(అమ్మ మాటల పట్ల వారికి కలిగిన అవగాహనను ప్రొఫెసర్ సి.ఆర్. ప్రసాదరావుగారు అందిస్తుండగా ఈ శీర్షికను ధారావాహికంగా ప్రచురిస్తున్నాము ఎడిటర్)
ప్రేమ, ధర్మం
అమ్మ ఒక సందర్భంలో ప్రేమ కన్న ధర్మం గొప్పదన్నదని ఎక్కడో చదివాను. ఎక్కడ చదివానో సరిగా గుర్తులేదు. చెప్పింది మాత్రం బాగానే గుర్తు ఉంది. పరమ ప్రేమమూర్తి అయిన అమ్మ దగ్గర్నుంచి ఈ సూక్తి రావటం బాగా, లోతుగా ఆలోచించవలసిన విషయం.
సాధారణంగా ఆశ్రమాలలోను, వేదాంత ప్రవచనాలలోను, నిత్యజీవితంలోను ధర్మం గురించి ప్రస్తావనవస్తూనే ఉంటుంది. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి – ఇవి చ లక్ష్యాలు, గుణాలుకూడా. ధర్మాన్ని ఒకప్పుడు ‘ఋతం’ అనేవారు. ‘ఋతం’ అంటే అర్ధం సత్యమని, సత్యమే ధర్మము; ధర్మమే సత్యం. సత్యమేవజయతి; ధర్మమేవ రక్షతి అని కూడా వింటాం కదా! శాంతి కావాలంటే సత్యమైన, ధర్మమైన జీవనం కావాలి. అదే సాధన కూడా. ‘అనృతం’ (అసత్యం) మాట్లాడవద్దు. అప్రియమైన సత్యమూ పలుకవద్దు అంటారు. సాధకులకి సత్యవచనం (నిష్ట) ప్రియంగా ఉండాలి. కఠినమైన సత్యాన్ని చెప్పగూడదన్నారు, సత్యాన్ని మట్టుకు జారవిడుచుకోకూడదు. వేదం అంటుంది: సత్యంవద; ధర్మంచర సత్య, ధర్మముల సమన్వయ జీవనమే శాంతికి, మోక్షానికి రాజబాట. సత్యవ్రతుడైన శ్రీరాముడు, హరిశ్చంద్రుడు ప్రసిద్ధమే. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు. అంటే దశరథుడిచ్చిన వాగ్దానం నిలబెట్టట్టటంకోసం రాజ్యత్యాగం చేసి, అడవులకి వెళ్ళి, చివరికి దశరథుని మరణానికి కారణం అయినాడు. రాముడు నిజంగా పితృవాక్య పాలకుడు కాదు. కేవలం సత్యవాక్య పాలకుడు మాత్రమే. దశరథుడు వద్దంటున్నా అడవికి వెళ్ళాడు. నిజంగా పితృవాక్య పాలకుడయినవాడు పరశురాముడు. తండ్రి ఆజ్ఞమేరకు తల్లి తల గొండ్ర గొడ్డలితో నరికిపారేస్తాడు. తర్వాత తండ్రి మరల ఆమెను బ్రతికించడం వేరే విషయం. మరి రాముడు చేసింది పితృవాక్య ధిక్కారము సత్యవాక్కు పాలనము, సత్యమే దైవము. సర్వానికి ఆధారం సత్యమే. సర్వం సత్యం ప్రతిష్ఠితం అన్నారు. అమ్మ సర్వాన్కి సర్వమే ఆధారం; ఆధారాన్కి ఆధారం ఆధారమే అంటుంది. అంటే ఎలా ఉన్నది, నిత్యమైనది, తనకి వేరే ఆధారం. లేనిది. అన్నింటికి ఆధారమైనది సత్యమే (సత్ చిత్ ఆనందంలో మొదటిది) అన్నా అదే అర్థం. సర్వాధారము, దైవము అయిన సత్యం సాధకునికి ముఖ్యాతిముఖ్యం. ధన, ప్రాణ, మానహానులందు కూడా సత్యవ్రతం వదల కూడదు. దృష్టాంతాలుగా అనేక కథలు కూడా చెప్తారు – సత్య నిష్టభంగం. ప్రియత్వభంగం లేకుండా ఎట్లా వ్యవహరించుకోవాలో, అప్రియమైన సత్యం మానసిక హింసకి దారితీస్తుంది కాబట్టి, అహింసావ్రతం కూడా సాధకుడు పాటించవలసిన ధర్మమే కాబట్టి, అప్రియ సత్యం వలదన్నారు.
