మామిడిపండులోని తీపితనం, నేరేడు పండులోని వగరుతనం, చింతకాయలోని పులుపుతనం ఆస్వాదించి నంత తేలికగా అమ్మలో మూర్తీభవించిన కమ్మని అమ్మతనం మనం అందరం అమ్మ నుండి అతి తేలికగా ఆస్వాదించాము. కారణం అమ్మలో నిబిడీకృతమైన సర్వమూ తానయైన యొక మహాద్భుతశక్తి యని గ్రహించగలగాలి. అయితే ఈ శక్తిని తెలుసుకునేందుకు మనం అమ్మ తత్త్వాన్ని సాధనతో సమన్వయం చేసుకొనగలగాలి. అమ్మే చెప్పింది కదా సాధ్యమైందే సాధన అని కనుక కొంత సాధనగా సమన్వయం కోసం ముందుకు సాగుదాము. శ్రీ మద్భాగవతంలో అష్టమ స్కంధంలో గజేంద్రుని శరణాగతిని గమనించండి.
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
యెవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూలకారణం
బెవ్వ డనాదిమధ్యలయుడెవ్వడు సర్వము తానయైనవా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్!
శరణాగతికి సిద్ధపడి కూడ గజేంద్రునికి అన్ని అనుమానాలే. సర్వము తానయైనవాడెవ్వడో తెలిస్తే ఆ స్వయంభువుయైన ఈశ్వరతత్వానికి శరణు కోరతా నంటున్నాడు. అనాదిగా భక్తులందరికి ఎదురయ్యే సమస్య ఇదే. తామున్న విపత్కర స్థితిలో ఏ శక్తిని శరణు కోరాలి. ఏ శక్తిని వేడితే తమ కష్టాలు తీరతాయని తెలియక సతమతమవుతారు.
కానీ తమ తమ సంచిత ప్రారబ్ధకర్మలు తా మాచరించిన ప్రాయశ్చిత్తాలతో తీరిపోగానే ఏ శక్తిని ఆరాధించకపోయినా “సర్వమూ తానయైన యెక దివ్యశక్తి యొకటి తనంతట తానుగ భక్తులకు దర్శన భాగ్యం కల్గిస్తుందనే విషయాన్ని సాధకులు గుర్తించరు. సర్వము తానయైన శక్తికి భక్తుని అవసరాలు, అవస్థలు తెలియకుండా ఎలా వుంటాయి. ఒకసారి ఒక భక్తుడు అమ్మదర్శనం కోసం జిల్లెళ్ళమూడి వచ్చాడు. చీకటి పడింది. “అల వైకుంఠపురిలో … ఆ మూల సౌధంబుదాపల” అన్నట్లుగ అమ్మ ఎక్కడో మేడమీద గదిలో ఉంటే పైకి వెళ్ళి అమ్మను దర్శించుకొని తాను తెచ్చిన పండ్లు అమ్మకి సమర్పించుకొని అమ్మ ఆశీస్సులు పొందాడు. అమ్మ ఆదేశంతో క్రిందకి వచ్చి అన్నపూర్ణాలయంలో ప్రసాదం స్వీకరించాడు. ఆరాత్రి ఇక బయలుదేరి వెళ్ళే అవకాశం లేదు. అందరు ఒక్కొక్కరే నడుములు వాలుస్తున్నారు. కొందరు గదుల్లో దూరి తలుపు వేసుకుంటున్నారు. ఈ భక్తునికి ఎక్కడ పడుకోవాలో అర్థం కాలేదు. ప్రయాణం అలసట వల్ల ప్రసాదం తిన్న భుక్తాయాసం వల్ల సతమతమవుతున్నాడు. అమ్మదర్శనం. అయింది కదా చాలులే ఏ గోడ దగ్గరో కూర్చుందామని అనుకొనే సమయంలో ఎవరో ఒకరు వచ్చి ఇదిగో దిండు చాప దుప్పటి ఆ చివర గదిలో ఫ్యాను వుంది. అక్కడ పడుకోమని అమ్మ చెప్పిందని అతనికిచ్చి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యపోవటం భక్తునివంతైనది. ఎక్కడా మేడమీద గదిలో యున్న అమ్మ సాధారణ భక్తుని అవసరాలు, అవస్థ గుర్తించి అతనికవసరమైన ఏర్పాట్లు చేయడం అమ్మకే సాధ్యం. జయహోమాతా అనుకుంటూ అతను సేదతీరాడు. అమ్మ ఇలా “నాది సర్వసామాన్యస్థితి” యని చెప్పుచు తన అసామాన్యస్థితిని బిడ్డలపట్ల బహిర్గతం చేస్తుంది. సర్వము తానైన శక్తికి తెలియని విషయాలు ఏముంటాయి? అదే అమ్మ తత్వమని మనం తెలుసుకొనగలగాలి.
