అమ్మ ఆధ్యాత్మిక సాధనలో అనేక సందేహాలున్న సాధకులకు, భయాలూ, ఆందోళనలూ తగ్గించే విధంగా అన్నిటికీ నాదీ భాద్యత అని అభయమిచ్చి, వారికి సరైన సమాధానాలు చెప్పింది. ఆమె భగవంతుని గూర్చి ఆయన సర్వశక్తిత్వాన్ని గూర్చి చెప్పే విషయాలు, మామూలుగా పుస్తకాలు చదివి చెప్పే పండిత వాక్యాలులాగ చిలక పలుకుల్లాగ వుండవు. ఆమె వాక్యాలు విశ్వాంతరాళాలలో లీనమైన ఆమె హృదయాంతరాళంలోంచి ఒక విచిత్రమైన మనస్థితి నుంచి మాట్లాడిన నగ్న సత్యాలు. ఆ పలుకులు అనుభవజ్ఞానమనే అమృతంలోంచి ముంచి తీసిన రసగుళికలు. అందుకని ఆమె పలుకులను నా సొంత భాషతో కలుషితం చేయటం ఇష్టంలేక యధాతథంగా “అమ్మ వాక్యాలు” అన్న గ్రంధం నుంచి “శ్రీవారి చరణ సన్నిధి” అని వసుంధర రాసిన డైరీ నుంచి చెదరు మదురుగా పడియున్న ముత్యాలను ఏరికూర్చి ఒక మాలగా ఈ వ్యాసరూపంలో అమ్మకు సమర్పిస్తున్నాను.
జగన్మాత అంటే జగత్తుకు తల్లి కాదు! జగత్తేతల్లి” అని అన్నది. ఈ జగత్తే గురువై మానవునకు సర్వజ్ఞానమును ప్రసాదిస్తుంది. ఈ ప్రకృతిలోంచే ఎన్నో అద్భుత జీవన సత్యాలను అమ్మ ఎత్తి చూపింది. ఒక్కోసారి అమ్మ చెప్పేవి సాంప్రదాయాలను, కొన్ని మూఢ నమ్మకాలను కూడా ఖండిస్తూ వుండి నిజం నిప్పులాంటిదని నిరూపిస్తుంది. అమ్మ చెప్పే ప్రతిమాటా ఆ నిప్పులాంటి నిజం మీదే ఆధారపడి వుంటుంది. కాబట్టి ఆమె వాక్కుకు తిరుగులేదు.
ఒకసారి అమ్మ తన బాల్యంలో పూలూ, తులసీదళాలు గుళ్ళోకి తీసుకొని వెళ్ళి వాటిని క్రింద పెట్టింది. అప్పుడు అక్కడున్న పూజారి “అయ్యో! అయ్యో!” అని అరచి అమ్మ వారి పూజకు తెచ్చిన పూలు క్రింద పెడతావేం అపచారం. కాదూ” అని అరిచాడు. దానికి అమ్మ “క్రిందనే కదా చెట్టు మొలిచింది! క్రింద మొలిచిన చెట్టు పూలు క్రింద పెట్టడం తప్పా? అమ్మవారికి పూజ చేసే కుంకుమ, పసుపు, గంధం, పాత్రలు, పళ్ళేలూ, నివేదనలూ, అన్ని భూమిలోంచే పుట్టాయిగా తన తల్లి శరీరములాగే ఇవన్నీ భూమిలోనే కలుస్తాయి. ఈ భూమినే దైవంగా ఎందుకు పూజించకూడదూ?” అని ప్రశ్నించింది. ఆ పసిపిల్ల మహాజ్ఞానానికి నివ్వెరపోవటం పూజారివంతైంది. ఇల్లాంటి సంఘటనలన్నిటిలో అమ్మధోరణీ, మాటలు ఒక నూతన చైతన్యంతో ఒక విధమైన సత్యాన్వేషణ స్ఫూర్తితో అర్ధంలేని మూడనమ్మకాలపై తిరుగుబాటుతో, సంపూర్ణ మానవత్వంతో మనకు గోచరిస్తాయి. అయితే బ్రహ్మత్వ సిద్ధి కోసం మనం చేయవలసిందేమిటి? పుస్తకాలు చదవటమూకాదు. ‘సాహిత్యంతో రాహిత్యం కాద’ని అమ్మ నిక్కచ్చిగా చెప్పింది. ‘పోతనగారు భాగవతంలో చెప్పినట్లు “సర్వము తానైన వాడెవ్వడు? వానినాత్మ భవునీశ్వరునే శరణంబు వేడెదన్” అన్న అర్థాన్నే స్ఫురిస్తూ చాలాసార్లు మాట్లాడింది. “ఏ శక్తి నీకు చేయవలసిన దేమిటి? అన్న ప్రశ్న కలిగించిందో అదే తరుణం వచ్చినప్పుడు నీచేత చేయవలసిన దానిని చేయిస్తుంది. అంత వరకూ ఊరికే కూర్చోనా అంటావా? నీవు ఊరికినే కూర్చోలేవు. అన్ని క్రియలూ ఆయనవే. నీదంటూ ఏదీ లేదు. తనకు కావాల్సిన విధంగా కావలసి వచ్చినప్పుడు ఆయనే చేయించుకుంటాడు. ఆయన ‘అనుకోనిదీ’ చేయించనదీ ”నీవు ఏమీ చేయలేవు. కనుక తోపించే వాడు ఆయనే