అన్ని మతాలూ, అందరి అభిమతాలూ అమ్మకి నచ్చుతాయి. కారణం అన్నీ తానే కనుక. “సర్వసమ్మతమే నా మతం” అంటూ సంకుచిత భావాలకి స్వస్తి చెప్పి సర్వత్రా మమకారబంధంతో అందరి హృదయాల్ని లాలిస్తుంది; అందరి విశ్వాసాల్ని గౌరవిస్తుంది. అలా అని అమ్మ దేనినీ గ్రుడ్డిగా అంగీకరించదు, నిరసించదు”. “ఇది ఏమిటి?” అని తర్కించుకొని అనుభవపూర్వకంగా నిగూఢ సత్యాల్ని ఆవిష్కరిస్తుంది. అవి ఆప్తవచనాలు, సార్వకాలిక సత్యాలు.
‘భారతీయ గురుతత్వం’ శీర్షికన శ్రీ సత్యసాయి సేవాసంస్థ కోఠి సమితి, హైదరాబాదు వారు ఆది శంకరాచార్య, భగవాన్ శ్రీరమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, సత్యసాయిబాబా వారల తత్త్వాలను ఒకే వేదికపై సో॥ శ్రీ వి.యస్.ఆర్.మూర్తి గారి గళం నుండి ఆవిష్కరించడం ఎంతో ఆనందదాయకం, ఆదర్శప్రాయం, బహుధా ప్రశంసనీయం. అనేకత్వంలో ఏకత్వాన్ని సందర్శించటమే ఆధ్యాత్మికసాధనకి పరాకాష్ఠ స్థితి. ఈ సందర్భంగా శ్రీమూర్తిగారు ‘All Gurus are one; but all are not ‘Gurus’ అనే సత్యాన్ని చాటి చెప్పారు. మహమ్మదు, క్రీస్తు, కృష్ణుడు, బుద్ధుడు, మహర్షి, బాబా అమ్మ … అంతా ఒకే సత్యాన్ని చాటి చెప్పారు. చెప్పిన తీరు వేరు. అది ఆయా దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. దేశాలు, ప్రాంతాలు, భాషలు, తెగలు, మతాలు పేరుతో మాత్రమే కాకుండా గురువులు పేరుతో కూడా మానవాళి చీలికలు కావటం శోచనీయం. తిరుపతి వేంకటేశ్వరస్వామి, షిర్డీసాయిబాబా, జిల్లెళ్ళమూడి అమ్మ అని పిలువబడినా ఆయా అర్చామూర్తులు తిరుపతికి, షిర్డీకి, జిల్లెళ్ళమూడికి మాత్రమే పరిమితం కాదు అనేది పరమసత్యం.
ది. 13.1.2012 తేదీన జి. పుల్లారెడ్డి భవన్లో సో॥ శ్రీ వి.యస్.ఆర్.మూర్తి గారి ‘జిల్లెళ్ళమూడి అమ్మ తత్వ’ ప్రసంగ సారాంశాన్ని నాకు అందినంతవరకు వివరిస్తాను. అమ్మ చేతికి ఎవరైనా డైరీ కానీ, ఫోటోగానీ, పుస్తకంగానీ ఇచ్చి ఆటోగ్రాఫ్ ఇమ్మంటే ‘అంఆ’ అని సంతకం చేసి తిరిగి ఇస్తుంది. అంతే తాను తొలి; ఆద్యంతరహిత అని అర్థం. జిల్లెళ్ళమూడి కుగ్రామంలో అడుగు పెట్టగానే అమ్మ నడయాడిన ప్రభావం వలన ప్రశాంతత, ఆత్మీయ వాతావరణం మనల్ని ఆకట్టుకుంటుంది. మనకు తెలియకుండానే అమ్మ దివ్య మాతృత్వ బంధంలో బందీలమై అన్నయ్యలు, అక్కయ్యలు అయిపోతాం.
అది ఒక పుణ్యక్షేత్రం. సూత పురాణంలో ‘అతి వర్ణాశ్రమ’ స్థితిని ప్రస్తావించారు. దానిని జిల్లెళ్ళమూడిలో అణువణువునా దర్శించవచ్చు. అమ్మకి జాతి, కుల, మత, వర్ణ, వర్గ భేదం లేదు. అంతటిలో తనను, తనను అంతటిగాను, తనలో అంతటిని దర్శించిన అద్వైతరసామృత మూర్తి. ఎక్కడో ఒక మారు మూల నులక మంచం మీద కూర్చొని సకలసృష్టినీ పరిపాలిస్తున్న శ్రీమత్సింహాసనేశ్వరి.
