1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సర్వసభ్య సమావేశము 20 మే 2012 – కార్యదర్శి నివేదిక

సర్వసభ్య సమావేశము 20 మే 2012 – కార్యదర్శి నివేదిక

Y V Sri Ram Murthy
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : June
Issue Number : 11
Year : 2012

ప్రేమస్వరూపిణి అమ్మకు ప్రణామములు 

సోదరీ సోదరులకు నమస్కారములు

శ్రీ శ్రీ విశ్వజననీ పరిషత్ మరియు అనుబంధ సంస్థలైన మాతృశ్రీ పబ్లికేషన్స్, మాతృశ్రీ విద్యాపరిషత్ల సర్వసభ్య సమావేశములకు విచ్చేసిన సోదరీ సోదరులకు సాదర స్వాగతం. 

1 మే 2011న జిల్లెళ్ళమూడిలో జరిగిన సర్వసభ్య సమావేశములో నూతన కార్యవర్గమును ఎన్నుకొని సంస్థ నిర్వహణ బాధ్యతలను అప్పగించడం జరిగింది. శ్రీ ఎమ్. దినకర్ గారి అధ్యక్షతన ఏర్పడిన కార్యవర్గము బాధ్యతలను స్వీకరించి ఒక సంవత్సరమైంది. సర్వసభ్య సమావేశమంటే ఆ సంవత్సరంలో జరిగిన కార్యక్రమములు సమీక్ష. ఈ సంవత్సరం మనం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు ఎంతవరకు పూర్తి చేయగలిగాము? సాధించిన ప్రగతి ఏమైనా వున్నదా అన్న విషయం మీద విశ్లేషణ చేసుకుని, లోటు పాటులేమైనా వుంటే సరిదిద్దుకుని ముందుకు సాగటానికి చేసే ప్రయత్నము. సంక్షిప్తంగా ఈ సంవత్సరము మనం చేపట్టిన కార్యక్రమాల వివరాలను తెలియచేయటానికి ప్రయత్నిస్తాను. మీ విలువైన సూచనలు, సలహాలను ఇచ్చి సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్ళటానికి సహకరించవలసినదని ప్రార్థిస్తున్నాను.

లోగడ జరిగిన సర్వసభ్య సమావేశము తరువాత ఈ సంవత్సర కాలంలో మనకు అత్యంత ఆత్మీయులైన సోదరీ సోదరులు కొందరు మనలను వీడి అమ్మలో లీనమైనారు. వారికి కృతజ్ఞతలు. వారిలో ఈ క్రింది తెలిపిన సోదరీ సోదరులు ఉన్నారు.

శ్రీమతి కె. కమలక్కయ్య (శ్రీ అధరాపురపు శేషగిరిరావు అన్నయ్య గారి కుమార్తె), వణి (శ్రీ అధరాపురపు శేషగిరిరావుగారి మనమడు, (కమలక్కయ్య గారి కుమారుడు), డాక్టర్ ప్రేమకుమార్ భార్గవ (శ్రీ వి.యన్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారి కుమారుడు), శ్రీమతి మన్నవ ప్రభావతి అక్కయ్య శ్రీ రాజుబావగారి సతీమణి), శ్రీమతి వారణాసి నాగమణిగారు (శ్రీ వి. ధర్మనూరిగారి తల్లి), శ్రీ 3. సింహాద్రిగారు – హైద్రాబాద్, శ్రీ గరుడాద్రి శేషయ్యగారు కర్నూలు, శ్రీ గొర్లె సత్యనారాయణగారు- విశాఖ, శ్రీమతి పెయ్యేటి నాగరత్నం- హైదరాబాద్, శ్రీమతి దాసరి అనసూయ – పెదనందిపాడు, శ్రీ రామరాజు బాబీ – గుంటూరు, శ్రీ ఎన్.జె. యశస్వి- హైదరాబాద్, మొదలగు వారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చవలెనని వారి కుటుంబ సభ్యులకు మనస్థైరాన్ని ప్రసాదించవలెనని అమ్మను ప్రార్థిస్తూ ఒక నిముషం పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిద్దాం.

అమ్మ శ్రీ చరణ ప్రతిష్ఠ: ప్రధమంగా ఈ సంవత్సరం దేవాలయ సముదాయములలో నూతనంగా అమ్మ శ్రీ చరణాలను ప్రతిష్ఠించుకోవటం జరిగింది. మాతృశ్రీ చరణ సన్నిధి అన్న పేరుతో ఒక అందమైన మందిరాన్ని నిర్మించి అమ్మ శ్రీ చరణములను ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సోదరులు శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణగారు అకుంఠితమైన దీక్షతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ చరణాలు ఎంతో మృదువుగా సుందరంగా వుండి అందరినీ ఆకర్షించుచున్నవి. ఈ సందర్భంగా సోదరులు శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణగారికి శ్రీ విశ్వజనని పరిషత్ గౌరవపూర్వకమైన ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నది.

