సాధన అంటే, ఉన్న స్థితి నుంచి, ఉన్నత స్థితికి, ఎదగటం కోసం, చేసే ప్రయత్నం.
ఒకటే ఇన్ని అయ్యింది గనుక, అన్నింటిలో వున్నది ఒక్కటేనని, తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే, సాధన’ అన్నారు అమ్మ.
అనేకం ఒకటిగా తోచటం, ఆత్మ సాక్షాత్కారం అని కూడ వివరించింది అమ్మ.
తత్వం అంటే, యధార్థస్థితి. అమ్మ తత్త్వం – “యధార్థమే నాస్థితి” అని అమ్మ చెప్పారు.
భక్తి అంటే, పూజ్య భావనతో పెనవేసుకోబడిన ప్రేమ మన మెఱిగిన సర్వానికీ కర్త ఒకరున్నారు, వారి నిర్ణయ ప్రకారమే ఇవన్నీ జరిగిపోతున్నాయి అని, ఆశక్తి యెడల పెంచుకున్న గౌరవమే భక్తి.
శ్రద్ధ అంటే శాస్త్రము నందు, గురు వాక్యము నందు విశ్వాసం, నమ్మకం. సత్యబుద్ది వుండటం.
ఏదైనా మంత్రసాధన చేసి, అమ్మ ఈ బ్రాహ్మీ భూత శక్తిని సంపాదించారేమో, తాను కూడ, ఆమంత్రాన్ని చిక్కించుకొని సాధన చేస్తే బాగుంటుందని, ఒక జిజ్ఞాసువు “అమ్మా! మీరు జీవితమంతా జపించిన మంత్రం ఏమిటమ్మా? అని అడిగారు.
అమ్మ : ‘సరే’ మంత్రం అతడు : సరే అంటే దేనికి సరే ?
అమ్మ : ‘అన్నిటికీ సరే’ అన్నది.
అంటే, జరిగే దాన్ని మనం (accept) చెయ్యటమే అనిపిస్తుంది నాకు. మనం దేనికీ (upset) కాకుండా, స్థిమితం కోల్పోకుండ, వుండగల్గటమే.
పురుష ప్రయత్నంతో సాధన చేసి, మనం మన లక్ష్యాన్ని శ్రద్ధతో సాధించాం అనుకుంటూవుంటాం మామూలుగా. అవిఘ్నంగా సాగాలని దేవుణ్ణి కూడ, ప్రార్థిస్తూ వుంటాం. అయినా మనం లక్ష్య సిద్ధిని పొందలేకపోతున్నాం, చాలాసార్లు.
ఈ సాధన ఎలా చేయాలమ్మా? అని అడిగితే, అమ్మ ఇచ్చిన వివరణ : “నాన్నా! ఏదీ నీవు చేస్తున్నానని ఎన్నడూ అనుకోకు. నీకు ఏం చేయాలని వున్నా, ఆ చెయ్యాలనుకున్న పనికి సంకల్పం కల్గించేది, ఏ పనీ చెయ్యాలనుకోక పోవడానికి మూలమయినది కూడ, ఆ అతీతశక్తే అని నమ్మునాన్నా”.
“చేయించేవాడు, చేసేవాడు, నీలో ప్రేరణగా మాత్రమే నిలుస్తున్నాడు. అవన్నీ వాడే అయి చేయిస్తున్నాడు. అలాంటప్పుడు జీవితంలో వచ్చే సుఖదుః ఖాలు, లాభనష్టాలు, ఆ చేయించేవాడికే గాని నీకు మాత్రం కావు. అందుచేత నీవు ఏదో చేస్తున్నావని, అంతా నావల్లే జరగుతోందని భావన చేయకు. నీ ఉనికి ఈ ప్రపంచంలో నామ మాత్రంగానే చేసేవాడు, చేయించేవాడు వాడే. అనుకున్నప్పుడు నీకెలాంటి పాపపుణ్యాలు లేవని భావిస్తున్నాను” అన్నారు అమ్మ. ఇలా కర్తృత్వం మన మీద పెట్టుకోకుండ మన విధ్యుక్త విధులు నిర్వర్తించాలి, అని అమ్మ సూచన అనిపిస్తుంది నాకు.
“అవకాశాన్ని గమనించటమే సాధన అన్నారు అమ్మ. ఒకసారి ఒక వ్యక్తి అమ్మ దగ్గరకు వచ్చి జపం, తపం, చేసుకునేందుకు అవకాశం లేదని బాధ పడ్తూ వాపోయాడు. కాని సాధన చేసుకుందామనే ఆలోచన వచ్చింది. చేద్దామని గుర్తుకు వచ్చింది గనుక అదే సాధన. ముక్కు మూసుకొని ఒక చోట కూర్చున్నదే గాదు. సాధన చేయాలనే మనస్సు వుంది, పరిస్థితులు అనుకూలంగా లేనందున చేయలేక పోతున్నాడు. చేయాలనే ధ్యాస పోలేదు. ఆ ధ్యాసే ధ్యానం, సాధన అన్నారు అమ్మ.