“నేను గురువును కాను – · మీరు శిష్యులుకారు”
నేను మార్గదర్శిని కాను మీరు బాటసారులు కారు
నేను అమ్మను – మీరు నా బిడ్డలు” అని అమ్మ చెప్పే మాటలు మాత్రమే కాదు అమ్మ చేతలు కూడా ఆశ్చర్యకరంగా వుంటాయనటం అతిశయోక్తికానేరదు. అమ్మ ఒక రోజు అందరిని హడావుడిగా సమావేశపరిచింది. ఆరోజు 1967 డిశంబరు 31వ తేది అమ్మ ఆదేశాలు విని అందరు ఆశ్చర్యపోయారు. అమ్మ జీవించి యున్న వెంకాయమ్మ గారిని అంత్యక్రియలకి ఏర్పాట్లు చేయమన్నది. అపరకర్మల నిమిత్తం పురోహితుడికి కబురు చేస్తున్నది. దహనానికి కావలసిన సరంజామ తెప్పిస్తున్నది. అమ్మ కార్యదక్షతలోని స్పష్టత చూచి అమ్మను పలకరించ టానికి అందరు జంకుతున్నారు. కొండముది రామ కృష్ణన్నయ్య చిన్నగా అమ్మ దగ్గరకు చేరి “అమ్మా కోన వెంకాయమ్మగారు ఇంకా జీవించే యున్నది కదమ్మా” అని ప్రశ్నించారు. దానికి అమ్మ ‘సరేలేరా ఇంకెంతసేపు తేదీ మారగానే ఈ ఏర్పాట్లన్నీ అవసరమవుతాయిరా” అన్నది. అంతే అమ్మ చెప్పినట్లే జరిగింది. 1968 జనవరి 1వ తేదీ కోన వెంకాయమ్మగారు స్వర్గస్థురాలయింది ఏమిటిది ఆశ్చర్యం జననమరణాలు అమ్మకెలా తెలుస్తున్నవి. “సర్వము తానయైన శక్తి”కి కాలజ్ఞానం తెలియకుండా ఎలా వుంటుంది? అమ్మ విషయంలో ఈ సంఘటన ఆశ్చర్యకరమైన విషయం ఎలా అవుతుంది? అమ్మ చేతలలో మాటలలో “సాధికారికత” “స్పష్టత” అందరిని అబ్బుర పరిచేవి.