కనుక నీకు తోచినది చెయ్యి అని అంటున్నది. ‘సాధన అనేది వాస్తవానికి లేదు. నీకేది సాధ్యమైనదో అదే సాధన. ఇతరులు చెప్పినదీ కాదు. నీవు చేద్దామనుకున్నదీ కాదు. నీకు తట్టే ఆలోచనలు సంకల్పాలు నీవి కావు. అన్ని సంకల్పాలూ ఎవరివో నీ వీ ఆయనవే? నావి అని ఎంత కాలము అనుకుంటావో అంతకాలమూ నీకు సంకల్పబంధం వుంటుంది. అంటే సంసారబంధం సుఖ దుఃఖాలూ పడుతూనే వుంటావు. నీకు తట్టే సంకల్పాలు నీవి కాదనుకోవటమే సంకల్ప రాహిత్యం. ఇలా అనుకోవటం కూడా నీ చేతుల్లో లేదు. ఆయనకి అనిపిస్తేనే అనుకుంటావు” అంటుంది అమ్మ. అయితే ‘ఏం చెయ్యాలి?’ అని మళ్ళీ ప్రశ్న. “అన్నీ ఏర్పాటు చేసిన ఆయన నీకోసం కల్పించిన సుఃఖ దుఃఖాలూ, సముద్ర కెరటాలలాంటివి. వాటి మీద హాయిగా పైకీ క్రిందికీ ఊగుతూ, తూగుతూ, ఈదులాడుతూ ఆనందించు. (అనువాక్యాలు పేజీ 9) “కర్మలు మనమంతా చేస్తాము. మనమే చేస్తున్నామనుకుంటే బంధము, భారమైన పనిగా తోస్తుంది) ప్రేరణే చేయిస్తున్నదనుకుంటే ఆ కర్మ, బంధరాహిత్యం అవుతుంది.” అని ఎంతో స్పష్టంగా సులభంగా కర్మసూత్రాన్ని అలవోకగా తెలిపింది అమ్మ. ఈ కర్మ సూత్రాన్ని అనుసరించే అమ్మ “అందరిల్లు” నడుపుతున్నది. ఆమే నడిపిస్తున్నానన్న భావం ఆమెకు లేదు అమ్మ అందరిల్లు గురించి ఇలా అన్నది.
“ఇది ఆస్తిగల సంస్థ కాదు, దీనికి చందాలు ఇవ్వమని ఎవ్వరినీ యాచించింది లేదు. ఎట్లా వస్తున్నదో ఎట్లా నడుస్తున్నదో మనకనవసరం. ఇది ‘అందరిల్లు’. ఎవరి ఓపికకు తగ్గ పని వారికుంటుంది. ఊరికే ఎవరూ కూర్చోరు. ఉండడానికి ఆశ్రయమిచ్చేది ఆశ్రయమే అయినా ఇది ఆశ్రమం కాదు; “ఇల్లు”. అనేక రకముల మనస్తత్వాలూ, ప్రవృత్తులూ కల వ్యక్తులందరూ కలసివున్న . అందరితో సర్దుకుపోవటమనేది, అందరిలో లోపాలు చూడక మంచినే చూడటం అనేది అంత తేలికైన విషయం కాదు.” “భిన్నత్వం లేని మనస్తత్వం ఎక్కడవున్నదో అదియే దైవత్వం” ఏదైనా నేను చేస్తునాననేది మానవత్వం, ఈ సందర్భానికి ఆధారం ఏదో శక్తి వున్నదనీ, దానికేమైనా పేరు పెట్టండి, మనం దేనికీ కర్తలం కాదు అనుకుంటే భక్తి అవుతుంది. జ్ఞానం అవుతుంది- “అని అన్నది. ఎవరో “సంకల్పం లేకుండా ఎట్లావుంటుందో చెప్పమ్మా” అని అడిగారు. “ఈ సృష్టి సంకల్పరహితం ఎట్లా అవుతుంది? సృష్టి కర్తే సంకల్పరహితుడు కాలేడు. మన సంకల్పం ఎట్లా పోతుంది? ఈ సంకల్పం మనది కాదనుకోవడమే సంకల్ప రాహిత్యం (శ్రీవారి చరణ సన్నిధి; పేజి 340) – “మానవులు చంచల స్వభావులు కదమ్మా!; అని ఒకరంటే” జగన్మాత ఈ జగత్తుకు తల్లి కాదు ఈ జగత్తే తల్లి : అమ్మే అన్నీ అనుకున్నప్పుడు ఇందులో సమస్య ఏముంది? చంచల స్వరూపంగా ఉన్న అమ్మ ఎప్పుడో అచంచలంగా చేసుకుంటుంది నా నామాలలో కూడా ఈ విషయం ఉన్నదిగా! “చపలాయైనమః చంచలాయైనమః అని చపలత్వానికి కూడా తానే కారణమని, అది పోగొట్టే బాధ్యత కూడా తనదేననీ చెప్పింది. అమ్మ జ్ఞాని గురించి సామాన్యుడి గురించి గల తేడాలు ఇట్లా వివరించింది. విశ్వవ్యాప్తమయిన శక్తి తానేనని ముందుగానే తెలుస్తుంది. జ్ఞానికి. చివరలోనైనా తెలుస్తుంది సామాన్యుడికి. జ్ఞాని అన్నింటికీ సిద్ధపడే