1. Home
  2. Articles
  3. Viswajanani
  4. “సర్వ జీవ కోటికి అమ్మ”

“సర్వ జీవ కోటికి అమ్మ”

Indhumuki Ramakrishna Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : January
Issue Number : 6
Year : 2012

అమ్మ అనేక సందర్భాలలో నేను అందరికీ అమ్మను, మీకే కాదు పశుపక్ష్యాదులందరికీ అని ఎన్నోసార్లు చెప్పింది మనం విన్నాము.

ఈరోజు ఇక్కడ, నా చిన్న చిన్న అనుభవాలు, నేను చూసినవి, విన్నవి మీ ముందు ఉంచుతాను. ఒకరోజు మధ్యాహ్నం నేను అమ్మగదిలో అమ్మ సమక్షంలో ఉన్నాను. గదిలో ఎవరూ లేరు. ఆ ప్రశాంత వాతావరణంలో ఆ దివ్యసుందర విగ్రహాన్ని తనివి తీరా చూస్తూ కూర్చొన్నాను. ఇంతలో నా దృష్టి అమ్మ బుగ్గ పైకి పోయింది. అక్కడ ఒక చిన్న ఆకుపచ్చని పురుగు (తరచూ వాటిని మనం పూలల్లో చూస్తు ఉంటాము) అమ్మ బుగ్గ మీద పాకుతోంది. అమ్మ మాత్రం నిశ్చలంగా కూర్చొని ఉంది. నేను ఆ పురుగును తీసివేద్దామనే ఉద్దేశ్యంతో ముందుకి వంగి చేయి చాచాను. అమ్మ ఠక్కున నా చేతిని తన చేత్తో గట్టిగా పట్టుకొని “ఉండనీ నాన్నా! దాని ఆనందం ఏమిటో” అన్నది. నాకు ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. పురుగే చాలా చాలా చిన్నది; దాని కొక మనస్సు- ఆ మనస్సులో ఏముందో గ్రహించగలిగిన అమ్మ శక్తి. ఆ చిన్న జీవి మీద కూడా అమ్మకి వింత ప్రేమ. అప్పుడు మనం లలితా సహస్రనామంతో చదువుకొనే “ఆబ్రహ్మకీట జననీ” అన్నపదానికి అర్థం తెలిసింది.

ఒకసారి ఇక్కడ మన ఆవరణలోకి ఒక పెద్ద కోతి వచ్చింది. దాని సహజ స్వభావం ప్రకారం మొత్తం ఆవరణ అంతా నానా భీభత్సంగా చేసేది. ఎవరూ దానిని అదుపులోకి తేలేక అలాగే వదిలేశారు. అప్పుడప్పుడు అది అమ్మగదిలోకి కూడా వెళ్ళి అమ్మకు ఎదురుగా నిటారుగా కూర్చొని అమ్మని చూస్తూ ఉండేది. అక్కడ మాత్రం ఏ అల్లరి చేయకుండా చూస్తున్నంత సేపు చూసి (అమ్మని) అక్కడ ఉన్న ఏ పండో కాయో తీసుకొని (ఏదో అమ్మ ఇచ్చినట్లుగా) వెళ్ళిపోయేది. ఒకరోజు నేను అమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు అమ్మ “నాన్నా ఇవాళ ఆ కోతి ఇంతవరకూ కనిపించలేదు. ఎక్కడ ఉందో చూసిరా” అన్నది. అన్ని చోట్లా వెదకి ఆఖరికి దానిని అమ్మగదిపైన గోపురంలాంటి (dome eve structure) దానిపై dull గా కూర్చొని కనిపించింది. నేను వెళ్ళి ఆ సంగతి అమ్మకు చెప్పాను అమ్మ ప్రక్కనే ఉన్న కొబ్బరి చిప్పను నా చేతికిచ్చి “ఇది దానికి ఇయ్యి. అది ఏం చేస్తే అది నాకు చెప్పు’ అని అన్నది. నేను మెల్లమెల్లగా నిచ్చెన ఎక్కి భయం భయంగా ఆ చిప్పను దానికి అందించాను. అది తీసుకొని ఒక్క నిమిషం పరిశీలనగా చూసి క్రిందికి విసరి కొట్టింది. అదే విషయం వచ్చి అమ్మకు చెప్పగా అమ్మ “ప్చ, ప్చ” అని బాధపడింది. నాకు ఆశ్యర్యం వేసింది. ఎందుకింత అమ్మ వర్రీ అవుతుందా అని. వెంటనే అమ్మ నా వేపు తిరిగి “దానికి ఒంట్లో బాగా లేదు నాన్నా! కోతి ఎప్పుడయిన కొబ్బరికాయను అయిష్టంగా విసిరివేసిదంటే దానికి ఆరోగ్యం బాగాలేనట్లు లెక్క’ అని విడమరచింది. కొన్ని నిమిషాలు తరువాత అమ్మ మళ్ళీ నాతో “క్రిందకి వెళ్ళి సత్యం అన్నయ్యని పిలుచుకురా! అని అన్నది. (సత్యం అన్నయ్య అక్కడ హోమియోపతి డాక్టర్గా పనిచేసేవారు). అమ్మ అప్పుడప్పుడు హోమియో మెడిసన్ వాడటం ఉండేది. నేను పిలవగా డాక్టర్ సత్యం అన్నయ్య అమ్మగదిలోకి వచ్చారు. అమ్మ ఆయనతో ఏదో మాట్లాడింది. తరువాత ఆయన వెళ్ళిపోయారు. మరో 3 నిమిషాలు గడిచాక అమ్మ “అన్నయ్య మందు ఇస్తాడు తీసుకొనిరా” అని అన్నది – అలాగే చేశాను. అమ్మ ప్రక్కనే ఉన్న ఒక అరటి పండు వలిచి దాని మధ్యలో ఒక చిన్న కన్నం చేసి అందులో ఈ హోమియో మంధు వేసి, మళ్ళీ ఆ కన్నం మూసివేసి ఆ పండు నాకిచ్చి, ‘ఇది తీసుకెళ్ళి ఆ కోతికి ఇయ్యి నాన్నా” అని అన్నది. మళ్ళీ నిచ్చెన ఎక్కి ఆ పండుని దానికి ఇవ్వగా అది వెంటనే తీసుకొని చాలా ఆత్రంగా మొత్తం పండు తినేసింది. ఆ విషయం చెప్పాలని అమ్మ గదిలోకి అడుగుపెడుతుండగానే అమ్మ నా వైపు చూస్తూ “పండు అంతా తినేసిందా నాన్నా” అని అడిగింది అవునమ్మా అన్నాను.

