“ఐహికముష్మిక సుఖాలను ప్రసాదించే శ్రీమాత సుఖప్రద. భోగతత్పరుడు మోక్షానికి, మోక్షార్థి భోగానికి దూరంగా ఉండటం సహజం. కానీ, లలితాదేవి నారాధించే భక్తులకు భోగమోక్షాలు రెండూ కరతలా మలకములే. లౌకిక సుఖాలు అనిత్యమైనవి. లలితాదేవి ప్రసాదించే సుఖం నిత్యమైనది. శాశ్వత సుఖప్రదాయిని అయిన లలితాదేవి ‘సుఖప్రద’ – భారతీవ్యాఖ్య.
మానవులమైన మనకు సుఖదుఃఖాలు కలుగుతూ ఉంటాయి. సుఖానికి పొంగిపోవడం, దుఃఖానికి క్రుంగిపోవడం మానవ లక్షణం. సుఖసంతోషాల కోసం అమ్మవారి నారాధించే మనల్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఇహలోక సుఖాన్ని కోరుకునేవారికి దానినే ప్రసాదిస్తుంది. అలాకాక, శాశ్వతమైన పరలోక భోగాలను ఆకాంక్షించే వారికి వాటిని అనుగ్రహిస్తుంది. కనుక శ్రీ లలిత ‘సుఖప్రద’.
“అమ్మ” – ‘సుఖప్రద’.
నిత్యమూ “అమ్మ” దర్శనార్థం అనేకులు వచ్చేవారు. వారిలో ఎక్కువమంది విధివంచితులూ, బాధాసర్పదష్టులూ. అందరూ “అమ్మ”కు తమ దీనావస్థను విన్నవించుకునేవారు. తమ అయిన వాళ్ళ దగ్గర చెప్పుకోలేనివి కూడా “అమ్మ”తో చెప్పేవారు. అలాంటి వారి నెందరినో “అమ్మ” తనచల్లని చూపులతో, మెత్తని స్పర్శతో పలకరించేది. తన సుమధుర గాత్రంతో ఓదార్చి, ఆదరించేది. “నీకేమీ ఫరవాలేదు. నేను ఉన్నాను” అని ముందుగా ఒక భరోసా నిచ్చేది. ఆ మాట చాలు, వారికి కొండంత అండ. “వాళ్ళు అనుమానంగా, బాధగా వచ్చినప్పుడు వాళ్ళ బాధ పోగొట్టాలి. సందేహం తీర్చాలి. కాని ఇంకొకటి చెప్పరాదు” అనే మాటలు బాధాతప్తహృదయాలను గురించి “అమ్మ” పడే ఆరాటాన్ని తెలియచేస్తాయి.
“అమ్మ” ప్రేమకు పరిమితులు లేవు. పతితులూ, పాపులూ అనే సరిహద్దులు లేవు. “గుణభేదమే నాకుంటే ఏ ఒక్కరూ నా దగ్గరకు రాగలిగేవారు కారు”, “నేను మీ గుణగణాలను చూసి ప్రేమించటం లేదు. నా కోసం నేను ప్రేమిస్తున్నాను” అని స్పష్టంగా చెప్పింది “అమ్మ”.
జిల్లెళ్ళమూడికి వచ్చిన ప్రతి ఒక్కరితో “అమ్మ” ముందు అన్నం తిని రమ్మని, తరువాతే పూజ అనీ చెప్పేది. “అమ్మ”తో తమ సమస్యలను, బాధలను చెప్పుకోవాలని వచ్చినవారికి ఈ మాట ఎంతో నిరాశను కలిగించేది. కానీ, తమాషాగా, వారు భోజనంచేసి, బయటకు వచ్చాక వారికెంతో హాయిగా, ప్రశాంతంగా అనిపించేది. ఆ తర్వాత కొన్నాళ్ళకు వారిని పట్టిపీడిస్తున్న రుగ్మతలు మటుమాయమై, క్రొత్త శక్తి వారిలోకి వచ్చినట్లు అనిపించినప్పుడు – సుఖప్రద అయిన “అమ్మ” దర్శన భాగ్యఫలం వారికి అనుభవంలోకి వచ్చేది.
1977 నవంబరులో ప్రకృతి విలయతాండవం చేసినపుడు జిల్లెళ్ళమూడి అంతా జలమయమై పోయింది. ఆ సమయంలో “అమ్మ”ను జిల్లెళ్ళమూడి నుంచి హైదరాబాద్, మద్రాసుకో పంపాలని ఆలోచన చేస్తున్న అన్నయ్యలతో “ఈ పరిస్థితుల్లో నేను లేకపోతే ఈ జనం ఇక్కడ ఉండగలరా? అంటే నేనుండి ఏదో చేస్తాను అని కాదు. నా ఉనికే కొంత ఊరట. కొండంత ధైర్యం. కష్టమో, సుఖమో మీతోనే నేను” అని ఆ దుర్భర పరిస్థితుల్లో కూడా తన బిడ్డల కోసం తాపత్రయ పడింది “అమ్మ”.
