ చదివినపుడు నాకేం తెలుసు అమ్మ నా సంగతే ప్రస్తావిస్తోంది అని? కాగా నా సంగతిని అమ్మ గజేంద్రుని మీద పెట్టి చెప్పింది నాకు. (సశేషం)