అమ్మ హోమియో డాక్టర్ గారిని పిలిపిస్తే తనకేమో అనుకున్నాను కాని కోతి కోసం అనుకోలేదు. సాయంత్రానికల్లా ఆ కోతి మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో ఆవరణ అంతా నానా అల్లరి చేసింది. చూశారా ! అమ్మ మన ఆరోగ్యం గురించి చూపిన శ్రద్ధ మిగతా ప్రాణులు మీద కూడా సమానంగా చూపిస్తుంది అన్న సంగతి అర్థం అయింది కదా!

ఇప్పుడు నేను చెప్పేది నాకు మన ప్రియసోదరులు డాక్టర్ పొట్లూరి సుబ్బారావుగారు (చీరాల) ఒకసారి తన అభుభవం ఈ విధంగా చెప్పారు :

నేను అమ్మ దగ్గర తరచూ వెళ్ళి అమ్మతో ఎంతో సమయం గడిపేవాడిని. అలా ఒక రోజు అమ్మ డాబా మీద కూర్చొని ఉండగా ఒక కుక్క అక్కడకి వచ్చింది. దానిని అక్కడ ఉన్నవాళ్ళు తిడుతూ తరిమి కొట్టారు. అప్పుడు నేను ‘అమ్మతో, “అమ్మా! నాకు వచ్చే జన్మలో ఏ జన్మ కాదు) ఏ ఇచ్చినా ఫరవాలేదు కాని కుక్క జన్మ మాత్రం ఇయ్యకు అమ్మా” అన్నాను. “ఎందుకు నాన్నా” అని అమ్మ అడిగితే, చూశావు కదా అమ్మా అందరూ ఆ కుక్కని “ఛీ, ధూ” అంటూ అసహ్యించుకొంటున్నారు. తరిమి కొడుతున్నారు అని అన్నాను. దానికి అమ్మే ఏ సమాధానం చెప్పలేదు. కొంత సమయం తరువాత మళ్ళీ అదే కుక్క అమ్మ దగ్గరకు (డాబా మీద) వచ్చి అటూ ఇటూ తిరిగి అమ్మ మంచానికి ఎదురుగా కొంత దూరంలో నిటారుగా కూర్చొని కాస్సేప్పేట్లో బిగుసుకుపోయి, కళ్ళు మూసుకొని నిశ్చలంగా ఉండిపోయింది. ఏ కదలికా లేదు. నేను ఆశ్చర్యంగా చూసి దాని దగ్గరకు వెళ్ళి దాని నాడి పరిశీలనగా చూశాను. దాని శ్వాస గమనించాను.

