(అమ్మ మాటల పట్ల వారికి కలిగిన అవగాహనను ప్రొఫెసర్ సి.ఆర్. ప్రసాదరావుగారు అందిస్తుండగా ఈ శీర్షికను ధారావాహికంగా ప్రచురిస్తున్నాము ఎడిటర్)
జన్మలు
పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరేశయనం” అని ఆదిశంకరులు వ్రాసారు. మోక్ష ప్రాప్తి పర్యంతం జనన – మరణ చక్రం తిరుగుతూండ వలసిందేనని ప్రామాణిక, సాంప్రదాయక సాహిత్యం చెప్తూనే ఉంది. మరి అమ్మ అయితే జన్మలు లేవంది. జన్మకారణమైన కర్మ త్రయం (ప్రారబ్ధం, సంచితం, ఆగామి) పురుషకారం ఇవేవి లేవు అంది. ఈ జన్మ వృత్తాంతాల గురించి శ్రీ పి.ఎస్.ఎన్. మూర్తిగారు “విశ్వజనని” మాసపత్రికలో (డిసెంబరు 2001, పే.11) ఒక వ్యాసం వ్రాసారు. చాలా బాగుంది. కాని అక్కడ వారు యిచ్చిన వివరణ కేవలం వారికి ప్రత్యేకంగా వచ్చినస్ఫురణ, ప్రేరణతో, వారి స్వంతభావంగా వ్రాసినారు. ఇదే విషయాన్ని మరొకకోణంలో కూడా వివరించవచ్చని నాకు తోచింది. అమ్మ చెప్పిన ఏమాటయిన, అమ్మ ఇతర సూక్తులతో అన్వయించి అర్ధం చేసుకోవడం శ్రేష్ఠ తరం అని విశ్వసిస్తూ వ్రాస్తున్న వ్యాసమిది.
జన్మలు లేవన్నది అమ్మ సూక్తి. అంటే సర్వానికి మాత అయిన అమ్మ మాట అది మాతృత్వం అంటే వివరంగా విశదపరిచే ప్రయత్నం చేస్తే ‘జన్మలు లేవు మాటకి సందర్భం, నేపధ్యం తయారవుతుంది. ఆదిశంకరులు చెప్పినా, ఇతర సాహిత్యం చెప్పినా, జన్మ అన్నది భౌతిక, లౌకిక దృష్టిలో చెప్పినదే. అది వ్యావహారికం. అమ్మదెపుడూ ఎడతెగని, సహజ, సంపూర్ణ, శుద్ధ ఆధ్యాత్మిక దృష్టి – అదే పూర్ణాద్వైత జ్ఞాన దృష్టి. అది అఖండమైన, అద్వితీయమైన, అనిర్వచనీయమైన ప్రేమమయ దృష్టి. అమ్మ అంటే హద్దులు, అడ్డులు లేనిది, అంతా తానే అయినది ‘తొలి’ అయినది. ఆద్యంతములు లేనిది, అంతా అయినది’ – ఈ విధంగా మాతృత్వం గురించి అమ్మే స్వయంగా పలికింది కదా! నేను ఎపుడూ బాలింతనే, నిత్యచూలింతనే అంటుంది. నా ఉదరం బ్రహ్మాండ భాండోదరం అంది. నాకూ కోరిక ఉంది. “ఇంకా ఎంత మందినో కనాలని. నాకూ అసంతృప్తి ఉంది. ఇంకా అందరికి బాగా పెట్టుకోవాలని, తల్లికి తప్పదు కాదు, తప్పేలేదని, చివరికి సెగగడ్డలూ నా బిడ్డలే అంది. ద్వంద్వాలు, ఉద్రేకాలు, అరిషడ్వర్గాలు, ప్రేరణలు,
సంకల్పాలు, అనుభవాలు, చీమలు, దోమలు, అన్నం, అశుద్ధమూ, సుగంధం, దుర్గంధం అన్నీ ఆ సర్వంలోనివే అంది. ఈ విధంగా అమ్మ మాతృతత్వం సర్వసమ్మతమైన విశ్వజననీ ప్రేమ తత్వం అయింది. తానే జగత్తు అంది. తన ధ్యాస, నిరంతర నిధిధ్యాస అంతా అదే అన్నది.
