చరాచర సృష్టీ ఏ ఒడిలో సేద తీరుతుందో ఆ ఒడే మన అమ్మ ఒడి. ఇంతవరకూ చరిత్రలో ఎంతోమంది మాతృమూర్తులు తపస్సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ విశ్వప్రేమని ఇంత అనుభవపూర్వకంగా నిరూపించిన వారు ఉన్నారా!. అని అనిపిస్తుంది నాకు.
భగవాన్ రమణ మహర్షి జ్ఞాన మూర్తి. వారిని స్కందుని అవతారంగా గుర్తించారు గణపతి ముని. తన జీవితాంతమూ మహర్షి గొప్పదనాన్ని చెబుతూ వచ్చారు. అలాంటి రమణులు అమ్మను చూడగానే “ మాతృశ్రీ” అని పిలిచారని, అమ్మ ఎక్కడైతే అప్పుడు కూర్చున్నారో అక్కడే మహర్షి మాతృమూర్తి అలఘమ్మ సమాధి నిర్మాణం అయిందని అమ్మ చరిత్ర చెబుతోంది. ఈ సత్యం మనలో ఎంతమందికి గుర్తు ఉంది!.
ఈ సృష్టిలో అలాంటి సన్యాసిని, పూర్ణ మహనీయుడిని మరి ఒకరితో పోల్చలేం! వారు శ్రీ శ్రీ శ్రీ కంచి పరమాచార్య స్వామి వారు. అలాంటి మహనీయుడు, వేళ కాని వేళ అయినా బయటకు వచ్చి చంకలో తమ దండాన్ని ఉంచుకుని, రెండు చేతులూ జోడించి చాలాసేపు అమ్మకు నమస్కరిస్తూ ఉండి పోయిన సంఘటన మనలో ఎంతమందికి గుర్తు ఉంది!. ” వాడికి కాళ్ళు లాగుతాయని వచ్చేసాను నాన్నా” అని అమ్మ స్వయంగా నాతో చెప్పారు.
ఆజన్మ సిద్ధులై లోకోపకారం కోసం జీవించిన శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారు “అమ్మ రాజరాజేశ్వరీ అవతారము. సాక్షాత్తూ ఆదిపరాశక్తే” అని చెప్పటం మనలో ఎంతమందికి గుర్తు ఉంది!.
నడయాడే శివుడే!. ఆ జటాజూటం ఏమిటి! ఆ దివ్య తేజన్సు ఏమిటి! పూర్ణ సుందరుడు పూర్ణానందుడు. వారు అమ్మను దర్శించుకుని తన అనుభూతిని ఇలా చెప్పారు. “ఎలాగైతేనేం మా అమ్మ దగ్గరకి వచ్చాను. అమ్మ పూర్ణ మానవి. భువనేశ్వరే!. ఏ శక్తి ఈ సృష్టిగా మారిందో ఆ శక్తి యొక్క ఆవిర్భావమే మన “అమ్మ” అని చెప్పటం మనలో ఎంతమందికి గుర్తు ఉంది!.
రెడ్డిపాలెం కాంతయ్య యోగి, లోకం చేత అసహ్యించుకోబడి, జ్ఞానుల చేత ప్రేమించ బడ్డ శ్రీ గుడిపాటి వెంకటచలం గారు, గొప్ప గురు సంప్రదాయం లోని శ్రీ శివానంద మూర్తి గారు, లక్ష్మణ యతీంద్రులు….. ఇంకా ఎందరో మహానుభావులు అమ్మలోని సర్వజ్ఞత్వాన్నీ, సర్వవ్యాపకత్వాన్నీ, సర్వేశ్వరత్వాన్నీ దర్శించారు. అనుభూతి పొందారు.
మన మనస్సులలో వచ్చే మార్పే నిజమైన మహిమ. అమ్మ ఈనాటికీ, ఏనాటికీ అర్కపురిలో ఉంటుంది. అమ్మ దర్శనం వృధా కాదు. మనలో నెమ్మదిగా మార్పు తీసుకువస్తుంది. జిల్లెళ్లమూడిలో సహస్ర దీపాలంకరణ జరుగుతున్న శుభవేళ. అసంఖ్యాకంగా ఎన్నో ఇళ్లల్లో, అమ్మ జన్మప్రభృతి “జ్ఞాన దీపాలు” వెలిగిస్తూనే ఉంది. దానికి సంకేతమే ఈ రోజు మనం జరుపుకుంటున్న దీపాల పండుగ.