క్రీస్తుశకం తేదీని బట్టి 11.11.11 విశేషమైన రోజు. సంఖ్యారూప పరంగా అన్నీ ఒకటే. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ దిల్సుఖ్నగర్ శిరిడీ సాయి గుడికి బయల్దేరి వెళ్ళాను. ఈ గుడి మధ్యాహ్నం కూడా తెరచి ఉంటుంది. దర్శనానికి అవకాశం వుంటుంది కనుక అలా వెళ్ళి వచ్చేవరకు మధ్యాహ్నం పోస్టులో ‘విశ్వజనని’ నవంబరు, 11 సంచిక వచ్చి ఉందింట్లో. ‘సాయి’ తలకు కట్టుకునే రుమాలు గుడ్డకట్టుతో ‘అమ్మ’ ముఖచిత్రం. ఓహ్! ‘సాయి’ లాగా ‘అమ్మ’ ! “సాయి మా” అనుకున్నాను. క్రమంగా చూస్తే ఆపాదమౌళి పర్యంతం సాయిరూప = వేషధారణమే. ఎడమకాలిపై కుడికాలి పాదం సాయి. కూర్చున్నట్లే ఉంది. ఆ పాదంపై ఎడమ చేయి సాయి వేసినట్లే ఉంది. ధరించిన పెద్ద పూలదండ సాయి తీరది. శిలాసనాన్ని పోలిన ఆసనం. అచ్చం సాయి చిత్రం లాగే. ఆ చూపు అచ్చంగా ఆ తీరులోని సాయి చూపే అలా చూస్తుంటే సాయి కనిపించి నవ్వాడేమోనన్నట్లు అమ్మ ప్రతి స్పందనగా నవ్వినట్లు “విశద రదన హసన్ముభి”గా “అమ్మ”. నా రీడింగ్ కార్నర్ ప్రక్కన సాయి మాష్టర్ ఎక్కిరాల భరద్వాజ గురుదేవుల చిత్రపటముంటే వారికి చూపుతూ మాష్టారుగారూ ! అమ్మ! విశ్వజనని ! మాతృశ్రీ ! సాయి రూప వేషధారణలో వచ్చిందన్నాను. అలాగే దివ్యజనని అలివేలు మంగమ్మగారికి చూపుతూ మీరు సేవించిన జిల్లెళ్ళమూడి అమ్మ సాయి రూపవేషధారణతో అంటూ చూపాను. మాతృశ్రీ Voice of Mother పత్రికలకు సాయి మాష్టారు అప్పట్లో ఆశ్రమంలో ఉంటూ చేసిన సేవాకృషి – భరద్వాజుల ధర్మపత్ని కావడానికి ముందు జిల్లెళ్ళమూడిలో అమ్మసేవలో అలివేలు మంగమ్మ గారున్న విషయాలు తలుస్తుండగానే తటిల్లతలా ఉపాసనీ మహారాజ్ రచించిన “సాయినాథ మహిమ్న స్తోత్రం”లోని శ్లోకం స్పురించిందిలా – చిత్రంగా – చిత్తానంద ప్రదంగా. ఓం అం ఆ
సాయిరూపధర విశ్వమాతరమ్ (రాఘవోత్తమం)
భక్త కామవిబుధ ద్రుమం శ్రియాం (ప్రభుమ్)
మాయయోపహత చిత్తశుద్ధయే
చింతయామ్యహ మహర్నిశం ముదా!!