“సాధన చేస్తే సాధ్యము – అని మీరు అంటారు.
సాధ్యమైనదే సాధన – అని నేనంటాను”
మాల త్రిప్పు అన్నారు. ఏ పూసకాపూస త్రిప్పటం సాధ్యం.
క్రియలో సాధ్యం. చెప్పటానికి సాధన.
సాధన మన చేతిలో పని అని అమ్మ చెప్ప లేదు. “అసలు నేను (అమ్మ) ఏదీ మన చేతిలో లేదంటాను. సాధన కూడ. ఆశక్తి కల్గిస్తే కల్గుతుంది. అని నా అభిప్రాయం” అన్నారు.
“అనేక ఉపన్యాసాలు మనం విన్నాం. కొన్ని నచ్చిన మార్గాల్లో, సాధన చెయ్యాలనుకున్నాం. కానీ చెయ్యలేకపోతున్నాం. ఎందుకూ? అంటే అంత తీవ్ర శ్రద్ధ లేక పోవటమేనా? ఆ చెయ్యలేని బలహీనత కూడ మీది అనను. ఒక వేళ చేసినా మీదనను. అంత క్రితంలేని ఈ ఆలోచన మీకెవరిచ్చారో, ఆ మార్గంలో సాధన చెయ్యమని ఎవరు ప్రేరేపించారో, వాళ్ళే చెయ్యలేని తనం కూడ ఇస్తున్నారు. ఇక సాధనలో కూడ ఈ సాధన గొప్పది, ఆ సాధన తక్కువదీ అనీ లేదు. ఏది ఎవరికి సాధ్యమైతే అదే గొప్ప సాధన” అని అన్నారు అమ్మ.
“చేద్దాము అనుకున్నది ప్రేరణ. చేసింది క్రియ. క్రియ మనదిగా కనిపిస్తున్నది. కర్త ఎవరో తెలియటంలేదు. కర్త ఎవరో, క్రియ కూడ వారిదే అనిపిస్తున్నది నాకు” అన్నారు.
అందుకే, ‘తోచిందేదో చెయ్యి. తోపింప చేసే వాడు వాడేగా’ అన్నారు. నాచేత ఈ పని వాడు చేయిస్తున్నాడు అనుకున్నప్పుడు అదే సాధనం అదే యోగం అదే తపస్సు అవుతుంది.
సాధన దశలో అన్నింటిలో భగవంతుడున్నాడని, సిద్ధదశలో అన్నింటిగా వున్నాడని శాస్త్రవచనం.
“ ‘ముందు’, ‘అంతా అదే అనుకో నాన్నా, తరువాత ‘అదే’ నని అనిపిస్తుంది” అని ఉపదేశించారు అమ్మ.
శరీరానికి అనుచితమైన సాధన అమ్మ చేయమనదు. ‘భోజనం చేసి వచ్చి
పూజ చేసుకోండి నాన్నా’ అనేది.
“ప్రాణాయామంకాదు. ప్రాణనియమమే. దానంతట అదే ఏర్పడుతుంది. అది ఎట్లా జరుగుతుందో గమనిస్తుంటే అదే నిలబడి పోతుంది. కర్మేంద్రియాలతో మనసు కట్టుబడదు. మనసుతో కర్మేంద్రియాలు కట్టుబడ్డాయి. ఒక ఉదాహరణ చెప్తానాన్నా! నీకు ఒక విషయం మీద ధ్యాస వుంటుందనుకో. అప్పుడు నీ ప్రయత్నం లేకుండానే, నీ కళ్ళు చూస్తున్నా, ఆ చూస్తున్న దేమిటో నీకు తెలియదు. నీ ప్రక్క నుండి మనిషి పోతున్నా నీకు తెలియదు. నీ ప్రక్కనే మనిషి మాట్లాడుతున్నా నీకు వినపడదు. నువ్వు ఏ సాధన చేస్తే ఆ స్థితి వచ్చింది? విషయం (మన వ్యవహారాలలో) వేరు కావచ్చు అనుకోనాన్నా. లౌకికం, పారమార్థికం అని అంతకుముందు, ఈ ధ్యాస, అతి తీవ్రంగా లేదు కదా? ఇప్పుడు కల్గింది. అట్లాగే నువ్వు కోరుకొన్నది, సమయం వచ్చినప్పుడు వీటిలాగే, అదే వస్తుంది. ఈ ధ్యాసే నీకు చాలు. చేతకాని సాధనలన్నీ చేసి, ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు” అని ఒక భక్తుడితో అన్నారు.