వుంటాడు. సామాన్యుడు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాడు. తనను గురించిన ఆందోళన ఉండదు జ్ఞానికి-సామాన్యుడికి నిరంతరం తనను గురించిన ఆందోళనే? ‘శ్రీవారి చరణ సన్నిధి’: పేజీ 430) ఏ ఒకటి తెలిస్తే అన్ని తెలుస్తాయో ఆ ఒక్కటీ తెలియనంతవరకూ ఇవన్నీ అనవసరం. శాస్త్రం అనుభవాన్ని ఇవ్వదు. అనుభవం శాస్త్రాన్ని ఇస్తుంది. ఇల్లాంటి నగ్న సత్యాలే అమ్మ నోటి నుంచి నిత్యం వెలువడుతూ వుండేవి. ఈ చదువులన్నీ పొట్టకూటి కోసంకాని ఆత్మజ్ఞానం కోసం కాదు. ఈ జ్ఞానాన్ని పొందటానికి జీవితం చాలదు. అమ్మ జనక మహారాజు గురించి చెబుతూ “జన్మనిచ్చిన వాడు జనక మహారాజు సీత అంటే ప్రకృతి. ఆమెకు జన్మనిచ్చాడు. గృహస్థుగా వుండి అన్నీ చేసి ఏమీ అంటకుండా ఉన్నవాడు. మోక్షాన్వేషణలో చెప్పుకోతగ్గ వారిలో ఆయన ఒకరు. నీటిలో పటికబెల్లం వేసుకున్నా తీపి అంటని స్థితి సంసారంలో ఉండి జయించటం (శ్రీవారి చరణ సన్నిధి, పేజి 308). సర్వాకాల సర్వావస్థల యందు ఒడిదుడుకులు లేకుండా ఉండేదే ఆనందం. ఇది కావాలి అని లేకపోవటమే ఆనందం. ఆనందం గూర్చి అమ్మ ఇలా వివరించింది (అమ్మవాక్యాలు).
ఒక సోదరుడు “నా ఆస్తి అంతా మీకు అంకితం చేస్తున్నాను. నాకు ఇక్కడకు వచ్చి ఉండాలని వుంది” అని సంతమాగులూరు నుంచి వచ్చిన వ్యక్తి అడిగాడు. దానికి అమ్మ సమాధానం “ఆస్తి కాదుగా నాయనా అంకితం, మీరు కావాలి ఆ మీరు ఎప్పుడో అంకితం అయివున్నారు. నేను నిన్ను తీసుకోవాలి కాని నీవు నీ అంతట అంకితం కావటంకాదు. అది ఎప్పుడో అయ్యింది. నువ్వు ఇక్కడ వుండటానికి ఏ అభ్యంతరమూ లేదు. నీ ఇల్లు నువ్వు కట్టుకుని నీ గంజి నీవు కాచుకుని తాగచ్చు. నా అభ్యంతరం ఏమీ లేదు. కాని ఇక్కడ ఉండటం అనేది చాలా కష్టం నాన్నా! ఇక్కడ అన్నిరకాల ప్రవృత్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్య వుండటం చాలా కష్టం కదూ. అక్కడ వేరుగా నీవున్నప్పుడు ఏవి కష్టాన్ని కలిగించిందో, ఆ కష్టం ఇక్కడా వున్నది నీ తత్వం బాధ పడేది అయినప్పుడు ప్రదేశం మారినంత మాత్రాన నీకా బాధ ఉండకుండా పోతుందా? అయితే ఇక్కడ ఒక్కటే తృప్తి. ఇక్కడ అమ్మ కనిపిస్తుంది. బయట ప్రపంచంలో ఎన్ని బాధలున్నాయో అన్నీ ఇక్కడా వున్నాయి. నీ అన్న నీవు తింటూ నీవు దూరంగా వున్నా అవి నీకు తప్పవు. అది తట్టుకునే ఓర్పు వుంటే సరే. అన్నీ ఆలోచించుకునిరా” బురదలో తామర పువ్వులా అమ్మ అనేక ప్రాపంచిక బాదరబందరీల మధ్య, తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరిస్తూ అందరికీ ప్రేమనీ పరమార్థాన్నీ పంచి పెడుతున్నది. ఒకసారి శ్రీపాదవారు “అమ్మా! మీ మాటలు వింటూంటే వేదాల్లోంచి మహావాక్యాలు చేతికిస్తున్నట్లు వుంటుంది. నావంటి అజ్ఞానికే ఇట్లావుంటే, జ్ఞానులైన వారు ఈ మాటల్లో ఎంత సారాన్ని తీసుకుంటారో! కష్టాన్ని కష్టంగా గుర్తించని తల్లివి. అందుకే అమ్మని ‘బాధల భగవంతుడ’ని ఆయన సంబోధించారు ఆయన అమ్మతో “మీది బాధల్లోని ఆనందాన్ని చూసి ఆనందపడే స్థితి కావచ్చు. ఆ స్థితి మాకు వద్దు. మిమ్మల్ని చూసి ఆనందించే స్థితి మాకు కావాలి” అని అన్నారు (‘శ్రీవారి చరణ సన్నిధి’;
