(అమ్మ మాటల పట్ల వారికి కలిగిన అవగాహనను ప్రొఫెసర్ సి.ఆర్. ప్రసాదరావుగారు అందిస్తుండగా ఈ శీర్షికను ధారావాహికంగా ప్రచురిస్తున్నాము. ఎడిటర్)
జన్మలు 2 –
తల్లిధర్మం : నేను ప్రత్యేకించి “తల్లిధర్మం కోసం వచ్చాననుకొంటున్నాను. ఈ రూపం అది. ఈ స్థానం అట్లాంటిది…. మీరు నన్ను వెతకటం కాదు. నేనే మిమ్మల్ని వెతుక్కోవాలి. నా బాధ్యత అట్లాంటిది. అందరికి సుగతి అన్నానంటే మీదేం లేదుకనుక. మీరు బురద పూసుకొన్నా, ఏం పూసుకున్నా దాన్ని కడిగి శుభ్రపరచాల్సిన బాధ్యత నాది. దానికి మాతృత్వం కావల్సి వచ్చింది. వచ్చాను.” (Ref : బ్రహ్మాండం వసుంధరః శ్రీవారి చరణసన్నిధి, 2002, పేజి 4) ఇది అమ్మ స్వయంగా మాతృత్వం, శ్రీమాతృతత్వం గురించి యిచ్చిన వివరణ, సవరణలేనిదే వివరణ అంది. అటువంటిదే ఈ వివరణ. ఈ వివరణకి యింకా వివరణ యివ్వవచ్చునేమో కాని, సవరణ మాత్రం లేదు. మన జనన మరణాలుగాని, ఈ రెండింటి మధ్య కాలంలో జరిగేవి కాని వీటికన్నిటికీ – మన బాధ్యత లేదు. తనను తెలుసుకోవాలంటే మనవల్లకాదు. తెలియబడాలనుకొన్న వారికి మాత్రం తాను తెలియబడాలనుకున్నపుడు మాత్రమే మనం అమ్మ యొక్క సత్యదర్శనం, సత్యతత్వదర్శనం చేయగల్గుతాము. మనశక్తిగాని, ప్రేరణగాని, ప్రయత్నంగాని, ప్రణాళికగాని సాధనగాని ఏమి ఈ లక్ష్యాన్ని సాధించ జాలవు. (కనిపెడితే కనబడను) తల్లి కాబట్టి మనతో దాగుడు మూతలాటలు ఆడుతోంది. నిజానికి తానే అనేకం. పిల్లవాడు తల్లిని మరచినా తల్లి వాడి ధ్యాస ఎపుడూ వీడదు. (మరుపు లేదు: మరుగేకాని మనం ఎన్ని ఆటలాడినా, ఎంత కాలం ఈ ఆటలు ఆడినా, ఎన్ని జన్మలు, మరణాలు అయినా మన గురించిన మరుపు అమ్మకి లేదు. అట్లాగే ఈ ఆటల్లో మనం ఏపూతలు పూసుకున్నా (అవిద్యా యుతమైన మల, విక్షేప, ఆవరణలు) వాటిని వదలకొట్టే బాధ్యత కూడా తనదే. కారణం, నిజాన్కి, ఈ పూతలు కూడా మనం పూసుకొన్నవి కావు, అవి కూడా అమ్మ పూసింది. కాబట్టి అవి ప్రధమస్పందనలోనే, ఆదికారణంలోనే, నిర్ణయంలోనివే. అవి వదల్చడం కూడా అమ్మ బాధ్యతే. అంటే కైవల్య పదదాయిని. శివజ్ఞాన ప్రదాయిని అయిన అమ్మయే బురదలు, పూతలు వదలగొట్టాలి. కారణం, అమ్మ “నిర్లేపా”, “నిరంజనా”, “నిర్మలా” కాబట్టి అదీ తన బాధ్యతే. పూయడం, శుభ్రపరచడం, మరుగుపడడం, తెరలు తొలిగించడం అంతా తానే చెయ్యాలి కాబట్టి, తానే చేస్తుంది కాబట్టి అందరికీ సుగతే” అంది, అంటే ఎవరిని విడిచేదిలేదు. విడిపించేది ఎపుడో ఎవ్వరికీ తెలియదు. జన్మలు, జన్మాంతరాలు గురించి శ్రీ తంగిరాల కేశవ శర్మ ఏమి వ్రాస్తున్నారో చూడండి : “ఒక మహా చైతన్యం మరో చైతన్యం, ఓ కాంతి పుంజం నుండి మరొక కాంతి పుంజం, ఒక తేజో రాశి నుండి మరొక తేజో రాశి ఉదయించిందే తప్ప ఎక్కడా జనసామాన్యమైన అర్థంలో “జననం లేదు. అందుకనే ఆమెనే మహామాయ, శివా, చండీ అన్నారు” (తంగిరాల కేశవశర్మ, “చండీ సప్తశతి – దివ్యచైతన్య తాండవం”, విశ్వజననీ మాసపత్రిక, జనవరి 2002, పే.14). ఆ మహా చైతన్యంలోని ఒకానొక తరంగం మన జననం మరణం.