శ్రీ ఆంజనేయస్వామి వారి విగ్రహ (వాయు) ప్రతిష్ఠ: 25 ఏప్రియల్ 2012న హైదరాబాద్ అతిధి గృహసమీపంలో శ్రీ ఆంజనేయస్వామి వారి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించుట జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహణకు సోదరులు శ్రీ బులుసులక్ష్మీప్రసన్న సత్యనారాయణశాస్త్రిగారు, సోదరి శ్రీమతి అపర్ణగారు ఆర్థిక సహకారము నందించగా, శ్రీ గోపాల్ అన్నయ్యగారు, శ్రీ మల్లు అన్నయ్య ఎంతగానో సహకరించారు.

అననూయేశ్వరాలయం స్థలసేకరణ: 

అనసూయేశ్వరాలయమునకు ఆనుకొని యున్న 1.50 శెంట్ల భూమిని కొనుగోలు చేసి రిజిస్టర్ చేయటం జరిగింది. భూమి విలువ రూ.1.10 లక్షలు. స్థల సేకరణ దేవాలయ విస్తరణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శ్రీ భట్టిప్రోలు రామచంద్ర కృషి ప్రశంసనీయం.

ప్రతి సంవత్సరం వలెనే అమ్మ కల్యాణ మహోత్సవం అనంతోత్సవం. అన్నపూర్ణాలయ వార్షికోత్సవం, నవరాత్రి ఉత్సవములు, శ్రీ హైమవతీ జయంతి ఉత్సవములు, ముక్కోటి ఏకాదశి, నూతన సంవత్సర వేడుకలు, అమ్మ పుట్టినరోజు మరియు దేవాలయములలో వార్షికముగా జరుగు పండుగలన్నింటిని అత్యంత వైభవముగా జరుపుకున్నాము. శ్రీ నవనాగేశ్వరస్వామి మరియు గణపతి దేవాలయముల వార్షికోత్సవములు కూడా యధావిధిగా జరుపుకున్నాము. ఈ సందర్భముగా వివిధరకములైన హోమములు, అర్చనలు నిర్విహింపబడినవి. ఈ సంవత్సరం అన్నపూర్ణాలయ వార్షికోత్సవములో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు మన అగ్రజులు జిల్లెళ్ళమూడి సంస్థలన్నింటికి మూలస్థంభమై నిలచిన శ్రీ అధరాపురపు శేషగిరిరావు అన్నయ్యగారి శతజయంతి ఉత్సవములు జిల్లెళ్ళమూడిలో ఘనంగా జరుపుకున్నాము. ఈ సందర్భముగా వారి కుటుంబ సభ్యులను యధావిధిగా సత్కరించుకున్నాము. మరియు పొన్నూరులో వారి విగ్రహ ప్రతిష్ట జరిగిన సందర్భముగా నిర్వాహకులకు మన వంతు ఆర్థిక సహాయమును అందించాము.

అన్నపూర్ణాలయ నూతన భోజనశాల: 

 సందర్శకులు / యాత్రికుల భోజన వసతికై నూతన భవన నిర్మాణమునకు 6 ఏప్రియల్ 2012 న శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ భవన నిర్మాణమునకు కావలసిన ఆర్థిక వనరులను సేకరించటానికి విశేషంగా కృషి చేసి త్వరగా పూర్తి చేయవలెనను సంకల్పంతో అహర్ణిశలూ శ్రమిస్తున్న మన ప్రియతమ సోదరుడు రవి అన్నయ్యకు కృతజ్ఞతా పూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాము. వారు లోగడ కాలేజి హాస్టల్ భవన నిర్మాణానికి విశేషమైన కృషి సలిపి రికార్డు టైమ్ పూర్తి చేయటానికి దోహదపడిన సంగతి మనకు తెలుసు. అన్నపూర్ణాలయ భవన నిర్మాణంలో ఎంతో శ్రద్ధ వహిస్తూ ప్రోత్సహిస్తున్నా సోదరులు శ్రీ జేమ్స్ కాంఫియన్కు సోదరీమణి శ్రీమతి బి. సుబ్బలక్ష్మి గారికి తదితర సోదరీ సోదరులకు కృతజ్ఞతలు.

ఈ సంవత్సరం మనం తీసుకున్న నిర్ణయాలలో ముఖ్యమైనది సౌరశక్తి వినియోగమునకై అవసరమైన చర్యలు చేపట్టటం. ముఖ్యముగా అన్నపూర్ణాలయ వంటశాలలో వెయ్యిలీటర్ల శక్తి కలిగిన సోలార్ హీటర్స్ను అమర్చటం జరిగింది. దీనివలన వంటగ్యాస్ను కొంతవరకు ఆదా చేసే అవకాశం ఏర్పడుతుంది. దేవాలయ ప్రాంగణం నుండి హైదరాబాద్ గెస్ట్ హౌస్ వరకు 5 సోలార్ వీధి దీపాలను అమర్చటం జరిగింది. ఇవి చాలా ఉపయోగకరంగా ఉన్నవి.

ముఖ్యముగా దేవాలయ సముదాయములలో విద్యుత్ కొరతను అధిగమించుటకు 2 కిలోల శక్తి కలిగిన సోలార్ ఇన్వర్టర్స్ను ఏర్పాటు చేయటం జరిగింది. కేవలం విద్యుత్ శక్తి మీద ఆధారపడకుండా దేవాలయ ప్రాంగణంలో నిరంతరాయంగా పూజలు తదితర కార్యక్రమాలు నిర్వహించుకొనటకు దోహదపడుతున్నవి. దేవాలయ సమదాయములలో ఏర్పరచిన సోలార్ ఇన్వర్టర్స్కు సుమారు 4.5 లక్షలు వ్యయమౌతుందని అంచనా వేయడం జరిగింది. దీనికయ్యే ఖర్చును శ్రీ వారణాసి ధర్మసూరిగారు భరించుటకు నిర్ణయించుకున్నారు. వారికి శ్రీ విశ్వజననీ పరిషత్ కృతజ్ఞతలు.

