(గత సంచిక తరువాయి)
తనతో పాటు బందా సుబ్బారావు అనే స్నేహితుడు కూడా ఉన్నారు. ఇద్దరూ ఒక హెూటల్ లో బసచేసి మర్నాడు షాపింగ్ చేద్దామని అనుకున్నారు. సుబ్బారావు గారికి సిగిరెట్ తాగే అలవాటు ఉంది. ఆయన హెూటల్ గదిలో సిగిరెట్ త్రాగేటప్పుడు పొరబాటున సిగిరెట్ పరుపు మీద పడి కొంతభాగం కాలిపోయింది. సుబ్బారావు గారు కాలిన పరుపు తిరగవేసి కనపడకుండా హెూటల్ గది ఖాళీ చేద్దామనుకుంటే బుద్ధిమంతుడు గారు ఒప్పుకోలేదు. హెూటల్ వారికి జరిగిన డ్యామేజ్ చెప్పి డబ్బు కట్టి హెూటల్ గది ఖాళీ చేశారు. ఈ విషయం డాక్టర్ పొట్లూరి సుబ్బారావు గారు అమ్మ దగ్గర ప్రస్తావించి నప్పుడు “ “వాడు అబద్ధాలు చెప్పడురా! వాడు అందుకే బుద్ధిమంతుడు” అని అమ్మ వివరించింది. అమ్మకుటుంబంలోని వారంతా బుద్ధిమంతుడు గారిని తమ కుటుంబ సభ్యునిగా ఆదరించారు. అమ్మకూడా అలాగే కుటుంబ విషయాలను బుద్ధిమంతుడు గారికి చెప్పి చేయిస్తుండేది. ఒకసారి రవి అన్నయ్యను చీరాల తీసుకెళ్ళి మంచి ఖరీదైన ప్యాంట్లు, షర్టులు కొని పెట్టమంది. కానీ రవి అన్నయ్య తన రూములో జిల్లెళ్ళమూడి సోదరులు ఎవరైనా వచ్చినప్పుడు ఉపయోగపడతాయని టవల్స్, లుంగీలు మొదలైనవి కొనుక్కుని మామూలు డ్రస్సులు కొనుక్కున్నారు. బ్రహ్మాండం సుబ్బారావు అన్నయ్య బుద్ధిమంతుడు గారు ఇద్దరూ “ఏరా మామా!” అంటే “ఏరా మామా!” అని సరదాగా పిలుచుకునేవారు. అందరితో చనువుగా మెలిగేవారు.
జిల్లెళ్ళమూడి సంస్థలో అమ్మ Honorary ప్రెసిడెంట్గా ఉంటూ, వైస్ ప్రెసిడెంట్ బుద్ధిమంతుడు గారిని స్వయంగా చెప్పి నియమించింది. దరిమలా దినకర్ అన్నయ్య ప్రెసిడెంట్, బుద్ధిమంతుడు వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు.
సంస్థ కష్టకాలంలో ఉన్నప్పుడు కోర్టుకేసుల్లో నలుగుతున్నప్పుడు గోపాల్ అన్నయ్యకు అండగా బుద్ధిమంతుడుగారు నిలబడ్డారు.
అమ్మ మాట తు.చ. తప్పకుండా పాటించి కొంతమంది నుండి వ్యతిరేకతను కూడా ఎదుర్కొన్నాడు బుద్ధిమంతుడు గారు.
ఆయనకు అమ్మమాటే వేదవాక్కు అమ్మను సదా స్మరిస్తూ అమ్మ అలయప్రవేశం చేసిన తర్వాత కూడా సదా అమ్మను సజీవమూర్తిగానే ఉన్నట్లు చాలామంది సోదరులలాగానే భావించారు. పరిపూర్ణమైన జీవితాన్ని అమ్మ ఆశీస్సులను పొందారు. 2019 లో మొదటిసారి కోవిడ్ పరిస్థితుల్లో తను ఆహారం తీసుకునేటప్పుడు గొంతులో ఆహారం అడ్డుపడి ఊపిరి అడక దాదాపు కోమా స్థితిలోకి వెళ్ళి నాలుగు రోజులు చీరాల హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నారు. 20% మాత్రమే బ్రతికే ఛాన్స్ ఉంది అని డాక్టర్లు, బంధువులు కబురు చేస్తే కోవిడ్ ఇబ్బందికర పరిస్థితుల్లో నేను, నా భార్య చీరాల హాస్పిటల్లో ఆయనను చూడటానికి వెళ్ళాము. మా శ్రీమతి ‘నాన్నా! నాన్నా!’ అని పిలవగానే ‘అ!’ అని పలికి డాక్టర్లను ఆశ్చర్య పరిచాడు. అమ్మ మళ్లీ కాపాడింది. అమ్మ శతజయంతి చూడాలని బతికించిందేమో అని అంటుండే వారు. అమ్మనామ జపం దాదాపు 70,00,000 చేశారు. చనిపోయేరోజు కూడా ప్రాణాయామం, ఓంకారం, వాకింగ్, అంబికా సహస్రనామ పారాయణం చేశారు. 3-9-2022 రాత్రి 10.30 వరకు నాతో, వాళ్ళ అమ్మాయితో మనవరాళ్ళతో, ముదిమనమలతో ఆనందంగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆకస్మికంగా ఎటువంటి ఇబ్బంది పడకుండా అమ్మని చేరుకున్నారు. చివరి నిముషం వరకు అమ్మ స్మరణలోనే ఉన్నారు. ఒక యోగిలాగా అమ్మ ఎప్పుడూ పిలిచే బుద్ధిమంతుడు లాగే అమ్మ పిలిస్తే అమ్మ దగ్గరకు వెళ్ళిపోయారు. చివరి రోజులలో అటువంటి మహానుభావుడిని సేవించుకునే మహాభాగ్యం నాకూ, నా భార్యకు కలిగించిన అమ్మ పాదారవిందాలకు ఎంతైనా కృతజ్ఞులం. తన చివరి మజిలీ అమ్మ నడయాడిన జిల్లెళ్ళమూడిలోనే అన్న ఆయన కోరికను నెరవేర్చామనుకుంటున్నాము. జయహెూమాతా.