కనురెప్పలు ఎత్తి కనుగుడ్లు రెండూ ఒక కొలిక్కి వచ్చి ఉండటం చూశాను. నాకు ఉన్న కొద్దిపాటి. ‘యోగాభ్యాసం వల్ల ఇది సమాధి స్థితికి చేరుకొందని తెలుసుకొన్నాను. వెంటనే వెళ్ళి అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి “అమ్మా, పొరపాటు అయిపోయింది. నాకు ఏ జన్మ ఇచ్చినా ఫరవాలేదు కాని నాకు ఈ స్థితిని (కుక్క వేపు చూపిస్తూ) మాత్రం అనుగ్రహించు” అని అన్నాను. అమ్మ చిరునవ్వు నవ్వింది.

దీనివల్ల మనకు తెలుస్తున్నది ఏమంటే శరీరం ఏదైనా ఆ జీవికి తన అనుగ్రహంతో ఉన్నత స్థితులు కల్పించాలంటే అమ్మకు ఏదీ అడ్డుకాదు.

మరో సంఘటన చెప్పాను కదా అమ్మ దగ్గరకు పిల్లులు, కుక్కలు యథేచ్ఛగా వచ్చేవని. అలాగే అమ్మ దగ్గరకు ఒక పిల్లి తరచూ వస్తూ ఉండేది. అది ఎక్కువ సార్లు అమ్మ మంచం క్రిందనే (అమ్మ మంచం పైన, తను మంచం క్రింద) ఉండేది. ఇలా ఉండగా ఒక రోజు వసుంధర అక్కయ్య వచ్చి ‘అమ్మా ! పిల్లి పిల్లలను పెట్టింది. కాని తమాషాగా ఆ ఎదురుగోడలో కన్నంలో పెట్టింది” అని చెప్పింది. (అమ్మగదికి ప్రక్కభాగంలో బయట ఈ గోడ ఉన్నది. అందులో కొంచెం ఎత్తులో ఈ కన్నం ఉండేది. అది సాధారణంగా పరిశీలనగా చూస్తే కాని కనపడేది

అమ్మ వెంటనే “ఈసారైనా దాని పిల్లలు దానికి దక్కాలనీ…..” అని ఆపేసింది. అంటే ఆ ఐడియా ఇచ్చింది. ‘అమ్మయే కదా! ఆ పిల్లికి రక్షణ ఇచ్చింది అమ్మయే కదా! గర్భిణీ స్త్రీల యందు, అమ్మ ఎంత ప్రత్యేక శ్రద్ధ చూపించేదో ఆ శ్రద్ధ ఈ పిల్లి మీద కూడా చూపించదన్నమాట.

అమ్మ దగ్గర ఒక ఎర్రటి కుక్క వస్తూ ఉండేది. ఎల్లప్పుడూ అమ్మతోటే ఉండటం, అమ్మతో తిరగటం ఎక్కడ అమ్మ ఉంటే అక్కడే తనూ ఉండటం చేసేది. అమ్మ చుట్టూ అందరూ చేరి మాట్లాడుతూ ఉంటే అది కూడా అక్కడే ఉండేది. అమ్మ మాట్లాడే మాటలు అన్నీ కూడా ఆ కుక్కకు దాని భాషలో వినిపిస్తాయి, అర్థం అవుతాయి. మనం అమ్మ మాటలు వింటూ అక్కడ నుంచి కదలకుండా ఎట్లా ఉంటామో అది కూడా అంతే అని అమ్మ మన రాజుబావ గారితో చెప్పిందట. (శ్రీరాజుబావగారు అమ్మ దగ్గర 1955-56 నుంచి వస్తూ అమ్మతో అత్యంత సన్నిహితం కలవారు, అనేక విశేషమయిన అనుభవాలు కలిగిన వారు)

మనకి అమ్మతో ఎట్లా ప్రేమ అనుబంధం ఉన్నాయో అన్ని జీవరాశులకు అలాగే ఉంటాయి. నాన్నగారు (అమ్మ భర్త – శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు) అమ్మ గదిలోకి వస్తున్నారని తెలియగానే మేము అప్రమత్తం అయ్యే వాళ్ళము- అలాగే అమ్మ దగ్గర ఉన్న ఒక పిల్లి, నాన్నగారు వస్తున్నారు అనే సూచన చెయ్యడం కోసం అమ్మ కాలును గీరేదట.