డ్రైనేజి నిర్మాణము : ఎమ్.ఎమ్.సి. నుండి నేరుగా నల్లమల డ్రైన్లోనికి మురుగునీటిని మళ్ళించడానికి తగిన ఏర్పాటు చేయటం జరిగింది. దీనివలన ఇంతవరకు మురుగు ముంపునకు గురవుతున్న పొలాలకు వాటికి సంబంధించిన రైతులకు, సంస్థకు సంస్థలో నివసించువారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. ఈ కార్యక్రమమునకు 5.50 లక్షలు ఖర్చు అయినది. ఈ వ్యయమును సోదరులు శ్రీ జేమ్స్ కాంపియన్ భరించడం జరిగింది. వారికి శ్రీ విశ్వజననీపరిషత్ కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియచేస్తున్నది. ఈ కార్యక్రమమునకు రూపకల్పన చేసి నిర్ణీత కాలంలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేయటానికి శ్రమించిన సోదరులు సోదరులు శ్రీ కె. రాజేంద్రప్రసాద్ గారికి, శ్రీ బి. రామచంద్రగారికి, వారికి సహకరించిన శ్రీ వి. మల్లికార్జున ప్రసాద్ గారికి, శ్రీ జె.యానాది గారికి కృతజ్ఞతలు.

రూరల్ శానిటేషన్ (గ్రామీణ పారిశుద్ధ్యము): జిల్లెళ్ళమూడి గ్రామ పారిశుద్ధ్యమును మెరుగుపరుచుటకు మరియు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు గ్రామంలోని ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి నిర్మాణము చేయవలెనను సంకల్పముతో ఇంతవరకూ 73 మరుగుదొడ్లు నిర్మించటం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడి కాక మిగతా ఖర్చును సోదరులు శ్రీ జేమ్స్ కాంపియన్ భరించారు. వారికి శ్రీ విశ్వజననీపరిషత్ కృతజ్ఞతలు తెలియచేస్తున్నది..

ఆ విధముగనే పర్యావరణ పరిరక్షణకు రోడ్డుకు ఇరువైపులా ఎమ్.ఎమ్.సి. నుండి ఓరియంటల్ కళాశాల ప్రవేశం ద్వారం వరకు వివిధ రకములైన చెట్లునాటుట జరిగినది. ఈ కార్యక్రమములో NABARD అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. దీనివలన పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామ పారిశుద్ధ్యము మెరుగుపడుటకు తోడ్పడుతున్నది. ఈ రెండు బృహత్కార్య క్రమములను కె. రాజేంద్రప్రసాద్ గారు శ్రీ బి. రామచంద్ర గారు, శ్రీ జె. యానాదిగారు, శ్రీ యం. శరశ్చంద్రకుమార్ గారు జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమతి జిల్లెళ్ళమూడి శాఖవారి ఆధ్వర్యములో నిర్వహించారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియచేయుచున్నాము.

త్రాగునీటిసరఫరా : ఏడవ మైలు కృష్ణకాలువ నుండి జిల్లెళ్ళమూడి గ్రామంలోని మంచినీటి చెరువులోనికి త్రాగునీటిని పైప్వైరా పంప్ చేసే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వము వారు శ్రీ నాదెండ్ల లక్ష్మణరావుగారికి అప్పగించగా సోదరులు శ్రీ భట్టిప్రోలు రామచంద్రరావుగారు విశేషమైన కృషితో, కార్యక్రమమును పూర్తిచేశారు.

ఆ విధముగనే టి.టి.డి. కల్యాణమండపము వద్ద నున్న ఫిల్టర్ బెడ్స్ నుండి ఎమ్.ఎమ్.సి. మరియు శ్రీ హైమవతి నగర్కాలనీ వరకు పరిశుద్ధమైన నీటిని పైపైన్స్ ద్వారా సరఫరా చేయుటకు ఏర్పాట్లు పూర్తి అయినవి. ఈ కార్యక్రమమును సోదరులు శ్రీ వి. మల్లికార్జునప్రసాద్ (మల్లన్నయ్య) ఎంతో శ్రమతో పూర్తిచేశారు. వారికి అభినందనలు.

వాటర్ కూలర్ : హర్యానా రాష్ట్రములోని గుర్గాన్ చెందిన Financial Models వారు మన సంస్థకు Water cooler మునమకూర్చినారు. ఇది ముఖ్యముగా వేసవికాలములో ఆవరణలోని సోదరీ సోదరులకు, యాత్రికులకు ఎంతో ఉపయోగపడుతుంది. వాటర్ కూలర్ను సమకూర్చుటకు కృషి చేసిన సోదరులు శ్రీ వి. రవీందర్ గారికి కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము.

