(అమ్మ మాటల పట్ల వారికి కలిగిన అవగాహనను ప్రొఫెసర్ సి.ఆర్. ప్రసాదరావుగారు అందిస్తుండగా ఈ శీర్షికను ధారావాహికంగా ప్రచురిస్తున్నాము ఎడిటర్)
మహాయోగియే మహాభోగి
తెలుగులో అమ్మ మహావాక్యాలలో ఇదొక మహావాక్యం. దీన్ని యోగ పరంగానే, ఆధ్యాత్మిక దృక్పథంలోనే విశ్లేషించుకోవాలి. ఇది మూడు పదాల సంపూర్ణ మహా; యోగి; భోగి. ‘మహా’ అంటే మామూలుగానే గొప్పదైన, లేక గణించలేని, కొలవడాన్కి వీలులేని, అఖండమైన అమేయమైన, అవిరళమైన అని అర్థం చెప్పుకొందాం. అంటే చ్యుతిలేని, అనన్యమైన అని అర్థం చేసుకొందాం.
ఇక ‘యోగం’ అంటే అది జీవ – బ్రహ్మైక్య అను సంధానం. బ్రహ్మములో నిరంతరమైన, నిరవద్యమైన, నిరవధికమైన సంధాన ప్రక్రియ స్రవంతి. ఒక రసానుభూతి. ఒక తాదాత్మ్యస్థితి. ఒక ఏకాగ్ర చిత్తవృత్తి. అమ్మ అంటోంది: ఆనందం అంటే దైవమును గుర్తించటమేకదా! బ్రహ్మానందం అంటే బ్రహ్మమును గుర్తించటం – తెలియడము. (విశ్వజననీ మాసపత్రిక, నవంబరు 2001, పేజి 4). ఇదీ అమ్మ చెప్తున్న మహాభోగం. అన్ని భోగాలలో ఉత్తమమైన భోగం. దాన్కి మించిన, సమానమైన భోగం మరొకటి లేదు అని కదా అర్థం. అమ్మ వివరణ యిచ్చింది : ఆనందం అంటే భగవంతుని గుర్తించటమేగా, అనుభవం అన్నా అదే (జ్ఞానం); ఏకాగ్రత అన్నా అదే; సమాధి అన్నా అదే. (విశ్వజననీ, నవంబరు 2001, పే.4) మహాయోగాన్ని పరమ లక్ష్యం, చరమ లక్ష్యం, పరాకాష్ఠ మహాభోగమే (ఆనందమే). ఈ మహాభోగం సాధారణంగా మనం అతీంద్రియ భోగంగా భావిస్తుంటాము. కాని అమ్మ అద్వైత దృష్టిలో ఇది ఇంద్రియ జన్యంగాను, ఇంద్రియాతీతంగాను అనుభవించాలి అని. ఈ తత్వం అర్థంకావాలంటే అమ్మ బ్రహ్మము, లేక భగవంతుడ్ని గురించి ఎట్లా చెప్పిందని చూడాలి. అట్లాగే అమ్మ ముక్తి గురించి ఏం చెప్పిందని చూడాలి. ‘దైవము’, ‘ముక్తి’ ఇవీ అమ్మ ఆనంద తత్వావిష్కరణకి ఆధారములు. ముందర ముక్తి: తృప్తే ముక్తి అంది. ATTAR ఎట్లా వుంటుంది? ఎట్లా వస్తుంది? దాని స్వరూప, స్వభావాలేమిటి? అమ్మ : “తృప్తి అంటే ఇంతకంటే ఇంకొకటి లేదనే స్థితి. (ఇది లౌకికం; పారలౌక్యం కూడా) సర్వకాల సర్వావస్థల యందు చెదరని సంతృప్తే ముక్తి. తృప్తే ముక్తి. ఏది చేస్తున్నా.. ఏది చూస్తున్నా అన్ని వేళలా…. నీ బాధ్యత లేదని గుర్తించడమే ముక్తి. (ఇది ప్రపతి; అనన్యశరణాగతి; ఏకాగ్రత; తదేక ధ్యాన; కర్మ యోగం) ఏది వచ్చినా ఉన్న శక్తి కవళికే అని హాయిగా అనుభవించగల సహజమైన ఓర్పు ముక్తి. తృప్తి, అసంతృప్తి రెండూ వాడిచ్చినవే అన్న భావం రావాలి. ఎవరూ మన కున్న దాన్ని వదిలించలేరు. లేని దాన్ని తెచ్చి పెట్టలేరు. నాకు లేదు అనుకోవడం దురదృష్టం. అదృష్ట, దురదృష్టాలు రెండూ భావనకే” (విశ్వజననీ, అక్టోబరు, 2001, పే.6) సంసారం భారంగా, బాధగా అనిపించకపోవడమే ముక్తి. మోక్షం గురించి ఆలోచన లేకపోవడమే మోక్షం అని అంటుంది. ఇక దైవం గురించి: అన్ని రూపాలు ఒకటే అన్న స్థితి రావటమే దైవత్వం. తదేకమైన సంకల్పమే దైవత్వం. భిన్నత్వంలేని మనస్తత్వం దైవత్వం. ఎదుటి వానిలో దైవత్వం చూస్తున్నంతసేపూ మనలో దైవత్వం మేలు కొంటుంది. సర్వత్రా పూజ్యభావనతో చూడ గలిగిన వారే పూజ్యులు. అన్ని వేళలా, అన్నిటి యందు సమమైన స్థితి కల్గిన మనస్తత్వమే దైవత్వం. ఎక్కడ అవధులు లేని ప్రేమ వాహిని ప్రవహిస్తుందో అదే దైవత్వం” (విశ్వజననీ, అక్టోబరు, 2001, పే. 6).
