“సదాసదాత్మకమైన జగత్తును సృష్టించి, పోషించి, సంహరించే శ్రీమాత సర్వాంతర్యామిని. అన్నింటిలోనూ, అందరి అంతఃకరణాలలోనూ వ్యాపించి ఉన్న ఆత్మస్వరూపిణి శ్రీమాత. ఆమె సర్వాంతర్యామిని. జగత్తును సృష్టించి, ఆ జగత్తులోని సర్వజీవుల లోపల వ్యాపించి ఉండేది సర్వాంతర్యామిని” – భారతీవ్యాఖ్య.
సర్వవ్యాపకమైన ఆత్మతత్త్వమే పరమాత్మ. సృష్టిలోని ప్రతి అణువులో నిండి ఉన్న భగవంతుడు సర్వాంతర్యామి. అందుకే ప్రహ్లాదుడు తన తండ్రితో “ఇందు గల డందు లేడని సందేహము వలదు” అని చెప్తూ “చక్రి సర్వోపగ తుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు” అని వివరించాడు. అంతటా నిండి ఉన్నవాడిని వెదకి చూడడ మేమిటి? అంటే, బయట మనకు కనిపించే సకల చరాచర సృష్టిలో అంతర్నిగూఢంగా దాగి ఉన్నది ఆ పరమాత్మ తత్త్వమే – అనే వాస్తవాన్ని గుర్తించమని తెలియజేయడమే వెదకి చూడమని చెప్పడంలో గల అంతరార్థం. బుద్ధితో ఆలోచించి, తెలివితో పరిశీలించి చూస్తే అంతటా, అన్నిటా ఆ భగవంతుడే సాక్షాత్కరిస్తాడు.
బాలుడైన ప్రహ్లాదుడు – కరి, మకరి, కాళ, కాలకూట విషాల్లో సైతం శ్రీహరినే దర్శించాడు. వాటిల్లో, తనలో ఉన్న భగవత్తత్త్వం ఒక్కటే అని గుర్తించి వాటికి నమస్కరించాడు. వాటితో అద్వైత భావం పొంది, ఆత్మ తత్త్వాన్ని అంతటా, అన్నింటా చూడగలిగాడు. అందువల్లనే అవేవీ అతనిని ఏమీ చేయలేకపోయాయి. అంతేకాదు. విష్ణుమూర్తి కోసం వెదకి వెదకి వేసారిన తన తండ్రికి కూడా భగవత్సాక్షాత్కారాన్ని కలిగించిన పరమ భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు.
స్థావర జంగమాత్మకమైన జగత్తులో వ్యాపించి ఉన్న శ్రీమాత సర్వాంతర్యామిని.
“అమ్మ” సర్వాంతర్యామిని. “ఈ సృష్టి అనాది. నాది” అని చెప్పిన “అమ్మ” – “నేను నేనైన నేను” అంటూ “అందరిలో ఉన్న ‘నేను’ ఎవరో కాదు. “నేనే” అని చెప్పింది. “నేను మాత్రం మీ కంటె భిన్నంగా దేవుణ్ణి చూడలేదు” అని, ఇంకా స్పష్టత కోసం “నేను మీకంటే భిన్నంగా లేను” అని చెప్పి, మనం అందరం భగవంతుని వివిధ రూపాలుగా ప్రకటించింది. “మిమ్ములను విడిచి నేనూ, నన్ను విడిచి మీరు లేరు” అని మనకూ తనకూ అభేదం అని సూచించింది. “జగన్మాత అంటే జగత్తే మాత” అని వివరించింది. “నీవు సాక్షాత్తూ రాజరాజేశ్వరివి అమ్మా” అంటే, “మీరు కానిది నేనేది కాదు నాన్నా!” అని ప్రవచించింది. “మీరంతా నా అవయవాలు” అని చెప్పి – సహస్రశీర్షుడు, సహస్రాక్షుడు, సహస్రభుజుడు, సహస్ర పాదుడుగా మనం భావించే భగవంతుని విశ్వరూపంలోని విశిష్టతను ఒక చిన్నవాక్యంలో మనకు సులభంగా అర్థమయ్యేట్టు చేసింది. “మీలో కాదు, మీరుగా” భగవంతుణ్ణి చూస్తున్నా అనడంలోని ఆంతర్యం అంతటా నిండి ఉన్నది తానే అని చెప్పడమే. “అంతటా ఉన్న అమ్మ తెలియడానికే ఈ అమ్మ” అని ఇంకా స్పష్టంగా ప్రకటించింది. “బాధ ఎవరిదైనా అనుభవం నాదే” అనే వాక్యం “అమ్మ”ను సర్వాంతర్యామిగా ప్రత్యక్షం చేస్తోంది. “నేను ప్రతీదానిలో ఉన్నాను. అన్నిట్లోను నేను ఉన్నాను” అని ఎంతో విపులంగా, వివరంగా చెప్పిన “అమ్మ” సర్వాంతర్యామినియేగా మరి.
