1. Home
  2. Articles
  3. Mother of All
  4. సర్వమాతృత్వం

సర్వమాతృత్వం

A Anasuya
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 21
Month : July
Issue Number : 3
Year : 2022

లోకంలో సాధారణంగా ఒక స్త్రీ ప్రసవించగానే ఆ శిశువుకి స్నానం చేయించి ఆమె ప్రక్కలో పరుండబెట్టి ‘ఇదిగో, నీ బిడ్డ’ అని చూపిస్తారు. “అవును’ అని తృప్తిగా తల ఊపి త్రికరణ శుద్ధిగా అంగీకరిస్తుంది. ఆ బిడ్డ యోగ క్షేమాల కోసం ఊపిరి ఉన్నంతకాలం శ్రమించేందుకు దేనినైనా త్యాగం చేసేందుకు ఆ క్షణంలోనే కంకణం కట్టుకుంటుంది. భర్తకు చూపించి గర్వంగా ‘మనబిడ్డ’ అని పరిచయం చేస్తుంది.

వాస్తవం ఏమంటే – ఆమెకేమీ దివ్య దృష్టి లేదు – ఆ బిడ్డ తన బిడ్డే ననేది కేవలం నమ్మకం; రూఢిగా తెలియదు. అందుకు ప్రకృతిలో సహజమైన ఉదాహరణ ఉంది. కోయిలలు గుడ్లుపెట్టి, కాకి గూటిలో ఉంచుతాయి. భేదం ఎరుగని కాకి తన గుడ్లతో పాటే వాటిని పొదిగి పిల్లల్ని చేస్తుంది. వసంతకాలం రాగానే అవి ‘కుహూ, కుహూ’ అంటూ ఎగిరిపోతాయి.

మన కట్టెదుటే మరొక ఉదాహరణ: విశ్వవిఖ్యాత భారతీయ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పుట్టిన వెంటనే వారి మేనమామ నారాయణ్ మసురేకర్ ఆస్పత్రికి వచ్చి మాతా శిశువులను చూసి వెళ్ళారు. ఆ మరునాడు కూడా ఆయన వచ్చారు; తన సోదరి ప్రక్కలో ఉన్నది తన మేనల్లుడు కాదని ఆస్పత్రి సిబ్బందిని పిలిచి. చెప్పారు. అంతా హడావిడిగా అన్వేషణ సాగించారు. ఆ రోజున పుట్టిన పసి కందుల్ని పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో చిన్నారి గవాస్కర్ ఒక పల్లె పడుచు (ఫిషర్ ఉమన్) డొక్క నానుకుని పాలు త్రాగుతున్నాడు. తనబిడ్డ ఎవరో కన్నతల్లికే తెలియలేదు. మరి మేనమామకి ఎలా తెలిసింది? గవాస్కర్ చెవికి చిన్న రంధ్రము ఉండేది. నారాయణ్ మసురేకర్ గుర్తించారు; గవాస్కర్ను తిరిగి తన తల్లి చెంతకు చేర్చారు. లేకుంటే పెరిగి పెద్దవాడైన తర్వాత గవాస్కర్ ఒక సముద్రపు ఒడ్డున పడవలో కూర్చొని వల విసిరి చేపలు పట్టుకుని పొట్ట పోసుకునే వాడు. ఆ పల్లెపడుచే తన కన్నతల్లి అని నమ్మేవాడు. కర్ణుడు కూడా చివరిక్షణం వరకు రాధేయుడే, సూతపుత్రుడే. విధి-విధానం, కర్త-కర్మ రెండూ తానైన అమ్మ తనను ‘అమ్మ’గా నిర్ణయించుకుని దిగి వచ్చింది, అవతరించింది. “నేను అమ్మను – నీకు, మీకు అందరికీ, పశుపక్ష్యాదులకూ, క్రిమి కీటకాదులకు” – అంటూ నిజ విశ్వమాతృత్వాన్ని విస్పష్టం చేసింది. ఆ సందర్భంలో ఒకరు అమ్మా! నువ్వు మమ్మల్నందరినీ కన్నావా?” అని ప్రశ్నించారు. వెంటనే అమ్మ “కంటేనేనా, అలా చూడగలిగితే చాలు” అన్నది. కాగా, భాషాపరంగా ‘కనటం’ అనే పదానికి నవమాసాలు మోసి కనటం, జన్మ నివ్వటం అని ఒక అర్ధం, ఒక దృష్టితో చూడటం అని రెండు అర్థాలున్నాయి.