నేను విద్యార్థి దశలో ఒకసారి జిల్లెళ్ళమూడి వెళ్ళాను. ఒక పాక – గుమ్మంలో ముందు నిలబడి ఉన్నాను. ఒక పెద్దమనిషి వచ్చి ‘ఇక్కడే వేచి ఉండండి’ అన్నారు. అంటూండగానే గదిలో నుంచి అమ్మ, “వాడిని నేనే పిలుచుకున్నాను. లోపలికి రానివ్వు” అన్న పలుకు వినవచ్చింది. అమ్మ నన్ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నది. ఆనందస్వరూపిణి అమ్మను దర్శించటమే శాంతిదాయకం. అమ్మ మనల్ని చూస్తే ఆ నిరవధిక ఆనందరసప్రాప్తికి అవధులు ఉండవు. అమ్మ అరటిపండు వలిచి స్వయంగా తినిపిస్తూ “నాన్నా! పైది తొలగిస్తే గానీ లోపల ఏముందో తెలియదు” అంటూ సరళంగా నిసర్గ సుందరంగా ‘నేతి నేతి విచారణ’, ‘సదసద్వివేచన’, ‘నిత్యా నిత్య వస్తు వివేకం’ ఇత్యాది మార్గాల ద్వారా ‘అసలు’ ను తెలుసుకోవటానికి మూలాన్ని తేటతెల్లం చేసింది. (ఉన్నది ఉన్నట్టు కనటమే లోచూపు – అమ్మ వాక్యం) అమ్మ తనం, కమ్మదనం దివ్యమాతృప్రేమను రంగరించి ఉగ్గుపాలతో ఉపనిషత్సారాన్ని పంచుతుంది.
ఒక సోదరుడు అమ్మకి ఒక ఫోటో చూపిస్తూ రష్యాలో ‘ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని మోసే అదృష్టం కలిగినందుకు గర్విస్తున్నాను’ అని తెల్పగా అమ్మ,” ఆ ప్రక్కనే ఉన్న ఒక రష్యన్ సోదరి స్పృహ తప్పి పడిపోతే నువ్వు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి ఆదుకున్నావుగా ! ఆ విషయం చెప్పవేం ?” అని అడిగింది అమ్మ సర్వజ్ఞ. కరుణాంతరంగ తరంగ.
ఒకసారి అమ్మ దర్శనం ఇస్తోంది. ఆ సమయంలో ఎక్కడనో శరీరాచ్ఛాదనకు కూడా సరిపడు గుడ్డలు లేని పేదరాలిని పిలిపించి, ఆరోజుల్లో రూ. 15,000/-లు విలువ చేసే పట్టుచీరెను ప్రేమతో పెట్టుకొని ఆనందించింది. అమ్మ ప్రేమకు అస్తిక్యత, ఆస్తి వున్నవారు లేనివారు అంతా పాత్రులే. కడుపు నిండినవాడు నిండనివాడిని చూడాలి అని అంటుంది అమ్మ. (నీకు రెక్కలు ఇచ్చింది, రెక్కలు రానివాడిని ఆదుకోవటానికి – అమ్మ వాక్యం).
“నీ చేత్తో నువ్వు తృప్తిగా పదిమందికి పెట్టుకో” అనేది అమ్మ దివ్య ప్రబోధం. ‘అన్నం బ్రహ్మేతి వ్యజానాత్”, ‘అన్నం బహుకుర్వీత,’ ‘అన్నం న నింద్యాత్’ ఉపనిషద్వాక్యాలు. అన్నం – అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశవికాసానికి ప్రధాన భూమిక. అమ్మకి 50 వసంతాలు నిండిన స్వర్ణోత్సవ శుభవేళ లక్షమంది బిడ్డలు ఒకే పంక్తిలో భోజనం చేస్తూంటే చూడాలనే తన అపూర్వాకాంక్షను వెలిబుచ్చింది. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయగలమా ? చేసినా ఈ కుగ్రామానికి అంతమంది జనం వస్తారా ? అనే సంశయాన్ని వెలి బుచ్చారు నిర్వాహకులు. అమ్మ సంకల్పం అమోఘం. రంగరంగ వైభవంగా జరిగిన ఆ అపూర్వ ఉత్సవంలో 1లక్ష 25 వేల మంది అన్నప్రసాదం స్వీకరించారు. ఉపనిషత్సారాన్ని ఒక బొమ్మగా పోతపోస్తే బొమ్మే అమ్మ.