మానవులూ, ఇతర జంతుజాలమూ “అమ్మ” దృష్టిలో ఒకటేనా అనే ప్రశ్నకు “అవి ఇతరమని అనిపించటం లేదు. అన్నీ నేననే అనిపిస్తుంది” అని సమాధానం ఇచ్చిన “అమ్మ” సర్వాంతర్యామిని. “అమ్మ”కు పూజ చేసుకుని, మామిడి పండ్లు నైవేద్యంగా సమర్పించబోయి, అవన్నీ ఎలుక కొరికినట్లు ఉంటే బాధపడిన ఒక అన్నయ్యతో “ఎలుకరూపంలో “అమ్మే” వచ్చి, తిన్నదేమో!” అని ఓదార్చి, ఒక పండు తీసుకొని తిన్న “అమ్మ” సర్వాంతర్యామిని.
“అన్నీ గ్రహించేది మనస్సు, మనస్సే దైవం” “భగవంతుడు అంటే మనస్సే” అని చెప్తూ “నేనూ మనస్సూ ఒకటే” అన్నది. అంటే అందరిలో అంతర్యామినిగా ఉన్నది తానే అని స్పష్టం చేసింది. “మనస్సును దైవంగా గుర్తించలేం కనుక ఏదో ఒక రూపంలో ఆరాధిస్తున్నాం” అని ఇంకా వివరంగా చెప్పిన “అమ్మ” – సర్వాంతర్యామిని. “నేను నేనైన నేనుకు దుఃఖం లేదు. ఆనందం లేదు. రెండూ సహజమే” అని చెప్పి, వాగ్రూపంలో మాత్రమే కాక, క్రియా రూపంలో కూడా ఎన్నో సందర్భాల్లో సుఖదుఃఖాలకు అతీతంగా ప్రవర్తించి, తన నడవడిక ద్వారా సర్వాంతర్యామినిగా సాక్షాత్కరించింది “అమ్మ”. “కనపడుతున్న రూపమేదో కనపడనిదీ అదీ అమ్మే” – అని సగుణ నిర్గుణాత్మకమైన తన సర్వవ్యాపకత్వాన్ని తెలియ జేస్తూ “వేళ్ళరూపమూ, వేళ్ళ మధ్యదీ అమ్మే” (ఖాళీ ప్రదేశం) అని వివరించి చెప్పింది.
సర్వాంతర్యామిని అయిన “అమ్మ”కు తన పిల్లల మనస్సుల లోని ఆలోచనలు తెలియకుండా ఎలా ఉంటాయి. అందరి హృదయగతాభిప్రాయాలను ఇట్టే పసిగట్టేయగలదు “అమ్మ”. అందుకే “తనకు అడ్డుగోడలు లేవు” – అన్నది “అమ్మ”.
