అమ్మను గురించిన నా అనుభవం ఏదో ఒకటి వ్రాయమని నన్ను పదేపదే అడగడం వలన నేను ప్రయత్నించక తప్పడం లేదు. అమ్మను దర్శించుకున్న ప్రతివ్యక్తికి అమ్మ మహిమలను గురించి అనేకానేక అనుభవాలుంటాయి. కొన్ని మనం గుర్తిస్తాము, గుర్తుంచుకుంటాము. అనేకం అసలు గుర్తించలేం. గుర్తించలేనివే ఎక్కువ ఉంటాయి.
ఒక పర్వదినాన నేను జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనం కోసం వెళ్ళాను. ఉదయం 9 గంటల ప్రాంతంలో పై అంతస్తు అమ్మగది ముందు వరండాలో అమ్మదర్శనం ఏర్పాటు చేయబడింది. ముప్ఫై నలభై మంది సందర్శకులు కూర్చుని ఉన్నారు. ముందు వరుసలోనే ఒక ప్రక్క గోడవైపు నేనూ కూర్చుని వున్నాను.
ప్రియసోదరులు త్రిలోక అప్పారావుగారు ఆ రోజు పాలతో అమ్మ పాదాభిషేకం, పూజ చేసుకోవడం ప్రధాన కార్యక్రమం. ఆయన రెండు పెద్ద బుట్టలనిండా గులాబీలు, ఆ ఊరిలో నుండి రెండు మూడు బిందెల పాలు తెచ్చుకున్నారు. పాదాభిషేకం ప్రారంభమయ్యింది. అప్పారావు అన్నయ్య పెద్దగ్లాసులతో అమ్మ పాదాలపై పాలుపోసుకున్నారు. ఇంకా కొంచెం మిగిలి వుండగా రామకృష్ణన్నయ్య అక్కడున్న మరికొంత మందిని పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాసు పాలిచ్చి అమ్మ పాదాల మీద పోయించారు. ఆఖరు గ్లాసుకూడ పూర్తయ్యింది. నాకు అవకాశం రాలేదు. అమ్మ రామకృష్ణయ్యతో రామచంద్రారెడ్డికి కూడ ఒక గ్లాసియ్యి’ అన్నది. అన్నయ్య ‘ఇంకా ఎక్కడున్నాయమ్మా, నీ ముందేగా కుమ్మరించాను’ అన్నారు. నేను ముందు వరుసలోనే ఉండడం వలన బిందె పూర్తిగా బోర్లించడం నేను చూశాను. అందులో ఇంకా మిగిలి వుండే అవకాశం లేదు. మళ్ళీ చూడు అన్నదమ్మ. అన్నయ్య బిందె తీసుకుని గ్లాసు పట్టి బోర్లించారు. గ్లాసు పెద్దదే. గ్లాసునిండింది. ఆ గ్లాసు పాలు నా చేతికిచ్చాడు. నేను అమ్మ పాదాల పైన పోసుకున్నాను..
అమ్మ ఆదేశంతో అమ్మ ప్రత్యేకంగా సృష్టించిన గ్లాసుడు పాలతో పాదాభిషేకం చేసుకోగలగడం నా అదృష్టం.
ఆ తర్వాత అప్పారావు అన్నయ్య తెచ్చుకున్న గులాబీపూలతో అప్పారావు అన్నయ్య తర్వాత అక్కడ ఉన్న మిగిలిన అందరం అమ్మ పాదాలకు పూజ చేసుకున్నాము. నాకు గుర్తుండి పోయిన అనుభవాలలో యిది ఒకటి.
: మాతృదేవికి మంగళం :