“సృష్టి, స్థితి, లయాలను బ్రహ్మవిష్ణు మహేశ్వరుల చేత నిర్వహింపజేసే పరమేశ్వరి శ్రీమాత. త్రిమూర్తులు లలితాదేవి ప్రేరణవల్లనే సృష్టి స్థితి లయాలకు కర్తలైనారని “సౌందర్యలహరి”లో శ్రీ శంకరాచార్యుల వారు స్పష్టం చేశారు. సాత్త్విక, రాజసిక, తామసిక శక్తులను సృష్టించి, వాటి ద్వారా సృష్టి స్థితి లయాలను జగన్మాత నిర్వహిస్తోంది. పరాశక్తి ప్రేరణ వల్లనే సృష్టికార్యం నడుస్తోంది. కనుకనే ఆమె సృష్టికర్తి.
చరాచర జగత్తును సృష్టించేటప్పుడు దేవికి బ్రహ్మరూప అని పేరు. బ్రహ్మచేత సృష్టికార్యనిర్వహణ చేయిస్తుంది శ్రీమాత” – భారతీవ్యాఖ్య.
బిడ్డకు జన్మనిచ్చి, తాను పునర్జన్మను పొందే సామాన్య స్త్రీమూర్తినే మాతృదేవతగా భావించి, గౌరవించే దేశం మనది. “మాతృదేవోభవ” అంటూ స్త్రీకి అగ్రతాంబూలం ఇచ్చి, తల్లిని దైవంగా ఆరాధించే సంప్రదాయం మనది. మరి, శ్రీలలిత జగన్మాత కదా ! జగత్తుకే తల్లి, జగత్తే తల్లిగా భావించే శ్రీమాత ముగ్గురమ్ములకు, ముగ్గురయ్యలకు ‘మూలపుటమ్మ’. అంతేకాదు. ఈ సకల చరాచర సృష్టికి మాతృమూర్తి ఆమె. స్థావర జంగమాత్మకమైన ఈ సమస్త సృష్టి ఆమె స్వరూపమే. అంటే – సృష్టే అమ్మ స్వరూపం. అమ్మే సృష్టికి మూలరూపం. ఆమె ఆదిశక్తి. ఆ పరాశక్తి ఆదేశం మేరకు బ్రహ్మ సృష్టి కార్యాన్ని నిర్విఘ్నంగా నిర్వరిస్తున్నాడు. నిర్వహిస్తున్న బ్రహ్మరూపంలో ఉన్నది కూడ అమ్మవారే. అందువల్లనే ఆమె బ్రహ్మరూప. బ్రహ్మరూపంలో సృష్టికార్యాన్ని చేపట్టిన తల్లి కనుక ఆమె సృష్టికర్తి.
“అమ్మ” – సృష్టికర్తి, బ్రహ్మరూప. “ఈ సృష్టి అనాది, నాది” అనే అమ్మవాక్యమే ఇందుకు ప్రమాణం. ఈ సృష్టినాది. అని “అమ్మ” చెప్పడంలోనే ఈ సృష్టిని రూపొందించింది. తానే అనే భావం ప్రస్ఫుటమవుతోంది. అందువల్ల “అమ్మ” – సృష్టికర్తి సోదరులతో సంభాషిస్తూ ఒకసారి “అహం బ్రహ్మాస్మి” అని చెప్పిన “అమ్మ” వెంటనే “ఇక్కడ అహం అంటే నేను అని కాదు” అంటూ ఏవేవో మాయమాటలు చెప్పి, నిజాన్ని కప్పిపుచ్చేసింది. ఇంకొక సందర్భంలో “ఇవ్వాళ ప్రొద్దున పిచ్చుక గడ్డిపరక వేసింది నామీద. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాదు. బ్రహ్మ మీద పిచ్చుకాస్త్రం” అంటూ కుండబద్దలు చేసింది “బ్రహ్మరూప” అయిన అమ్మ.
“నేను గురువును కాను, మీరు శిష్యులు కారు
నేను మార్గదర్శిని కాను, మీరు బాటసారులు కారు
నేను తల్లిని, మీరు బిడ్డలు” అంటూ తాను తల్లిని అని నొక్కి వక్కాణించింది. “తల్లి అంటే తొల్లి” (మొదలు) అని కూడా “అమ్మే” ప్రకటించింది. మరొకసారి తాను “ఆదెమ్మను” అని చెప్పింది. (ఆది అంటే మొదటగా ఉన్న + అమ్మ) – ఈ సృష్టికి పూర్వమే ఉన్న “అమ్మ”, ఈ సృష్టిని రూపొందించింది. కనుక “అమ్మ” – సృష్టికర్తి. ఈ సృష్టిని నిర్విరామంగా తాను కొనసాగిస్తున్నాని చెప్పడానికి అన్నట్లుగా “తాను ఎప్పుడూ నిండుగర్భిణిని” అని చెప్పింది. “అమ్మ”, “ఎప్పుడో కని పెంచాను. ఇప్పుడు కనిపించాను” అనే వాక్యం కూడా ఈ సృష్టికి కారణభూతురాలు, సృష్టికర్తి అయిన ‘తాను’ మనలను అనుగ్రహించడానికి ఇప్పుడు, ఈ భూలోకంలో “అమ్మ”గా మనకు కనిపించి, కనువిందొనరించింది అనే విషయాన్నే వ్యక్తం చేస్తోంది.
“మీ సాధన ఏమిటమ్మా?” అనే ప్రశ్నకు “బిడ్డల్ని కనటమే” అనే “అమ్మ” సమాధానం ఎప్పుడూ ఈ సృష్టి కార్యక్రమంలోనే తాను నిమగ్నమై ఉంటాను అనే సందేశాన్ని అందిస్తోంది. “మీరెవరమ్మా?” అనే ప్రశ్నకు సమాధానంగా “అమ్మను నాయనా ! నీకు, మీకు, అందరికీ” అని చెప్పి, సృష్టికర్తిగా, బ్రహ్మరూపగా ప్రకాశించింది “అమ్మ”.
అర్కపురీశ్వరి అనసూయమ్మను సృష్టికర్తిగా, బ్రహ్మరూపగా దర్శించి, ఆరాధించడం కంటే ఈ జన్మకు సార్ధకత ఏముంటుంది -మాతృశ్రీ “జిల్లెళ్ళమూడి అమ్మ”కు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ…..
– (అమ్మవాక్యాలు” రచయితకు కృతజ్ఞతలు.)