అవి మానసికంగా చాలా అశాంతి అనుభవిస్తున్న రోజులు. బంధువులు, స్నేహితులు… ఎవ్వరూ పలకరించే
పరిస్థితి లేదు. ఒక్క మహనీయులే దిక్కు!. ఎవరి ద్వారానో “కులపతి” గారి గురించి తెలిసింది. వారిని గురించి అంతకు ముందు చాలా కాలం వెనుక అమ్మ సన్నిధిలో తెలుసుకున్నాను. మాతృశ్రీ పత్రికలో వారి గురించి ఉండేది. ఆ సమయంలో వారు ఫారిన్ లో ఉన్నారు. వారి రాక కోసం బాగా ఎదురుచూసాను. వారు ఇండియాకి వచ్చిన కొద్ది రోజుల్లోనే గుంటూరు కాళీపీఠంలో ఉన్నారని తెలిసి వెళ్ళాను. అక్కడి నా స్నేహితులు ఒకాయన, మన “ఆంజనేయ ప్రసాద్” గారి ఇంటికి ముందుగా తీసుకు వెళ్లారు. వారు సహృదయతతో స్పందించారు. ఆ రోజే శ్రీ సిద్దేశ్వరానందభారతీస్వామి వారితో మాట్లాడిస్తానన్నారు. అలాగే జరిగింది. స్వామి వారితో మాట్లాడుతూ, నేనూ, నా శ్రీమతీ జిల్లెళ్లమూడి గురించి మాట్లాడబోతూ ఉండగా స్వామి వారు వెంటనే ఇలా అన్నారు. ఈ రోజు ‘సాక్షాత్తూ అమ్మే’ మిమ్మల్ని నా దగ్గరకు పంపింది. ఆంజనేయ ప్రసాద్ తీసుకు వచ్చాడంటే ‘అమ్మే తీసుకువచ్చిందని’ అర్ధం.” అని అంటూ చాలాసేపు మాట్లాడారు. ఆ పవిత్ర ఘడియల దగ్గరనుంచీ ఇప్పటివరకూ, స్వామి వారి ఆశీస్సులు అందుతూనే ఉన్నాయి. సహస్రచంద్ర దర్శనం మానవ జీవితంలో ఒక గొప్ప మైలు రాయి. ఈ శుభ సందర్భాన మన ఆంజనేయప్రసాద్ అన్నయ్య గారు, నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తున్నాను.Fraa