శ్రీ సూక్తంలో –
గన్ధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్!
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తా మిహోపహ్వయే శ్రియమ్’॥ అనే మంత్రం ఉన్నది. నేటికీ పరమేశ్వరికి చేసే ఉపచారాల్లో ఈ మంత్రాన్ని పఠించి ‘శ్రీ గంధాన్ ఈ ధారయామి’ అని గంధాన్ని సమర్పిస్తారు ఎవరైనా ఎక్కడైనా.
కాగా భక్తి ప్రపత్తులతో అమ్మ నామం చేసుకుంటూ – మంచి గంధాన్ని సానమీద తీసి, ఉండలు చేసి, ఆరబెట్టి, మాలగా కట్టి అమ్మ గళసీమలో అలంకరించిన సౌభాగ్యం సోదరి రాజ్యలక్ష్మికే దక్కినది. అంతేకాదు. గంధంతో కిరీటం తయారు చేసి అమ్మను సర్వేశ్వరిగా అర్చించింది ఆమె.
మద్రాసు సోదరులు శ్రీ పద్మనాభన్ గారి ధర్మపత్ని శ్రీమతి రాజ్యలక్ష్మి. చాలా కాలం క్రితం శ్రీ పద్మనాభన్ గారు ఆమె అనుభవాన్ని, ఒక మహత్వపూర్ణ సందర్భాన్ని నాకు తెలిపారు. ఆమె కంచికామాక్షీ అమ్మవారి పరమ భక్తురాలు.
వాత్సల్యయాత్రలో భాగంగా అమ్మ మద్రాసు వెళ్ళింది. శ్రీ పద్మనాభన్ గారు అనుదినం అమ్మ దర్శనార్థం వెళ్ళేవారు. ఆ సందర్భంగా తనతో వచ్చి అమ్మ దర్శనం చేసుకొమ్మని భార్యని బ్రతిమాలేవారు. కానీ, ఆమె, ‘నా మనస్సులో కామాక్షమ్మకి తప్ప ఎవరికీ చోటులేదు. ఆ తల్లి నా ఆరాధ్యదైవం. నేను ఇంక ఎవరికీ నమస్కరించలేను” అని వారి మాటను తిరస్కరించేది.
అమ్మ మద్రాసు పర్యటన పూర్తికావచ్చింది. చివరిసారిగా శ్రీపద్మనాభన్ గారు భార్యతో ‘నువ్వు ఎవరికీ
నమస్కరించనక్కర్లేదు. నాతో వచ్చి ఒకసారి చూడు’ అని బలవంతం చేశారు. వారి పోరు పడలేక ఆమె అమ్మ ఉన్న చోటుకి వచ్చింది.
చిత్రం గదిలోకి వెళ్ళి చూడగానే అక్కడ మంచం మీద అమ్మ లేదు. కంచి దేవ్యాలయంలో కామాక్షీ అమ్మవారు ఎలా కొలువై ఉంటుందో – అదేమూర్తి, అదే రూపం, అదే తేజస్సు, అదే అనుగ్రహంతో వచ్చి ఆ మంచం మీద కూర్చున్నది. ఆ దృశ్యం, ఆ సాక్షాత్కారం కొన్ని క్షణాలే అయినా ఆమె ఆశ్చర్యం, ఆనందం, భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరై అమ్మ శ్రీచరణాలకు ప్రణమిల్లింది. అంతే. అదే సర్వాత్మనా సమర్పణ. అదే మొదలు ఆమెకు నిరంతరం అమ్మనామస్మరణే, అమ్మచింతనే.
శ్రీమతి రాజ్యలక్ష్మి అక్కయ్య తన 85వ ఏట 23-5-2021న తుదిశ్వాస విడిచి అమ్మలో ఐక్యమైంది. శ్రీమాతృసాయుజ్య ప్రాప్తి కలిగింది.
ఆ దంపతులు ఆదరణకి, ఆప్యాయతకి చిరు నామాలు. వారు మా కుటుంబానికి ఆత్మీయులు, చిరస్మరణీయులు. సహోదరి రాజ్యలక్ష్మికిదే సాత్రు నివాళి.