అమ్మ ముద్దుగా ఎవరికి ఏ పేరు పెట్టినా అది సార్థకం. అది 1960 వ దశకం. పేరాల గోపాలస్వామి గుడి వెనుక ఒక పెంకుటిల్లు. యనమండ్రవారి ఇల్లు. అందులో నుండి ఒక ఉంగరాలజుట్టు మధ్య వయస్కుడు, పేరు సుబ్రహ్మణ్యం. ఆయన ఇంగ్లీషు దొరల ఐ.యల్.టి.డి కంపెనీ ఉద్యోగి. బయటకు వద్దామని తలుపు తీశాడు. అంతలో ఒక కారు వచ్చి గుమ్మం ముందు ఆగింది. సుబ్రహ్మణ్యం గారి ఆఫీసర్ శ్రీ నోరి వెంకటేశ్వరరావు గారు కారులోనుండి దిగారు. “సుబ్రహ్మణ్యం!! నేను పొన్నూరు వెళుతున్నాను. నువ్వూ నాతో రావాలి” అన్నాడు. వెంకటేశ్వరరావు గారు తనని సొంతమనిషి కంటే ఎక్కువగా అభిమానిస్తాడు. ఆయన మాట కాదనలేక ‘సరే’ అని కారు ఎక్కాడు సుబ్రహ్మణ్యంగారు. కారు పొన్నూరు వైపు వెళుతున్నది. దారిలో వెంకటేశ్వరరావు గారు చెప్పారు. “నేను తరుచు జిల్లెళ్ళమూడి వెళుతుంటాను. అక్కడ కరణం గారి భార్య అనసూయా దేవి – రాజరాజేశ్వరి అవతారం. అమ్మగా అందరూ పూజిస్తున్నారు. వారు ఇప్పుడు పొన్నూరులో ఒకరి ఇంట్లో బసచేశారు. నిన్నూ తీసుకెళదామనిపించి వచ్చాను. అదీ సంగతి” అని వివరించారు. పొన్నూరులో అమ్మ బస చేసిన చోటుకు ఇద్దరూ వెళ్ళారు. వెంకటేశ్వరావుగారు నేరుగా అమ్మ ఉన్న చోటుకు వెళ్ళి కూర్చున్నారు. సుబ్రహ్మణ్యం గారికి అంతా కొత్త. బిడియం. బయట వరండాలో ఆగిపోయాడు. అమ్మ దగ్గర కూర్చున్న వెంకటేశ్వరరావు గారు సర్వం మరిచిపోయి అమ్మతో మాట్లాడుతూ చాలాసేపు ఉండి అమ్మ ఇచ్చిన ప్రసాదం తీసుకుని బయటకు వద్దామనుకుంటున్నారు. ప్రక్కన సుబ్రహ్మణ్యం గారు లేరు. “నాన్నా! నీ వెంట ఇంకొకరు వచ్చారు కదా ! ఆయనకి ప్రసాదం ఇవ్వాలి పిలిపిస్తా ఉండు” అని, ప్రక్కన ఉన్న ఒక అన్నయ్య గారితో “బయట సుబ్రహ్మణ్యం అనే ఆయన ఉంటాడు. సుబ్రహ్మణ్యం అంటే పలకడు. “బుద్ధిమంతుడు” అని పిలు. వస్తాడు” అని చెప్పి పంపించింది. ఆయన బయటకు వచ్చి “బుద్ధిమంతుడు గారు ఎవరు ? అమ్మ గారు పిలుస్తున్నారు” అని అడిగాడు. సుబ్రహ్మణ్యం గారు ఆశ్చర్య పోయారు. తన కన్నతల్లి ఎప్పుడూ ముద్దుగా బుద్ధిమంతుడూ బుద్ధుడూ అని పిలుస్తుంది. ముద్దుపేరు బయట ఎవరికీ తెలియదు. ఆశ్చర్యపడుతూ లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకుని ప్రసాదం తీసుకుని వచ్చాడు. అది మొదలు సుబ్రహ్మణ్యం అనేపేరుపోయి అమ్మ చేసిన నామకరణం బుద్ధిమంతుడు స్థిరపడిపోయింది. ఎంతగా అంటే జిల్లెళ్ళమూడిలో “యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్యం” అంటే, “ఆయన ఎవరు?” అంటారు. “బుద్ధిమంతుడు” అంటే, “ఆయనా! ఆయన తెలియక పోవడమేమిటీ?” అంటారు. బుద్ధిమంతుడు గారు శారీరకంగా చాలా బలహీనంగా ఉండేవారు. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నందువల్ల కుటుంబ బాధ్యతలు అన్నీ తనమీద పడ్డాయి. ఆరోజుల్లోనే F.A ( P.U.C) వరకు చదువుకున్న ఆయన బంధువుల సహాయంతో చిన్న చితక ఉద్యోగాలు చేస్తూ తన కంటే చిన్నవాళ్ళైన తమ్ముళ్ళు ఇద్దరినీ డిగ్రీవరకు చదివించి వాళ్ళు జీవితంలో స్థిరపడేవరకు తను ఒక పూట తిని రెండో పూట కడుపు మాడ్చుకుని పునుగులు, బజ్జీలు తిని వాళ్ళని చదివించాడు. పెద్దన్నయ్య తమకోసం, తమ చదువుల కోసం ఎంతో కష్టపడ్డాడన్న కృతజ్ఞతాభావం తమ్ముళ్ళిద్దరికీ ఉండేది. వాళ్ళూ కష్టపడి చదువుకొని బ్యాంకు ఉద్యోగాలలో స్థిరపడినా కూడా అన్నమాట జవదాటి ఎరుగరు. పూర్వీకులు ఇచ్చిన ఆస్తి వ్యవహారాలు అన్నీ అన్నగారి చేతుల్లోనే పెట్టారు. వారి తల్లి వెంకటసుబ్బమ్మ గారు కూడా పెద్ద కుమారుడు బుద్ధిమంతుడు అంటే అమితమైన ప్రేమ చూపించేది. చిన్న కొడుకులు పెద్ద ఉద్యోగస్తులైనా ఆమె చాలావరకు పెద్దకొడుకుని కనిపెట్టుకుని ఉండేది. తిండి తిప్పలు పట్టించుకోకుండా కుటుంబం కోసం కష్టపడటం బుద్ధిమంతుడు గారి అనారోగ్యానికి ఒక కారణం కావచ్చు. బుద్ధిమంతుడు గారు స్వయానా మేనమామ కూతురు వెంకట సుబ్బులుని చిన్నతనంలోనే వివాహం చేసుకున్నారు. వారి మేనమామ యద్దనపూడి గుర్నాథంగారు మద్రాస్ లో పంచాగ్నులవారి నూలు వ్యాపారంలో మొదట గుమాస్తాగా చేస్తూ తర్వాత వాటాదారుడుగా మారి బాగా సంపాదించాడు. మా నాయనమ్మ గారు, మేళ్ళచెఱువు సోమిదేవమ్మ గారు, గుర్నాథం గారి తల్లిగారైన యద్దనపూడి అన్నపూర్ణమ్మ గారూ ఒకే ఊరివాళ్ళు. వాళ్ళది విజయనగరం. మంచి స్నేహితురాళ్ళు. ఆరోజుల్లో ఆంధ్రదేశంలో ఆడపిల్లలు దొరకక విజయనగరం నుండి, పాల్గాట్ నుండి ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకునేవారట. అలా మాకూ వారికి కుటుంబ స్నేహం ఉండేది. యద్దనపూడి గుర్నాథం గారు కూడా అమ్మ భక్తులే. జనవరి 1 న పూజ మొదట్లో వారే చేసుకునేవారట. బుద్ధిమంతుడు గారు, మా నాన్నగారు మేళ్ళచెఱువు లింగేశ్వరరావు గారు చీరాల ILTD company లో కలిసి పనిచేశారు. ఇద్దరికీ అరే ఒరే అనే స్నేహం ఉండేది. బుద్ధిమంతుడు గారికంటే ముందుగా 1957 నుండి చీరాల డాక్టర్ గారు పోట్లూరి సుబ్బారావు గారు, కోనా సుబ్బారావు మాష్టారు చీరాల వెంకట్రావు గారు, డాక్టర్ శ్రీధర్ రావు గారు, నోరి వెంకటేశ్వరరావు గారు, శ్రీహర్షరావు యించింది. మాష్టరు గారు, జిడ్డు ప్రసాదరావు గారు మొదలైన చీరాల భక్తులతో మా నాన్నగారు దాదాపు ప్రతి ఆదివారం అమ్మని దర్శించడానికి వచ్చేవారు. నేను అప్పడు చాలా చిన్నవాడినైనా మా నాన్నగారితో పాటు నేనూ తరుచూ అమ్మ దర్శనం కోసం వచ్చేవాడిని. 