వాటర్ ట్యాంకర్ : 5000 లీటర్ల సామర్థ్యము కలిగిన వాటర్ టాంకర్ను సంస్థ ఉపయోగార్థము ఏర్పాటు చేసుకొనడమైనది. ఈ టాంకర్ నిర్మాణమునకు సుమారు 1.65 లక్షలు ఖర్చు అయినది. సోదరులు శ్రీ జేమ్స్ కాంఫియన్ తమ సొంత నిధులతో ఈ కార్యక్రమమును పూర్తి చేశారు. వారికి శ్రీ విశ్వజననీ పరిషత్ కృతజ్ఞతలు తెలియచేయుచున్నది. ఈ టాంకర్ నిర్మాణమునకు సహకరించిన సోదరులు శ్రీ బి. రామచంద్రరావుగారికి అభినందనలు తెలియుచేయుచున్నాము.

అమ్మతత్వచింతన మహాసదస్సు : శ్రీ విశ్వజననీ పరిషత్ కార్యదర్శి శ్రీ యస్. మోహనకృష్ణగారి సంకల్ప బలంతో శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామివారి ఆశీస్సులతో 2011 నవంబర్ 18, 19, 20 తేదీలలో అమ్మ తత్వచింతన కృతజ్ఞతలు. మహాసదస్సు అన్న పేరుతో వినూత్నమైన రీతిలో సమావేశాలు నిర్వహించుకున్నాము. సుప్రసిద్ధులైన సాహితీవేత్తలు. ఆధ్యాత్మిక జ్ఞానసంపన్నులు ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. అమ్మతత్త్వాన్ని అధ్యయనం చేసి వారికి అందినంత వరకు అమ్మతత్వమిది అని వ్యాసాలను సమర్పించారు. ఆ సభలలో పాల్గొన్న ప్రముఖమైన వ్యక్తులలో శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామి వారు, ప్రెస్ అకాడమీ పూర్వాధ్యక్షులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు శ్రీ కుప్పా కృష్ణమూర్తిశాస్త్రిగారు, శ్రీ వి.యస్.ఆర్.మూర్తిగారు, తిరుపతి వేద విశ్వవిద్యాలయ వైస్ ఛానర్ శ్రీ సన్నిధానం సుదర్శనశర్మగారు, శ్రీ కొల్లూరు అవతారశర్మగారు, విజ్ఞాన స్వరూవ్ శ్రీ కోసూరు మురళీకృష్ణరావుగారు, దర్శనం మాసపత్రిక అధిపతులు శ్రీ ఎమ్. వెంకటరమణశర్మ మున్నగువారు వున్నారు. విశ్వజననీ మాసపత్రిక సంపాదకులు, ప్రముఖ సాహితీవేత్త అయిన శ్రీ పి.యన్. ‘ఆర్. ఆంజనేయప్రసాద్ గారు, మధుర ఉపన్యాసకులు, ఆర్షవిద్యానిధి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు ఈ సదస్సును సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ తత్వచింతన సదస్సులో శ్రీ విజ్ఞాన్ స్వరూప్ సమర్పించిన వ్యాసమును సోదరి శ్రీమతి అన్నె రమణవర్ధని చిన్న గ్రంథ రూపముగా ప్రచురించి అందరికీ అందించారు. ఈ సందర్భముగా సోదరి శ్రీమతి రమణవర్ధనికి కృతజ్ఞతలు. ఈ వ్యాసాలను ప్రసంగాలను క్రోడీకరించి అందమైన సావనీర్ రూపంలో మహస్సు అన్న పేరుతో దర్శనం పత్రికాధిపతులు శ్రీ ఎమ్.వెంకటరమణ శర్మగారు ప్రచురించటం జరిగింది. వారికి శ్రీ విశ్వజననీపరిషత్ కృతజ్ఞతలు. ఈ సావనీర్ ఆవిష్కరణసభ హైదరాబాద్ లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. సదస్సులోని ప్రధానాంశాల సమాహారం ఒక సి.డి.గా రూపొందించి సంఘటనా కార్యదర్శి శ్రీ ఎస్.మోహనకృష్ణ గారు విడుదల చేశారు. మల్లాప్రగడవారి సముచిత సుమధుర వ్యాఖ్యానంతో వెలువడిన ఆ సి.డి. సదస్సును మన మనస్సులపై మరోసారి ఆవిష్కరిస్తుంది. శ్రీ ఈమనికృష్ణ, తమ సాంకేతికపరిజ్ఞానంతో ఈ సి.డి.ని. అందంగా తీర్చిదిద్దారు. జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి హైదరాబాద్ శాఖవారు ఈ కార్యక్రమ నిర్వహణకు ఎంతో సహకరించారు. వారికి కృతజ్ఞతలు. 

సత్సంగం : జిల్లెళ్ళమూడిలో మద్రాస్ గెస్ట్ హౌస్ లో ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటలకు సత్సంగ కార్యక్రమము నిర్వహింపబడుచున్నది. ప్రధానముగా అమ్మను గరించిన అధ్యయనము, తత్వ విచారణ జరుగుచున్నది. ఈ కార్యక్రమమును సోదరులు శ్రీ కె.బి.జె. కృష్ణమూర్తిగారు, శ్రీ ఎమ్. దినకర్గారు, సోదరులు శ్రీ టి.టి.అప్పారావుగారు, సోదరి శ్రీమతి సరస్వతి అక్కయ్యగారు తదితరులు ప్రత్యేకశ్రద్ధ వహిస్తూ నిర్వహించుచున్నారు. వారికి కృతజ్ఞతలు. ఇది ఆవరలోని సోదరీ సోదరులకు స్ఫూర్తిదాయకముగా వున్నది.