ఒక శ్రావణ పూర్ణిమ నాడు కొందరు సోదరులు అమ్మను ఏదైనా సాధన చెప్పమని వేడుకొంటే అమ్మ – “నేను మీకు పెట్టింది హాయిగా, తృప్తిగా తిని, వచ్చినవాడికి ఆదరణగా, సంతోషంగా, పెట్టండి. ఇదే మీకు సాధన” అన్నారు.
1970లో శ్రీ శివశంకర ఆప్ట్ అనే భక్తుడితో – నా కొరకు ఆదేశమేమున్నదని ప్రశ్నకు బదులుగా అమ్మ –
“తనకిచ్చింది తృప్తిగాతిని అనుభవించటం,
తనకున్నది నలుగురికి ఆదరణగా పెట్టటం,
అంతా వాడే చేస్తున్నాడని నమ్మటం,
మన ప్రయత్నం వున్నదనుకున్నా, ఆ ప్రయత్నమూ దైవమే, మానవులలో ప్రేరేపించే ప్రేరణే దైవం” అని, ఒక్క క్షణం ఆగి “అని నాకు అనిపిస్తున్నది” అన్నారు.
ఆప్పారావు అన్నయ్యగారితో అమ్మ “జరిగేది జరుగుతుంది. జరిగే దాన్ని చూస్తూ వుండు” అన్నది. ఎలా చూడ మంటావమ్మా అని తన బాధను వ్యక్తిం చేసినప్పుడు “హాయిగా చూడు నాన్నా!” అంటుంది. తట్టుకునే శక్తి నైనా ఇవ్వమని అడిగినప్పుడు ‘ఆశక్తి నీలోనే వున్నది’ అని అన్నదట.
తట్టుకునే స్థితి వున్నప్పుడు జరుగుతున్న దాన్ని చూస్తూ వుంటానికి మార్గం సుగమం అయినట్లే కదా! “అమ్మమాట మంత్రంలా పనిచేసి కొంత సేపటికి మనశ్శాంతి లభించేది” అన్నారు అప్పారావు అన్నయ్యగారు.
ఇలా కొంత కాలం జరిగేటప్పటికి ఇది ఒక అద్భుత సాధనగా మారి, నిత్య జీవితంలో ఎదురయ్యే, ఒడిదుడుకులకు తట్టుకొని, వాటిని సాక్షిగా చూడటానికి, మనసు అలవాటు పడింది. అంతే కాదు. తన ఆధ్యాత్మిక సాధనలో పురోగతికి కూడ బాగ ఉపయోగపడింది. ఎలాగంటే, తొలిరోజులలో ధ్యాన సమయంలో తనకు వచ్చే ఆలోచనలతో తాదాత్మ్యం చెందుతూ వుండే వాడట. జరిగేది జరుగుతుంది చూస్తూ వుండు అన్న అమ్మమాట గుర్తుకు వచ్చి, వస్తూవున్న ఆలోచనలను సాక్షిగా చూడటం అలవాటయ్యిందిట.
“అమ్మ ఇచ్చిన ఈ మహోపదేశం జీవన్ముక్తిని కరతలామలకం చేసింది అమ్మ” అని ఎంతో మురిసిపోయారు అప్పారావు అన్నయ్యగారు. అసలు సాధన దేని కోసం మోక్షానికా? జీవన్ముక్తికా? ఆత్మానందానికా?
మనశ్శాంతికా? అన్నింటికీనా?
అంతటావున్న అమ్మని తెలుసుకోవటానికి అన్నీదారులే. మోక్షానికి రహదారి ఇదేను అని ఏ ఒక్కటీ ప్రత్యేకంగా లేదు. నువ్వు వెళ్ళగలిగిన దారి కూడ అక్కడికే కనుక సాగిపో!
ఎవరికి ఇష్టమైన రూపం వారు ఆరాధించ వచ్చును. అన్ని రూపాలు వాడివే గనుక ఏ పాదాలకు నమస్కరించినా వాడికే చెందుతుంది. ‘సర్వదేవనమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి.
విశ్వమున నీ శక్తి వివిధ రూపము లెత్తి
విహరించుటాయెలే మేలుకో
నీ నిఖిల రూపములు నిలుపుకొని కలుపుకొని
నిద్రించుటేలకో మేలుకో !
అని స్తుతించారు కదా శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మగారు.
“శాశ్వతంగా, స్థిరంగా, ఏకాల పరిస్థితుల్లోనూ తృప్తిపడ గల్గిన సంతృప్తి ఏదైతే వుందో అదే ఆనందం. అదే శాశ్వతానందం. ఈ తృప్తే అటువంటి ఆనందం. నవ్వులోనూ ఏడుపులోనూ, సుఖంలోనూ దుంఖంలోనూ అన్ని వేళల్లో ఆ తృప్తి వుండాలి” అన్నారు అమ్మ.