ఎర్రటి చీర, రవిక ధరించి, శంఖ చక్ర త్రిశూలాలతో కిరీటధారణిగా “అమ్మ”ను చూడాలనుకుంది కమల అక్కయ్య. ఆమె మనస్సులోని కోరికను గ్రహించిన “అమ్మ” దుర్గాష్టమినాడు ఆవేషధారణతో దర్శనమిచ్చి, ఆమెకే కాదు, అందరికీ కనువిందు చేసింది. తనకు బంగారు బొట్టు కానుకగా తెచ్చిన ఒక అబ్బాయితో “ఎందుకూ? పరీక్షకు వెళుత్నూవా?” అని ప్రశ్నించి, అతని మనస్సులోని మాటను బయట పెట్టింది. మన ఇష్టదైవం సీతాదేవిగా భావించి “అమ్మ”ను అర్చించుకోవాలి అనుకున్న క్రోసూరి కరణంగారికి, వారింట్లో పెద్దపట్నంలోని సీతాదేవి ధరించిన చీరలాంటి చీరతో దర్శనమిచ్చి, ఆయనకు ఎంతో ఆనందం కలిగించిన “అమ్మ” సర్వాంతర్యామిని.
ఒక సోదరి బట్టలకొట్లో నల్లటి స్పన్సిల్క్ చీరను చూసి, ముచ్చటపడి కొనాలనుకుని కూడా ఎందువల్లనో కొనలేదు. ఆమె జిల్లెళ్ళమూడికి వచ్చినప్పుడు “అమ్మ” ఇచ్చిన చీరను చూసి, “నా మనస్సు గ్రహించి, “అమ్మ” ఈ చీర ఇచ్చింది” – అని ఎంతో మురిసిపోయింది. “అమ్మ”ను గురించి ఎవరో చెప్పగా విన్న ఒక సోదరికి, ఒకనాటి రాత్రి కలలో – ముక్కుకు బులాకీతో “అమ్మ” కనిపించిదిట. ఆ సోదరి జిల్లెళ్ళమూడికి వచ్చినప్పుడు ముక్కుకు బులాకీ లేకుండా “అమ్మ” దర్శనం అయింది. ఆమె తనకు కలలో కనిపించిన “అమ్మ” కాదా ? అని సందేహించింది. సర్వాంతర్యామిని అయిన “అమ్మ” వెంటనే లోపలికి వెళ్ళి, బులాకీ ధరించి వచ్చి, ఆమెకు సందేహ నివృత్తి చేసింది.
చీరాలలో డాక్టర్ శాంసన్ ఆస్పత్రికి వెళ్ళినప్పుడు పులిహోర, దోసకాయపప్పు, అన్నం తీసుకువెళ్ళింది “అమ్మ”. ఆ పదార్థాలు ఆ లేడీ డాక్టరుగారికి ఎంతో ఇష్టమైనవట. ఒక సోదరుడు టెంకాయ కొడుతుండగానే నీళ్ళన్నీ క్రిందపడిపోయినాయి. “అమ్మ” నవ్వుతూ “అసలు ఆయన ఉద్దేశమేమిటంటే, ఒక్క చుక్క కూడా పోకుండా కొట్టాలని. అన్నీ క్రిందనే పోయినై” అని చెప్తే, తన మనస్సు గ్రహించిన “అమ్మ” మాటలకు ఆయన మనసారా నవ్వారు.
సర్వాంతర్యామిని యైన “అమ్మ”కు అందరి మనస్సులలోని ఆలోచనలు తేటతెల్లమవుతూ ఉంటాయి అనడంలో ఆశ్చర్యం ఏం ఉంది ? “అమ్మ” బిడ్డలు అందరికీ ఈ విషయం ఎవరి అనుభవం వారికి నిలువెత్తు నిదర్శనం.
ఈ సంవత్సరారంభంలో అందరి హృదయవర్తిని అయిన అర్కపురీశ్వరి అనసూయామాతను సర్వాంత ర్యామిగా స్మరించి, దర్శించి, భజించి, తరించడం కంటే మహద్భాగ్యం మరేమి ఉంటుంది ? “అమ్మా!”
“కొండలో, కోనలో, వాగులో, వంకలో,
అంతట నీవేనమ్మా ! అన్నిట నీవే నమ్మా !
నీ ఒడిలో నన్ను దాచుకోవమ్మా !
నీ పాపగా నన్ను చూచుకోవమ్మా !”
(కృతజ్ఞతలు : అమ్మా, అమ్మ వాక్యాలు సంకలనకర్తకు.)