“తెలియనిది తెలియజేయడానికే నా ఈ రాక” అని తన అవతార పరమార్థాన్ని తెలియచేసింది అమ్మ. సృష్టి వేరు, పరమాత్మ వేరు అన్న భ్రాంతిలో ఉన్న మనకు ‘పరమాత్మ వేరు, సృష్టి వేరు కాదు; సృష్టే పరమాత్మ పరమాత్మే సృష్టి’ అనీ ఆత్మతత్త్వాన్ని తెలియచెప్పడం కోసమే తాను అవతరించానని అమ్మ ఎరుకపరిచింది.
‘యద్ జ్ఞాత్వా నేహ భూయో న్యత్
జ్ఞాతవ్య మవశిష్యతే’ – దేనిని తెలుసుకున్న తర్వాత ఈ జగత్తులో తెలుసుకొనవలసినది ఏది మిగలదో అదే ఆత్మతత్త్వం. తెలియవలసినది అది.
‘ఆత్మైవేదం జగత్సర్వమాత్మనోన్యన్న విద్యతే |
మృదోయద్వత్ ఘటాదీని స్వాత్మానం సర్వమీక్షతే |”
నామరూపాత్మమైన ఈ సమస్త విశ్వం పరబ్రహ్మ స్వరూపమే అనే పరమార్థాన్ని పరమసత్యాన్ని తెలుసుకున్నవారే తత్త్వవేత్తలు. ఈ సత్యాన్ని అమ్మ అనేక విధాలుగా ఎన్నో ఉదాహరణలతో మనకు ప్రబోధించింది. ప్రాణికోటి వేరువేరుగా కన్పిస్తున్నా అందరిలో ఉన్న చైతన్యం ఒకటే. అదే వెలుగులకు వెలుగు. ఆ పరబ్రహ్మతత్త్వమే తెలుసుకొనవలసినది. దానిని తెలుసుకునే తెలివే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? తెలియవలసినది తెలియడం. అందుకే రాజుబావ ‘తెలిసెడి తెలివిని తెలుపుము తల్లీ, తేటతెల్లముగ తెలివే నీవై’అని ప్రార్ధించారు.
‘సృష్టి ఎవరు చేశారు?’ అన్న దానికి కూడ “దైవం సృష్టి చేయడం కాదు. దైవమే ఇన్ని రూపాలుగా అయింది. ఉన్నది ఒక్కటే. ఆ శక్తికి స్త్రీ పురుష భేదం లేదు. శక్తే దైవం. కనిపించే సృష్టికంటే దైవం ఎక్కడుంది?”అని వివరించింది. మన దృష్టిలో దేవాలయం భగవంతుడు కాదు. గర్భాలయంలో కొలువైన వాడే భగవంతుడు అనుకుంటాం. కానీ అమ్మ దృష్టిలో దేవాలయమే కాదు, దేవాలయంలోని అణువణువు గోడలు, గడపలు, ఇటుక, సిమెంటు మొదలైన రూపాల్లో ఉన్నది కూడ భగవంతుడే. అలాగే ‘అమ్మ’ అనే పదాన్ని “దేనికయితే ఆది అంతమూ లేదో ఏది సర్వానికీ ఆది అంతమో అదే అమ్మ”అని నిర్వచించింది.
‘సృష్టి అంటే మనుష్యరూపం మాత్రమే కాదుగా, అనుక్షణం జరిగేదే”, “సృష్టికి ఆద్యంతాలు లేవు” అన్న అమ్మ వాక్యాల వల్లనే – ఆది అంతములేనిది సృష్టి; ఆది అంతమూ లేనిది అమ్మ. అందువల్ల సృష్టే అమ్మ – అని అర్థం అవుతోంది. కనుక అమ్మ పుట్టినరోజు అంటే సృష్టికి పుట్టినరోజు.
‘యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః |
తత్రకో మోహః కఃశోక ఏకత్వమనుపశ్యతః ||’
ఎవరయితే సమస్త ప్రాణులను ఆత్మలాగా దర్శిస్తారో అంతటా ఏకత్వాన్ని దర్శిస్తారో వారికి శోకం గాని దుఃఖం గాని అంటదు. అంతా తానే అనుకునే జ్ఞానికి దుఃఖమూ లేదు, మోహమూ లేదు.
“మీరు కానిది నేనేదీ కాదు. మీరంతా నేనే, మీదంతా నేనే, ఇదంతా నేనే. అందరిలోనూ అంటే మంచివారిలోనూ, చెడ్డవారిలోనూ గొప్పవారిలోనూ ‘నేను’గా వెలుగుతున్న చైతన్యమంతా తానేనని పలుసందర్భాల్లో అమ్మ స్పష్టం చేసింది. “ఉన్నదంతా దైవమే” అన్న అమ్మ దృష్టిలో ద్వంద్వం ఏమీ లేదు. “ప్రజ్ఞానం బ్రహ్మ అయితే అజ్ఞానమూ బ్రహ్మే” అనీ “ఆనందోబ్రహ్మ’ అనే వాక్యాన్ని ‘బాధా భగవంతుడే’ అంటుంది.