అమ్మలోని సాధికారికత, స్పష్టత అమ్మకి సాధన వల్లనో, వయస్సు వల్ల కలిగే అనుభవం వల్లనో అబ్బిన విద్యయని భావిస్తే అమ్మతత్వాన్ని తెలుసుకునే గమ్యంలో తప్పటడుగు వేసినట్లే. అమ్మ చిన్నతనంలోనే శ్రీ పావులూరి ఆంజనేయస్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా తినమని భారతి అత్తయ్య విషయంలో ఆదేశించింది కాని భారతి అత్తయ్య కాదంటే అమ్మ అలాగే నూట ఎనిమిది ప్రదక్షిణాలు స్వామికి తానే చేసి ప్రక్కనే చేలలోని మట్టిగడ్డలు తెచ్చి స్వామికి నైవేద్యం పెట్టె తాను స్వీకరించి అందరికి పంచిపెట్టింది. ఆ ప్రసాదం సువాసనలతో అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ నివేదనని విమర్శించిన వారికి అమ్మ ఇలా చెప్పింది” నివేదనకి నియమమేమియున్నది. మనకి ఏది వుంటే అది సమర్పిస్తాము. దేవుడు పండ్లయితేనే పుచ్చుకుంటాను లేకపోతే వద్దు అనలేదు కదా ! మనకి కలిగిన దాన్ని నివేదన చేస్తాము. ఈ రోజు నాకు దొరికింది మట్టిగడ్డలు” అని సమర్థించుకొన్నది. సర్వవ్యాపకుడైన పరమాత్మ భక్ష్యభోజ్య లేహ్యలలోనే కాదు. సర్వప్రాణుల్లో చరాచరజీవుల్లో ఉంటాడనే పరమాత్మ సర్వవ్యాపకత్వాన్ని
అమ్మచిన్నతనం లోనే అందరికి తెలియపరిచింది. పెద్ద పెద్ద విషయాలని సహితం చిన్న చిన్న మాటలతో చెప్పగలగడం అమ్మకి జన్మతః అబ్బిన అద్భుతశక్తి. “ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి చూచిన నందందే కలడు దానవాగ్రణివింటే” యని స్వామి సర్వవ్యాపకతను వెల్లడించిన ప్రహ్లాదుని మాటలు వమ్ము చేయక
“హరి సర్వాకృతులం గలండనుచు బ్రహ్లాదుండు భాషింప స
త్వరుడై యెందునలేడు లేడని సుతున్ దైత్యుండు తర్కింప శ్రీ
నరసింహాకృతి నుండె నచ్యుతుడు నానా జంగమ స్థావరో
త్కర గర్భంబుల నన్నిదేశముల నుద్ధండ ప్రభావంబునన్”
తన భక్తుని పరీక్షించటానికి హిరణ్యకశిపుడు తనని ఏ వస్తువు నందు చూపమని ప్రహ్లాదుని కోరతాడోయని పరమాత్మ నరసింహాకృతిలో సమస్త చరాచర జీవవస్తు జాలములలో ప్రపంచమంతట నిండిపోయాడు. సర్వము తానన శక్తి సర్వవ్యాపకుడుగా మారిన ఈ విచిత్ర లీల సాధారణ భక్తులకి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇవన్ని సర్వముతానైన శక్తి లీలలు లేదా క్రీడలు. బ్రహ్మ సూత్రాలు రెండవ అధ్యాయంలో ఈ క్రీడల్ని లేదా లీలలని “లీలావత్తు కైవల్యం” గా పేర్కొనబడింది. పరమాత్మలేని చరాచర వస్తుజాలం ఏదీ లేదని భాగవతం చెప్పిన ఇంతటి భాగవతమైన సందేశాన్ని మట్టిగడ్డలని నివేదన రూపంలో అమ్మ నివేదన చేసి అందరికి సులభరీతిలో చెప్పింది. పెద్ద పెద్ద విషయాలని సర్వము తానయైన శక్తికే చిన్న చిన్న మాటలతో ఉదాహరణలతో చెప్పగలిగే సత్తాయుంటుంది. ఈ సర్వముతానయైన శక్తిని గమనించి సిద్ధపురుషులు ఇలా విన్నపాలు చేసుకుంటారు. “అమ్మా లేని దాని కొరకు ఆశించేది దుఃఖము. ఉన్నది చాలనుకునేది. సుఖము. ఈ రెండింటికి చెందినది ఆనందం. నీవు ఆనంద స్వరూపిణివి. ఏది వచ్చినా అనుభవించే స్థితినీకున్నది. మాకు కూడా ఆ సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించే స్థితి ప్రసాదించవమ్మా ! అని వేడుకోవడం నాబోంట్లకు మార్గదర్శనమని స్థిరంగా విశ్వసిస్తున్నాను. సర్వము తానైన జగదంబ మనందరికి ఆస్థితిని కలగజేసి తీరుతుంది.