శ్రీ పన్నాలరాధాకృష్ణశర్మగారి ఆశీతి (80వ) జన్మదినోత్సవం : మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల వ్యవస్థాపక ప్రిన్సిపాల్ అమ్మ సంస్థలలో నిత్యార్చనకు కావల్సిన మహోదాత్త వాఙ్మయ స్రష్ఠగా జిల్లెళ్ళమూడి చరిత్రతో విడదీయరాని అనుబంధం కలిగిన డాక్టర్ పన్నాల రాధాకృష్ణశర్మగారి 80వ జన్మదినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని అహోబిల్ మఠ్ కడు వైభవముగా జరిగినవి. వారి కుమారుడు శ్రీ శేఖర్, కోడలు శ్రీమతి శిరీష, కుమార్తె శ్రీమతి శైలజ, అల్లుడు శ్రీకృష్ణ విఠల్ దేవ్ ఘనంగా నిర్వహించారు.

శ్రీవిశ్వజననీపరిషత్ ఈ సందర్భంగా ఒక ప్రత్యేక సంచికను ప్రచురించి విడుదల చేయటం జరిగింది. అధ్యాపకులు పూర్వ విద్యార్థులు శ్రీరాధాకృష్ణశర్మ గారిని అక్షర సుమాలతో అర్చించుకున్నారు. శ్రీ పి.యన్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారు, శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు ఎంతో శ్రమపడి చాలా తక్కువ వ్యవధిలో ఈ సంచికను వెలువరించారు. వారికి శ్రీ విశ్వజననీపరిషత్ కృతజ్ఞతలు.

డిజిటల్ సెంటర్ : సోదరులు శ్రీ జేమ్స్ కాంపియన్ ఈ కార్యక్రమము చేపట్టటానికి ప్రత్యేక భవనాన్ని నిర్మించి దానికి కావలసిన అన్ని హంగులు ఏర్పాటు చేసి భావితరాలకు అమ్మను, అమ్మ సిద్ధాంతాలను విశ్వవ్యాప్తంగా చేయవలెనను సంకల్పముతో కృషి చేయుట జరుగుచున్నది. అమ్మచిత్రపటములను, అమ్మపై ఇంతవరకూ వెలువరించిన సాహిత్యమును భద్రపరిచి అందరికి అందించడం. జరుగుచున్నది. సోదరులు శ్రీ కె. రాజేంద్రప్రసాద్ గారు, శ్రీ ఎమ్. శరత్చంద్రకుమార్గారు తదితరులు ఈ కార్యక్రమానికి సహకారం అందించుచున్నారు. వారికి అభినందనలు. 

వీడియో ఎక్విప్మెంట్:  అమ్మను చాలా చిన్నతనంలోనే దర్శించుకుని అనేక అనుభవాలను పొందిన సోదరీ సోదరులు మన మధ్య వున్నారు. వారికి అమ్మతో వున్న అనుభవాలు అమ్మవారికి ప్రసాదించిన దివ్యమైన అనుభూతులు భావితరాలకు ఎంతో ముఖ్యమైనవి. విలువైనవి. శ్రీవారి వారి జ్ఞాపకాలను రికార్డు చేసి ఆడియో వీడియో రూపంలో భద్రపరచటానికి ప్రయత్నం జరుగుచున్నది. సోదరుడు శ్రీ రావూరి ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టటం జరిగింది. ఎంతో విలువైన యంత్రసామాగ్రిని సమకూర్చుకుని ఊరూరా తిరుగుతూ సోదరీ సోదరుల అనుభవాలను రికార్డు చేయుచున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ వారికి సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేయుచున్నాము.

శ్రీ వెబ్సైట్ : జిల్లెళ్ళమూడిలో శ్రీ విశ్వజననీపరిషత్ చేపట్టిన కార్యక్రమముల వివరములు ఎప్పటికప్పుడు దేశవిదేశాలలోని సోదరీసోదరులకు అందించటానికి వీలుగా మన వెబ్సైట్ను update చేయటం జరుగుచున్నది. దీనికి శ్రీ కుమ్మమూరి కృష్ణ కోఆర్డినేటర్గా ఈ క్రింద తెలిపిన సభ్యులను ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసినదిగా కోరటం జరిగింది. వారు అంగీకరించి ఈ కార్యక్రమమును చేపట్టటం జరిగింది. 1. రహి, రాజుపాలెం 2. శరత్చంద్ర బి. 3. ప్రేమచైతన్య బి 4. దేవీ చరణ్ వి. 5. కృష్ణమోహన్ జి. 6) ప్రేమరాజు వి. 7) తేజోమూర్తి టి. ఈ కార్యక్రమమునకు కావలసిన సమాచారాన్ని సూచనలను ఎప్పటికప్పుడు శ్రీ ఎమ్. శరత్ చంద్రకుమార్ గారు అందించటం జరుగుచున్నది. ఈ పై సభ్యులందరికీ శ్రీవిశ్వజననీ పరిషత్ కృతజ్ఞతలు  తెలియపరుచుచున్నది. 

