‘అమ్మా! జన్మలు లేవంటారా?’ అని అడిగితే అమ్మ, “నా దృష్టిలో లేవు. ఈ జన్మలోనే ఎదురుగా ఉన్నదాన్ని గురించే అర్థం కావటం లేదు. జన్మలదాకా ఎందుకు?” – అన్నది. ఇంకా
ఉన్నది ఉన్నట్లు అర్థం చేసుకోవటం ఏమంత తేలికైన విషయం కాదని ఒక విచికిత్స, సత్యాన్వేషణ చేయమని సందేశాన్నిచ్చింది. కొన్ని ఉదాహరణలు
అమ్మ సన్నిధిలో :
అమ్మ జిల్లెళ్ళమూడికి కాపురానికి వచ్చిన రోజులలో గ్రామంలో వర్గాలు, కక్షలూ ప్రజ్వరిల్లుతూండేవి. నాన్నగారు ఆ గ్రామ కరణం అయినందున ఒక వర్గం వారు కత్తికట్టారు. ఆ కారణంగా అమ్మపై అత్యాచారం చేయడానికి ఒకడు సాహసించాడు. అమ్మ సన్నిధిలో ఒక గుడ్డిగేదె ఉండేది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. హుటాహుటిన ఆ స్థలానికి చేరుకుని ఆముష్కరునికి అమ్మకి నడుమ ఒక అడ్డుగోడలా నిలిచింది. ఆ మూగజీవికి మనస్సు లేదంటామా? కళ్ళు ఉన్నవాళ్ళు గుడ్డివాళ్ళవద్ద సంస్కారం నేర్చుకోవాలా? పశువులు, పక్షులు, పాములు, చెట్లూ అంగరక్షకుల్లా, ఆప్తబాంధవుల్లా నిలబడేవి, ఆదుకునేవి. చేమలూ అమ్మకి
అమ్మకి సహజమైనది మనకి విశేషమౌతుంది. కాఫీకప్పు పరిమాణం గల బియ్యం గిన్నెలో పోసి కుంపటి మీద అన్నం వండేది అమ్మ. ఆ అన్నం ఒక్కరికి కూడా చాలదు. కానీ ఎంతో మంది క్షుధాగ్నిని చల్లార్చేది. అచేతన పదార్ధం. అని పిలువబడే ఆ బియ్యం అమ్మ అమృతకరస్పర్శతో అనంత చైతన్యాన్ని నింపుకుని అపరిమితంగా ఎదిగి అమ్మను అర్చించేది. కరచరణాద్యవయవాలు కలిగి, వివేచన – తార్కిక భావన కలిగి ఉన్నత శ్రేణి జీవి అయిన మానవునికి అది సాధ్యమా ?
ఒక సోదరుడు, ‘అమ్మా! ఒక మూర్తిని ఉద్దేశించి ధ్యానం చేస్తుంటే అనేక రూపాలు మనసు నిండానూ, కనుల నిండానూ వచ్చి నిలుచుంటాయి. ఏకాగ్రత కుదరటం లేదు. ఏం చేయాలి?’ అని బాధ పడినప్పుడు అమ్మ, “ఏమీ బాధపడకు, నాన్నా! నీవు ధ్యానించే దైవమే అన్ని రూపాలు కూడా తనవేనని నీకు తెలియ జెప్పటం కోసం అన్ని రూపాలతో సాక్షాత్కరించింది. అంతేగాని నీవు ఒకరిని కొలుస్తుంటే, యితరు లెవరో నీ మార్గంలో అడ్డురావటం కాదు. వారందరూ ఒక మూర్తి యొక్క విభిన్న రూపాలని భావించడమూ, గుర్తించడమే ఏకాగ్రత” అని అతని సాధన యొక్క పరమప్రయోజనాన్ని విశదీకరించింది; భిన్నత్వంలో ఏకత్వాన్ని, సామాన్యం అనిపిస్తున్న దాంట్లో విశేషాన్ని స్పష్టం చేసింది; ఒక అపోహ, మాయ తెరలను తొలగించి సత్యావిష్కరణ చేసింది.
కొన్ని ఉదాహరణలు నా ఎరుకలో?
‘HEALTH’ అనే పదంలో ‘HEAL’ అనే పదం ఉన్నది. ఒక వైద్యుడు ఒక రోగికి శస్త్ర చికిత్స చేసినపుడు శరీరం లోపల absorbable sutures నీ, శరీరం వెలుపల non-absorbable sutures ని వేస్తారు. చర్మం పై భాగం సహజంగా కలిసిన తర్వాత వాటిని తొలగిస్తారు. కాగా శరీరం లోపలి కుట్టు త్వరగానే కలిసిపోతాయి. శరీర అంతర్భాగాలు తమంతట తామే పునరుద్ధరించుకొని సహజ జీవన స్రవంతిలోకి వస్తాయి. బాహ్యేంద్రియ అంతరింద్రియ వ్యాపారాలు యధావిధిగా కొనసాగుతాయి. ఈ మొత్తం బాధ్యత ప్రకృతిదే: వైద్యుని ప్రమేయం ఏమీ లేదు. అమ్మ అంటుంది, “శరీరానికి వ్యాధి వచ్చినప్పుడు దానిని తగ్గించుకునే శక్తి శరీరానికే ఉన్నది” అని మనల్ని భయభ్రాంతుల్ని చేసే తుఫానులు, వరదలు, భూకంపాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించటానికి హేతువు సృష్టిలో సమతౌల్యం (Equilibrium) లోపించటమే.