ఒకసారి నేను, నా ఆప్తమిత్రులు కామరాజు, ధర్మసూరి క్యాంటిన్ దగ్గర బజ్జీలు తింటున్నాము. దగ్గరలో ఒక కుక్క పడుకొని వుంటే దాని దగ్గరకు వెళ్ళి నేను ఒక బజ్జీ తినమని వేశాను. అది తినలేదు. అది చూడలేదేమో దాని మూతి దగ్గరకు ఆ బజ్జీని పెట్టి ఎంత ప్రయత్నించినా అది తినలేదు. మాలో మేము నవ్వుకుంటూ “చూడరా కుక్కలు కూడా తినని బజ్జీలు మనం తింటున్నాము” అని నవ్వుకొన్నాము. ఆ తరువాత ఒక గంటలో మేము ముగ్గురు అమ్మ గదిలోకి వెళ్ళి silent గా కూర్చొన్నాము. ఉన్నట్టుండి “ఇక్కడ కుక్కలు కూడా నియమంగా వారం. వారం రోజున ఏమీ తినవు నాన్నా” అని అన్నది. మాకు ఎంత ఆశ్చర్యం వేసిందో చెప్పలేము. పై సంఘటన మేము అమ్మకి చెప్పలేదు కదా ! అమ్మకి ఎట్లా తెలిసింది? మేము ఏమీ చెప్పకుండానే అమ్మ ఎలా వివరించింది? మరి అన్ని జీవరాశులకీ అమ్మ తల్లి కదా ! మన చేత అమ్మ ఎట్లా నియమాలు, దీక్షలు చేయించిందో మిగతా ప్రాణులతో కూడా అలాగే చేయించిందా !

శ్రీరాజుబావ చెప్పారు. ఏమిటంటే 1956-58 ప్రాంతాలలో భోజనాలు అయిపోయిన తరువాత విస్తరాకులు బయట దూరంగా పారేస్తే మరునాటి కల్లా ఎక్కడా వాటి ఆనుమాళ్ళు కూడా లేకుండా అంటే మిగిలి పారేసిన పదార్థాలు, ఆకులతో సహా ఏమీ మిగలేవి కాదట. అక్కడ ఉన్న జీవరాశులు అన్నింటికి అది ఆహారం అయి పూర్తిగా వినియోగపడతాయని అమ్మ ఒకసారి సూచనప్రాయంగా చెప్పిందట. లేకపోతే ఆకులు నాశనం కావడానికి కనీసం 2-3 రోజుయలయిన పట్టాలి కదా!

చెప్పాను కదా ! అమ్మ దగ్గరకు పిల్లులు వచ్చేవి అని. అవి ఎలుకలను చంపి, ఆ చచ్చిన ఎలుకలను అమ్మ గదిలోకి తెచ్చి, అమ్మ బీరువాలలో, అమ్మ చీరలలో, అమ్మ ప్రక్క పైన దాచి పెట్టేవి. అక్కడంతా రక్తంతో, మాసం ముక్కలతో చాలా అసహ్యంగా, దుర్వాసనలతో… భరించలేనంతగా ఉండేది. ఎన్నిసార్లు ఎన్ని విధాల ప్రయత్నించినా పిల్లులు ఈ పనిని మానలేదు. అదంతా మళ్ళీ మళ్ళీ శుభ్రం చేయలేక వసుంధర అక్కయ్య, మిగతా అక్కయ్యలు చాలా విసిగి వేశారి పోయారు. ఇక ఇలా కాదని రామకృష్ణ అన్నయ్య ఒక గోనెసంచి తెప్పించి ఆ పిల్లులను పట్టి అందులో వేసి దూరంగా తీసుకెళ్ళి వదిలేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ విషయం అమ్మకి తెలిసింది. అమ్మ వచ్చి “నాన్నా! మీరు బజారుకి వెడితే మీ పిల్లలకు ఇష్టమయినవి తెచ్చి పెడతారు కదా ! ఇది కూడా అలాంటిదే. వాటిని (పిల్లులను) ఏమీ చేయకండి” అమ్మ అని మందలించింది. 

ఇంకొకసారి అమ్మ గదిలో అందరం కూర్చొని ఉన్నాము. గదికి ఎడం వైపు పిట్టిగోడ మీద రెండు కాకులు ఉన్నాయి. ఒక కాకి దగ్గరకు వస్తే రెండోది దూరంగా జరుగుతుంది. ఒకటి ఇటు ఎగిరి కూచుంటే రెండోది అటు ఎగిరి కూచుంటుంది. అమ్మ అలవోకగా చిరునవ్వుతో మాకు వాటిని చూపిస్తూ “ఇది మగకాకి, అది ఆడకాకి – ఆడకాకి అలిగింది. దానిని ఒప్పంచాలని దీని ప్రయత్నం” అని అన్నది. 3-4 నిమిషాల మౌనంగా (si lent) ఉన్న తరువాత అమ్మ “ఆ! ఇప్పుడు సఖ్యత కుదిరింది” అని అన్నది. అన్న మరుక్షణం రెండు కాకులు కలిసి ఎగిరిపోయాయి.