పేజి 157) శాస్త్రాలలో అమ్మ చెప్పింది ఉండదు, కానీ, అమ్మ చెప్పింది శాస్త్రమే అని అన్నారు శ్రీపాదవారు. మనిషికీ దేవుడికీ ఉన్న సంబంధాన్ని చిన్న మాటలలో వివరిస్తూ “దేవుడికి మనతో టచ్ వుంది. కానీ మనకే దేవుడితో టచ్ లేదు. పక్షులలో గరుత్మంతుడినీ, పాముల్లో సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని నేనే అని చెప్పుకోవటంలో భగవంతుని ఉద్దేశం అన్నింటిలో నేనున్నానని చెప్పుకోవటం కోసమే. సాటి మానవుడినే సమానంగా చూడలేని మనం ఒక దుష్ట జంతువుని చూడగలమా? అందుకే అందులో సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని చూడమన్నారు. అన్ని సర్వత్రా వాడున్నాడని తెలుసుకోవటం కోసం ఇవన్నీ (అమ్మవాక్యాలు; 264)
“తెలిసే సమయం ఎప్పుడు వస్తుందమ్మా” అని అడిగారు. “దానికి తెలిసి వచ్చేదీ కాదు. వస్తే తెలిసేదీ కాదు” అని అన్నది. అనగా తరుణం వచ్చేది తెలియదు. అది వచ్చినా తెలియదు అన్న గూఢార్థంతో అన్నది. ఇవన్నీ లోతైన ఆధ్యాత్మికానుభవంలోంచి వచ్చిన మాటలు కానీ శాస్త్రాలు చదివి చెప్పినవి కావు. “ఏది జరిగినా, ఎవరు ఏది చేసినా మనం కాదు చేసేది. మనలను నడిపించే శక్తి మరొకటి వుందనుకోవడమే” అని అన్నది. “దేనికీ మనం కర్తలము కాదు” అందుకు ఒకరు “మరి అనుభవానికి కర్తలమై అనుభవిస్తున్న బాధ ఎప్పుడు తీరుతుందమ్మా!” అని అడిగితే “మనం కర్తలము కామని మాటలతో కాకుండా మనసా అనుభవం కలిగితే హాయిగా వుంటుంది” అని అన్నది.
ఒక అన్నయ్య “పరమాత్మను తెలుసుకోవటానికి ఏం చెయ్యాలి?” అని అడిగాడు. “ఏమీ చెయ్యనక్కరలేదు. వాడంతట వాడే తెలుస్తాడు” అని అన్నది.“ మన ప్రయత్నం ఏమీ లేదా?” అని ఎదురు ప్రశ్న వేశాడు. “ఉంటే చెయ్యండి” అని అన్నది. “నాకు తెలియదునాన్నా! ఆ సమయం వస్తే వాడంతట వాడే తెలియబడుతాడు అని అనుకుంటున్నా.” “అనుకున్నది జరగదు తనకున్నది. తప్పదు” అన్న అమ్మ స్పూర్తి అందరి జీవితాల్లో నిత్యం అనుభవమవుతూనే వుంది.
“ఒక నిముషం పెరగకుండా ఒక నిముషం తక్కువకాకుండా రోజూ 5గం||లకు టీ తాగండి చూద్దాం. ఏ ఊరు వెళ్ళినా సరే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నియమం తప్పకుండా సరిగ్గా 5 గం॥ టీ త్రాగండి. నేను కొత్తసాధన ఏమీ చెప్పటంలా! రోజూ మీరు చేసే పనే!” అమ్మా! చెయ్యటం కష్టమమ్మా! నిదుర మెలుకువరాక పోవచ్చు. ఒంట్లో కులాసా లేక పోవచ్చు.” అని అంటే అమ్మ “నువ్వు చెయ్యగల్గింది సదా చెయ్యటమే ఆధ్యాత్మిక సాధన. సాధనలన్నింటికి చరమదశ తృప్తే నాన్నా!” అని అంది. ఒక సోదరుడు అమ్మతో “మనశ్శాంతి లేదమ్మా! ఆధ్యాత్మికంగా ఏమయినా చేద్దామని వుంది”.
“ఎంత ప్రయత్నించినా మనసుకుదరటంలేదు. దానికి నా పూజాలోపం అని అనుకుంటున్నాను.” అని విన్నవించుకున్నాడు. పూజంటే కేవలం పూలతో చెయ్యటంకాదు నాన్నా! ఎన్ని బాధలు వచ్చినా వాడిని మరవకుండా ఉండటమే పూజ. పూజ వాడు చేయించుకునేదే కాని నీవు చేసేది ఏం లేదునాన్న! నువ్వేం బాధపడకు. వాడికి నీతో కావలసింది వాడే చేయించుకుంటాడు అని అన్నది (‘శ్రీవారి చరణ సన్నిధి’ పేజీ 109).
