అమ్మా! నీ ఆరాధ్యమూర్తులెవరు?’ అని ప్రశ్నించినపుడు “నాన్నా! మీరే నా ఆరాధ్యమూర్తులు” అన్నది. ఆమాట మాటవరసకు అన్న మాటకాదు, సర్వాత్మనా భావంతో అన్నది.
అమ్మ ‘సర్వాత్మనా’ మనకోసం తపిస్తుంది, మన ఊహకు అందనిదది. ఆ మాటకు అర్ధం ఏమిటో వాల్మీకి మహర్షి వివరించారు.
అశోకవనంలో ఆంజనేయస్వామి సీతాసాధ్విని దర్శించిన సందర్భం అది. సీతామాతను – ‘అశ్రుపూర్ణముఖీం దీనాం కృశామ్ అనం శనేనచ !
శోక ధ్యాన పరా దీనాం నిత్యం దుఃఖ పరాయణామ్ -‘ అంటూ ‘సర్వాత్మనా రామం అనుస్మరంతీం’ – అన్నారు. అమ్మ నిర్వచించినట్లుగా ‘రాధ’ అంటే ఆరాధన. సీతాదేవి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా రామనామ స్మరణ స్ఫురణ తపనతో నిండి ఉన్నాయి.
‘అనుస్మరణ’ అనేది అద్భుతమైన రసప్రపూర్ణమైన పదం. ‘అను’ అనే ఉపసర్గ (..) చాలా గొప్పది. దాని అర్థాన్ని సోదాహరణంగా వివరిస్తా. సృష్టి ఆవిర్భావ క్రమాన్ని వివరిస్తూ వేదాలు – తత్ సృష్ట్వా తదేవ అను ప్రావిశత్’ అన్నాయి. అంటే దైవం సృష్టిని చేసి అందే అణువణువునా ప్రవేశించెను — అని. దీనిని తేలికగా అర్ధమయ్యేట్లు “సృష్టే దైవం” అన్నది అమ్మ.
ఇక అమ్మ తన అశేష సంతానాన్ని ఆరాధించే ప్రక్రియను పరికిద్దాం. అమ్మ మహదాకాంక్ష – ఏ ఒక్కరూ ఆకలితో అలమటించ కూడదు. మనందరం తనలా హాయిగా ఉండాలి – అని.
అమ్మ ప్రేమకు మనప్రేమకు పోలికే లేదు. బిడ్డల కోసం దిగులు చెందేది, పునర్దర్శన ప్రాప్తికోసం పరితపించేది అమ్మే. ఈ లక్షణాలన్నీ హైమక్కయ్య ద్వారా ప్రకటించింది ప్రస్ఫుటంగా.
లక్షమంది పసివాళ్ళు ఊయలల్లో ఊగుతూంటే చూడాలనేది అమ్మ కోరిక. (వాస్తవానికి కోట్లాది పసివాళ్ళను ఊపుతున్నది తనే. కాగా ఆ దృశ్యం మనం చూసి ఆనందించాలని)
“జిల్లెళ్ళమూడి వచ్చే ప్రతివాడు కడుపు నిండా తినాలి, కొత్త బట్ట కట్టుకోవాలి” అని అన్నది.
సశరీంగా ఉన్నపుడు అమ్మ .
బిడ్డలు వస్తారని వారికోసం ముందుగా అనురాగ రూప అన్న ప్రసాదాన్ని సిద్ధం చేసేది. నూతన వస్త్రాలతో సన్మానించి మూడు పువ్వులూ ఆరు కాయలుగా వర్ధిల్లమని దీవించేది. బిడ్డల నొసట తీర్చిదిద్దే తిలకం – కుంకుమ బొట్టుకు వ్యాఖ్యానం చెప్పగలిగితే అది ఒక గ్రంధమే అవుతుంది. సూర్య బింబాన్ని పోలిన గుండ్రని చుక్క, వీర తిలకాన్ని పోలిన పొడవైన నిలువు బొట్టు, కళ్యాణ తిలకం… దిద్దేది. ఏమని ఆశీర్వదించేదో, విధాత రాతను చెరిపి తిరగ వ్రాసేదో – మన ఊహకు అందదు.
అరమరికలు దాపరికం లేక సత్యజ్ఞాన సంపదను సంకల్పమాత్రం చేతనే ప్రసారం చేసేది. కార్తీకదీప చందాన దివ్యజ్యోతి ప్రభలతో దీపిస్తూ పతితులు, దుఃఖ భాగులు, అనాధలను వెతుక్కుంటూ వెళ్ళి దర్శన ప్రసాదాదులను అనుగ్రహించేది.
అంతేకాదు; అంతా ఇంతాకాదు. ‘సర్వాత్మనా ఆరాధన’ అనే తపస్సుకు వాస్తవికతకు ఒక ఉదాహరణ:
ఒకసారి చీరాల నుంచి ఒక బృందం జిల్లెళ్ళమూడి వచ్చారు. వారంతా అమ్మ దర్శనం చేసుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆ సమయంలో అమ్మ సన్నిధిలో నేనున్నాను. అమ్మ నన్ను చేర పిలిచి “నాన్నా! వీళ్ళకి అన్నం పెట్టించి పంపించు” అని ఆ బాధ్యతను నాకు వప్పగించింది. వారిని నేను అన్నపూర్ణాలయానికి తోడ్కొని వెళ్ళాను. అక్కడి వారంతా వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కనుక చాపలు పరచి, “మీరు కూర్చోండి. నేనే వడ్డిస్తాను” అన్నాను. వారు “మేము చాలాకాలం నుంచి వస్తున్నాము. పాత వాళ్ళమే. మేము భోజనం చేసే వెడతాం. మీ పని చూసుకోండి” – అన్నారు. సరేనని నేను వెళ్ళిపోయాను.