జిల్లెళ్ళమూడిలో ‘హాస్పిటల్’ ప్రారంభోత్సవం సమయంలో “అమ్మ” – ‘డాక్టర్’ కుర్చీలో కూర్చుంది. ‘డాక్టర్’గా లబ్ధప్రతిష్టులైన డాక్టర్ సుబ్బారావుగారు మొదటి పేషెంటుగా వెళ్ళి “అమ్మ” ముందు కూర్చున్నారు. “అమ్మ” వైద్యపరీక్షలో భాగంగా వారి కుడిచేయి మణికట్టు వద్ద పట్టుకుంది. ‘డాక్టరు’ గారికి కొన్ని వారాలుగా అక్కడ నొప్పిగా ఉండి, ‘ధర్మామీటరు’ కూడా విదలించనివ్వడం లేదట. కాని “అమ్మ” అమృతకరస్పర్శతో ఆ నొప్పి మటుమాయమైంది. “అమ్మ” కటాక్ష వీక్షణమే సర్వరోగ నివారిణి కదా! అలాంటిది చేతితో తాకాక నొప్పికి స్థానమెక్కడ?
శారీరక బాధల నుంచి మాత్రమే కాదు; మానసిక వ్యధల నుంచీ కూడా రక్షించి, సుఖాన్ని ప్రసాదించే “అమ్మ” సుఖప్రద.
ఎవరికైనా మరణం అనివార్యం. కానీ, ఎప్పుడు చనిపోతామో ఎవరికీ తెలియదు. అయితే చనిపోయే వరకు ప్రతిక్షణం చనిపోతున్నామనే భావం మాత్రం భయంకరం. అలాంటి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైన ఒక వ్యక్తి, అతని ఆత్మీయులందరినీ బాధకు గురిచేశాడు. ఎన్నిరకాల చికిత్సలు చేయించినా ఫలితం శూన్యం. చివరకు అతని ఆత్మీయులంతా అతనిని విదేశాలకు పంపాలనే ఆలోచన చేశారు. ఈ సమయంలో అతడే – ‘నన్ను కాపాడగలిగితే ఒక్క అమ్మ మాత్రమే కాపాడగలదు. ఇతరులెవరూ నన్ను రక్షించలేరు’ అన్నాడు. అతణ్ణి “అమ్మ” వద్దకు తీసుకు వచ్చి విషయం “అమ్మ”కు వివరించారు. “ఇక్కడ ఉంచండి, డాక్టరు చేత చికిత్స చేయిస్తాను. నయం కావచ్చును” అన్నది “అమ్మ”. ఆ మాటలే అభయప్రదానంగా భావించి, వారు అతణ్ణి జిల్లెళ్ళమూడిలో వదిలివెళ్ళిపోయారు. ఆనాటి నుంచి “అమ్మ” అతని బాధ్యతను స్వీకరించింది. హోమియో వైద్య చికిత్స నేర్పాటు చేసింది. ఎక్కువ సమయం తన దగ్గరే కూర్చోబెట్టుకునేది. అతని అన్ని అవసరాలూ ఎప్పటికప్పుడు జరిగే ఏర్పాటు చేసింది. ఒక్క వారంరోజుల్లో అతనిలో గణనీయమైన మార్పు వచ్చింది. అతని మనస్సు స్థిమితపడింది. ధైర్యం వచ్చింది. ఈ మార్పుకు “అమ్మ” అనుగ్రహం కారణం అంటాం మనం. కానీ, “అమ్మ” మాత్రం ‘వైద్యప్రభావం’ అంటుంది.
“అమ్మ” స్పర్శవల్ల “అమ్మ” ఉనికివల్ల, “అమ్మ” దృష్టి ప్రసారం వల్ల, “అమ్మ” వాక్యం వల్ల, “అమ్మ” సంకల్పం వల్ల అనేక అద్భుతాలు వాటంతట అవే జరిగేవి. “అమ్మ” మహిమలను అంగీకరించదు. “ఆధ్యాత్మిక శక్తిముందు ఈ మహిమలు అత్యల్పాలు” అంటుంది. అయితే, ఆ ఆధ్యాత్మిక శక్తి సాగరమే “అమ్మ” కనుక “అమ్మ” సన్నిధిలో అద్భుతాలు జరుగుతాయి. “అమ్మ” అద్భుతాలు చేయలేదు. “అమ్మ” దృష్టిలో “మంచిని మించిన మహిమలేదు”.
మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉంది వసుంధర అక్కయ్య. ఆపరేషన్ తప్పనిసరి అని డాక్టర్లు చెప్పారు. అయితే, ఏ శస్త్రచికిత్సా లేకుండానే, “అమ్మ”చేతి ఆసరాతో, మంచంపై నుంచి లేవటమే కాక, ఆ చేయి పట్టుకుని హార్సిలీ కొండల్లో “అమ్మ”తో పాటు ఎగుడు దిగుడు రోడ్లపై నడిచి, ఆ నడకను ఈ రోజు వరకూ కొనసాగిస్తూనే ఉన్నది అక్కయ్య నిరాఘాటంగా.
సోదరులు శేషసాయిగారి కడుపులో ‘అల్సర్’ ఉందని, ‘ఆపరేషన్’ చేయాలని డాక్టర్లు చెప్పారు. వారు “అమ్మ”ను దర్శించి సంగతి చెప్పారు. “అమ్మ” వారి పొట్టను తన చేత్తో తడుముతో “నీకు అల్సర్ లేదు. ఆపరేషన్ వద్దు” అని చెప్పింది. ఆ మాట నమ్మని డాక్టర్లు ఆపరేషన్ చేసి అక్కడ ‘అల్సర్’ తాలూకు చిన్న అవశేషాన్ని కూడా చూడలేకపోయారు.
చన్నీళ్ళ స్నానం అలవాటు లేని శ్రీపద్మనాభుని వెంకటరత్నంగారు జనవరి నెలలో జిల్లెళ్ళమూడిలో “అమ్మ” ఆదేశంపై ఒకరాత్రి ఆగిపోవలసి వచ్చింది. ఆ మర్నాడు ఉదయం స్నానానికి నీళ్ళు పంపుల దగ్గరకు వెళ్ళి, చలికి వణుకుతూ బక్కెట్టు పంపు క్రింద పెట్టారు. ఆశ్చర్యం. పొగలు కక్కుతూ వేడినీరు వచ్చింది. ఇంకా ఆశ్యర్యం ఏమిటంటే – ఆ పంపు ఉన్న గొట్టానికే అమర్చి ఉన్న ఇతర పంపుల్లో చల్లని నీరు రావడం. ఇదెలా సాధ్యం? “అమ్మ”కు ఏదైనా సాధ్యమే. తన బిడ్డ సుఖంగా ఉండాలి అనుకనే ఆ తల్లికి సాధ్యం కాని దేముంటుంది?
మన అందరి వలె జన్మించినా హైమక్కయ్య చాలా ప్రత్యేకంగా ఉండేది. మనిషి ఎంత నిర్మలంగా ఉండవచ్చునో హైమక్కయ్య ద్వారా నిరూపించింది “అమ్మ”. అంతటా ఆత్మను దర్శించిన హైమక్కయ్య “అమ్మ” సన్నిధి భాగ్యాన్ని కోరుకున్నది. ఆమె కోరిక ప్రకారమే “అమ్మ” – శాశ్వతమైన కైవల్య పదాన్ని అనుగ్రహించి,లోకారాధ్యగా హైమక్కయ్యను ప్రతిష్ఠించింది.
“అమ్మ” సందర్శనానికి వచ్చిన ఎందరో తమ బాధలను, సమస్యలను “అమ్మ”కు విన్నవించుకునేవారు. అన్నీ విని “అమ్మ” – “చెప్పటం చేత కాదు నాన్నా, ప్రసాదం ఇచ్చానుగా” అనేది. అప్పుడు వారి కేమీ అర్థం కాకపోయినా ఆ తర్వాత తెలిసేది – ఆ ప్రసాదంలోనే తమ సందేహానికి సమాధానమూ, సమస్యలకు పరిష్కారమూ, వ్యాధికి ఔషధమూ, బాధకు నివారణమూ, సకల శుభాలూ, సమస్త సుఖాలూ నిక్షిప్తమై ఉన్నాయని.
ఇలా ఎన్ని చెప్పుకున్నా, ఇంకా చెప్పుకోవాల్సినవి కోకొల్లలుగా ఉంటాయి. మన దుఃఖానికి కరిగిపోయే తల్లి, మన సుఖసంతోషాలను కోరుకునే తల్లి, మన అందరకూ అండదండలుగా ఉండి, నిరంతరమూ మనతోనే ఉండే “అమ్మ” – ‘సుఖప్రద’.
అర్కపురిలో అనసూయేశ్వరాలయంలో ‘సుఖప్రద’గా కొలువు తీరిన “అమ్మ” అడుగుదమ్ములకు అంజలి ఘటిస్తూ – జయహోమాతా!
మాతృసంహిత గ్రంథకర్తకు కృతజ్ఞతాంజలులు. సమర్పించుకుంటున్నాను.