(అమ్మ మాటల పట్ల వారికి కలిగిన అవగాహనను ప్రొఫెసర్ సి.ఆర్. ప్రసాదరావుగారు అందిస్తుండగా ఈ శీర్షికను ధారావాహికంగా ప్రచురిస్తున్నాము ఎడిటర్)
ధర్మానికి నాల్గుపాదాలు అవి : సత్యం; శౌచం; దానం; తపస్సు. ఈ నాల్గు ధర్మపాదాలు సాధనకి సోపానాలుగా సులువుగా అవగతం అవుతాయి. అమ్మ అంటోంది : “సత్యమైన ధర్మాన్ని చేబడితే నిత్యమైన వస్తువేదో తెలుస్తుంది”. (Ref : చాగంటి వెంకట్రావు : సాధన, విశ్వజనని మాసపత్రిక, నవంబరు 2002, పేజీ 4) సత్యం గురించి ‘సాధన – 6’లో చెప్పుకొన్నాం. శౌచం అంటే బాహ్యం శౌచం. బాహ్యశౌచంకంటే కూడా అంతర శౌచం చాలా ముఖ్యం. సాధకుని ప్రయత్నం అంతా అంతఃకరణాలు నిర్మలంగా చేసుకోవడానికే. నిర్మలమైన చిత్తా కాశంలో ఆత్మ (చిదాకాశం) ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తూంటుంది. చిత్తాకాశం సూక్ష్మతరం, సూక్ష్మతమం అవుతున్నకొద్ది అంతా ఆత్మప్రకాశంగానే మిగిలిపోతుంది. ఈ అంతరేంద్రియ శుద్ధినే (మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం) శౌచం యొక్క రెండవ పాదం. ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ శంకరుడు లేడంటారు మహర్షి శౌచం ప్రదేశానికి, ఆహరానికి, భావానికి, సంకల్పానికి, క్రియ, శౌచం ప్రదేశానికి, ఆహారానికి, భావానికి, సంకల్పానికి, క్రియకి, వాక్కుకి అన్నింటికి అన్వయించు కోవాలి. జీసస్టు ఆహారం తీసుకొనే విషయంలో “శౌచం” గురించి చెప్తూ బయట నుంచి లోపలికి వెళ్ళేదేదీ మలిన పరచదు. మనలోపలి నుంచి బాహ్యంగా ఏ మొస్తుందో అదే మలిన పరచేదంటాడు. లోపల్నించి బయటకు వచ్చేవి అరిషడ్వార్గాలు. అందువలన సాధనలో అంతరశౌచం, అనగా నిర్మలాంతః కరణం చాలచాల ప్రధానం. అందువలనే సాధకునికి బహిర్యాగాల కంటే అంతర్యాగం ముఖ్యమంటాడు పరమాత్మ. అంతరంగా చేసే హోమం గురించి గీత చెప్పింది. భగవద్గీత 18 అధ్యాయాలు కొందరు మూడు షట్కాలుగా విభజించారు. ఆ మూడు : శోధనషట్కం (6 అధ్యాయాలు); సాధనషట్కం (6 అధ్యాయములు) జ్ఞానషట్కం లేక బోధన షట్కం (6 అధ్యాయములు). వీటినే మరి కొందరు కర్మయోగం, భక్తి యోగం, జ్ఞాన యోగంగా విభజన చేస్తారు. సారాంశం గీత యావత్తు అద్వైతామృత సాధన గ్రంధం. ఇక ధర్మం యొక్క మూడవ పాదం ‘దానం’. ఇది వస్తుదానం; లేదా విద్యాదానం; లేదా ప్రేమదానం అనుకోవచ్చునేమో! భగవంతుని పట్ల ప్రపత్తి భావం ఆత్మదానం ఆత్మార్పణం, ఆత్మనివేదనం అగును. అరిషడ్వార్గాల త్యాగం, జీవధర్మాల త్యాగం గురించి చూచాము. ఏ చింత లేకుండా తన చింతే పెట్టుకొంటే (సర్వధర్మాన్ పరిత్యజ్య) సాధకుని యోగ క్షేమాలు ఆయనే చూస్తానంటాడు. అమ్మ కూడా తన మాటలలో అదే చెప్తూందికదా! లౌకిక విషయాలకి ఏ శక్తి సాయపడుతున్నదో అదే ఆధ్యాత్మిక సాయం చేస్తుందంటోంది. ఒక చక్కని అమ్మ మాట : చిక్కించుకొనే చిక్కం అల్లే వాడి దగ్గరుంటుంది” (చా ॥ వెం ॥ ‘సాధన’, విశ్వజననీ, నవంబరు 2002, పేజి 4) ఇంకా భరోసాయిస్తోంది : ఆ రోజు వస్తే అన్నీ అనుకోకుండా జరుగుతాయి. సమయం వస్తే ఏదీ ఆగదు. కనిపెడితే కనబడేది కాదు. మీ ప్రయత్నాలు లేవు. వాడ్ని చూడాల్సి వచ్చినపుడు వాడ్ని చూచే గుర్తు, చూపు కూడా వాడే యివ్వాలి. లేకపోతే చూడలేరు : సాధన, సాధ్యం, సాధకుడు మూడూ వేరు కాదు. సాధనలో పురుషకారం లేదు. అంతా దైవమే. నేను ఎవ్వరికీ సాధన వద్దు అని చెప్పను. పూజలు, అర్చనలు మానుకోమని చెప్పను. ఎవరికి ఏ సాధన సాధ్యమవుతుందో అదే గొప్పదంటాను. అంతా వాడే చేయిస్తున్నాడనుకోమంటాను. సాధనలో హెచ్చు తగ్గులు లేవు. నమ్మకమే దారి. నమ్మకాన్ని మించిన దేమున్నది? (చా॥ వెం|| : సాధన, విశ్వజనని, డిసెంబరు, 2002, పేజి. 11) దేవీభాగవతంలో మందబుద్ధిగల ఒకరు కేవలం అడవి పంది చేసే శబ్దం విని దాన్నే మంత్రంగా స్వీకరించి దేవీ సాక్షాత్కారం పొందాడు అనేగాధ ఉన్నది. అమ్మ కూడా కుక్క, పిల్లి చేసే శబ్దంలో ఓంకారం వినగలగాలి అంది. నమ్మకమే అంతా చేస్తుంది. నమ్మకమే తీవ్రతరం, తీవ్ర తమం అయిన ఏకాగ్రత యిస్తుంది. సాధనలో ఏం చేస్తున్నాం అనేది కాదు ముఖ్యం. ఎట్లా చేస్తున్నాం అనేది మాత్రమే సఫలత్వాన్నిస్తుంది. బుద్ధుడిలాగ ఇల్లు, భార్యను విడిచిపోవడం కాదు. బుద్ధుడు వెళ్ళినట్లుగా వెళ్ళాలి అంది. మనకి వచ్చిన సంకల్పాలన్నీ మనవి కావనుకొనే స్థితినే సంకల్పరాహిత్యం అంటుంది. అంటే వృత్తి నిరోధం కాదు; అహం నిరోధం; ప్రపత్తి ప్రబలంగా వృద్ధి కావడం “నేను” లేక “తాను” లేకుండా పోవడమే ఉపాసన. తపస్సు అంటే తపనే. జిజ్ఞాసంటే భగవంతుని గురించిన దిగులు అంది అంటే విరహభక్తి, మధుర భక్తి, పరాభక్తి, పూర్ణభక్తి, ఆత్యంతిక భక్తి. “సహజంలోంచి విశేషాన్ని విడదీసి మళ్ళీ దాన్ని సహజం చేసుకోవాలి” (విశ్వజనని, డిసెంబరు, 2 . అంటే అవిరళమైన మనన, నిధిధ్యాసలు, సహజమైన సమాధి స్థితి. గాయత్రి సందర్శనం ఈ కనబడే అంతలోను చెయ్యడం అన్న మాట (ధీయో యోనః ప్రచోదయాత్).
సర్వచైతన్య రూపాంత్వాం ఆద్యాంవిద్యాంచధీమహి | బుద్ధిం యోనః ప్రచోదయాత్ | ఇదే సహజంలోంచి విశేషం. మరలా విశేషం సహజంగా రూపొందడం. (తార్కికంగా చెప్పితే : Induction and Deduction – From specific to general and from general to yet another specific; that is, prediction/application of attained knowledge in an ever expanding circle without end, thereby adding to the body of knowledge infinitely) ఇదే మహాజ్ఞాని, పూర్ణజ్ఞాని, సహజని యొక్క సహజ సమాధి తత్వం. వైద్యం గాయత్రి; వైద్యుడు గాయత్రి; రోగి గాయత్రి; మందులుగాయత్రి; రోగం గాయత్రి; రోగ కారణం, నిర్మూలనం గాయత్రి కన్పడుతున్నదంతా “అదే” అయినపుడు కళ్ళు మూతలెందుకంది? అంటే సత్యదర్శనం బహిర్ముఖం గాను, అంతర్ముఖంగాను జరగాలంటోంది. ఈ ప్రకారం లలితాదేవి అంతర్ముఖ సమారాధ్య కాదు; బహిర్ముఖ సౌలభ్య అవుతుందన్న మాట. అంటే జగత్తు, సృష్టి కూడ చైతన్యంగా స్ఫురిస్తుంది. అంతర్బహి నారాయణా” అన్న మంత్రపుష్పం యొక్క అర్థం గోచరిస్తుంది.
తత్పురుషాయ విద్మహే (రుద్రగాయత్రిలో ఒక పాదం)
మహాదేవ్యైచ ధీమహి | (లక్ష్మీగాయత్రిలో పాదం)
తన్నో దుర్గిః ప్రచోదయాత్। (దుర్గా గాయత్రి పాదం)