బాల్యంలో ఒకసారి అమ్మ తన తాతమ్మగారితో కలిసి మన్నవనుండి చేబ్రోలుకు కాలినడకన బయలు దేరింది. దారిలో కాలువలనూ, చెరువులనూ, చెట్లనూ, పైర్లనూ, పిట్టలనూ అన్నింటినీ చూస్తుంది. అమ్మకు అన్నింటిలో తన ప్రతిరూపమే కనిపించింది. అయితే ఇవన్నీ నేనేనా అని ప్రశ్నించుకుని “అవును ఇవన్నీ నేనే” అని తనకు తానే సమాధానం చెప్పుకొని ‘మరి ఇన్నిగా కన్పిస్తున్నది ఏమిటి?’ అని మళ్ళీ తానే తర్కించుకుని ‘ఒక్కటే ఇన్ని అయింది కనుక’అని సమాధానపడి ముందుకు నడిచింది. ఈ సందర్భంలోనే ‘ఒకటి అనేకమయింది కనుక అనేకంలో ఆ ఒక్కదాన్ని చూడడం సాధన అనీ, అనేకం ఒక్కటిగా తోచటమే ఆత్మ సాక్షాత్కారమ’ని అద్భుతంగా ప్రవచించింది అమ్మ.
‘దైవం సర్వాంతర్యామి అనీ, అంతటా అన్నింటిలో అన్నీ తానే అయి ఉన్నాడని’ చెప్తూనే సాధన దశలో ‘ప్రధమం సగుణ మాశ్రిత్య తతో నిర్గుణ మాశ్రయేత్’ అన్న సంప్రదాయ సూక్తిని ‘నిగ్రహం కొరకే విగ్రహారాధన’ అనీ నామరూపాత్మకమైన దైవాన్ని అర్చించడం ద్వారా నామరూపాలకు అతీతమైన పరతత్త్వాన్ని అందుకోవచ్చునన్న ఆధ్యాత్మిక వాఙ్మయ ప్రబోధాన్ని ‘కాలువనిండా నీరున్నా దిగడానికి రేవు కావాలి కదా’ అని ప్రవచించింది అమ్మ.
విగ్రహారాధనతో ప్రారంభమైన సాధన అనన్యచింతనగా పర్యవసించి అంతటా అన్నిటా ఆ దైవాన్ని దర్శించకలగాలి. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస సాధన అమ్మవారి విగ్రహా రాధనతో ప్రారంభమై అంతటా జగత్తునే మాతగా దర్శించగలిగారు. అందుకే అమ్మ ‘జగన్మాత అంటే జగత్తే తల్లి’ అని నిర్వచించింది. “అన్నీ నేనే, నేను సర్వానికీ మూలాన్ని’ అని ప్రకటించిన అమ్మ ‘మావన్నీ నీకెట్లా తెలుస్తాయమ్మా?’ అన్న వారితో “నా ప్రవర్తన నాకు తెలియదూ!” అన్నది. ‘మేము మాట్లాడుకునేది నీకెట్లా వినిపించింది?’ అని అడిగిన సోదరులతో “మీరు మాట్లాడుకునేది మీకు వినిపించటం లేదూ? అలాగే అన్నీ వినపడతాయి. అన్నీ కనపడతాయి” అన్నది.
ఒకసారి ఒక సోదరులు ‘మీ అమృత హస్తంతో నన్ను తాకండమ్మా’ అని ప్రార్థిస్తే “ఎప్పుడూ తాకే ఉన్నానుగా, నాన్నా!” అన్నది. అతనికి అర్థంకాక అడిగాడు. ‘ఎప్పుడూ తాకడమంటే?’ అని. ‘నేను’ అందరిలో ఉన్నది కదా! అందుకే ఎప్పుడూ తాకే ఉన్నాను. అని అన్నాను” అన్నది ఆత్మ స్వరూపిణి అమ్మ. ఉన్నదంతా అమ్మే ఈ విశ్వంగా కనపడుతోంది. విశ్వమే తానైన రూపం కనుక విశ్వజనని. ‘విశ్వమంతా నిండిన రూపమే విశ్వరూపం’ అని అమ్మ చెప్పినట్లుగా సృష్టిలోని ప్రతి వస్తువునూ ప్రతి వ్యక్తినీ అమ్మగా దర్శించాలి.
అమ్మను దర్శించడం అంటే అమ్మ తత్త్వాన్ని అర్థంచేసుకోవడం. అమ్మ ప్రబోధాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడం. అమ్మను ఆరాధించడం అంటే అమ్మ గుణాలను అలవరచుకోవడమే. అమ్మ బిడ్డలుగా ఆచరణద్వారా అమ్మ తత్త్వాన్ని జగద్వ్యాప్తం చేయడానికి సారధులం కాగలిగితే అమ్మకు అదే నిజమైన అర్చన అన్పిస్తుంది.