‘రంగాంబా సుప్రజాదేవి!’, ‘కౌసల్యా సుప్రజారామ!’ అనీ అమ్మకు జన్మనిచ్చిన రంగమ్మ అమ్మమ్మని, రామునికి జన్మనిచ్చిన కౌసల్యాదేవిని స్మరిస్తాం.
‘Woman’ అనే పదంలో ‘man’; ‘female’ అనే పదంలో ‘male’; ‘She’ అనే పదంలో ‘He’ అనే పదాలు ఉన్నాయి. అంటే పురుషునికి కాని స్త్రీకి గాని జన్మనిచ్చేది ఒక స్త్రీ ‘మాతృమూర్తి’ అని తెలుస్తోంది.
ఇంకా లోతుకు వెళ్ళి తర్కించుకుంటే సృష్టి నడకకి ఆధారం తల్లీ బిడ్డల అనుబంధం, రక్తసంబంధ బాంధవ్యం; సృష్టి మనుగడకి హేతువు మాతృప్రేమ అని తెలుస్తుంది. “సృష్టి అంటేనే మాతృత్వం” అంటుంది అమ్మ. ప్రతి వస్తువుకి, జీవికి ఆధారం – తల్లి ఉంటుంది. అమ్మ అద్భుత ప్రవచన సారాన్ని వేదాలు ‘అకాశాత్ వాయుః వాయోరగ్నిః.. ఓషధీభ్యోన్నం, అన్నాత్పురుషః’ అని అభివర్ణించాయి. అంటే ఆకాశం నుండి వాయువు పుట్టింది, వాయువు నుండి అగ్ని పుట్టింది; క్రమేణ నీరు, నేల, మొక్కలు, అన్నము, అన్నము నుంచి జంతు జాలము పుట్టినవి. అంటే ఒక దానికి మరొకటి ఆధారము. అలా పోగా పోగా “సర్వానికి సర్వం ఆధారం” అని తేలుతుంది.
చాలా ఆధ్యాత్మిక సంస్థలలో, ముఖ్యంగా జిల్లెళ్ళమూడిలో ఒక చిత్రమైన పరిస్థితి తరచూ తటస్థపడుతూంటుంది. పురుషుని ‘అన్నయ్య!’ అనీ, స్త్రీని ‘అక్కయ్య!’ అనీ ఆత్మీయతతో సంబోధన చేస్తాం. వారిరువురు భార్యాభర్తలు అయినా సరే. ఈ భావవైరుధ్యాన్ని Shakespeare కవి – ‘Adam’s sons are my brethren. I hold it a sin to match in my kindred’ – అని చక్కగా వెలుగులోకి తెచ్చాడు. వివాహ సంబంధ నిర్ణయ ప్రస్తావనలో సాంఖ్యాయనస, భారద్వాజస, కాశ్యపస, కౌండిన్యస, హరితస ఇత్యాది గోత్ర నామాలతో వ్యక్తుల్ని వర్గీకరిస్తారు.
అసలు ముక్క ఏమంటే అందరిదీ ‘మాతృశ్రీ గోత్రం’- అన్ని గోత్రాలకి తొలి తల్లి – ఆద్య – అమ్మ.. కంటికి కనిపించే సామాన్యంలోని విశేషాన్ని గుర్తించటం అసామాన్యమే. ఇక కంటికి కనిపించని విశేషాన్ని విశేషంగా అర్ధం చేసుకోవటం అసంభవమే. ‘బ్రహ్మసత్యం, జగన్మిధ్య’ అన్నారు అద్వైత సిద్ధాంత ప్రవక్త శంకరాచార్యులు. అది వారి దర్శనం. “మిధ్య అంటే లేనిది అని కాదు. మార్పు. మారేది మారని దాన్లోంచి పుట్టింది. జగత్తు సత్యమే” అన్నది అమ్మ. అమ్మ దృష్టిలో బ్రహ్మసత్యమే, జగత్తూ సత్యమే.
సామాన్యుని దృష్టిలో “బ్రహ్మమిధ్యే’, ‘జగత్తూ మిధ్యే’. బ్రహ్మ పదార్ధం కంటికి కనిపించదు కనిపించే జగత్తులోని వస్తువులు, జీవరాశి సమస్తమూ నశిస్తోంది కావున. ఆశావాదికి ‘బ్రహ్మ మిధ్య – జగత్తు సత్యం; దైవం కనిపించటం లేదు, అనుభవిస్తున్న జగత్తు సత్యమే కనుక. శ్రీ రాజుబావవంటి దార్శనికులకు ‘అమ్మయే సత్యం – బ్రహ్మయే మిధ్య’, దైవం పరిమిత రూపంలో సర్వజ్ఞత్వ, సర్వవ్యాపకత్వ, సర్వశక్తిమత్వ లక్షణాలతో కళ్ళముందు కోటి సూర్యప్రభలతో అనుగ్రహ స్వరూపిణిగా అందరినీ చేరదీస్తోంది, ఉద్ధరిస్తోంది. “అమ్మ”గా. బ్రహ్మకనిపించటం లేదు. ఆ బ్రహ్మ మిధ్య; అందరి అమ్మ సత్యం.
అశుద్ధంలోనూ పరమాత్మను దర్శించమని మన పూర్వీకులు ఆవు పేడతో సందెగొబ్బెమ్మను చేసి మంగళగౌరిగా ఆరాధించమని ప్రబోధించారు. ఉన్నది. ఉన్నట్లుగా, సామాన్యంలో విశేషాన్ని గుర్తించాలంటే జగదేకసవిత్రి అయిన అమ్మ కృపావిశేషం ఉండాలి.