అమ్మను గురించి:
అమ్మ జన్మించింది చైత్ర శుద్ధ ఏకాదశి, తెల్లవారుజామున 4 గం. 30ని లకు, 1923 మార్చి 28వ తేది, గుంటూరు జిల్లా, మన్నవ గ్రామంలో. అమ్మ జన్మించక ముందే 34 సంవత్సరములు గల పాంచభౌతిక స్థూలదేహంతో అమ్మ తండ్రి అయిన మన్నవ సీతాపతి శర్మ గారికి దర్శనం ఇచ్చింది. “నేను అమ్మను. మీ ఇంట్లో పుడతాను” అని చెపుతుంది. అమ్మ తండ్రి మన్నవలో చెన్నకేశవస్వామి, రాజ్యలక్ష్మి ఆలయాలలో ప్రదక్షిణాలు చేస్తూ వుండేవారు. ఒకసారి పొన్నూరులో చింతచెట్టు క్రింద కూర్చుని “ఈసారి పుట్టే బిడ్డ అయినా దక్కేనా?” అని చింతాక్రాంతుడై వుండగా ఎదురుగా చెన్నకేశవస్వామి కనపడి, ఒక బాలికగా మారి అదృశ్యమవటం జరుగుతుంది. ఈ రెండు దర్శనాల అనంతరం అమ్మ అవతరించటం జరుగుతుంది.
అమ్మ అంటే అంతులేనిది, అడ్డులేనిది, ఆధారమయినది. జనని అంటే జన్మస్థానం అని, భారం వహించే శక్తి ఎక్కడ వుందో అది మాతృత్వం అని ప్రకటించింది. అనగా అమ్మ అనేది ఒక ఉజ్జ్వల తత్త్వం. కేవలం ఒక స్త్రీ వాచకం కాదు. ఈ విధంగా తన పూర్ణత్వస్థితిని తెలియజేసింది అమ్మ. సర్వం తానైన అమ్మకి సర్వం సామాన్యమే! అమ్మకి ప్రత్యేకత లేదు. కాని ప్రత్యేకతే తానైనది. ఇతః పూర్వం వివరించిన దర్శనాలు ఆద్యంతరహితమయిన అమ్మ ఉనికికి నిదర్శనాలు. “రూపం పరిమితం శక్తి అనంతం” అన్న వాక్యానికి – ప్రతిరూపం ‘అమ్మ’ అని తెలియజేసిన అనుభూతులు అమ్మ తండ్రి యొక్క అనుభవాలు. సాధనలకు గమ్యం అమ్మ:
అమ్మకి 19 నెలల వయస్సులో మన్నవ రాజమ్మగారి ఇంట్లో సాయంత్రం 5.30 ప్రాంతంలో దానిమ్మ చెట్టు క్రింద కూర్చుని నల్లగుడ్డు పైకి పోనిచ్చి, అరమోడ్పు కన్నులతో పద్మాసనం వేసుకు కూర్చుని వుండగా బంధువులైన మన్నవ కృష్ణశర్మగారు అది జబ్బు అనుకుని ఉల్లిపాయలు, జిల్లేడు రసములు ముక్కులో పోయటం, అరగంట తరువాత అమ్మ జాగ్రదావస్థకు రావటం జరుగుతుంది. అది వైద్య ప్రభావమనుకుంటారే గాని, అమ్మ సమాధ్యవస్థను గుర్తించరు. తరువాత తెనాలిలో అమ్మ బంధువుల ఇంట్లో అరమోడ్పుకన్నులతో చేపనిద్ర మాదిరిగా, ఎడమకాలిని చాచి, కుడికాలును వెనుకకు పోనిచ్చి దానిమ్మ పువ్వును చేతిలో పట్టుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసము లాగిపోయి కూర్చుంటుంది. ఇది చూసిన అమ్మ పెదతల్లి అన్నపూర్ణమ్మ గారు అమ్మ దగ్గరకు వచ్చేటప్పటికి అమ్మ లేవబోయే సమయం ఒకటి అవుతుంది. అప్పుడు ఆవిడ “ఎందుకమ్మా అట్లా కూర్చున్నావు?” అని అడిగితే “శాంభవీ ముద్రలే” అంటుంది అమ్మ. ఆ వయస్సులోనే ముద్రలు వేయటం గాక, ముద్రలు రావటం జరిగేది. “ముద్రలు వేయటం కాదు రావాలి” అంటుంది అమ్మ. ముద్ర అంటే అధికారం అన్నది. ఆ లక్ష్యసిద్ధి కోసం ముద్రలు వేస్తారు. ఇది సాధన స్థితి. ఈ సాధనలకు గమ్యం తానని తెలియజేసింది అమ్మ. గమ్యమే తానైన అమ్మకి ముద్రలు సహజంగా వచ్చేవి.