1968కి ముందు ఇప్పటి అలంకార హైమ ఉన్న పూరింట్లో ఉన్నప్పటి నుండి నేను నాన్నగారితో పాటు వచ్చి ఆరోజుల్లో అమ్మ దివ్యదర్శనాన్ని, అద్భుతమైన ప్రేమని, అలౌకికమైన శక్తిని, అమ్మ చల్లని చూపులని, స్పర్శని, అమ్మ చెప్పే ఆధ్యాత్మిక విశేషాలను వాటిపై ఆనాటి పెద్దలైన సోదరుల విశ్లేషణలను విన్న, అనుభవించిన అదృష్టం నాకూ దక్కింది. ఆరోజుల్లో హైమతో కూడా సంభాషించిన అదృష్టాన్ని కూడా పొందాను. మా నాన్నగారు అన్నపూర్ణాలయం స్థాపన సమయం లోనూ, గుంటూరులో సోదరుడు కుమారస్వామి గారింట్లో ఇమామ్ ద్వారా అమ్మ ఇచ్చిన ‘జయహో మాతా మహామంత్రం’తో ఏకాహం చేసిన సందర్భంలోనూ ప్రముఖ పాత్ర ఉంది. అమ్మ దగ్గర మా నాన్నగారికి ప్రత్యక్షంగా జరిగిన అనుభవాలు చాలా గొప్పవి. ఆ కాలంలో ఎందరెందరో అమ్మ దివ్యత్వ పరిమళ అనుభవాలు చవి చూశారు. బుద్ధిమంతుడు గారికి అచంచలమైన విశ్వాసం, భక్తి.
అమ్మ ను మొదటిసారిగా దర్శించింది మొదలు దాదాపు గా ప్రతివారం జిల్లెళ్ళమూడి వచ్చేవారు. వారిని ‘ఒరే బుద్దూ’ అనే ప్రేమగా పిలిచేది అమ్మ. క్రమంగా సుబ్రహ్మణ్యం పేరు మరుగునపడి, “బుద్ధిమంతుడు” అన్న పేరు స్థిరపడింది. అమ్మని చూడకుండా బుద్ధిమంతుడు గారు ఉండలేక పోయేవారు. బుద్ధి మంతుడు గారిని చూడకుండా అమ్మా ఉండలేక పోయేవారు. ఒక సందర్భంలో బుద్ధిమంతుడు గారు స్వల్ప అనారోగ్యంతో చాల రోజులు జిల్లెళ్ళమూడి రాలేకపోతే, అమ్మ డాక్టర్ కోనా సత్యంను చీరాల పంపించింది, ఆయన్ని తీసుకురమ్మని పురమాఇంచింది
ఆరోజు ఎందుకో బుద్ధిమంతుడు గారు కూడా అమ్మని దర్శించాలని ఓపిక లేకపోయినా జిల్లెళ్ళమూడి బయలు దేరారు. డాక్టర్ కోనా సత్యం, బుద్ధిమంతుడు గారు బాపట్లలో తారసపడ్డారు. “అదేమిటీ అమ్మ నిన్ను తీసుకురమ్మని పంపించింది. నీకు ఎట్లా తెలిసిందీ నువ్వు బయలుదేరావు” అని సత్యం అన్నయ్య అడిగాడు. “ఏమో అమ్మ పిలుస్తున్నట్లు అనిపించి నేను బయలుదేరాను” అని బుద్ధిమంతుడు గారి సమాధానం. ఇద్దరూ కలిసి అమ్మ దగ్గరకు వచ్చారు. అలాంటి టెలిపతి అమ్మకు, బుద్ధిమంతుడు గారికీ ఉండేది. 1971-72 సంవత్సరం లో బుద్ధిమంతుడు గారి మామగారు గుర్నాథం గారు కాలం చేశారు. అప్పుడు బుద్ధిమంతుడు గారు అమ్మని అడిగారు. “జనవరి 1 పూజ ఎలాగ అమ్మా!” అని. “నువ్వు చేసుకో నాన్నా ! ” అని అమ్మ ఆదేశించింది. పూజ ఎలా చెయ్యాలో ఏమేం తీసుకురావాలో కూడా అమ్మే చెప్పింది.