“దెబ్బ తగిలితే గాయం కూడ వాడిచ్చిందే అనే భక్తి వుండాలి. దుఃఖముకాని, సుఖముకాని వద్దని ప్రయత్నము చేయక, ఏది వచ్చినా స్వీకరించి, అనుభవించే స్థితియే ఆనందము అన్నారు అమ్మ.
మన దేశంలో వేదకాలం నించీ, జీవిత గమ్యమును చేరడానికి యత్నించిన పరమసాధనకులు తాము అనుష్ఠించినవీ, తమ గురువులు చెప్పిన పద్ధతులు వ్రాసి పెట్టారు. అలాగ వ్రాసినవే శాస్త్రాలు. వీటిని చదివి, తరువాతివారు, తమకు అనుకూలంగా కనపడిన పద్ధతులలో సాధనచేశారు. ఆచారము, శుచి, నియమము, ఆసనము, పద్ధతి అన్నవి ఇంద్రియాలకు సంబంధించినవి. సాధకులు తమ కర్మేంద్రియాల్నీ జ్ఞానేంద్రియాల్నీ, నియంత్రించి, జపమో, ధ్యానమో, చేశారు. ఇంద్రియాలను నియంత్రించడం వల్ల మనస్సును కట్ట యత్నించే పద్ధతులన్నీ యోగములు. ప్రతిఫలం అపేక్షించకుండ మంచి పనులు చేయటం, రోజూ దేవాలయంలోనో, ఇంటి దగ్గరో ప్రదక్షిణ, నమస్కార, పూజ,
సాష్టాంగాది అంగన్యాసాలు చేయడము, ప్రాణాయామంతోపాటు నామస్మరణ చెయ్యటమూ, వేదాంత గ్రంధ పఠన కాలక్షేపం చేయడమూ – ఇవన్నీ యోగాలే.
వీటికి కాలక్రమేణ పద్ధతులు, అనగా చేయవలసిన రీతులు అలవాట్లుగా ఏర్పడ్డాయి. వీటన్నిటికీ పరమ ప్రయోజనము, చిత్త వృత్తులు అణగిపోయి, మనసు భగవంతుని మీద నిలవడము. కానీ శ్రద్ధ లేక పోవడంతో పైన చెప్పిన క్రియలన్నీ కీర్తికోసము, గొప్పకోసమూ ప్రదర్శనకోసమూ, అల్ప ప్రయోజనాల కోసమూ, పలుకుబడి కోసమూ ప్రవర్థమాన మౌతాయి. నిజంగా ఒకటి చేద్దామనుకొనే వాడికి పద్ధతులు, రూపము, క్రమము, ఆచారాలు, అడ్డువస్తాయి. మొత్తంగా చూచినపుడు కర్మ, భక్తి, జ్ఞానము అంటూ విభాగాలుగా గోచరిస్తాయిగాని, ఆచరణలో ఇవన్నీ కలిసే వుంటాయి. ఒక దాన్ని విడిచి ఒకటి వుండలేవు.
కనుక శాస్త్రంలో చెప్పినట్లు ప్రారంభించిన వాడికి, అనుకూలమైనది కాక కసరత్తులాగ (military discipline) లాగ తయారౌతుంది. చెయ్యలేక మధ్యలోనే వదిలేస్తారు. కసరత్తు శరీరానికి మంచి చెయ్య గలదుకాని మనసు తిరగటానికి పనికిరాదు.
ఎలాగ అంటే –
మన ఆచార అభిమానము, మడి, తడి అనేవి సాధనాలు కావలసినవి. సాధ్యాలే అయి పోయినాయి. తడి వస్త్రము, ఆరవేసినదీ, నారచీర, ధావళి, తలస్నానము, కంఠస్నానము, బ్రహ్మచారి మడి, గృహస్థుమడి, గృహిణి మడి, వితంతుమడి మడిలో ఎన్ని రకాలు వున్నాయో చూడండి. అలాగే దేవతారూపాలు. దేవాలయానికి వెళ్ళితే అనేక దేవతల కొలువు. అలాగే అనేక మంత్రాలు. వాటి చుట్టూ రకరకాల సంప్రదాయాలు. ఒకరు బాల ఉపాసన. ఒకరు నారసింహం మొదలైనవి. మన పద్ధతులు (museum)లో వున్నన్ని విభేదాలతో వున్నాయి.
కనుక అమ్మ ఆచారము మీద కాక ఆచరణ మీద మొగ్గు పెట్టమన్నారు. ఆ చేతలు సాధ్యమైనవే గనుక, శ్రద్ధాభక్తులతో చేస్తూ వుంటే, లక్ష్యము మీదే నిలుస్తుంది మనస్సు.
మానవత్వం దివ్యత్వంలోకి ఎదుగుతుంది.
జయహోమాత