“”కూతురుని కోడలిని సమంగా చూడటమే అద్వైతం” అంటూ గృహస్థులకి పూర్ణాద్వైత భావాన్ని కరతలాలమలకం చేసింది. అమ్మ వివాహం చేసుకున్నది. మన దృష్టిలో ముగ్గురు బిడ్డల తల్లి. ప్రపంచమంతా అమ్మ పాదాల మ్రోల మోకరిల్లితే, అమ్మ అనుదినం ప్రథమంగా భర్తపాదాలకు నమస్కరించిన తర్వాతే ఏ పనైనా చేసింది. స్త్రీలంతా తరించటానికి ఏదైనా వ్రతాన్ని ఉపదేశించమని అంటే ‘నీ భర్తే నారాయణ స్వరూపుడు నీకు. వేరే వ్రతాలుఎందుకు ? పతిసేవే పరాత్వరుని సేవ’ అంటూ అనసూయమ్మ పాతివ్రత్యాన్ని ఆచరణాత్మకంగా ప్రబోధించింది.
భగవాన్ శ్రీరమణమహర్షికి భుజంమీద (Sarcosis) నెత్తురు గడ్డ లేచినపుడు దానిని శమంతకమణి తోనూ, కన్నబిడ్డతోనూ పోల్చారు. అమ్మకి ఊపిరితిత్తులలో కురుపు (Lung absciss, cancerous growth) లేచింది. మరొకసారి చట్ట మీద పెద్దగడ్డలేచింది. “గడ్డ కూడా బిడ్డే” అన్నది అమ్మ. భయంకర వ్యాధికారక పోషక సూక్ష్మజీవుల్ని సైతం కన్నబిడ్డలుగా ఎంచే వారి గుండెలోతు, ఆలోచనారీతి (Lateral thinking) అసాధారణమైన పోకడ మనకి అగ్రాహ్యములే. అమ్మకి మత్తు (anaesthesia) ఇవ్వకుండానే ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆ స్థితిని ‘కేవల కుంభక యోగం’ అని అంటారు. అంటే ప్రాణం, మనస్సులను బ్రహ్మ పదార్థంతో అనుసంధాన చేయటం. అప్పుడు శరీరస్పృహ ఉండదు; అది సాధారణ anaes thesia కంటే నూరు రెట్లు ప్రభావం కలిగి ఉంటుంది.
అమ్మ జన్మస్థలం (మన్నవ గ్రామం)లో శ్రీ మౌనస్వామి (కుర్తాళం పీఠాధిపతులు) వారు శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మ వారి విగ్రహం క్రింద ఒక యంత్రం వేశారు. గ్రామస్థులంతా దానిని ‘రాజ్యలక్ష్మీయంత్రం’ అని అనుకునేవారు. (పాలుత్రాగే) పసిప్రాయంలోనే అమ్మ, “అది రాజ్యలక్ష్మీయంత్రం కాదు, రాజరాజేశ్వరీ యంత్రం” అని పల్కింది. తర్వాత కాలంలో పండితుల సమక్షంలో సత్యాన్ని నిరూపించింది. ఆశ్చర్యం. అది రాజరాజేశ్వరీ యంత్రమే. మారుమాటలేని మాట అమ్మ మాట. దానికి ఎదురు లేదు.
జిల్లెళ్ళమూడి అమ్మను గురించి చెప్పేటప్పుడు, అమ్మ కుమార్తె హైమను గురించి కూడా చెప్పుకోవాలి. హైమ అవ్యాజ వాత్సల్యరేఖ. హైమ శరీరత్యాగం, హైమాలయ ప్రాదుర్భావం అద్భుతం. జగన్మాత అమ్మ తన శరీరంలోంచి ఒక భాగాన్ని త్రుంచి, లాలించి, పెంచి, పోషించి లయం చేసుకున్నది. (హైమను నేనే కన్నాను, నేనే పెంచాను, నేనే చంపుకున్నాను. నేనే దైవత్వం ఇచ్చాను – అమ్మ వాక్యం. ) ఈ సందర్భంగా భగవాన్ శ్రీ రమణమహర్షి ప్రతిష్ఠించిన శ్రీ మాతృభూతేశ్వరాలయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి.
