లోకకళ్యాణం కోరి ఎందరో మహాత్ములు వేర్వేరు కాలాలలో చైతన్య అధిగమనం ద్వారా నిత్యసత్య స్రష్ట లయ్యారు. ఆ సత్య సత్వాలను వారసత్వంగా తరువాతి తరాలకు అందించారు. 1923-1985 మధ్య ఆంధ్ర దేశంలో, గుంటూరుజిల్లాలో జిల్లెళ్ళమూడిలో అమ్మ తన జీవిత మహోదధి (2004)లో “అందరికీ సుగతి” అని ప్రకటించి ధ్యాస, ఆరాధన వంటి మార్గాలు సూచించారు. జననమరణాలు కేవలం మార్పులు అనీ మానవుడు జన్మ రాహిత్యం కోసం ప్రయత్నించనక్కర లేదనీ ఖచ్చితంగా చెప్పారు. తమ విశ్లేషణ, తీర్మానం ఆధారంగా “సుగతి యోగము” ను రూపొందించి, సిద్ధాంతమూ సూత్రాలూ అభ్యాస క్రమమూ పొందుపరిచారు.
వ్యక్తస్థితి నుంచి అవ్యక్తస్థితికి చైతన్యాధిగమనమే యోగము. ఈ యోగము సుగతి కొరకే. మానవుడు ఎనిమిది భూమికలలో ప్రయాణం చేయాలి. ఈ ఎనిమిది భూమికలే ఎనిమిది తలాలు.
01.మనస్సు( ఇది ఆహారము వల్ల ఏర్పడుతుంది)
- నేను (ఇది అధి యజ్ఞం)
- కరుణ ( కష్ట సుఖాలను సూచిస్తుంది)
- కాలము ( వాసనలు గుణములు దీనిలో భాగంగానే ఉంటాయి)
05.చైతన్యము (ఇది చిత్ స్వరూపం)
06.అసలు(ఇదే శక్తి తత్త్వము)
- స్పందన (ఇదే విక్షేపము)
- మరుగు ( ఇదే గురు తత్త్వము)
వీనిలో మనస్సు, నేను, కరుణ, కాలము అనేవి వ్యక్త ప్రపంచం పరిధిలోకి వస్తాయి.
చైతన్యము, అసలు, స్పందన, మరుగు అనేవి అవ్యక్తం పరిధిలోకి వస్తాయి. వ్యక్తమైనవన్నీ రూపము, నామము, గుణము, పరిమితి, వాసనలు అనేవి కలిగినవే. ఇవన్నీ అహంస్ఫురణతో లొంగి ఉంటాయి. అమ్మ ప్రకారం నామము, రూపము, శక్తి, చైతన్యము తక్కువవి కావు. తరుగుఒరుగులు లేని శక్తి కొండలాదిగా తరంగమై, కరుణయై, మనందరిచేత తరుణం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మనం చేయవలసినవి చేయిస్తుంది. రాగద్వేషాలు, కష్టసుఖాలు వంటి ద్వంద్వాలు అన్నీ భౌతిక ప్రపంచంలో అవసరమే. భ్రాంతి చేతనే భ్రాంతి పోతుంది కనుక భ్రాంతిని ఖండించడమో, అపవాదంగా చూడడమో చేయకూడదు.
నిరంతరం వ్యక్తంలో అవ్యక్తస్ఫురణ ఉంటుంది. పరస్పరం ఆధారంగా ఉంటాయి. ఇదే “సర్వానికి సర్వం ఆధారము” అన్నారు అమ్మ. కనబడే మెట్టు ఆధారంగా పైనున్న గట్టు చేరాలి. మెట్టూ అవసరమే. ఈ సాధనా క్రమంలో సాధ్యమైనదే సాధన. ధ్యాసే ధ్యానము. మననం చేత మాట మంత్రమౌతుంది.
అభ్యాసము
స్థూల శరీరాన్ని సమన్వయం చేసుకుంటూ శక్తిని ఊర్ధ్వముఖంగా మరలించి, ధ్యానంలో మగ్నమవాలి.
వీటికి గాను ఐదు స్థితులలో దేహ మనో శక్తి స్థితులను ఉంచాలి.
- ద్రవ్యరాశి సమన్వయం – ఈ స్థితిలో సుఖాసనంలో ఉండి చిన్ముద్ర, యమపాశ ముద్ర, అంజలి ముద్రలలో నాభి, అనాహతం, ఆజ్ఞ వరకూ, మరల ఆజ్ఞ, అనాహతం, నాభి వరకు ఉంచాలి.
- శక్తి ఉత్థానము – శరీరంలో వాయు శక్తిని ఊర్ధ్వముఖంగా మరలించాలి. షట్చక్రముల వద్ద కుంభిస్తూ క్రింద నుండి పైకి స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, ఆజ్ఞ లలో శక్తి కుంభించి, బ్రహ్మ రంధ్రంలో గోవింద ముద్రతో నిలబెట్టాలి. ఆజ్ఞ వద్ద అంజలి ముద్రలో ఉంచాలి. ఇలాగ క్రింద నుండి పైకి 1,2,3,4 స్థాయిలో శక్తిని పెంచి, పై నుంచి 4,3,2,1 లలో వలయం ఏర్పరచాలి.
- వికిరణ గ్రహణము- ఈ స్థితిలో కన్నుల ద్వారా, చెవుల ద్వారా వికిరణశక్తి గ్రహించాలి.
- మరుగు గడపలోకి – ఇది భ్రూమధ్య ధ్యానంతో సరిపోతుంది. ఈ స్థితిలో కాలము, కర్మ,అనే వాని క్రియాశీలమైన ప్రభావం నుంచి దూరం అవుతారు.
- అధిధ్యానము ( ఇది అన్నిటికంటే చివరిది. పై దవడదాటి నాలుక మడిచి అంగిటిని నొక్కే అధ్యాత్మస్థానం మీద ఉంచి ధ్యానం చేయాలి.
ఈ పంచతంత్రసమన్వితమైన అభ్యాసము ద్వారా మరుగులో ప్రవేశించి, అది ధ్యానములో ఉండడం చేయాలి.
స్థితి,క్రియా,ప్రకాశ గతులలో శ్వాసపై అధికారం సాధించాకనే ద్రవ్యరాశి సమన్వయము, శక్తి ఉత్థానములకు పూనుకొనాలి. ఈ సుగతియోగములో పంచభూతాల, పంచతన్మాత్రల స్థితి దాటి, చైతన్య స్పృహతో అధిగమించాలి.
ఇది శక్తితో సమన్వయం కలిగిస్తూ, మరుగులోకి చేర్చగలదు. ఇదే సుగతి. ఈ ప్రయత్నం.