అమ్మ వాక్యాలలో మనం తరచూ ఉదహరించే ఒక వాక్యం వుంది. అది విప్లవాత్మకమైన అమ్మ సిద్ధాంతంగా, సార్వకాలిక సత్యంగా, పూర్వ ఋషులు చెప్పలేకపోయిన, లేదా చూపింపలేకపోయిన మార్గంగా ప్రపంచానికి పరిచయం చేసి సంతృప్తి పడే ప్రయత్నంలో భాగంగా ప్రచారంలో వుంది. ఆ వాక్యం – “సాధ్యమైనదే సాధన.”
ఈ వాక్యాన్ని అనేక రకాలుగా విశ్లేషించి, చివరకు ఆ వాక్యానికి విశిష్టమైన భాష్యంగా “మనకు ఏది సాధ్యమైనదో అదే చేయమని అమ్మ చెప్పింది కాబట్టి మనం ప్రత్యేకించి కష్టసాధ్యమైన సాధనలేవీ చేయనక్కరలేదు” అనే ఒక నిర్ణయానికి చాలామంది వచ్చారంటే సత్యదూరం కాదేమో!
ఆ వాక్యాన్ని కేవలం పైపైన విశ్లేషిస్తే నిజానికి అంతకంటే అర్థం కాదు. అమ్మ ఇతర సందర్భాలలో చెప్పిన అనేక వాక్యాలతోటి, సంఘటనలతోటి అనుసంధానం చేసుకుంటూ నిష్పక్షపాతంగా, లోతుగా, విశ్లేషించి గాని ఒక నిర్ణయానికి రాకూడదు.
మానవజీవితంలో శాస్త్రాలు అనేక విధి నిషేధాలను స్పష్టంగా సూచించాయి. నిజానికి మానవజీవితమే ఒక మహోన్నతమైన సాధన. మానవజన్మ ఎత్తిందే సాధన చేయటానికి. ఎందుకంటే భూమిపై ఇతర జీవులకు సాధనా మార్గం లేదు. ఇక స్వర్గలోక వాసులు భోగజీవులు. వారికి సాధన అవసరం లేదు.
జీవుడు దేవుని చేరటానికి చేసే ప్రయత్నమే సాధన. శాస్త్రం విధించిన కర్తవ్యం నిర్వహించాలంటే బద్ధకం, దానిని తప్పించుకునే మార్గాలు వెతకటం, నిషేధించిన వాటిపై వ్యామోహం. ఇది మానవ నైజం. “సాధ్యమైనదే సాధన” అని అమ్మ చెప్పింది కాబట్టి మనకు విధించిన ధర్మాలు మనకు నచ్చలేదు కాబట్టి, చేయకపోయినా పరవాలేదు అని అనుకోవచ్చా? ఎంతమాత్రం కాదు.
అలా అయితే రెండు విశిష్టమైన, మహోన్నతమైన ఆలయాలు అమ్మ ఎందుకు ప్రతిష్ఠించింది? వాటిలో సమగ్రమైన విధి విధానాలు ఎందుకు నియమించింది? అఖండనామ సంకీర్తన వేదికను ఎందుకు ఏర్పరచింది? “గీతలో చెప్పనిది నేనేమీ చెప్పటం లేదు. చెప్పే విధానం వేరు కావచ్చు” అని ఎందుకు అన్నది?
కలియుగంలో సామాన్యంగా మానవులు సోమరులు. ఎక్కువ కష్టపడలేరు. అల్పాయుష్కులు. అనేక రకాల రోగాలబారినపడి కొట్టుమిట్టాడుతుంటారు. మరి వారికి ఏమిటి తరుణోపాయం?
మన ఋషులు దయామయులు. సదా విశ్వమానవ శ్రేయస్సును ఆకాంక్షించేవారు. భాగవతంలో శౌనకాది మహర్షులు సూత మహామునిని ఇటువంటి ప్రశ్నే అడుగుతారు.