దేశకాలా పరిచ్ఛిన్న అయిన అమ్మ యొక్క పంచకృత్యాలు నిరంతరం, ప్రతిక్షణం, ప్రతి క్షేత్రంలోను జరుగుతూనే వున్నాయి. తానే అన్నీగా పుడుతోంది, అన్నీగా పెరుగుతోంది. అన్నీగా లయం అవుతోంది, అన్నీగా ఆనందిస్తుంది; అనుభవిస్తుంది. దుఃఖిస్తుంది. నా సాధన సర్వసాధారణమైనదే అంది. ఈ పంచకృత్యాలు అమ్మకి సహజాలు, సర్వసాధారణాలు. నేను వేరే ఏ సాధన చెయ్యలేదు నాన్నా! అంది. సాధన. అంటే ప్రత్యేకంగా యిదీ అని నేను చెప్పను నాన్నా!, నన్ను మీరు దైవంగా కొలుస్తుంటే, నేను మిమ్మల్ని దైవంగా కొలుస్తున్నా నంది. నా సాధన అంతా మిమ్మల్ని కనడం వగైరా అంది. మీరే నా ఆరాధనా మూర్తులంది. తనకంతా జగత్తు తప్ప దైవం ఎక్కడా కన్పడటం లేదంది. బ్రహ్మ మిధ్య, జగత్తు సత్యం అంది. మీరు తింటే నేను తిన్నట్లే అంది. మీరు తినక పోతే చిక్కిపోతారు; నేను పెట్టుకోకపోతే చిక్కి పోతానన్నది. ఇదీ అమ్మ యొక్క విశ్వజనీనమైన, విశ్వధారణమైన విశ్వయోనిత్వమైన విశ్వంబరమైన మాతృతత్వం. మీరంతా, ఇదంతా నా అవయవాలంది. తన దృష్టి. తన తత్వం (ఏకైక దృష్టి, దేశకాలాతీత దృష్టి) కాలాతీతమైందంది : మూడు కాలాలులేవు. అ కాలం, అంతా వర్తమానమే అంది. మరణం లేదు; అంతా పరిణామమే. అంటే క్రొత్తగా పుట్టడం లేదు; మళ్ళీ మరణించడం లేదు. కేవలం రూపం, నామం, పాత్ర, రంగం మాత్రం మారుతున్నాయి. గీతలో పరమాత్మ కూడా జనన, మరణాలు నూతన వస్త్ర ధారణం చెయ్యడం, జీర్ణ వస్త్రాన్ని విసర్జించడంగా వర్ణించాడు. ఆత్మ అఖండంగా శాశ్వతంగా, ఎప్పుడూ, ఎక్కడా ఉన్నదే. అది అవినాశి. పరమాత్మ, జీవాత్మ అని రెండు లేవు. ఒకటి రెండయి (దేవుడు, జీవుడు), రెండు మూడయి (త్రిగుణాలు) అక్కడ నుంచి గుణ సంపర్కంతో అయిదయి (పంచభూతాలు), అనేకత్వం వచ్చి జగత్తు అయింది. అందుకనే తను ఆదెమ్మనని, తన ఆది ఎవరికి తెలియదని, ఎవరెంత లోతుకెళ్ళితే అంతలోతుకి తాను కూడా వెళ్తానని (ఉంటానని) తనకి మరుగేకాని, మరుపు ఎపుడూ లేదని (అంటే మనల్ని ఎపుడూ చూస్తూనే ఉండి – ఎన్ని జన్మలయినా) మరుగే ప్రధానమని, మీరంతా, మీదంతా నేనేనని, మీరందరూ నా మనస్సులో ఎపుడూగుర్తుంటారని, ఎవ్వరూ నా ఒడి నుంచి దూరంగా లేరని నిశ్చయంగా పలికింది. తనే అనేక రూపాల్లో, అనేక కాలాల్లో, అనేక దేశాల్లో ఉంటున్నపుడు జీవాత్మ, పరమాత్మ భేదం అయినపుడు ఇక జననము లేవి? మరణము లేవి? జనన మరణాలు జీవభావంతులే కాని ఆధ్యాత్మిక సత్యాలు కానేరవు. ఇదే భగవద్గీతలో చెప్పిన సమదర్శనత్వం అంటే. “పండితులు తెలిసినవారు) సమదర్శనులు” అంటాడు. శ్రీ కృష్ణపరమాత్మ. లౌకికాన్ని, పరమార్ధాన్ని అభేదదృష్టితో చూడడమే సమదర్శన లక్షణం. సమదర్శనం లౌకికమైన ద్వంద్వ దృష్టి లేకపోవడం మాత్రమేకాదు. సమదర్శనం బహు విస్తృతం అపరిమితం. అది ఆత్మాకార వృత్తి, లేదా బ్రహ్మకార వృత్తిజన్యం. అది కేవలం