అమ్మకు కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేవన్న సంగతి అమ్మ బిడ్డలందరికీ విదితమే కదా ! అమ్మ చిన్నతనంలోనే అమ్మను సేవించిన నల్ల ఖాసీమ్, మౌలాలీ చరిత్రలో మనకు కనిపిస్తున్నారు. ఒకమారు అమ్మ జన్మదినంకు జిల్లెళ్ళమూడి వెళ్లాను. అప్పుడు ఒక ముస్లిమ్ స్త్రీ వచ్చి “అమ్మా ! మీరు అమ్మగారి చరిత్ర రాస్తున్నారుటదా! మీరు రాసిన నల్లఖాసిమ్ కోడలిని, అతను అమ్మ చిన్నతనంలో జట్కాబండీ తోలేవాడని, అమ్మ పుట్టిన రోజు పండుగకు మా కుటుంబీకులము తప్పక వస్తుంటా”మని చెప్పింది.
డోలోత్సవంలో కూడా ఒక ముస్లిమ్ స్త్రీ తన బిడ్డను తీసుకు వచ్చి ఆ ఉత్సవంలో పాలుపంచుకున్నట్లు విశ్వజననిలో చదివాను.
అదే విధంగా మన జిల్లెళ్ళమూడి కాలేజీలో షేక్ జరీనాబేగం (కాలేజీలో పనిచేసే నబీ కూతురు) బి.ఎ. చదివినట్లు, తిరుపతిలో ఎమ్.ఎ., రీసెర్చి నిమిత్తం జిల్లెళ్ళమూడి వచ్చిందని చదివిన నాకు చాలా సంతోషమనిపించింది. తల్లిదండ్రులు జిల్లెళ్ళమూడి వాస్తవ్యులే కాబట్టి సరే. అత్తమామలు కూడా ఆమెను ప్రోత్సాహించటం ఊహించని విషయము.
సెప్టెంబరు 12న ఇ.సి. మీటింగుకు జిల్లెళ్ళమూడి వెళ్ళాను. మర్నాడు ఉదయం అనసూయేశ్వరాలయంలో పూలుకడ్తున్నాను. అక్కడికి ఒక ముస్లిమ్ కుటుంబము వచ్చి అమ్మ అర్చనలో పాలుపంచుకున్నారు. నాకు చాలా ఆశ్చర్యమనిపించి వివరాలు అడిగాను. షేకు బాజీ, మహదర్ ఉన్నీసావారి కుమార్తె షమీర అన్నప్రాశన అనసూయేశ్వరాలయంలో జరుపుకున్నారుట. అతని తండ్రి షేకు ఖాజావళీ తల్లి చాంబ్బీ, జిల్ళెళ్ళమూడి వాస్తవ్యులు. వాళ్ళు ఎప్పుడూ అనసూయేశ్వరాలయంలో పూజలు చేసుకుంటారట.
ఈ విషయము లక్ష్మణరావు అన్నయ్యతో చెపితే మన ఆటోవలీ బంధువులే అయి వుంటారని అన్నారు. నేను బాపట్ల వెళ్ళటానికి అతని ఆటోలోనే వెళ్ళాను. అతన్ని అడిగితే వాళ్ళ పెద్దనాన్నగారి మనుమరాలి అన్నప్రాశనే అని చెప్పాడు. వలీ బావమరిదికి పిల్లలు లేకపోతే అమ్మదర్శనానంతరం వారికి పిల్లలు కలిగారన్నాడు. అమ్మ అనురాగానికి ఎల్లలుండవు కదా ! అమ్మ వాత్సల్యానికి పాత్రులైన ఆకుటుంబీకులు ఎంత అదృష్టవంతులో అనిపించింది.