అమ్మ మరొక సందర్భంలో పలు సందేహాలను పటాపంచెలు చేస్తూ “నేనే మిమ్మల్నందరినీ కన్నాను; మీమీ తల్లులకు పెంపుడిచ్చాను” అని ఘంటాపథంగా చాటింది. అంటే అమ్మయే అందరికీ నిజమైన కన్నతల్లి – అన్నమాట; ఉన్నమాట. ఈ వాక్యాన్ని అర్ధం చేసుకుంటే మన కన్నతల్లి ఎవరో, పెంపుడు తల్లి ఎవరో తేటతెల్లం అవుతుంది.

ప్రతి ఒక్కరికి తల్లి ఉన్నది, ఆమె జన్మనిచ్చి ప్రాణాధికంగా ప్రేమిస్తూ పెంచి పోషిస్తోంది. కాగా, సద్గురు శ్రీశివానంద మూర్తిగారు ఒక వాస్తవాన్ని వెల్లడించారు. ప్రతివారికి ఇంటివద్ద తల్లి ఉన్నది. జిల్లెళ్ళమూడిలోనూ ఒక తల్లి ఉన్నది. ఇరువురికీ తేడా ఏమిటి? ఆకలివేస్తే ఇంటివద్ద తల్లి అన్నం పెడుతుంది. జిళ్ళెమూడిలో ఉన్న అమ్మా అన్నం పెడుతుంది. కానీ అమ్మ పెట్టేది కేవలం ఆకలి తీర్చే అన్నం కాదు, మహాప్రసాదం, ఆ ప్రసాదం మోక్ష ప్రదాయకం.

అంతేకాదు. ఇంటివద్ద తల్లి అంటుంది – “బిడ్డల్ని కన్నాం కానీ వాళ్ళ (తల) రాతల్ని కన్నామా?” అని. అదిగో (అందరితల) రాతల్ని కన్న తల్లి జిల్లెళ్ళమూడిలో ఉన్నది – అమ్మ”-అని.

తలరాతల్ని కన్నతల్లి అనసూయమ్మ అంటే – మన జీవితం, జీవనం, ఉనికి, నడక, విలువలు, సుఖదుఃఖాలు, ఊపిరి, ప్రయోజనం – ప్రయోజకత్వం .. అన్నిటినీ తీర్చి దిద్దే మహాశక్తి. శిలలోని జలము, పువులోని మధువు అమ్మ కను సైగతోనే, కృపతోనే విరాజిల్లుతున్నాయి. స్థావర జంగమాత్మక సకల సృష్టికి కన్నతల్లి, పెంచే తల్లి అమ్మయే అనేది ముమ్మాటికీ సత్యం. అదే సర్వమాతృత్వం.

మూడేళ్ళ పసిప్రాయంలో తన కన్నతల్లి రంగమ్మగారితో అన్నది, “నీవు లేనప్పుడు నేనే అమ్మనై ఉంటానుగా” అని. పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది. అన్నట్లు అమ్మకు జన్మప్రభృతి మాతృత్వ మాతృతత్త్వ దివ్యలక్షణాలు ప్రసృతమై పలువురిని ప్రభావితుల్ని పునీతుల్ని చేశాయి. ఐదేళ్ళ ప్రాయంలో గుంటూరులో విరూపాక్ష పీఠాధిపతులు శ్రీకళ్యాణానంద భారతీస్వామి వారితో ప్రసంగ సందర్భంగా ‘నాయనా! అని వారిని సంబోధించింది. వారు కవులు, పండితులు, వేదాంగ పారంగతులు, సర్వసంగ పరిత్యాగి. అమ్మది విరిసీ విరియని వయస్సు, అభం శుభం తెలియని చిన్న బాలిక. వారు విద్యావయో వృద్ధులు. కానీ, ఒక తల్లి తనయుని పిలిచినట్లు ‘నాయనా!’ అని ప్రేమగా సంబోధించింది. కనుకనే వారు ప్రశ్నించారు “నాయనా – అంటున్నావెందుకు నన్నూ?” అని. “అది నా విధి” అన్నది అమ్మ. తనను అందరికీ అమ్మగా నిర్ణయించుకున్నది కావున ఎవరినైనా, దేనినైనా బిడ్డలుగానే చూడగలదు, ఒడిలోకి తీసికొని లాలించగలదు; తన కంటి పాపలుగా సంరక్షించ గలదు.