ధాన్యాభిషేకము : నాన్నగారి ఆరాధనోత్సవాల సందర్భంగా జరిగిన ధాన్యాభిషేక కార్యక్రమమునకు సోదరీ సోదరుల నుంచి విశేషమైన స్పందన లభించింది. అధికసంఖ్యలో కార్యక్రమములో పాల్గొని అమ్మ నాన్నగార్లను ధాన్యంతో, బియ్యంతో అభిషేకించుకున్నారు. ఈ కార్యక్రమమునకు ధనరూపేణ 23.41 లక్షలు ధాన్యరూపేణ రూ.5.20 లక్షలు బియ్యంరూపంలో రూ.1.62 లక్షలు – మొత్తం రూ. 30.23 లక్షలు విరాళములు రావటం జరిగింది. ఈ కార్యక్రమములో ఉత్సాహముగా పాల్గొని జయప్రదం చేసిన సోదరీ సోదరులకు శ్రీ విశ్వజననీపరిషత్ కృతజ్ఞతలు తెలియపరుచుచున్నది. 

మాతృవేదము (టెలీఫిలిం డి.వి.డి.), మాతృగీత (సిడి.ఆడియో) : శ్రీ విశ్వజననీ పరిషత్ జిల్లెళ్ళమూడి మరియు జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి హైదరాబాద్ శాఖవారు సంయుక్తంగా 9 జులై 2011న హైదరాబాద్లోని శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించిన కార్యక్రమములో శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరనాందభారతీస్వామివారి చేతులమీదుగా ఈ టెలీఫిలిం, సిలు ఆవిష్కరింపబడినవి. ఈ రెండింటి నిర్మాణములో సోదరుడు శ్రీ గంటి కాళీప్రసాద్ గారు, శ్రీరాం కపిల్ శర్మగారు నిర్విరామమైన కృషిచేశారు. వారికి శ్రీవిశ్వజననీపరిషత్ ధన్యవాదములు.

అమ్మ నామ సప్తసప్తాహములు : అమ్మ నామ సప్త సప్తాహములు జిల్లెళ్ళమూడిలో 28 సెప్టెంబరు 2011 నుండి 15 నవంబరు 2011 వరకు ఎంతో శ్రావ్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నాము. ఇతర గ్రామ భక్త సమాజములు, స్థానిక సోదరీ సోదరులు ఈ కార్య క్రమములో పాల్గొన్నారు. సోదరులు శ్రీ బి. రామబ్రహ్మం గారు, శ్రీటి.టి.అప్పారావుగారు, శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు గారు మరియు శ్రీమతి భ్రమరాంబక్కయ్య శ్రీ కార్యక్రమమును జయప్రదము చేయుటకు సహకరించారు. వారికి కృతజ్ఞతలు. గ్రామస్తులలో రెడ్డి సుధ సహకరించారు.

దీపదానహోమము : మాఘపౌర్ణమి సందర్భముగా 6 ఫిబ్రవరి 2012న జిల్లెళ్ళమూడిలో దీప దాన హోమము వేడుకగా జరిగినది. శ్రీశైలంలోని శ్రీ పూర్ణానందస్వామి శిష్యులు, స్థానిక సోదరీ సోదరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. శ్రీ హైమవతీదేవి 70వ జన్మదినోత్సవ సందర్భంగా హైమ నామ ఏకాహము 7 ప్రదేశములలో జరుపవలెనని నిర్ణయించడం జరిగింది. హైదరాబాద్, చేశారు. గుంటూరులో జరిగినవి.

మాతృశ్రీ పబ్లికేషన్ డివిజన్: ఈ సంవత్సరంలో మనము పబ్లిష్ చేసిన పుస్తకముల వివరములు :

  1. అద్భుతచారిత్ర – శ్రీమతి మల్లాప్రగడ శ్రీవల్లి 2. Sojourn – శ్రీ ఎమ్.దినకర్ (ఇంగ్లీషు అనువాదము) 3. జిల్లెళ్ళమూడి అమ్మతో నా మధుర స్మృతులు – శ్రీమతి రాణీ సంయుక్త 4. జిల్లెళ్ళమూడిలో వింతలు విశేషాలు (పునర్ముద్రణ – ఆచార్య ఎక్కిరాల భరద్వాజ 5. అమ్మతో క్షణక్షణం అనుక్షణం – శ్రీ ఎ.యస్. చక్రవర్తి, శ్రీమతి ఎ. కుసుమాచక్రవర్తి 6. అమ్మ-మహర్షి (ఆంగ్లం) – శ్రీ ఇందుముఖి శేషగిరిరావు 7. డాక్టర్ పన్నాల రాధాకృష్ణశర్మ గారి అశీతి (80) జన్మదిన సంచిక 8. అమ్మ అమ్మ వాక్యాలు – Reprint IIIrd Edition 9. 1. జన్మదినసంచిక, 2. కళ్యాణోత్సవ సంచిక 3. అనంతోత్సవ సంచిక, ప్రత్యేకసంచికలు తీసుకొని రావటం జరిగింది.