జిల్లెళ్ళమూడిలో ఉన్నప్పుడు రోజూ రాత్రి అమ్మ మంచం ప్రక్కన చాప వేసుకుని పడుకోవటం నాకు అలవాటు. సాధారణంగా నిద్రించేవాడిని కాదు. అమ్మ సుందర దరహాస భాసుర వదనాన్ని దర్శిస్తూ, అమ్మ పాదాలు రాస్తూ, వాటిని కళ్ళకి హత్తుకుంటూ ఒక అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తూ ఉండే వాడిని. అమ్మ సాన్నిధ్యమే. శివంకరం, మహదానందకరం.
అమ్మ గురకపెట్టి నిద్రస్తోంది. రాత్రి 1.00 గం॥ ప్రాంతం. ఉన్నట్టుండి. అమ్మ కలవరిస్తోంది. “వాళ్ళు అన్నాలు తినకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు అన్నాలు తినకుండా వెళ్ళిపోయారు..’ అని
‘ఎవరమ్మా? అని అడిగాను.
‘చీరాల నుంచి వచ్చిన వాళ్ళు’ అన్నది అమ్మ కళ్ళు తెరవకుండానే. ఆ పొరపాటునాది. వాళ్ళ మాటలు నమ్మి నేను ప్రక్కకు తప్పుకోగానే, వాళ్ళు చల్లగా జారుకున్నారు. అది అమ్మ హృదయంలో కార్చిచ్చును రగిలించింది.
ఒక ముఖ్యాంశం. గాఢ నిద్రలో పలవరించే మనిషిని ప్రశ్నిస్తే సమాధానం రాదు. విని అర్థం చేసుకుని ప్రయత్నపూర్వకంగా బదులు పలకడు. అది అమ్మ. మనోవేదన, హృదయ ప్రకంపన. అమ్మకి నిద్ర, మెలకువ లేవు; జాగ్రత్స్వప్న సుషుప్తీనాం సాక్షి –తత్త్వతః.
మానవ మనస్తత్వ శాస్త్రప్రకారం మనకి conscious, unconscious, sub-conscious states ఉంటాయి. అమ్మకి ఈ మూడూ లేవు. అమ్మకి ఉన్నది. ‘Universal consciousness’; విశ్వాంతరాత్మ. ఈ సత్యాన్నే అన్నమాచార్యులవారు. ‘విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు’- అని వర్ణించారు.
విశేషం – మనకి విశేషం, అమ్మకి సహజం – ఏమంటే, గాఢ నిద్రలో కూడా అమ్మ మన ఆకలి దప్పుల గురించే తపిస్తోంది, కలవరపడుతోంది – ఇదే స సర్వాత్మనా ఆరాధన అంటే. ఇందుకు మరొక ఉదాహరణ.
శ్రీకాశీనాధుని రాజగోపాలకృష్ణమూర్తిగారు పాలకొల్లులో Auditor గా పనిచేస్తూండేవారు. వారిని అమ్మ ముద్దుగా ‘గోపి’ అని పిలిచేది. వారు అమ్మయందు అకుంఠిత భక్తి విశ్వాసాలు కలవారు.
ఒకనాటి నిశిరాత్రి. వారింట్లో దొంగలుపడి వారిని బంధించి మారణా యుధములతో బెదిరించి సంపదను అపహరించారు. ఆ సందర్భంలో వారి సంక్షుభిత మానసిక స్థితి, భయాందోళనలు, నిశ్శబ్ద ఆక్రందనలు వేరే వర్ణించనవసరం లేదు.
అదే సమయంలో జిల్లెళ్ళమూడిలో అమ్మ గాఢనిద్రలో “నాన్నా! గోపీ! భయపడకు – భయపడకు. భయపడకు” అని కలవరిస్తోంది.
ఆ ప్రమాదకర సంఘటన అనంతరం గోపి జిల్లెళ్ళమూడి వచ్చారు. “నాన్నా! ధన నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరగలేదు. డబ్బుపోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు” అన్నది. అంటే ప్రాణనష్టం కలగకుండా రక్షించిందన్నమాట.
ఒక్క మాటలో చెప్పాలంటే – అమ్మ తపన, సముద్ధరణ ఏమంటే – మార్జాల కిశోర, మర్కట కిశోర, భ్రమరకీటక న్యాయమేదో కానీ – అమ్మ తనదైన శైలిలో పరివర్తన తీసుకువచ్చి – మనల్ని తన స్థాయికి తీసుకువెళ్ళాలని. అదే సర్వాత్మనా అమ్మ ఆరాధన, ఆవేదన.
అట్టి మానవ సౌభాగ్య దేవత అమ్మ శ్రీచరణాలకు శతసహస్రాధిక వందనములు.