1964 ప్రాంతాలలో అమ్మ దగ్గర ఒక నల్లటి కుక్క ఉండేది. ఈ కుక్క చిన్నప్పుడు జనం కొట్టిన దెబ్బలకు ప్రాణాపాయస్థితిలో అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ చిలికిన మజ్జిగ చుక్కలు త్రాగి తేరుకొన్నది. కాని నిజానికి ఆ స్థితిలో కేవలం మజ్జిగ చుక్కలు నాకినంత మాత్రాన బ్రతికే స్థితి కాదు. అయితే ఆ మజ్జిగ చుక్కలతో అమ్మ అమృతం ఇచ్చిందేమో అది బాగా అయింది. ఎప్పుడు అమ్మతోనే ఉంటూ అది అమ్మకు ఒక మంచి స్నేహితుడిలాగా ఉండేది.

ఆ కుక్కకు అనారోగ్యం చేసి చివరి దిశకు చేరుకొంది. అమ్మ ఆ కుక్క దగ్గరికి చూడాలని బయలుదేరింది. బయట వర్షం బురద, ఈ వర్షం, బురదలో నువ్వు అక్కడికి వెళ్ళడం ఎందుకులే అమ్మా ! దానినే నీ దగ్గరకే తీసుకు వస్తాము అని రామకృష్ణ అన్నయ్య అన్నాడు. ఈ విధంగా అమ్మ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఎన్నో విధాలా అమ్మను ఆపాలని ఆయన చేసిన సంపాదించిన ఆక్కు ఆఖరికి అమ్మ ఒడిలోకి చేరుకొంది ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడు అమ్మ “ఈ వర్షం, ఈ శాశ్వతంగా. బురద ఇవన్నీ నాకేం కొత్తకాదు. వీటికి అలవాటు పడ్డదాన్నే పాపం పిచ్చిది దానికి నేనంటే ఎంత ప్రేమో! దానికి ఓపిక ఉన్నన్నాళ్ళూ నా కోసం వచ్చేది. ఇవాళ దాని కోసం నేను వెడతాను. మీరు దాన్ని ఇక్కడకు తీసుకొచ్చేది నా కోసం కాని దాని కోసం కాదు కదా నాన్నా! నాకేం ఫర్వాలేదు. నేను వెళ్ళాల్సిందే” అంటూ అమ్మ బయలుదేరింది.

 పాలల్లో తులసీదళాలు వేసి దాని ప్రక్కన కూర్చొని దానికి కొంత త్రాగించింది. దాని మీద చెయ్యి వేసి, ఆప్యాయంగా ఒళ్ళంతా నిమిరింది. కుక్క మూతి కడిగి శరరీమంతా నీళ్ళు చల్లి, తోకభాగం తుడిచింది. చెవి దగ్గర అయిన గాయాన్ని చూసి తుడిచింది. చెవి దగ్గర అయిన గాయాన్ని చూసి చెవి కడిగింది. ఆ కుక్క పరవశించి దీనంగా తన ఆప్తమిత్రుడు ఇష్టదైవం, అయిన అమ్మ వైపు చూడలేక చూడలేక చూసింది. ఆ అమృత స్పర్శకు అది పులకించిపోయింది.

అమ్మ ఆ కుక్క గురించి చెబుతూ “మనిషి మనిషిని ఎంత దూరం ప్రేమించవచ్చో అంత దూరం అది ప్రేమించ గలదు” అని అన్నది.

అమ్మ స్వర్ణోత్సవం సందర్భంగా ఆహారపదార్థాలన్నీ ‘మీరే కాదు – అవి కూడా నా బిడ్డలే’ అంటూ పొలాల్లో, కాలువల్లో, నదులలో ఉన్న సకల జీవరాశులకు వేయించడం మనం చూశాం.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో, పై సంఘటనల వల్ల అమ్మ సర్వజీవకోటికీ తల్లి, వాటి మీద అమ్మకు గల ప్రత్యేక శ్రద్ధ, ప్రేమతత్వం మనందరికీ అర్థం అవుతోంది. మనం కూడా అన్ని ప్రాణులలో అమ్మని చూడటానికి ప్రయత్నించాలి. కాబట్టి పిల్లలూ ! ఈసారి ఎక్కడయినా కుక్కగాని, పిల్లిగాని కనబడితే వెంటబడి, కొట్టే ప్రయత్నం చెయ్యకండి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!