“శ్రీ కృష్ణుడు భగవద్గీతలో సాధన గురించి చెప్పాడు. చెప్పింది దైవమే. వింటున్న సాధకుడు కూడా దైవమే. చెప్పించుకుని వినేవాడు లేకపోతే ఎవరికి చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుని గొప్పతనం అందరకీ ఎలా తెలుస్తుంది? అర్జునుడు శ్రీకృష్ణునికి అవసరమైనవాడంటున్నా అన్నది అమ్మ. ఇలా గీతాబోధ గురించి చెప్పినవారు ఎవరూ ఉండరేమో! అమ్మ భగవంతుడే కనుక ధైర్యంగా ఈ మాట చెప్పింది.
‘ ప్రహ్లాదుడు, ధృవుడు చరిత్రలు వింటాంగానీ మన పిల్లవాడు ధృవుడైతే భరించలేం!”
చివరకు అమ్మ ఇచ్చే సందేశం? సాధ్యం అయినదే సాధన అని, మన నిత్యకృత్యాలలో రోజూ ఒకే టైముకి ముఖం కడుక్కుని ఒకే టైములో కాఫీ తాగగలుగుతున్నామా? ఈ చిన్న విషయాన్ని పాటించలేని మనం సాధన గురించి చర్చించటం దేనికి? సాధన మన చేతుల్లో లేదు. ఏ శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నదో ఆ శక్తి మన చేత సాధన చేయించి తరుణం వచ్చినపుడు గమ్యం చేర్చి మనిషికి కావలసిన తెలివిని ఇస్తుంది. దీన్ని నమ్ముకుని ఏ సాధననైనా తనకు సాధ్యమైనది చేయమని, బాధ్యత తనదని హామీ ఇస్తున్నది అమ్మ. ఇంక మనమంతా అమ్మమీద అన్ని భారాలు మోపి నిశ్చింతగా హాయిగా వుందాం!
‘రాజుపాలెపు’ డైరీల నుండి (అవతార సమయములు)
(కీ.శే. రాజుపాలెపు రామచంద్రరావుగారు తొలిరోజుల్లో అమ్మను దర్శించుకొని దివ్యాను భూతులు పొందిన ప్రముఖులలో ఒకరు. వారు జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనార్థమై వచ్చిన ప్రతిసారి అమ్మ వాక్కులను అక్షరం పోకుండా ఎంతో భక్తితో శ్రద్ధతో వ్రాసుకుని తిరిగి వారి ఇంటికి వెళ్లిన తరువాత డైరీ రూపంలో ఈ వాక్కులను తమ అవగాహనననుసరించి వ్యాసంగా వ్రాసుకునేవారు. అట్లాంటి వానిలో లభ్యమైన వాటిని కొన్ని వారి కుమారుడు రాజుపాలెపు శేషగిరిరావుగారు అందించగా సమయానుసారము వాటిని ప్రచురిస్తున్నాము -ఎడిటర్)
(గత సంచిక తరువాయి)
కాని అమ్మ ఇచటికి పిల్లవాని నెత్తుకొని వచ్చిన వెంటనే, పిల్లవానికి దొడ్లో స్నానము చేయించు సమయముననే నాన్నగారి స్థలమునకు బయానా రశీదులు వ్రాసుకొనిరట. కొలది దినములు ఖగ్గా రామయ్య గారింటి యందు’ తరువాత ప్రస్తుతము గాంధి విగ్రహము వెనుక రాఘవులు గారి ఇంటి వెనుక, పాకయేర్పరచుకొని స్థిరనివాస మేర్పరచుకొను ఇచ్చ జనించుట గమనింపదగినది. ఇట్టి నిర్ణయమునకు సహితము ‘పూర్వాపరములు కలవు. తమ భూవసతి పోవుట, రేటూరులో స్థలము లేకుండుట మొదలైనవి:
వీరిచట నుండగా ఒకనాడు ‘ఇనుప చిరుతల’ నొసట కొట్టి కొనుచు ముఖము రక్తమయమైనను, గమనింపని, ఒకానొక సాధువు వచ్చెనట. వారికి ‘బొమ్మ’ గారు భోజనమిడి, నూతన వస్త్రము లిచ్చిన పిదప అప్పటికి వారుండు స్థలము వారికి మంచిది కాదనియు, అప్పటికీ స్వంతముగా కొనిన స్థలములో “అనగా ప్రస్తుతము కరణముగారి స్వంత ఇల్లుగల స్థలములో స్థిరనివాస మేర్పరచుకొన మనియు, వృద్ధియగుననియు చెప్పివెళ్లిరట. అట్లే తాము ప్రస్తుతమున్న స్థలములో మెరకలు తోలించి నివాస మేర్పరచుకొనిరట. ఇప్పటి వరకు వీరి పూర్వు లెవ్వారుగాని యిచట స్థిర నివాస మేర్పరచుకొని యుండలేదు. (ఈ సాధువే 49లో లోకనాధం గార్కి పెళ్ళి జరిపించుకొని పెండ్లి వద్ద నుండగా అమ్మను ‘సమయ మాసన్నమైనది బహిర్గతమగుము’ అనిరట) (ఆ వెంటనే రాజమ్మగారి వద్దకు వెళ్లుట, క్రమతః బహిర్గతమగుట)