లౌకికాన్కి చెప్పిందేకాదు. అది లౌకిక, పారమార్థిక తత్వాలకి, విషయాలకి కూడా వర్తిస్తుంది. పారమార్ధికంలో సమదర్శనత్వం అంటే ఒక ఉదాహరణ – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఒకటిగానే తలచడం. వారిని త్రిమూర్తులుగా కాక ఏకమూర్తిగా ఏకైక సత్యంగా చూడగల్గడం. అమ్మ వారిని బిడ్డలుగా భావించింది. అట్లాగే పారమార్థికంలో జరిగే పంచకృత్యాలు (సృష్టి, స్థితి, లయాదులను కూడా) అభేద దృష్టితో చూడడమే సమదర్శనం అనిపించుకొంటుంది. ఆ సమదర్శనమే అమ్మది. అందుకే జగత్తును, పరమాత్మను ఐక్యం చేసింది. అందుకే సృష్టి అనాది అంది. అంతా పరిణామమేకాని, విలయం, వినాశం లేదు. వినాశం లేనపుడు పుట్టుకలేదు. ఒకటి ఉంటే రెండవది తప్పదు. పుట్టుకంటె కాలగమనంలో ఇదివరకు లేకుండా యిపుడు వచ్చింది. ఒకప్పుడులేక, తర్వాత వచ్చిన జన్మ మరొకపుడు లేకుండా పోవాలి, పోయింది. ‘జాతస్యమరణం ధ్రువం”, జననం, మరణం దేశాన్కి కాలాన్కి లోబడే ఉన్నాయి.
అవతార పురుషులైన రామకృష్ణాదులు ఒకపుడున్నారు. అంతకుముందు అవతరించలేదు. మరి యిపుడు లేరు కదా! అవతరణ, నిష్క్రమణ దేశ, కాల బద్ధంగానే జరిగింది. అంటే రూపం వస్తుంది. పోతుంది. ఉపాధి మారుతుంది. శక్తి ఎపుడూ ఉంటుంది. అందుకే అమ్మ అందరికి ‘సుగతే” అంది. అందరికి “సుగతి” అంటే అందరిదీ ఒకే ‘గతి’ అని అర్థం ఎక్కడుంది? అట్లాగే అందరికీ ఒకేసారి “సుగతి” అని అర్థమూ లేదు. “సుగతి” పరిణామం కూడా కాలబద్ధమే. అది ఉత్తమ జన్మం కావచ్చు. సాలోక్య, సామీప్యం కావచ్చు. ఎవరి “గతి” వారికే ఉన్నది. ఎవరిగతి వారికి. అది “సుగతే”. ఎవరి కాలం వారి కున్నది. ఎవరి ఉపాధి వారికున్నది. ఎవరి శక్తి, ఎవరి కొలత వారికున్నది. ఎవరి గమ్యం వారికున్నది. ఎవరి నిర్ణయం వారికున్నది. ఎవరి పరిణామం వారి కున్నది. ఈ అనేకత్వం అంతా ప్రథమ స్పందనలోనే నిర్ణయింపబడినది అన్నది అమ్మ. ఈ ప్రథమ స్పందనగతే అందరికి సుగతి. అంటే కాలమే దైవం. భగవద్గీతలో పరమాత్మ “కాలోస్మిన్” అన్నాడుకదా! ఇదే విధి. ఈ ప్రథమ స్పందన విధానమే విధి అంది. అద్వైతులు కూడా జగత్తు మిధ్య. బ్రహ్మసత్యం అన్న వారు మరలా జ్ఞాన దృష్టి కల్గిన పిదప జగత్తు కూడా బ్రహ్మమే అని ఒప్పుకొన్నారు. వారి మిథ్యావాదం కేవలం లౌకికమే అన్నారు. రమణ మహర్షి. అది సాధకుల కొరకు చెప్పడం అన్నారు మహర్షి. “నేతి, నేతి” వాక్యాలతో పంచకోశాలు (ప్రాణమయ, అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు) దాటిపోయి చివరకు ఈ కోశాలన్ని బ్రహ్మమే అన్ని అన్నవారూ వారే! అందుకనే అమ్మ కూడా కన్పించేదంతా బ్రహ్మమే అంది. అంతా బ్రహ్మమే అయినపుడు స్థూలంగా కన్పించు జనన, మరణాలు కూడా బ్రహ్మమే. ‘చిదాకాశమే’ (ఆత్మ) ‘చిత్తాకాశంగాను’ (జీవుని యొక్క అంతః కరణంగాను) ‘భూతాకాశంగా’ను ఉందంటారు మహర్షి