ధర్మం అనేకంగా ఉంటుంది. వర్ణ, ఆశ్రమ ధర్మం, మానవధర్మం, పురుష ధర్మం, నిమిత్త ధర్మం, విశేష ధర్మం, ఆపద్ధర్మం, రాజధర్మం వగైరా.
ఇక ప్రేమకి, ధర్మాన్కి వైరుధ్యం వస్తే దేన్ని సాధకుడు పాటించాలి? అమ్మ అంటుంది ధర్మానికి ప్రాధాన్యం శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అవతార ధర్మం. దుష్ట శిక్షణలో ప్రేమలేదుగా. అంటే ధర్మం శ్రేయం అని, ప్రేమ ప్రియం అని అర్థం అవుతోంది. ప్రియంకంటే శ్రేయం గొప్పది. ప్రియమైన వచనం శ్రేయంగా ఉండాలి. అంటే పరహితంగా, లోకహితంగా ఉండాలన్నమాట. బిడ్డ అడిగిందల్లా అమ్మ పెట్టదు కదా! జబ్బుతో ఉన్న వాడికి ఏది అవసరమో అదే తల్లిగా యిస్తాను అంటుంది. మన కోరికలు పూరణ జరగడం మనకి ప్రియం కావచ్చు. కాని శ్రేయం కాకపోవచ్చు. పథ్యం శ్రేయపదార్థమేకాని, ప్రియ పదార్థం కాదుగా. అందుకే అమ్మ ప్రేమకంటే ధర్మం గొప్పదంది. ధర్మాచరణంలో శ్రేయము, సత్యమూ రెండూ వున్నవి కాబట్టి “ధర్మో రక్షతి రక్షితః” అని; ధర్మోహంతి హతః అని చెప్తారుగా. ధర్మాన్ని ఎవరు హతం చేస్తారో వారు, ధర్మం చేతనే హతులవుతారని ధర్మోద్ధరణ కోసం అవతారాలు వస్తున్నాయిగా. అంటే ధర్మం అంత గొప్పది. విశ్వసృష్టి, విశ్వగతి, విశ్వశ్రేయస్సు, ధర్మం మీదనే ఆధారం. అసత్యం, అధర్మం విశ్వశాంతికి, విశ్వగతికి, విశ్వసృష్టికి విఘాతం కల్గిస్తాయి. కాబట్టి, సత్యధర్మాలు ఎట్టి పరిస్థితుల్లోను సాధకులు త్యజించ కూడదు. దేహ త్యాగమైన చెయ్యొచ్చు. కాని సత్య, ధర్మాలువదలరాదు. గాంధీగారు సత్యాన్ని, అహింసను పాటించి మహాత్ములయ్యారు.
కొందరు మహాపురుషులు ధర్మం కోసం సంసారం వదిలివేస్తారు. ఉదాహరణకి బుద్ధ భగవానుడు: శ్రీరామానుజాచార్యులు: శ్రీ గురునానక్ వగైరా. అయితే వారు స్వీకరించిన ధర్మం ఆత్మోద్ధరణం; త్యజించిన ధర్మం సంసారం. శ్రీ భగవద్రామానుజులవారి చరిత్రలో భార్య కోసం ధనం, అయినా వదులుకోవచ్చు ‘ దైవం కోసం భార్యను కూడా వదులు కోవచ్చు. అందుకని తాను భార్యను వదిలి వేసారంటారు. గురునానక్ని కూడా తన భార్య నాసంగతేమిటి అంటే, ఏ భగవంతుడు నన్ను ఆత్మధర్మాన్కి ప్రేరేపించాడో అదే భగవంతుడు నీ విషయం చూసుకొంటాడంటారు. శ్రీరామకృష్ణ పరమహంస కూడా వివేకానందుణ్ణి సన్యాసం స్వీకరింప చేసారు.
