ఏ మహాసౌందర్యమిలలోని జనులకు ఎనలేని ఆహ్లాదమిచ్చునెపుడు
ఏ దేవి కారుణ్యమెవ్వారికైనను అదనులో వర్షమై ఆర్తి నణచు
ఏ దివ్యపరిమళ మెల్లెడ ప్రసరించు మంచిగంధము వోలె మహిమ గలిగి
ఏ వాక్కు మధురమై ఎవ్వరికైనను వీనుల విందుగా వెలయుచుండు
- అట్టి లావణ్య పరసీమ అద్భుతముగ
అవతరించెను అమ్మయై అర్కపురిని
అమృత వారాశి బుట్టిన ఆదిలక్ష్మి
మనను కరుణింప వచ్చిన మాతృమూర్తి
- కారుణ్యంబును వత్సలత్వమును సాకారంబుగా అమ్మయై
సారూప్యంబున కెంత మాత్ర మెవరున్ చాలంగ లేనట్లుగా
భారం బంతయు మోయుచున్ మనల తా పాలించుచున్ నిత్యమున్
పారంబే కనరాని దేవి మనకై ప్రాదుర్భవించెం గదా!
- అమ్మ తలంపులే మనకు అందరి కెప్పుడు అండయౌనుగా
ఇమ్మహి అమ్మరక్షణయె ఎవ్విధినైనను పూర్ణమౌ గదా!
అమ్మయె సర్వశక్తియుత; ఆపద బాపును సౌఖ్యదాయియై
అమ్మను మించి ఎవ్వరిక ఆదుకొనంగ సమర్థులీ యిలన్?
- అమ్మ అనుగ్రహం బదియ అంతయు వర్షము రీతిగా పడున్
తమ్ము తరింప చేయగను తత్పరతన్ తపియించుచుండగా
దమ్మును కల్గ జేయుటకు దక్షతతో దరిచేరి యుండగా
సమ్మతి తోడ నెల్లరకు సన్నిధి నిచ్చుచు ఆదరంబునన్.
- “ఈ నా సాధన బిడ్డలన్ కనుటయే ఏ ప్రొద్దునైనన్ తగన్
కన్నా నందరి నాదు దైవములుగా కన్ఫార్ప కెల్లప్పుడున్
ఉన్నా నిక్కడ వారి మేలు కొరకే ఉప్పొంగి పాలింపగా
ఎన్నంగా నదియే ముదం “బను నహెూ! ఈ అమ్మకున్ మ్రొక్కెదన్.