ఇట్లే తదుపరి గ్రామములోని పార్టీల దృష్ట్యా క్రొత్తపాత సందున పలువురు బీదలు అన్నమునకై బాధపడుట గమనించి, అమ్మ ‘సోషల్సర్వీస్’ మాదిరిగా, ప్రతివారి నుండి గుప్పెడు బియ్యము చొప్పున పోగుచేసి, ఔసరమైన వారి అవసరముల గడుపుచు వారలనందర ఒకచోట చేర్చి, విద్య గరపుచు, పునీతుల చేయుచు, క్రమతః అది నెరవేరినప్పటికి గల ‘ధాన్యమమ్మి’ ప్రస్తుతము దేవాలయము కట్టుచున్న స్తలము కొనుటయు విని యున్నాము. ఈ స్తలములో అదివరకు ఒక వైశ్యుడుండెడి వాడట. అతను బెజవాడ వెళ్లు సమయములో ఈ స్తలము నడుగ ఎక్కువ ధరకు గాని ఇవ్వనని, ఇష్టపడక, వారు వెళ్లిన తర్వాత ఇతరులకు అమ్ముటకు ఖరారు పరచుకొనియు, వారు కొననందున, రిజిష్టరు చేయుటకు బాపట్ల వెళ్లి, తగాదాలు పడి తిరిగి వచ్చి, తిరిగి వీరికే ప్రధమమున వీరిచ్చెదమన్న ధరకంటే తక్కువగా ఇచ్చి వెళ్ళి యుంటయు విని యున్నాము. ఇప్పటికి దరిమిలా 60 సెంట్లు + 20 సెంట్లు ఈ స్తలములో కలియునది, ఎట్లు కొనినదియు, అంతకు క్రితం అచట గల వారెట్లు ఏదో కారణములుగా దూరముగా వెళ్లుటయు చూచినారము. దేవాలయము కట్టునపుడు, ఆ నీడ తమస్థలముపై పడకూడదని, ఎవరో చెప్పిరని సత్యం హోటలు ఎదురుగా స్థలము, బదులు తీసుకొని చేరిరి. ఇట్లే క్రమేపి వాముల దొడ్డి లగాయతూ సమాధుల వరకు గల స్థలము స్వతః కరణములకై నిర్దేశింపబడినది, ఎన్నియో మార్పులు చెంది, చివరకు వీరికే ‘కరణములకే’ ‘సంక్రమింప’ జూడ నిర్ణయమన నెట్టిదో చూడగలము.
ఇదివరలో చెప్పిన గాథలో ‘అమ్మ’ కొంత కాలము విశ్రాంతి తీసుకొన్న ‘కొత్తదిబ్బ’ యు నేటికి దేవుని మాన్యమను పేర దేవాలయమునకే కొనుటయు చూడ పూర్వాపరములు తెలియుచున్నది.
ఇట్లే ఆచార్యులచే ‘అగ్రహారము నుండి’ గవర్నమెంటు వారిదిగా మార్పిడి జరిగించినపుడు, నాన్నగారికి దఖలుపరచబడిన 7 ఎకరముల ఫలసాయము అనుభవించుచు ఏవియో కారణము లేర్పడి, అగత్యముగా తోచి, అవి అమ్ముటయు, ఈ ప్రతి ఫలముతో కొంత స్వంతమున కుపయోగించుచు, అదే విస్తీర్ణత గల మెట్ట పొలమును వీరు కొనుటయు (ఇక మీదట కాల్వరాగలదనియు ఎక్కువ ధరకు ప్రస్తుతపు మాగాణినమ్మి, తక్కువ ధరకు మెట్ట, ఇక మీదట మాగాణి కాగలదు అను ఉద్దేశ్యముతో కొనుటయు) చూడ, అట్టి పొలము స్వతః చాగంటి పాడుదై యుంట, ఆ చాగంటి పాటికిని, వీరి పూర్వ సంసారమునకు గల సంబంధము విదితము కాగలదు. అనగా అప్పటి వారివే తాము తిరిగి సంపాదించుట యగును.
ఇది వారికి కడసారి జన్మ అయ్యు (వారి బాధ్యతల నీమెయే వహించుట) పూర్వజన్మ వాసనా బలముచే ముఖ్యముగా వీరి దేహ బంధువులు ధనాపేక్షరలవారై (రసవాద వృత్తులగుట) ఈ యమను తమ ఈప్సితముల కొరకు బాధించుటగాక సహజముగా దారి దోపిడులగుట ఇతరుల మోసగించుటయు చేపలు పట్టుట వృత్తి యగుట, ఏ సమయమున కే చేప పడునోయని ‘సర్వదా ‘ గాలము చేత బట్టుకొని, తిరుగు జాలరి మాదిరి ఇప్పుడిచటికి ఎవరు వచ్చిన వారెట్లు తమ కుపయోగపడు చుండిన అట్లుపకరింప చేసుకొనుటయు, సదాన్వేషణయు జీవ జంతువుల హింసించుట సహజ ధర్మము కావున, జన్మతః బ్రాహ్మణులయ్యు, అత్యాచారముల నొనరింప వెనుదీయ కుండుట గమనింప దగ్గది.