ఆదరణాలయము : ఆదరణాలయం ప్రారంభించా లనే సంకల్పంతో అమ్మ పుట్టినరోజునాడు పూజా కార్యక్రమమును నిర్వహించి కావలసిన ఏర్పాటు చేయటం జరిగింది. ఆదరణాలయ నిర్వహణకు తగిన నియమ నిబంధనావళిని, సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ప్రారంభించ వలెనని నిర్ణయించడం జరిగింది.

చెన్నైలో అమ్మ దేవాలయము : చెన్నైలోని అమ్మ దేవాలయ మేనేజింగ్ ట్రస్ట్ శ్రీ పి. వేంకటేశ్వర్లుగారు తమ అనారోగ్య కారణము వలన దేవాలయ నిర్వహణను విశ్వజననీ పరిషత్ను తీసుకొనవలసినదిగా అభ్యర్థించడం జరిగింది. శ్రీ విశ్వజననీపరిషత్ అధ్యక్షులు శ్రీ దినకర్రు, ప్యాట్రన్ శ్రీ బి. రవీంద్రరావుగారు తదితరులు 29 ఏప్రియల్ 2012న చెన్నై వెళ్ళి దేవాలయ నిర్వహణ స్వీకరించడానికి తగిన ఏర్పాట్లు చేయటం జరిగింది. ప్రస్తుతం ‘మనం ప్రతిసంవత్సరం రూ.36,000 లు అక్కడి దేవాలయ నిర్వహణకు ఇవ్వటం జరుగుచున్నది. ఇటీవల చెన్నై ఆలయ ప్రాంగణంలో శ్రీ హనుమబాబు గారి ఆధ్వర్యమున అమ్మ నామ సప్తాహములు ఘనముగా జరిగినవి.

గుంటూరులో అమ్మ దేవాలయం: గుంటూరు దగ్గర చౌడవరంలో మేళ్ళరావు సుబ్రహ్మణ్యశర్మగారి లలితా పీఠప్రాంగణంలో మాతృశ్రీ అధ్యయన పరిషత్వారు ఏర్పాటు చేసిన అమ్మ దేవాలయం 9.2.2012 ప్రారంభోత్సవం జరిగింది. శ్రీ అన్నం రాజు • మురళీకృష్ణ కుటుంబం విశేషకృషి చేసారు. 

మాతృశ్రీ మెడికల్ సెంటర్: 1978లో అమ్మ చేతుల మీదుగా ప్రారంభింపబడిన 14 పడకల నర్సింగ్తోం దినదినాభివృద్ధి చెంది జిల్లెళ్ళమూడి గ్రామవాసులకే కాక పరిసర గ్రామములలోని వారికి కూడా ఉచిత వైద్య సదుపాయము అందుచేస్తున్న సంగతి మనకు తెలుసు. అనుభవజ్ఞులైన డాక్టర్లు, నర్సులు, వైద్యసేవలు అందించు చున్నారు. మాతృశ్రీ మెడికల్ సెంటర్ జిల్లెళ్ళమూడిలోనూ, పరిసరగ్రామములోనూ శ్రీ విశ్వజననీపరిషత్ మరియు ఇతర సేవాసంస్థల సహకారముతో తరచువైద్య శిబిరములను నిర్వహించి ప్రజలకు సేవలందించుచున్నారు. దీనికై ఒక అంబులెన్స్ను కూడా కొనుగోలు చేయడం జరిగింది. దీనికి సోదరులు శ్రీ యు. గిరీష్ కుమార్, శ్రీ డి. వేదాంతం, శ్రీ రాచర్ల బంగారు, సోదరి శ్రీమతి వాసా జ్యోతి, ఆర్థిక సహకారాన్ని అందించారు. ఈ సంవత్సరం నిర్వహించిన కొన్ని వైద్య శిబిరముల వివరములు.

1) 15 మే 2011 – జిల్లెళ్ళమూడి. 2) 3 డిసెంబరు 2011 – పాండురంగాపురం మరియు జిల్లెళ్ళమూడి

3) 08 జనవరి 2012 రామచంద్రాపురం, మరియు జిల్లెళ్ళమూడి 4) 12 ఫిబ్రవరి 2012 జిల్లెళ్ళమూడి గ్రామము (స్త్రీలకు ప్రత్యేక శిబిరము) 5) 04 ఏప్రియల్ 2012 బాపట్ల 6) 08 ఏప్రియల్ 2012 మన్నవ

ఈ వైద్య శిబిరములకు ప్రముఖ వైద్య నిపుణులను ఆహ్వానించి విశేషమైన సేవలను అందించటానికి కృషి చేస్తున్నా డాక్టర్ ఎ.ఇనజకుమారి గారికి, వారికి సహకరిస్తున్న డాక్టర్ సి. రామమోహనరావు గారికి, శ్రీ ఎమ్.యస్. శరత్ చంద్రకుమార్ గారికి శ్రీ విశ్వజననీ పరిషత్ ప్రత్యేక కృతజ్ఞతలు.

సేవాకార్యక్రమములో భాగంగా 16 జూన్ 2011న బాపట్లలోని కనకాద్రినగర్లో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు శ్రీ విశ్వజనని పరిషత్ తరపున పులిహోర, బియ్యం, కందిపప్పు, దుప్పట్లు, వస్త్రములు పంపిణీ చెయ్యటం జరిగింది.