అపుడు అమ్మ నాలుగేండ్ల బాలిక. వంటి నిండా బంగారమే; అసలు అమ్మ అసలు స్వరూపం, స్వభావం బంగారమే-అమూల్యమే. అట్టి బంగారు తల్లి అమ్మ నగల్ని దోచుకుని, అమ్మను అంతం చేస్తే తన చౌర్యం మాసిపోతుందని ఎంచి, ఒక దురాత్ముడు రెండు చేతులా ఎత్తి అమ్మను నడి సంద్రంలోకి విసిరేశాడు. శోక సంతప్తుల్ని శోకసాగరం నుంచి పరిరక్షించే అమ్మ క్షేమంగానే ఉంది; కానీ, ఆ దుష్టుడు సముద్రపులోతుల్లో చిక్కుకుని మృత్యుముఖంలో ఉన్నాడు. వాడిని ఒక అదృశ్యశక్తి రెండు చేతులా ఎత్తి ఒడ్డుకు చేర్చింది. ఆ శక్తి అమ్మే. అంతేకాదు. ఆ దుర్మార్గునిపై కూడా పుత్ర వాత్సల్యాన్ని కురిపించింది – “నీవు ఒలిచింది నీ సొమ్మే నాయనా! నీవు బ్రతికి వచ్చావు. అంతేచాలు. నాకదే సొమ్ము. నీకిదే సొమ్ము. తల్లికి బిడ్డ సొమ్ము, బిడ్డకు డబ్బు సొమ్ము” అని అక్కున చేర్చుకున్నది.

విశేషాంశ మేమంటే – అమ్మ అందరినీ తన కడుపున పుట్టిన బిడ్డల వలెనే కాక అంతకు మించి ఎక్కువగా ప్రేమించింది – అనేది వాస్తవం. అమ్మకి కాస్త సన్నిహితంగా మెసిలే భాగ్యానికి నోచుకున్న వారినెవరినైనా ప్రశ్నిస్తే వారు చెప్పేది నిర్ద్వంద్వంగా ఒకే సత్యం-“అమ్మ నాది. అమ్మకి నేనంటేనే అమితమైన నిరుపమానమైన ప్రేమ” – అనేది.

ఎవరికి వారు అమ్మ ప్రేమ, మమకారం తనకే సొంతం అని భావిస్తారు; కానీ అమ్మ ప్రేమ, వాత్సల్యం ఏ ఒక్కరికీ ఏ ఒక్కరికో సొంతం కాదు. అమ్మ ఏ హృదయాంతరాళాల్లో ఎవరి స్థానం వారిదే. సహస్రనామ సంకీర్తిత, సహస్రరూప సంపూజిత అమ్మ లాలన పాలన, సంరక్షణ అందరికీ చెందుతాయి. లక్షమంది బిడ్డలు తృప్తిగా కడుపు నిండ అన్నం తిన్నప్పటికీ ఒక్కరు ఆకలితో ఉండిపోతే ఆ బాధ, వేదనలను అమ్మ భరించలేదు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచినట్లు అందరి మనోమందిరాల్లో అమ్మ, అమ్మ హృదయ వినీలాకాశంలో నక్షత్రాల్లా బిడ్డలూ దీపిస్తూనే ఉంటారు. ఒక ఉదాహరణ:

ఒకనాడు వాత్సల్యాలయంలో అమ్మ దర్శనం ఇస్తోంది. ఒక సోదరుడు వచ్చాడు. ‘అమ్మా! నేను మిమ్మల్ని విజయవాడలో చూశా; మరలా ఇవాళ చూస్తున్నా’ అన్నాడు. “విజయవాడలో ఎక్కడ చూశావు నాన్నా!” అడిగింది అమ్మ. 

“మీరు పి.డబ్లు.డి. గ్రౌండ్స్లో దర్శనం ఇస్తున్నారు. దాదాపు లక్షమంది వచ్చారు. అపుడు మిమ్మల్ని చూశాను” అన్నాడు. “నిన్నూ నేను చూశాను” అన్నది అమ్మ. ‘లక్షమంది జనంలో ఎక్కడో చివరిలో ఉన్నాను. నన్ను చూడటమేమిటమ్మా! అని అడిగాడు. “నువ్వు ఎఱ్ఱచొక్కా తొడుక్కుని, నీ స్నేహితుని భుజాల మీద చేతులు వేసుకుని నన్ను చూస్తుండగా నిన్ను చూశాను” స్పష్టం చేసింది అమ్మ. ఆతడు జ్ఞాపకం చేసుకుని “నిజమే-లక్షమందిలో ఎలా గుర్తు పట్టారు? అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు. “నాన్నా! గొట్టెల కాపరికి వాడి గొఱ్ఱ జ్ఞాపకం ఉండదా? ఇదీ అంతే. తల్లి బిడ్డని గుర్తు పట్టలేదా?” అన్నది అమ్మ.

సకల జగత్తునూ సృష్టించి పోషిస్తున్న అమ్మయే అందరికీ, అన్నిటికీ కన్నతల్లి మరియు పెంచే తల్లి. దీనినే సర్వమాతృత్వం అని కీర్తిస్తున్నాను.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!