ఎందరుగానీ ఎప్పుడు రానీ బిడ్డలకు అమ్మ అన్నం పెడుతుంది. ఆ క్షేత్ర మాహాత్మ్యాన్ని, వైభవాన్ని అపార్థం చేసికొని అక్కడ ధనరాశులు మూలుగుతున్నాయని భ్రమపడి కొందరు దుండగులు (నక్సలైట్లు) ఆశ్రమం మీద దాడి చేసి అందినంత దోచుకుపోయారు. ఆ నేరస్థుల్ని పట్టి బందీలుగా నిలబెట్టారు. వాళ్ళనీ అమ్మ బిడ్డలు గానే సంభావన చేసింది. (కొందరు బిడ్డలు అడిగి తీసుకుంటారు, కొందరు అదరగండం చేసి తీసుకుంటారు. వీళ్ళు అలాంటివాళ్ళు – అమ్మ వాక్యం).
ఈ ఆధ్యాత్మిక రంగస్థలం పైకి అందరూ వేషం వేసుకువస్తే, అమ్మ మాత్రం వేషం తీసి కేవల సద్వస్తువుగా భాసిల్లుతోంది. అమ్మ అక్షర పరబ్రహ్మంగా, శ్రీ లలితాదేవిగా, రాజరాజేశ్వరిగా, శ్రీ గురుమూర్తి, దక్షిణామూర్తిగా వచ్చి ఉంటే మనలో ఏ ఒక్కరు తన దగ్గరికి చేరే అవకాశం లేదు. (అధాతోబ్రహ్మ జిజ్ఞాసా) గురువు ఎదుటపడాలంటే శిష్యునికి ఒక అర్హత (qualification) ఉండాలి. అమ్మగా వచ్చిన మూలప్రకృతి, పరంజ్యోతి, ద్వాదశాంశ కల అమ్మ; కనుకనే మన యోగ్యతా యోగ్యతల్ని పరిగణించదు.
ప్రతి ఒక్కరు జిల్లెళ్ళమూడి వెళ్ళాలి. అక్కడ అమ్మ ప్రసాదం, అన్న ప్రసాదం – పట్టెడన్నం తినాలి. అది అమ్మ అనుగ్రహానికి ప్రతిరూపం. ఇపుడు ప్రముఖులుగా విరాజిల్లుతున్న వారంతా ఎప్పుడూ ప్రముఖమైన అమ్మ చేతి మీదుగా అన్నం ముద్దలు తిన్నవారే. డాక్టర్ ప్రసాదరాయ కులపతి (శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి, కుర్తాళం), శ్రీ పూర్ణానందస్వామి (శ్రీశైలం) శ్రీ లక్ష్మణయతేంద్రులు (పెదముత్తేవి), డాక్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య, వేదవ్యాస్ IAS, Ph,D, శ్రీ ఎక్కిరాల భరద్వాజ, విశ్వయోగి విశ్వంజీ మున్నగు వారంతా అమ్మ వాత్సల్యజలధిలో పుష్కరస్నానం చేసినవారే.
ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధారులు, జ్ఞానులు, యోగులు, మునులు, సర్వసంగపరిత్యాగులూ అందరూ అమ్మ వద్దకు తమ తమ సాధనా మార్గాల్లో, లక్ష్యసిద్ధి దిశగా fine tuning కోసం వెడతారు. డాక్టర్ ప్రసాదరాయ కులపతి అమ్మను ‘జగజ్జనయిత్రి’ ‘పరమశక్తి’, ‘సవిత్రి’ అని కీర్తిస్తే; శ్రీ పూర్ణానందస్వామి ‘Motherless Siva has found his mother’ అని ప్రస్తుతించారు.
ఒకసారి నాదయోగి, రామనామయోగి, శ్రీ అవధూతేంద్ర సరస్వతీస్వామి (రఘువరదాసు)గారు అమ్మ దర్శనార్థం జిల్లెళ్ళమూడి వస్తున్నారు. 8/10 మైళ్ళదూరంలో ఉన్నారు. అమ్మ స్థానికులకు ఆ విషయం చెప్పి తగిన ఏర్పాటు చేయించింది. ఈ విషయం అమ్మకు ముందే ఎలా తెలుసు ?
