“అపమృత్యువు, అకాలమృత్యువు వంటి అన్నిరకాల మృత్యువులనూ నివారించే శ్రీమాత సర్వమృత్యునివారిణి.”
“దారువు అంటే కొయ్య, కుఠారిక అంటే గొడ్డలి. చెక్కను గొడ్డలి చీల్చినట్లు మృత్యువును నాశనం చేసే లలితాంబిక మృత్యుదారు కుఠారిక.”
“సంసార నిర్మగ్నులైన సామాన్యమానవులు మృత్యువుకు లోబడి ఉండవలసిందే. తన్ను కొలిచేవారికి అమృతత్వాన్ని అనుగ్రహించి, శాశ్వతానందాన్ని ప్రసాదించే లలితాదేవి మృత్యుమథని” – భారతీవ్యాఖ్య.
అవతారమూర్తులే అయినా, మానవశరీరం ధరించాక, మృత్యువు బారిన పడక తప్పదు. అవతారమూర్తు లయిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా ఈ శరీరాన్ని వదలి, వైకుంఠాన్ని చేరుకున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి. ఈ కలియుగంలో మనం సాక్షాత్తూ దేవతా స్వరూపులుగా భావించి, అర్చించిన మహాత్ములు షిరిడీసాయి, మెహర్బాబా, హరనాధబాబా, రమణమహర్షి, రామకృష్ణపరమహంస వంటివారు కూడా దేహత్యాగం చేసి, మృత్యుదేవత ఒడిని చేరుకున్నవారే. “జాతస్య హి ధ్రువో మృత్యుః” కనుక, శరీరధారులకు మృత్యువు తప్పదు.
“అమ్మ” సర్వమృత్యునివారిణి. “అమ్మ” జీవిత మహోదధిలో పైకి లేచిన ఎన్నో అలలు, “అమ్మ” ప్రేమరసవాహినిలో మనల్ని తడుపుతూ, ఎప్పటికప్పుడు “అమ్మ”ను సర్వమృత్యునివారిణిగా సాక్షాత్కరింపజేస్తాయి. ఈనాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సంస్కృతశాఖలో రీడర్గా ఉన్న డా॥ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఆ కళాశాల విద్యార్థినిగా ఉన్న రోజుల్లో, తిరుగుతూఉన్న నీళ్ళు నింపే మోటారుచక్రంలో ఆమె శిరోజాలు పడి, తలంతా చెక్కుకుపోయింది. తలకు అంత పెద్దగాయమై నందువల్ల ఆవరణలోని అందరూ భయభ్రాంతులైనారు. ఆందోళన చెందారు. అయితే, “అమ్మ” అనుగ్రహబలం వరమై, ఆమెకు సంపూర్ణారోగ్యం చేకూరింది. అంతేకాదు, విద్యాభ్యాసం పూర్తయి డాక్టరేటు డిగ్రీ, గౌరవప్రదమైన ఉద్యోగమూ కూడా లభించాయి. ఇలాంటి ఎన్నో సంఘటనల్లో అపమృత్యువు, అకాలమృత్యువులనుంచి “అమ్మ” తనబిడ్డలను ఎక్కడికక్కడ రక్షిస్తూ సర్వమృత్యు నివారిణిగా ప్రతక్ష్యమైంది.
“అమ్మ” మృత్యుదారు కుఠారిక. చిన్నతనం నుంచీ విషసదృశమైన మూలికలూ, ద్రావకాలూ తీసుకున్నా, అవి “అమ్మ”కు ఎలాంటి ప్రాణహానీ కలిగించలేకపోయాయి. ఒకసారి “అమ్మ” అనారోగ్యంతో బాధపడుతోంది. “అమ్మ”కు త్వరగా ఆరోగ్యం చేకూరాలని, “అమ్మ” మీద అంతులేని ప్రేమతో, “అమ్మ”సేవకే అంకితమైన అక్కయ్య ఒకరు “అమ్మ”కు ఎక్కువ మోతాదులో మందు ఇచ్చారు. అయితే, ఆ మందులో ఎక్కువశాతం విషం కలిసి ఉంటుందని పాపం ఆ అక్కయ్యకు తెలీదు. ఇంకేముంది? త్వరగా కోలుకోవడానికి బదులు, “అమ్మ” శరీరం క్షణంలో కొయ్య బారిపోయింది. చర్మం స్పర్శను కోల్పోయింది. అందరూ భయభ్రాంతులైనారు. “అమ్మ” మాత్రం “ఏమీ భయపడవద్దు. అదే తగ్గుతుంది” అని అభయమిచ్చింది. గరళాన్ని స్వీకరించినా “అమ్మ”కేమీ హాని జరుగలేదు, ఇది ఒక్కటే కాదు. “అమ్మ” జీవితంలో మృత్యువాతనుంచి బయటపడిన సంఘటనలు ఎన్నో. మృత్యువు “అమ్మ”ను కబళించలేదు. “అమ్మ” మృత్యుదారు కుఠారిక. అయితే, “అమ్మే” చెప్పింది – “నిర్ణయానికి నిర్ణయించిన వాడూ బద్ధుడే” అని. అందువల్లనే తన నిర్ణయం ప్రకారం 1985 జూన్ 12న “అమ్మ” తన అవతారాన్ని చాలించి, ఆలయ ప్రవేశం చేసింది.
“అమ్మ” మృత్యుమథని. జిల్లెళ్ళమూడి సోదరు లందరికీ డా॥శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారి గురించి తెలిసే ఉంటుంది. వారు బహుముఖప్రజ్ఞాశాలి. ఎన్నోవిషయాల్లో పరిశోధనలు చేసి, తాను తెలుసుకున్న విషయాలు, వ్యాసాలరూపం లోనూ, ఉపన్యాసాల ద్వారానూ, లోకానికి అందించిన మేధాసంపన్నులు వారు. “అమ్మ”ను దర్శించడం వారి జీవితంలో ఊహించని మలుపు. “అమ్మ”వాక్కులలోని ప్రత్యేకత వారిని “అమ్మ”కు దగ్గరగా చేరిస్తే, “అమ్మ”జీవితంలోని సంఘటనలు వారి మనస్సుపై ఎంతో ప్రభావం చూపాయి. “అమ్మ”ప్రేమ వారిని కరిగించి వేసింది. “అమ్మ”కు సంబంధించిన ఎన్నో విషయాలు వారు గ్రంథస్థం చేశారు. “అమ్మ”ను గురించి లోకానికి తెలియజేయడమే తన సాధనగా, తపస్సుగా భావించారు. ఆ మార్గంలోనే సిద్ధిపొందాలనుకున్నారు. “అమ్మ” ఆశీస్సులు అందుకొన్నారు. వారి మరణానంతరం “తపించాడు, తరించాడు, తానంతా “అమ్మే” అయినాడు” అని వారిని గురించి తక్కిన బిడ్డలకు వివరించింది. మృత్యుమథనిగా దర్శనమిచ్చిన “అమ్మ”. శ్రీపాదవారు ఆశ్రయించి, తరించిన మాతృశ్రీ చరణాలు మనందరికీ నిత్యసంస్మరణీయాలు, ఆవశ్య శరణ్యాలు.