అలా ‘ఆదేశిస్తేనే అర్థరాత్రి పూజ అయిన తర్వాత రస్కులు, టీ ప్రసాదంగా ఇవ్వడం అనేది వాడుకలోనికి వచ్చింది. అది మొదలు దాదాపు 60 సంవత్సరాలు జనవరి 1 పూజ బుద్ధిమంతుడు గారు చేసుకున్నారు. మద్రాస్ నుండి పట్టుచీరలు ప్రత్యేకంగా ఆ పూజకి గాను తెచ్చేవారు. తర్వాతి రోజుల్లో వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంత గొప్ప చీరెలు తేలేకపోయినా అమ్మ జనవరి 1 తేదీన బుద్ధిమంతుడు గారు తెచ్చిన చీరే కట్టుకునేది. ‘బుద్ధిమంతుడు ఏ చీరె తెచ్చినా నాకు ఇష్టం’ అని తన కోడలు శేషక్కయ్యకు అమ్మ చెప్పిందిట. అమ్మ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత కూడా శేషక్కయ్య అమ్మ ఆదేశాన్ని తు.చ. తప్పకుండా పాటించేది. అంత అదృష్టాన్ని వారికి ప్రసాదించింది అమ్మ. జిల్లెళ్ళమూడిలో ఒకరోజు అమ్మ దర్శనార్థం వెళితే తాటి ఆకులమీద కూర్చుని ఉంది. ఆయన ఎప్పుడు వెళ్ళినా అమ్మ కాళ్ళకు నమస్కరించి కాళ్ళను ముద్దుపెట్టుకునేవారు. అమ్మ ఆరోజు తాకనివ్వలేదు. అమ్మ పవిత్రోత్సవాలలో నాలుగవ రోజు పూజ అమ్మ బుద్ధిమంతుడు గారికి అనుగ్రహించింది.
ఆ పూజ కొన్ని దశాబ్దాలుగా బుద్ధిమంతుడు గారు చేసుకున్నారు. అట్లతద్దికి అమ్మని పెద్ద పెద్ద ఉయ్యాల వేసి ఊగించేవారు. జిల్లెళ్ళమూడిలో అదొక పెద్ద పండగ. చీరాల నుండి పెద్ద పెద్ద క్యాన్లలో అట్లపిండి తెచ్చి అందరింటిలోని అందరు ఇళ్ళల్లో అట్లుపోయించి అమ్మకు నివేదించి అందరికీ ప్రసాదంగా ఇచ్చేవారు. ఆ పండగా కొన్ని దశాబ్దాలుగా బుద్ధిమంతుడు గారు చేశారు. దీపావళి పండుగ కూడా బుద్ధిమంతుడు గారిని చేసుకోమని అమ్మ ఆదేశించింది. చీరాలనుండి మతాబుల రజను తీసుకొచ్చి జిల్లెళ్ళమూడిలో తయారు చేసేవారు. దీపావళి పండుగ ఘనంగా చేసేవారు. జిల్లెళ్ళమూడిలోని గడప గడపకూ మతాబులు బుద్ధిమంతుడు గారు పంచేవారు. ఆనాటి జిల్లెళ్ళమూడి పిల్లలకి బుద్ధిమంతుడు ఆ విధంగా ప్రేమ పాత్రుడయ్యాడు. దీపావళి వచ్చినా, అట్లతద్ది వచ్చినా, జనవరి 1 వచ్చినా బుద్ధిమంతుడు గారికోసం ఎదురు చూసేవారు. అంతటి సౌభాగ్యం అమ్మ వారికిచ్చింది. 