జిల్లెళ్ళమూడిలో అందరూ శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేస్తారు. ‘దానికి భాష్యం ఎవరిచేత చెప్పిస్తే బాగుండును’ అని అమ్మకు విన్నవించుకున్నారు. అమ్మ శ్రీ మల్లాప్రగడ శ్రీరంగారావు గారి చేత చెప్పించు కోమన్నది. వెంటనే కేశవశర్మ మల్లాప్రగడ వారిచేత చెప్పించి దానిని భారతీ వ్యాఖ పేరుతో అచ్చువేయించారు. అది అందరికీ ఆమోదయోగ్యమయింది. అదీ అమ్మ సంకల్పమే. ఈ విషయాలు అన్నీ అమ్మకి ముందే ఎలా తెలుసు ? అది coincidence కాదు, providential. ఆ విషయం అమ్మను అడిగితే “దానిదేమున్నది ? నాన్నా!” అని నవ్వింది. దూరశ్రవణ, దూరదర్శన విద్యాసిద్ధి మన బోంట్లకు కలిగితే నూరుకోట్ల వ్యాపారం చేసుకోవచ్చు.
నేను ముచ్చటించే విషయాలు కొద్దిపాటి మాత్రమే. ‘అమ్మ ‘జీవిత మహోదధి’, అమ్మ స్వీయచరిత్ర, గ్రంధాన్ని చదవండి. మీకే తెలుస్తుంది.
అమ్మ దేవతయే ఆమెను మనం దేవతను చేయనక్కరలేదు. publicity అక్కర్లేదు. ఆ దివ్యపరిమళం సహజంగా వ్యాపిస్తుంది. (యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాంధోవాత్యేవం పుణ్యస్సకర్మణో దూరాద్ధంధోవాతి). ఆమె ఏం ఆచరించిందో చెపితే చాలు. ఉదా: ‘ఇంటింటా పిడికెడు బియ్యం’ పధకాన్ని ప్రవేశపెట్టి, (ఒక కుగ్రామంలో వర్గ వైషమ్యాల నడుమ అందరినీ ఒక్క త్రాటిపై నడిపించి) ఆకలి బాధని రూపు మాపింది. కొంతవరకైనా మనం ఆచరిస్తే ధన్యులం. అమ్మ ప్రాతః స్మరణీయ. మహా మహితామృత మూర్తి, వాత్సల్యానికి నిలువెత్తు రూపం. మన ప్రస్తుత కర్తవ్యం -గురుసమన్వయం చేసుకోవటం.
సో॥ శ్రీమూర్తిగారి ప్రసంగానంతరం ‘అమ్మ చేతిమీదుగా అమృతోపమానమైన అన్నం ముద్దలు తిన్న తృప్తి తమకు కలిగిందని, పదిమందికి ఆదరణగా పెట్టుకోవటం అనే అమ్మ సందేశం శిరోధార్యం, అమృతత్వ పరమపదానికి ‘సోపానం’ అంటూ వందన సమర్పణ చేశారు కార్యకర్తలు.
అరమరికలు, అంతరాలు, పరిమితులను అధిగమించి ‘గురుసమన్వయ – తత్త్వచింతన’ సభలను నిర్వహించాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉన్నది. అందుకు భాగ్యనగర వేదిక ఒక శుభారంభానికి శ్రీకారం చుట్టింది అని సభ్యులంతా త్రికరణశుద్ధిగా భావించారు.
“ఎదుటి వానిలో మంచిని చూడటమే మన మంచితనం” అనీ, “ఎదుటివానిలో మంచిని చూస్తున్నంత సేపూ నీలో దైవత్వం కలుగుతుంది” అనీ, “మంచినిమించిన మహిమలు లేవు” అనీ, అమ్మ ‘మంచితనం’ ప్రభావాన్ని వేనోళ్ళ చాటింది. కనుక మనం అందరం మంచి మనస్సుతో శివంకరమైన ఇట్టి సభానిర్వహణలకు సత్వరం పూనుకోవాలి. అందుకు సర్వేశ్వరి, అనుగ్రహస్వరూపిణి అమ్మ ఆశీస్సుల్ని నిండు మనస్సుతో అపేక్షిద్దాం.