- గురుని ఖండించి మరుగును గురువు చేసె
అసలునే శక్తియనియమ్మ నొక్కి చెప్పే
భ్రాంతి లేనట్టి బ్రహ్మము పట్టు చెప్పె
సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ,
- గుణములో భేదమేమాత్ర మెంచలేదు
కులమతంబుల భేదము చూడలేదు.
మనసు నెరుగుచు బోధను మరచిపోయె
సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ
- కష్టసుఖములు కరుణని బాగచెప్పె
తప్పులెంచని తల్లిగా తల్లడిల్లె
ప్రేమపంచుచు పోషించె నందరిల్లు
సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ
- తెరలలోపల తననుతా దాచుకొనెను
మరుగుపరచుట తనదైన విధము అనియె
వర్గములులేని స్వర్గముకోరుకొనెను
సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ
- ధ్యాసనే ధ్యానమంచును ఆచరించే
నేను అమ్మను అని తాను నిర్ణయించే
మొదటి స్పందన అసలని చెప్పెనామె
సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ
- వేదశాస్త్రాల నెప్పుడు నేర్వలేదు
తనను గురువుగ నెప్పుడు చెప్పలేదు
మాట మననాన మంత్రమౌనంచు చెప్పే
సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ
- సుగతి కోరెను జగతిలో జీవులకును
శక్తినే దైవమని తాను నమ్మ బలికె
చావు పుట్టుక మార్పని చక్కబలికె
సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ
- నేను నేనైన నేనని నిశ్చయించె
కాలమే గొప్పయౌనంచు వెలయజెప్పె
తాడుపాములు భ్రాంతి కల్గించు ననియె
సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ
- జీవితంబను జలధిని వెలయులక్ష్మి
సహన సుందర శాంతి సుధారసంబు
సత్యసౌందర్య విజ్ఞాన రూపమౌను
సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