1970 దశకంలో బుద్ధిమంతుడు గారు I.L.T.D companyలో ఉద్యోగం మానేసి తమ మేనమామ, పిల్లనిచ్చిన మామగారైన గుర్నాథం గారి నూలువ్యాపారం లో భాగస్వామిగా చీరాలలో బిజినెస్ చేశారు. తర్వాత మామగారు కాలం చేసిన తర్వాత ఆ బిజినెస్ బుద్ధిమంతుడు గారే చేశారు. చీరాలలో క్లాత్ మార్కెట్ షాపు ఉండేది. జిల్లెళ్ళమూడిలో అమ్మకు కట్టే చీరెలు, పెట్టుబడులకు కావలసిన చీరెలు, ధోవతులు మొదలైనవి అన్ని ఆయనే తీసుకువచ్చేవారు. విషయాలు అన్నీ అమ్మ బుద్ధిమంతుడు గారికే చెప్పేది. జిల్లెళ్ళమూడి వాళ్ళు శుభకార్యాలకు ఎవరికి బట్టలు కావల్సి వచ్చినా పేరాల వారి ఇంటికి అమ్మ పంపించేది. చీరాల ఎవరు వెళ్ళినా బుద్ధిమంతుడు గారింట్లో ఆతిధ్యం స్వీకరించాల్సిందే. ఆ విధంగా అమ్మే చెప్పేది. బుద్ధిమంతుడుగారి ఆరోగ్యం ఎప్పుడూ బాగుండేది కాదు. ఎన్నోసార్లు అమ్మ కాపాడింది. ఒకసారి టైఫాయిడ్ జ్వరం, విరోచనాలతో దాదాపు కదలలేని పరిస్థితి వచ్చింది. అమ్మ జిల్లెళ్ళమూడి రమ్మంది. అన్నం ఒక ముద్దకూడా తినలేని పరిస్థితి. అమ్మ వసుంధర అక్కయ్యకు చెప్పి చింతకాయ పచ్చడి, పొట్లకాయ కూర మొదలైన పథ్యంతో గోరుముద్దలు పెట్టి రోజుకో ముద్ద పెంచుతూ ఆరోగ్యం కలిగేదాకా తనవద్దనే ఉంచుకుని కళ్ళల్లో పెట్టుకుని కాపాడింది. ఇంకొకసారి అనారోగ్యం చేసి జిల్లెళ్ళమూడి వస్తే హైమాలయంలో ప్రదక్షిణలు చేయమంది. అడుగుతీసి అడుగు వేయలేక ఉన్నాడు. నా వల్ల కాదన్నాడు. మొదట కుర్చీలో హైమ ఫోటో పెట్టుకుని ప్రదక్షిణలు చేశాడు. తర్వాత హైమాలయంకి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేశాడు. క్రమంగా 108 ప్రదక్షిణలు చేయగలిగే పరిస్థితి అమ్మ తెచ్చింది. తర్వాత అమ్మ దగ్గరకు వెళితే ‘నక్క నోట్లో మట్టి కొట్టావులేరా ఫో’ అన్నదిట. ఇలా ఎన్నో సార్లు అమ్మ కాపాడింది. “నాచర్మం వలిచి చెప్పులు కుట్టించినా అమ్మ ఋణం తీర్చుకోలేను” అని ఆయన అనేవారు. అమ్మని మనసా వాచా కర్మణా ఆరాధించినవాడు బుద్ధిమంతుడు అన్నయ్య. 1976వ సంవత్సరం లో మా నాన్నగారు నాకు వివాహం చేయాలనుకున్నప్పుడు అమ్మ ప్రోద్బలంతో మానాన్నగారు లింగేశ్వరరావు గారు, బుద్ధిమంతుడు గారు జిల్లెళ్ళమూడిలో వివాహం చెయ్యాలని సంకల్పించారు. అదీ అమ్మ నిర్ణయమే. ఇద్దరు స్నేహితులు వియ్యంకు లయ్యారు. చీరాలలో ఆడ పెళ్ళి వారు