ఇక అమ్మ యని, తాను విధి యగుట, ఈ ప్రకృతి జనితములైన రస పాషాణాదులన్నియు చైతన్యము గల వగుట, తాను చైతన్య రూపిణియగుట, ఇవి ఎల్ల తమ యెడ నిష్ప్రయోజనములని ఋజువు పరపనెంచుచో, అట్టి ప్రయోగము లితరులెవ్వరు చేయవలను పడుకుండుట జేసి, తన యందు హక్కు గల వారగు, ‘భర్త, అత్తగార్లకే’ స్వీయ సంకల్ప బలమున, అతిక్లిష్ట సమస్యల కల్పించి (అట్లు చేయనిదే క్రోధోద్రేకులు కారు గాన) వారిచే లోహ జనిత మగు, మారణాయుధముల చేతను, ప్రకృతి పరమగు పంచభూతముల వల్లను, ప్రకృతి సంబంధమైన విషపాషాణాదులగు మూలికల చేతను, ఇట్లే మణి మంత్ర, ఔషధములైన (మనము తరచు వినుచున్న) సిద్ధుల వల్లను వీనిలో నేవేనియు తన యెడ నిష్ప్రయోజనము లగునని మన బోంట్ల కెరుక జేయుటకై ఆవిర్భవించిన ‘అవతారమూర్తి’ గాక మరెవరు?
మీదు మిక్కిలి ‘పతివ్రత’ అను పదమునకు గల భావమును స్వయముగా తన జీవితముననే ఋజువు పరచుచు ‘స్త్రీకి వైధవ్యము అనునదిలేదు’ అని సృష్ట పరచుటకునై తరచు, వివాహ సమయమున, వారి కొసగు మంగళ సూత్ర ధారణమే, భర్త తన పాద యుగ్మము ఆడవారి కంద జేయుట యగుననియు తదారభ్య వారెచ్చటెచ్చట, తిరుగు చుండినను, పతివ్రత పతినెడబాసి యుండుట లేదనియు, ఎన్ని జన్మలలోనైన, ఈ సూత్రమే, ఆ సూత్రమును (పూర్వపర జన్మ లెరుంగు శక్తి) నొసంగ గల్గి యుంట ‘స్త్రీకి’ వైధవ్యమనునది ఎన్నటికీ జరుగనేరని విషయమని చెప్పు చుందురు. దీనికే పురాణములలోను, ఇది వరకు జరిగిన వానింబట్టియు, గోదాదేవి శ్రీరంగనాధుని భర్తగ ఎంచు కొనియుంటయు, ‘తరిగొండ వెంకమాంబ’ శ్రీ వెంకటేశ్వరుని ఎంచుకొనినట్లు, అంత ఆరూఢతతో, తమ భర్తయే దైవమగునను ఆరూఢత కల్గిన అట్లే సంభవింపనేరుట చూసి, పతివ్రతాధర్మము నెరుక పరచు చున్నారు. ఇట్టి, న్యాయమే ‘సుమతి’ సూర్యునుదయింప కుండ శాపమిడగల శక్తిగల్గియుంటయు ‘వశిష్ఠ అరుంధతులు’ ‘అత్రి అనసూయ’ ‘తులని జలంధరులు’ వీరి వల్ల ఉపదేశింపబడియే యుండిరి. ఈ సందర్భమున “ధర్మము” “సత్యము” అను పదముల గల వ్యత్యాసము చెప్పునపుడు, తరచు తెలుపునది.
ఎట్లన తన పతి “ఒక స్వంత కుమారునికి గాని, కుమార్తెకు గాని ” విషమిమ్మన, నిస్సంకోచముగా తన ధర్మ ప్రకార మిచ్చుటయే “ధర్మమనియు” వెంటనే వారు సంరక్షింపబడుట “సత్యము” వలననియు, ధర్మము మారుట కనకాశముండినను, సత్యము నిత్యమైనదనియ చెప్పుట, ఇదియు వీరి జీవితము నుండియే ఋజువు పరచియుండిరి. ప్రతి ఇతరస్త్రీ సంసర్గము కల్గి యుండి, ఆమె కూడిగము సేయ నియమించుతరి, “తనసపత్నియు “పతి”. రూపముననే గోచరింప చేసుకొని, ఊడిగము సేయ సపత్ని యనునది లేక తన పతిగనే స్ఫురింప చేసుకొన గల్గియుంట “అసూయా ద్వేషములను తావుండనేరదను చుందురు కదా! దీనిలో ఎంత అర్ధమిమిడి యుండి, సాధనచేయువారి కనువుగా నుండెనో గ్రహింపనగును. ఇట్లే పతి వ్యభిచరించి తెచ్చుకొనిన రుగ్మతల నీయమ స్వీకరించి పునీతుల జేయుటలో ప్రారబ్ధ స్వీకార మననేమో, ఇట్లే తన అత్తగారి వద్దకు దూరమున బాపట్లలో గల తన భర్త వద్దను, ఒకే పరి ఇరువురుగా యుండి చరించినదియు తెనాలిలో నుండగా, శ్యామల తామున్నూ ఇరువురు 15 దినముల వరకు డింగీలో