మాతృశ్రీ విద్యాపరిషత్, జిల్లెళ్ళమూడి సంస్కృత విద్యను ప్రోత్సహించే దిశగా జిల్లెళ్ళమూడిలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల మరియు మాతృశ్రీ సంస్కృత పాఠశాలలు అమ్మ చేతులమీదుగా స్థాపించబడిన విషయము మనకు తెలుసు. ఈ సంస్థలలో సుమారు 200కు పైగా వెనుకబడిన ప్రాంతముల నుండి వచ్చే పేద విద్యార్థినీ విద్యార్థులకు 8వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు ఉచిత విద్య, భోజనము, హస్టల్ వసతి, వైద్య సదుపాయములు కల్పించబడినవి. వృత్తి విద్యలలో భాగంగా కంప్యూటర్ శిక్షణకు కూడా ప్రాధాన్యంగా ఇవ్వబడుచున్నది. ఈ సంవత్సరం ముఖ్యంగా సంస్కృత పాఠశాలకు రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించటం కళాశాల నూతన కరస్పాండెంట్ గా శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు పదవీ బాధ్యతలు స్వీకరించటం, సంస్కృత పాఠశాలకు ఒ.యస్.యస్.సి. సిలబసన్ను అమలు చేయుటకు తగిన చర్యలు చేపట్టటం ఈ సంవత్సరంలో జరిగిన ముఖ్యమైన కార్యక్రమములో కొన్ని

ఇప్పటికి సుమారు 38 లక్షల రూపాయలకు పైగా కళాశాలకు కార్పసఫండ్ ఏర్పడినది. ఈ నిధుల సేకరణకు అవిశ్రాంతంగా కృషిచేస్తున్న శ్రీ విశ్వజననీపరిషత్ పూర్వాధ్యక్షులు, ప్రస్తుతకళాశాల అభివృద్ధి సంఘ అధ్యక్షులు శ్రీ బి. రామబ్రహ్మంగారికి శ్రీ విశ్వజననీపరిషత్ కృతజ్ఞతలు తెలియుచేయుచున్నది. కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న అధ్యాపకులకు ఇతర సోదరీ సోదరులకు అభినందనలు.

మాతృశ్రీ పబ్లికేషన్స్ : మాతృశ్రీ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో నడుపబడుతున్న విశ్వజననీమాసపత్రిక ప్రస్తుతం 2,600 కాపీలను పబ్లిష్ చేయుచున్నది. అందులో నికరంగా 1600 మంది చందాలను రెన్యూ చేయటం జరుగుచున్నది. దాదాపు 500 మంది ఆలస్యముగా నయినను చందాలను పంపి రెన్యూ చేసుకొనుచున్నారు. దాదాపు 300 కాపీలు ప్రకటనదారులకు మరియు విశ్వజననీ పరిషత్ డోనార్సుకు ఉచితముగా పంపుట జరుగుచున్నది. ఆగష్టు 2001 సంవత్సరం నుండి 2004 జులై వరకు 1/8 డెమ్మీలో 24 పేజీలతో పత్రికను ముద్రించడం జరిగింది. అప్పుడు సంవత్సరం చందా 100 రూపాయి గా జీవిత చందా 1000 రూపాయిలు నిర్ణయించియున్నారు. సభ్యుల కోరికపై ప్రస్తుతము 1/4 క్రౌన్లో 32 పేజీలతో ముద్రించటం జరుగుచున్నది. సంవత్సరంలో జరిగే ముఖ్య పండుగులను కలర్ ప్రింటింగ్ (ఆర్ట్ పేపరు మీద) నాలుగు పేజీలు అదనంగా ప్రింటు చేయుచున్నాము. పత్రిక నిర్వహణ ఛార్జీలు కొన్ని రెట్లు పెరిగినప్పటికి చందా రేట్లు మార్పు చేయటం జరగలేదు. డివోటీస్ సౌకర్యార్థము ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమము నలుగురికీ తెలియవలెనను ఉద్దేశ్యముతో ఫోటోలతో సహా ప్రచురించటం జరుగుచున్నది. కనుక వదాన్యులు. ప్రకటన కర్తలు, చందాదారులు తమ తమ చందాలను సకాలములో రెన్యూ చేసి పత్రిక అన్ని విధముల ఇంకా అభివృద్ధి పధములో పయనించుటకు తోడ్పడవలసినదిగా కోరుచున్నాము.

వ్యక్తిగతమైన బాధ్యతలు వత్తిళ్ళకు అధిగమిస్తూ విశ్వజననీమాసపత్రిక సంపాదకులుగా, అనసూయావ్రత నిర్వాహకులుగా శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ గారు చేస్తున్న కృషి బహుధా ప్రశంసనీయము. వారికి కృతజ్ఞతలు. వారికి సహకరిస్తున్న శ్రీమల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారికి అభినందనలు. పత్రిక నిర్వహణ బాధ్యతను నిర్వహిస్తూ శ్రమిస్తున్న శ్రీ కె.బి.జి. కృష్ణమూర్తి గారికి ధన్యవాదములు.

ఈ సంవత్సరకాలంలో శ్రీ విశ్వజననీపరిషత్ ఆధ్వర్యంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమములు, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమములు నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమములన్నింటిని విజయవంతం చేయటానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సంస్థ అభివృద్ధికి మరింతగా కృషి చేయవలెనని వేడుకుంటూ అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!