మగ పెళ్ళివారూ ఒకే బస్సులో జిల్లెళ్ళమూడి తరలి వచ్చాం. అమ్మ కోడళ్ళిద్దర్నీ ( శేషక్కయ్య, వైదేహిని ) మగపెళ్ళి వారి కాళ్ళకు నీళ్ళు అందించమని ఆదేశించింది. అంతటి సౌభాగ్యాన్ని అమ్మ మాకు ఇచ్చింది. స్వతహాగా బిడియపడే బుద్ధిమంతుడు గారితో “ఆడపెళ్ళి వారి తరుఫున నేను ఉంటాను. భయపడకు” అని అభయహస్తం ఇచ్చింది. ఆటోమేటిక్ గా బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు మా నాన్నగారికి “మనం మగపెళ్ళివారం, మనం ఏమాత్రం తగ్గేది లేదు” అని మగపెళ్ళివారి పక్షాన నిలబడ్డారు.
పెళ్ళికి ముందు పెళ్ళికొడుకుని చెయ్యాలని, పైకి రమ్మని కబురు పంపింది అమ్మ. నాన్నగారు మమ్మల్ని కదలనివ్వలేదు. “పిలవంగానే వెళ్ళాలా? మనం మగపెళ్ళివారం. ఉండండి” అని నాన్నగారు ఆపేశారు. అమ్మ నాలుగుసార్లు కబురు చేసింది. చివరకు నాన్నగారు “ఇప్పుడు వెళ్ళండి” అని ఆదేశించారు. అలా సరదాగా మా పెళ్ళి జరిగింది. పెళ్లికి ముందు ఒడుగు చేశారు. పైన గదిలో నాకు బ్రహ్మోపదేశం చేసింది అమ్మ.
అలా బుద్ధిమంతుడి గారి ఒక్కగానొక్క పుత్రిక వివాహం అమ్మే స్వయంగా బాధ్యత వహించి నిర్వహించింది. బుద్ధిమంతుడు గారికి ముగ్గురు కుమారులు.
వై.వి.యల్. నారాయణ, వెంకట రమణ మూర్తి, రాజా ప్రభాకర్. పెద్ద కొడుకు Deaf and dumb teacherగా ఉద్యోగం చేశాడు. ఆయన చాలా రోజులు వివాహం చేసుకోలేదు. రెండవ కుమారుడు వెంకటరమణమూర్తి సెంట్రల్ బ్యాంకు ఉద్యోగి. ఆయనకు ముందు వివాహం జరిగింది. పెద్ద కుమారుడు physically challenged యువతిని ఎవరినైనా ఆదర్శ వివాహం చేసుకొని వాళ్ళ జీవితానికి అండగా నిలబడాలని ఆశించాడు. అక్కడా అమ్మ బుద్ధిమంతుడు గారికి సహాయపడింది.
తన రెండవ కోడలు వైదేహి సోదరి నిర్మలను, (ఫిజికల్లీ హాండికాప్డ్) బుద్ధిమంతుడు గారి పెద్దకుమారుని ఆదర్శానికి తగ్గట్లుగా వివాహం జరిపించింది. అలా బుద్ధిమంతుడు గారిని తన విశ్వకుటుంబంలోకి కూడా తీసుకుంది. దురదృష్టవశాత్తు పెద్దకుమారులిద్దరూ వారి కంటే ముందుగా మరణించినా ఆ బాధను తట్టుకుని నిలబడే శక్తిని అమ్మ ప్రసాదించింది. ఒకసారి బుద్ధిమంతుడు గారు అమ్మకు పట్టుచీరలు, వస్త్రాలు తేవడానికి మద్రాసు వెళ్ళారు.
- (సశేషం)