ఉండి ఇంటి వద్ద యధావిధిగా తాముండుట జూడ, తానే అనేక చోట్ల ఒకేపరి ఉండ వీలగునని శాస్త్రము చూపినది ఋజువు పరచుచుండిరి కదా? ఒకటి రెండు కానేర్చిన పిదప అనేకములు కానేర్చుట అనుటలో ‘రాసలీల’ కెట్లు మనగునదియు ఎరుంగ నగును. ఇక తను రూపముననే, అనేక రూపములగుట గాక, ‘నాగమణి’ యడ తానే తులసి చెట్టు రూపము ధరించుట, తిరుత్తణిలో సర్పాకృతి, శిలాకృతి ధరింపగల్గియుంట ‘కామవామితాప్యార్ధసిద్ధి’ ని ఎరుక పరచిరి. (బాపట్ల బస్టాండులో రేటూరు వానికి విషమిడినపుడు తాము నీరసించి పడిపోవుట) ఇట్లే ఇతరుల యెడ ప్రయోగించిన విషము తాను ముందు స్వీకరించి వారల నుత్తేజితుల జేయుటకు ఎరుంగనగును (రేటూరు) “విషపాషాణాదుల గ్రహించి భంగ మొందకుండుటచే ప్రకృతి పరమగు మార్పు ఆయుధముల వల్లను, విషపాషాణాదుల చేతను సేగి నొందకుండుటయు పంచభూతములగు, అగ్ని, నీరు, వీని వలన బాధ నొందకుంట, పంచ భూతముల నియమింప గల్గియుంటయు, సర్వదా సర్వజ్ఞస్థితి యందుండుటయు, సిద్ధి ప్రదర్శింపు సంకల్పము లేకయే తమంతట అవి ప్రదర్శితము లగుటయు మొదలగు విషయానేకములన్నియు, ఈ యమగారి జీవితము నందే ప్రదర్శింప బడుచున్నవి కదా. పర్యవసానముగా : –
- “శూలములన్ నిశాచరులు…… అనపాయత నొందుటకేమి హేతువో”
- ముంచితి వార్నిల …..చావడిదేమి చిత్రమో
- ఎరుగము జీవనౌషధము…….దివ్యము. దీని ప్రభావమెట్టిదో?”
అను భాగవతాంతర్గత ఉదాహరణల మాదిరి, ఇచటను వీరలకుం గల భయ సందేహాదులు ద్యోతక మగుచునే యున్నవి. ప్రథమమున క్రోధావేశములో ఒకపరి, తదుపరి రెండు, పిదప అలవాటు చొప్పున (మొదట పొరపాటు, గ్రహపాటు, అలవాటు) అనేక పర్యాయములు జరిపించి యుండినందునన్ను, ఈయమగారొసంగిన అభయము! తనకు మరణము తెలియుననియు ఉండినందున ఈ యమగారు మరణించబోరను దృఢ విశ్వాసముచే అట్లు చేయగల్గు చుండిరి. ముఖ్యముగా ఎల్లర సంకల్పములు ఆమె యై యుంట, వారికివారు, తమంతట తామే ఏమో చేయు చున్నారమను సంకల్పములనిడి, ప్రతిఫలముల నీయమయే స్వీకరించి తన చరిత్ర కనువగు చొప్పున జరిగించు కొనుచుండ వలెను. లేనిచో ఎట్టి వారైన “ఒకమారు, పలుమార్లు’ జరిగించి ప్రయోజనముండనేరకుంట గమనించియు. పదేపదే తిరిగి జరుప యత్నించుట జూడ, పాపము వారెట్లు బాధ్యులగుదురనియు తోచును. ఇందలి విశేషమే మన, ఏదేనొక పదార్ధము అన్యులయెడ ‘ప్రాణము దీయగల సమర్ధత కల్గినది, అట్లు తీయునేగాని, బాధ నొసంగనేరదుకదా! అట్లయ్యు ఈ యమకు బాధ కల్గించునట్లగు పడుట జూడ, అట్లగుపడిననే తమ ఈప్సితము కొరకు, సాధింపవలెనను కోర్కె వారికి కల్గించి, పదేపదే జరిపించుటకు దోహద మొనర్ప
ఇట్లే పై నుదహరించిన భాగవతాను సారము తామును విసిగివేసారితుదకు ‘అమ్మను’ ‘అమ్మగా’ చూడగల్గుట తటస్థించునేమోననియు, ఇతరుల కెందరకో, సద్గతి నొసంగ గల్గియున్న ‘అమ్మ’ వీరికిని, తన కార్యము నెరవేర్చుకొనినంత ‘ముక్తి’ నొసంగ గల్గియుంటయు సత్యమై యుండును. ఈ అవతార ప్రయోజన మెరుంగుటకు, ఇంతకు తగినంత వ్యవహరించి యుండ నందున, ఇక ముందు రాగలవారు సత్యము నెరుంగగలరు. పిమ్మట పురాణేతి హాసములుగా ముందు యుగములవారు చెప్పుకొందురు.
– (సశేషము)