ఇది అమ్మ యొక్క దివ్య అవతారాలకి, రూపాలకి, జన్మలకీ సంబంధించినదే కాదు. ఇది సృష్టికి, సృష్టిలోని సకల జీవకోటికి వర్తిస్తుంది. ఎందుకంటే అది ఆమె క్రీడ. అదే అద్వైత దర్శనం. అదే “సమదర్శనం”. అదే మాతృశ్రీ దృష్టి. ‘అది’, ‘ఇది’ అని రెండు లేవు. అదే ఇది. ఇదే అది. అది చూస్తున్నపుడు ఇది కన్పించదు – లేదు (ఏకాగ్రత). ఇది చూస్తున్నపుడు అది లేదు – కన్పించదు (ఇదీ ఏకాగ్రతే), అందుచేత అది (బ్రహ్మ) మిధ్య, ఇది (జగత్తు) సత్యం అన్నా సమ్మతమే. తాను తప్ప అన్యమేమీలేదు అన్న జ్ఞానదృష్టికి అది, ఇది కూడా లేవు. ఆ శ్రీ స్థితినే, ఆ జ్ఞానమునే “ఋతంభర ప్రజ్ఞ” అని, “భూమా” అని, “తుర్యా తీత”మని అంటారు. ఇక్కడ, ఈ ఐదవ అవస్థలో (నిద్ర, స్వప్న, జాగ్రత, తురీయం దాటునది తెలియడం, వినడం, చూడడం, తెలుసుకొనే తెలివి జ్ఞాత – యివేమి ఉండవు ఉండేదంతా ఒక్కటే. అదే “ఏకాకిని”. “ఏకో హం” (ఏకామే వాద్వితీయం, నిర్వైతా, ద్వైతవర్జితా) ఇక్కడ సత్, చిత్, ఆనందం ఏక రసానుభవంగా ఉంటాయి. ఉండుట, ప్రకాశం, జ్ఞానము, ఆనందం – అంతా సమిష్టి రసానుభూతిగా ఉంటాయి. ఈ కారణముగానే అద్వైతజ్ఞానమునకు కూడా అంతరాలు (సత్యం జ్ఞానం అనంతం) చెప్పబడ్డాయి. ఈ అద్వైత జ్ఞాన స్థాయిని బట్టి బ్రహ్మవిదులు, బ్రహ్మవిద్వరులు, బ్రహ్మవద్వేరీయులు, బ్రహ్మ విద్వరీష్టులని చెప్పడం జరిగింది. మోక్షం కూడా 5 రకాలు : సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య, కైవల్య) ఏదయితే బ్రహ్మ విద్వరేణ్యంగా ప్రభాసిత మయిందో అదే ఋతంభరప్రజ్ఞ – తుర్యాతీత అవస్థ. అమ్మది అటువంటి అవస్థ కాబట్టి, తాను తప్ప అన్యం గోచరంకాని, స్ఫురించని అవాజ్మానస బ్రహ్మతత్వం కాబట్టి, వేదాలు కూడా వెదుకజాలని నిర్గుణ పరబ్రహ్మ తత్వం కాబట్టి అమ్మకి జన్మలు, మరణాలు యిత్యాదులేవీ లేదు. మన జన్మపరంపరలకి కారణభూతమైన “మహామాయ”కి కూడా అతీతమైన స్థితి అది. (Ref : పీయూష ః అమ్మ – సాధన సామగ్రి, ‘విశ్వజననీ’ మాసపత్రిక, జనవరి 2002, పే. 22 – ఎంత వెదికినా, నాకింకొకటి కన్పడడం లేదంది. మీరుకానిది నేనేమీ కానంది. దీన్నే ఏకాగ్రత అంటుంది.
అణువున యిమిడెదవు: జగమంతయునిండెదవు; జగమావల వెలిగెదవు అని ఒక ప్రార్థనాగీతం. అమ్మతత్వం ‘సయేశ్వరం” (ఈశ్వరుడున్నాడు) “నిరీశ్వరం” (ఈశ్వరుడు లేడు) – ఈ రెండూ అయినదే. సర్వానికి (జగత్తుకి, సృష్టికి, విశ్వానికి) సర్వమే (పరునికి కూడా పరమయిన తత్వమే – పరాత్పరుడు – నిర్గుణ, నిరంజన, నిరాకార, నిరాధార, నిరాలంబ, నిరవధిక – ఇత్యాది “నీతి” వాక్యాలు చెప్పే సత్యం) ఆధారం అంది అమ్మ. సర్వాధారమైన ‘నిరాధారం’గా ఉండి తీరాలి. వేరే మార్గంలేదు.