దైవమే తాను:
పుట్టిన తరువాత సాధన చేసి దైవత్వం సంపాదించటం కాదు – దైవమే తానైన అమ్మ చిన్నప్పటి నుండే అనేకమందికి దివ్యదర్శనాలు, అలౌకిక అనుభూతులను కలుగజేసింది. 4, 5 సంవత్సరాల పిల్లగా వున్నప్పుడే ఎంతోమందికి దివ్యదర్శనాలు ఇచ్చింది. గంగరాజు పున్నయ్యగారికి కృష్ణుడుగా, తురిమెళ్ళ వెంకటప్పయ్యగారికి సత్యనారాయణ స్వామిగా, గుండేలురావుగారికి రామునిగా, తిరువళ్ళూరులో పహిల్వానుకు కృష్ణునిగా, లక్ష్మణాచార్యుల వారికి నరసింహస్వామిగా, పోలీసు అంకదాసుకి విశ్వరూప సందర్శనం ఇస్తుంది. మరొక పోలీసు మస్తానికి తనలో వున్న జీవం లేచి అమ్మలో ప్రవేశిస్తున్నట్లుగా భావించి, తాను లేను – వున్నదంతా అమ్మ అనే అనుభూతిని కలిగిస్తుంది. ఇదే సమయంలో ఒక ముసలి తాతకు నాగేంద్రునిగా దర్శనం ఇచ్చి తరింపచేస్తుంది. చిదంబరరావు తాతగారికి అనేక దేవ దేవీ దర్శనాలు ఇవ్వటమే కాక, నిష్ణాతుడైన బ్రాహ్మణునిగా, ఊడ్చుకునే వాని దగ్గర్నించి అన్ని రకాల వృత్తులలో వుండే వ్యక్తుల రూపంలో దర్శనం ఇస్తుంది అమ్మ. ఈ విధంగా ఎందరికో దివ్యదర్శనాలు ఇచ్చి దైవమే తానని తెలియజేసింది. “ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనా” – ఉపాసకుల నిమిత్తమై బ్రహ్మము రూపము కల్పించుకొనునని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. సేవించుకునే వానికి తగిన విధంగా తనను తాను మలుచుకొనుట కొరకే భగవంతుడు అవతారాలు ఎత్తటానికి కల ముఖ్య కారణాలు.
అమ్మగా ఎందుకు వచ్చిందో వివరణ:
ఆంధ్రవాల్మీకిగా బిరుదుపొందిన శ్రీ వాసుదాసస్వామి రామాయణంలో ఈ విధంగా చెబుతారు. త్రేతాయుగంలో ధర్మావతారంగా శ్రీరామచంద్రుడు ఆవిర్భవించారు. ధర్మప్రబోధం గాక, ధర్మాన్ని ఆచరిస్తూ వుంటే చూసి మారెడి సమాజం తమ నడకని మార్చుకునే స్థితి వున్నది ఆ యుగంలో. ద్వాపరయుగంలో కృష్ణావతారం కేవలం ఆచరణ కాక ప్రబోధం అవసరమయింది. అందువలన గీతాచార్యుడై భగవద్గీతని ప్రబోధించారు శ్రీకృష్ణుడు. అంటే ధర్మాచరణ మాత్రమే కాక, ధర్మప్రబోధం కూడా అవసరమయింది. శంకరుని కాలంలో ఒక పద్ధతిగా వాదోపవాదాలు సాగేవి. మండనమిశ్రుడు ఒప్పుకుని, సురేశ్వరాచార్యుడై శంకరుని శిష్యుడైనాడు. అంటే శంకరుని కాలంలో ప్రబోధం అవసరంగా వాదించి, నాటి సమాజానికి కావలసింది. చేశాడు.
ఈనాడు ఆచరిస్తూపోతే చూసి మారేవారు లేరు. ప్రబోధిస్తే వినేవారు లేరు. వాదిస్తే వితండవాదం చేస్తారు. సంహరిస్తే ఎవరూ మిగలరు. అందువలన దివ్యశక్తి మాతృరూపంలో తనే సరెండరై (surrender), బురద పూసుకున్నా క్షాళనం చేసుకుని ఒడిలోకి తీసుకునే అమ్మయై ఈ అవనిపై అవతరించింది.