“అలసులు మందబుద్ధియుతు లల్పతరాయువు లుగ్రరోగ సం
కలితులు మందభాగ్యులు సుకర్మము లెవ్వియు చేయజాల రీ
కలియుగమందు మానవులు; కావున నెయ్యది సర్వసౌఖ్యమై
యలవడు? నేమిటం బొడము నాత్మకు శాంతి? మునీంద్ర చెప్పవే?” అని అడుగుతారు.
కలియుగంలో కఠోర తపస్సులు, కష్టసాధ్యమైన అనేక నియమ నిష్ఠలతో కూడినటువంటి యజ్ఞ యాగాది ప్రక్రియలు ఆచరించమంటే చేయలేరు. అందుకే అనేకమైన సులభసాధ్యమైన సాధనా మార్గాలు సూచించారు. నామ జపం, పురాణ పఠనం, శ్రవణం మొదలైనవి.
మాతృతత్త్వ ప్రధానంగా అమ్మ అవతరించింది. పరస్పర ప్రేమానురాగ, వాత్సల్యాలు అమ్మ ఆచరించి ప్రబోధించిన మార్గాలు. ఇవీ ఒక సాధనే!
సాధనా క్రమంలో అపరాధ భావన లేకుండా వుండటం ముఖ్యం. ఉపదేశం లేకుండా మంత్ర సాధన చేస్తే విపరీత ఫలితాలు వస్తాయనీ, ఒక మంత్రం నెత్తి అణుస్తుందనీ, మరో మంత్రం మైలగా వున్నప్పుడు గుర్తు వస్తున్నదనీ, అది అపరాధమేమో ననీ, ఇటువంటి భావనలతో, లేనిపోని అనుమానాలతో సతమతమవుతూ కొందరు బాధపడటం చూస్తూ వుంటాం. అటువంటి వారి భయాన్ని తొలగించటం కోసం అనురాగమూర్తి అయిన అమ్మ “మనస్సే గురువు” అనీ, “సాధ్యమైనదే సాధన” అనీ ప్రకటించింది. “ఒక సాధన గొప్పదనీ ఒక సాధన తక్కువనీ నాకు లేదు” అని అభయమిచ్చింది.
మనం చేస్తున్నామనే భావన లేకుండా మనచేత చేయించే శక్తి ఏదైతే వున్నదో దానిమీద విశ్వాసం వుంచి చేతనైనది చేయమని చెప్పింది అమ్మ. “జపం చేసుకోవటం ఎంత కష్టమో, మానుకోవడమూ అంత కష్టమే” అని మరో సందర్భంలో అమ్మ అన్నది.
పై వాక్యాలన్నీ గమనిస్తే సాధనా మార్గంలో నిర్భయంగా ప్రయాణించటం కోసం చెప్పినవి కానీ ధర్మాచరణ నుండి విముఖుల్ని చేయటం కోసం కాదని గ్రహించాలి. సాధనా మార్గంలో ఒక స్థాయికి చేరుకున్నాక అనుమానాలన్నీ వాటంతట అవే పటాపంచలై పోయి, సత్యదర్శనం జరుగుతుంది.
జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి వారు చెప్పినట్లు శాస్త్రం విధించిన సాధనా మార్గం అనుసరిస్తూ అది శక్తివంచన లేకుండా, కృషిలోపం లేకుండా ఎంతవరకు సాధ్యమయితే అంత చేయడమే “సాధ్యమైనదే సాధన” అనే వాక్యంలోని సారం. గీతలో భగవానుడు కూడా అదే చెప్పాడు.
“స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్” (భ.గీ.2-40)
ధర్మాన్ని ఏ కొంచెం అనుసరించినా అది మనలను కాపాడుతుంది అని భావం.
“సత్యం వద. ధర్మం చర” అన్నది ఉపనిషద్వాక్యం. సత్యాన్ని పలుకుతూ, ధర్మమార్గంలో నడవటం ఉత్తమ సాధన. ఈ సాధనని మనం కొంతైనా ఆచరించగలిగితే అది మనకు శ్రేయోదాయకమవుతుంది. అందులో సందేహం లేదు.