” అర్థంకాని శక్తి పరమాత్మ. కనబడే దంతా దైవమే. మారుతుండే బ్రహ్మము తప్ప మరేదీ లేదు. అదే ఇదంతా అయింది. … దేవుడితో వ్యవహారం కత్తి మీద సాములాంటిది అంటారు కదా! అంటే, దేవుడుతో లేని వ్యవహారమేదైనా ఉందేమిటి? (సర్వం దైవంమీదనే ఆధారం, సర్వాన్కి దైవమే కారణము. ఇక దైవప్రమేయంగాని, దైవ ప్రేరణగాని, దైవ ప్రభావంగాని లేని వ్యవహారమేముంది?). నా దృష్టిలో ప్రత్యేకించి దైవం ఎక్కడా లేడు. మీరే దైవం. ఈ కనబడే 1 దాన్కి భిన్నంగా మరొకటి లేదు. (బ్రహ్మం తప్ప వేరు ఏమి లేదు అన్న అద్వైత మహావాక్యాన్ని తిరగవేసి ఈ కనబడే దంతా తప్ప వేరే ఏమి లేదు అంటోంది) ఈ కన్పించే దంతా బ్రహ్మసాక్షాత్కారమే – విశ్వరూపమే… మీరు ఏదో ఇంకొకటి ఉన్నదనుకొంటున్నారు. ఇంకొకటి వేరే ఉన్నదనే ఆలోచన లేదు నాకు.. ప్రపంచమూ పరమార్ధమూ వేరు కాదు” (విశ్వజననీ, డిసెంబరు, 2001, పే. 5) ఈ జగత్తు సర్వం నీకు కన్పించేది, కన్పించనిది అంతా పరబ్రహ్మమే. ఆనందాన్ని మళ్ళీ చెస్తోంది : “ఈ సృష్టే భగవంతుడు. కనుక ఈ సృష్టిలో దేనిని చూచినా, దేనిని తాకినా, దేనిని ఆలోచించినా ఎంతో ఆనందంగా ఉంటుంది” (విశ్వజననీ, నవంబరు, 2001, పే. 4) ఈ సృష్టిలో ద్వంద్వాలున్నాయి. త్రిగుణాలున్నాయి. పంచభూతాలు వాటి తన్మాత్రలున్నాయి. జీవచైతన్యం ఉంది. భూకంపాలు, అగ్ని పర్వతాలు, తుఫాన్లు వరదలు, యుద్ధాలు, హింస, నేరం వగైరాలన్ని ఉన్నాయి. వీటన్నిటిని ఒకే ఒక దివ్య చైతన్య ప్రకటన, ప్రణాళిక, ప్రదర్శనగా గుర్తిస్తే అదే బ్రహ్మానందం, పరమానందం, పరమ సుఖం, మహా భోగం అవుతుంది. అదే మహా యోగం అవుతుంది. సమస్తమూ పరమేశ్వరుని ఆనంద తాండవంగా, అమ్మ యొక్క లీలాలాస్యంగా చూడగల్గడమే మహా యోగం అవుతుంది. అదే తురీ యానందం, తుర్యాతీతానందం. అదే సత్, చిత్, ఆనందం యొక్క ఏకైక రసానుభవంగా గోచరమవుతుంది. ఆ ఆనందమే తన తత్వంగాను, తన అస్థిత్వంగా, తన స్వభావంగా మహా యోగాన్కి స్ఫురిస్తుంది. ఈ సృష్టిని మిధ్యగా, భిన్నంగా, స్వప్నంగా, అనిత్యంగా, అసత్గా గాకుండా భోగవస్తువుగా చూడగల్గడమే మహాయోగం అవుతుంది. భ్రాంతి భాతిగా, అభాస ప్రభాసంగా, భేదం మోదంగా, ప్రళయం ప్రణవంగా, క్రాంతి శాంతిగా, మృతం అమృతంగా, విరళం సరళంగా, విచ్ఛిన్నం అవిచ్ఛన్నంగా పరిణామం పొందుతాయి. అపుడు యోగి భోగి అవుతాడు. మహాయోగి మహాభోగి అవుతాడు. మానవుడు మాధవుడవుతాడు. ద్వంద్వం నిర్ద్వందం, ఆనందం అవుతుంది. విరాగం సర్వత్రానురాగం అవుతుంది. ద్వేషం ప్రేమగా మారుతుంది. బాధ భోధ అవుతుంది. ఇదీ ఈ మహావాక్యానికి నా వ్యాఖ్యానం.