1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సాహితీ ప్రతిభా సంపన్నులు – శ్రీ పి.యస్.ఆర్.

సాహితీ ప్రతిభా సంపన్నులు – శ్రీ పి.యస్.ఆర్.

Pochiraju Seshagiri Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : March
Issue Number : 8
Year : 2022

“నరుడు నరుడౌట దుర్లభంబు” – అని ఒక నానుడి. నరుడు నరుడైనచో నారాయణుడే అని దీని భావము. ఇరువురకు రూపభేదమే అని -‘ఈశ్వరో గురురాజ్ఞేతి రూప భేద విభాగినే’ అని దక్షిణామూర్తి స్తోత్రం.

అటువంటి విశిష్ట వ్యక్తిత్వం కలిగిన శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారు అమ్మ మీద అచంచల విశ్వాసంతో అమ్మయే లోకంగా, తన ఉచ్ఛ్వాస నిశ్వాసలలోను అమ్మనే ఉపాసించారు.

పండితవంశంలో జన్మించినా ఆ ఆభిజాత్యానికి గాని, తన పాండిత్య ప్రకర్షకి గాని గర్వించని వినయశీలి, స్నేహశీలి. ఆయన పితృభక్తి తార్కాణంగా తనను ‘పురుషోత్తమపుత్రభార్గవ’ అని పిలుచుకున్నారు.

అమ్మ బిడ్డలంతా వారికి ఆత్మబంధువులే. జిల్లెళ్ళమూడి వెళ్ళేవారు ఎంత చిన్నవారైనా, అపరిచితులైనా వారి పట్ల ఆయన ‘అమ్మ’ చూపే ప్రేమని, మమకారాన్ని వర్షించేవారు.

మా పూర్వీకులు రచించిన “ముకుంద స్తవరాజము” అనే గ్రంథానికి ముందు మాట వ్రాయమని నేను కోరిన వెంటనే ఆయన 4 పేజీలు పీఠికను అద్భుతంగా వ్రాసి యివ్వడమే గాక, ఆ గ్రంథంలో ఎన్నో సవరణలు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. అంతేకాదు. ఆయన తమ మిత్రులైన శ్రీ రామడుగు వెంకటేశ్వరశర్మగారి చేత కూడా ఆ గ్రంథానికి ముందు మాట వ్రాయించారు.

అదే విధంగా నేను ‘అమ్మ’ను గురించి వ్రాసిన పాటల పుస్తకం ‘శ్రీ మాతృగురువందనం’కు కూడా తమదైన అద్భుతశైలిలో ముందుమాట వ్రాసి, ఆ గ్రంథాన్ని వారి చేతులమీదుగా 30-8-2015 నాడు జిల్లెళ్ళమూడిలో ఆవిష్కరించారు. ఇక్కడ ముఖ్య విషయమేమంటే అతఃపూర్వం వారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు.

80 ఏళ్ళవయస్సులో ఈ మధ్య పి.యస్.ఆర్. గారు తనంతట తానుగా సంకల్పించి కర్త, కర్మ, క్రియ అనీ తానే అయి సో. శ్రీ రావూరి ప్రసాద్ గారికి ‘జీవన సాఫల్యపురస్కార’ ప్రదానం చేస్తూ సన్మానించిన తీరు అద్భుతం, మరువలేనిది.

వారి శారీరక రుగ్మతలు ఏవీ తమ సంకల్పానికి ప్రతిబంధకాలు కాలేదు. అట్టి వజ్రసంకల్పం వారిది. ఇందుకు ఉదాహరణ 9-1-22 నాడు శ్రీమతి వసుంధర అక్కయ్యకు కనకాభిషేక కార్యక్రమ నిర్వహణ అన్యోన్య సహాయంతో.

వచ్చిన నచ్చిన పనులన్నింటినీ జయప్రదంగా పూర్తి చేసుకుని తృప్తిగా 13.2.22న అమ్మలో ఐక్యమైనారు. సోదరులు శ్రీ రామకృష్ణ అన్నయ్య తరువాత శ్రీ ‘విశ్వజనని’ సంపాదకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తూ, అమ్మసేవా సంస్థల అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషిచేస్తూ, అందరింటి కార్యకర్తలకు మార్గదర్శనం చేసిన శ్రీ పి.యస్.ఆర్. అన్నయ్య సేవలు అమూల్యములు, ఆదర్శప్రాయములు. వారిలోటు భర్తీ చేయలేనిది. వారి స్మృతికి ఇవే నివాళులు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!