మంత్రాలయ శ్రీ రాఘవేంద్రులు. పురందరదాసు వగైరాలు కూడా ఆత్మధర్మం కోసం అన్ని ధర్మాలు వదిలివేసారు. ధర్మశాస్త్రం కూడా అన్ని ధర్మాల్లోకి ఉత్తమమైన ధర్మం ఆత్మధర్మం అని చెప్తుంది. చతుర్విధ పురుషార్థాలలో చరమమైన మోక్షసాధనే ఆత్మ ధర్మం. ఆశ్రమాల్లో సన్యాస ఆశ్రమం కూడా అదే విధిస్తోంది. మానవజన్మ వచ్చింది కూడా సర్వోత్కృష్టమైన ఆత్మధర్మంకోసమే. అయితే సన్యాస ధర్మం పూర్తి అవగాహనతోనే సన్యాసం స్వీకరించాలి. అమ్మ సన్యాసం స్వీకరించడంకాదు, సన్యాసి అవ్వాలి అంటుంది. అంటే అంతర పరిణామం (Inner growth, evolution) సన్యాసికి దైవం తప్ప వేరే ధర్మం లేదు. జ్ఞానికి అసలు ధర్మాలే లేవంటారు. భగవానుడు గీతలో ‘స్వధర్మో నిధనం పరధర్మో భయావహం’ అంటాడు. ఏది స్వధర్మం అన్న ప్రశ్న వస్తుంది. అంతర్ త్యాగమే స్వధర్మం. అంటే జీవదోషాలు, ధర్మాలు పరిత్యజించడమే స్వధర్మం అని మహర్షి స్వధర్మాన్ని అర్థం చెప్తారు. ప్రేమకంటే ధర్మం గొప్పదేమరి. ప్రేమ ఒక పాశంకాకూడదు. ప్రేమ గ్రుడ్డిది కారాదు. ప్రేమ ఆత్మోన్నతికి ప్రతిబంధకంకాకూడదు. ప్రేమ పరిమితం కారాదు. ప్రేమ వివేక, విచక్షణంతో పరిణతితో కూడినదై ఉండాలి. ప్రేమ పేరు చెప్పి ఆత్మధర్మం వదలరాదు. మరు జన్మ ఏం వస్తుందో తెలియదు. అందుకే, ఇక్కడే, ఇప్పుడే ఆత్మసాధనకి ఉపక్రమించాలి. సంసారధర్మం పూర్తిగా నిర్వర్తించిన వారు, వేరే ఇక ఇతర బాధ్యతలు లేనివారు బంధ విముక్తులు కావడాన్కి కృతనిశ్చయులు కావాలి. అదివారికోసమే. జీవితం కూడా అందుకే. అవకాశం ఉన్నా ఆత్మధర్మాన్ని పాటించలేనివారు. మాయాజాలంలో చిక్కుకొన్నట్లే. అందుకే ముముక్షత్వం (మోక్షాపేక్ష కల్గడం) భగవంతుడిచ్చిన వరం అంటారు. ఆదిశంకరులు. అమ్మ కూడా సంకల్పాలన్నీ దైవమే అంటుంది. మోక్షకామిత్వం అమ్మ చెప్పిన దైవప్రేరణే. ఆ అపేక్ష తీవ్రమయి. దినదిన ప్రవర్ధమానమయి సాధకుడు తపిస్తుంటే మోక్షాన్కి కావలసిన సాధన భగవంతుడే చేయిస్తాడంటుంది. తరుణం వచ్చినపుడు సాధనా సాయం, మోక్షార్హత, జ్ఞానం కూడా ఆశక్తియే ప్రసాదిస్తుంది అంటుంది అమ్మ. జ్ఞానం వాడిస్తేనే వస్తుందన్నది. ఉపనిషత్తులు కూడా అదే వక్కాణిస్తాయి.