1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సృష్టి స్థితి లయకారిణి – అమ్మ

సృష్టి స్థితి లయకారిణి – అమ్మ

R. Lakshmi Narayana
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : June
Issue Number : 11
Year : 2014

(సృష్టి పరమ విచిత్రము. అనంతమైన నామ రూపాలతో చిత్ర విచిత్రములైన పదార్థాల రూపంలో వ్యక్తమయ్యే సమస్త సృష్టి ఒకే చైతన్యానికీ శక్తికీ తత్త్వానికీ ప్రతీక అని, దృశ్యమానజగత్తులోని అనేకత్వంలో ఆ ఏకత్వాన్ని దర్శించటమే మానవ జీవితానికి చరమలక్ష్య మనీ తత్త్వవేత్తలైన ఋషులూ అవతారమూర్తులూ అనాదిగా ప్రవచిస్తున్నారు. ఆ పరతత్త్వమే రామునిగా, కృష్ణునిగా, రాజరాజేశ్వరిగా, రామకృష్ణ పరమహంసగా, అమ్మగా అభివ్యక్తిని పొందుతున్నదని తత్త్వవిదులు ఉదోషిస్తున్నారు. అమ్మ అనుగ్రహం అపరిమితమూ ఆది మధ్యాంత రహితమూ అయినప్పటికీ పరిమితమైన సర్వగ్రాహ్యమైన రూపంతో వ్యక్తమైనపుడు మాత్రమే కొంతమందికయినా అది అనుభూతమవుతుంది. అప్పుడు కూడా కొద్దిమంది అదృష్టవంతులు మాత్రమే ఆ అనుగ్రహాన్ని గుర్తించి తరించగల్గుతారు. “యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తితత్త్వతః” అన గీతావాక్యం పైభావాన్నే నొక్కి చెపుతోంది. జిల్లెళ్ళమూడిలో అవతరించి సర్వసామాన్యమైన నామరూపాల్ని ధరించిన అమ్మను సాక్షాత్తు రాజరాజేశ్వరిగా గుర్తించి ఆరాధించుకుంటూ అమ్మబాటలో ప్రయాణంచేసిన సాధకులలో శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణగారొకరు. సోదరులు శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణగారు 26-8-1984వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి విద్యార్థులనుద్దేశించి చేసిన ప్రసంగ సారాంశాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాము. )

“ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీనమై

యెవ్వనియందు డిందు? పరమేశ్వరు డెవ్వడు? మూలకారణం

బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానయైన వా

డెవ్వడు? వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్”.

అనే పద్యాన్ని బాల్యంలోనే కంఠస్థీకరించి ప్రతిపదార్ధాన్ని తెలుసుకున్న ప్పటికీ, ఆ పద్యంలో చెప్పబడిన పరమేశ్వరుడెవ్వడో తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం నాకు చాలాకాలంగానే మిగిలి పోయింది. నిరంతరం నా పరిశ్రమ ఆ ప్రశ్నకు సమాధానం వెతకటమే అయింది.

బాల్యం నుండి ఎందుకో నాకు పూజలంటే సరిపడేది కాదు. రాముడు, కృష్ణుడు, రాజరాజేశ్వరి వంటి ఏ దేవతామూర్తీ నా హృదయంలో చోటుచేసుకోలేదు. అయితే సూర్యనమస్కారాలు మాత్రం చేస్తుండేవాడిని.

నాలోని జిజ్ఞాసను శాంతింపచేసే ప్రయత్నంలో రామాయణం, దేవీ భాగవతం, భాగవతం వంటివాటి అనువాదాల్ని చదివినప్పుడు కూడా నా ప్రశ్నకు సమాధానం లభించలేదు. ఏ పురాణంలో చూసినా ఆ పురాణంలో చెప్పబడే దేవతే సృష్టి స్థితి లయాలకు కారణంగా వర్ణించబడి ఉండేది. పరమేశ్వరుడంటే రాజరాజేశ్వరేనా? కృష్ణుడా? మరొకరా? అనే సందేహం ద్విగుణీకృతమైందేతప్ప తీరలేదు. 1959లో నేను యాదృచ్ఛికంగా జిల్లెళ్ళమూడి రావడం జరిగింది. అమ్మ ప్రేమామృత వర్షంలో తడిసి ముద్దగా తయారైన నాకు జిల్లెళ్ళమూడి రావడం అమ్మను దర్శించటం జీవితంలో విడదీయరానిదిగా తయారయ్యింది. ఒకరోజు నా సందేహాన్ని అమ్మ ముందుంచాను, సందేహం ఒకటే అయినా సమాధానం చెప్పటంలో అమ్మ అనుసరించే పద్ధతి ఎంతో విలక్షణంగా ఉంటుంది. అడిగినవారిని గమనించి వారికర్థమయ్యే రీతిలో సూటిగా అమ్మ సమాధానం చెపుతుంది. బహుశా మన ప్రశ్న ఎలా ఉన్నా మన భావాన్ని అమ్మ స్వయంగానే గ్రహించ గల్గటం వలననే మనకర్థమయ్యే సమాధానలను అమ్మ ప్రసాదించ గల్గుతుంది. సృష్టిస్థితి లయాలకు కారణం ఒకరున్నారని నమ్మినా, ఆయన ఒకరే కావాలి కాని రాముడు, కృష్ణుడు, దేవి, ఇలా ఎంతోమంది కావడమేమిటి? వారు భిన్నులుకదా! అనేది నా ప్రశ్నలో అంతరార్థం. “ రామునిలో ఉన్న ‘నేను’, కృష్ణునిలో ఉన్న ‘నేను’, దేవిలో ‘అమ్మలో ఉన్న ‘నేను’ సృష్టికి కారణము” అని అమ్మ ఉన్న ‘నేను’, ప్రవచిస్తూ నా సందేహాలను పటాపంచలు చేసింది. రాముడు, కృష్ణుడు, దేవి పేరు వేరుగా ఉన్నారనే అపోహ తొలగిపోయి, వారిలో ‘నేను’గా ఉన్న తత్త్వమే ‘ఎవ్వనిచే జనించు’ పద్యంలో చెప్పిన పరమేశ్వరునిగా గుర్తించగల్గాను. “నేను నేనైవ నేను” అనే అమ్మ మాటలో ఉండే పరమార్థం బోధపడి పరవశుడనయ్యాను.

‘అమ్మ సాక్షాత్తు రాజరాజేశ్వరే’ ననటానికి సందేహం లేదు. అలాంటి నిశ్చయానికి రావటానికి తగినంత అనుభవాన్ని అమ్మే ప్రసాదించింది. మా నాయనమ్మ గారే మమ్మల్ని చిన్నప్పటి నుండీ పెంచింది. ఆవిడకు ఆలయాలు దర్శించటం అలవాటు. కొన్ని సందర్భాలలో నేనూ ‘ వెళ్ళేవాడిని. ఒక రోజు నాకు కలవచ్చింది. ఆ కలలో- దేవాలయంలో చూసిన రాజరాజేశ్వరి విగ్రహం ముందు నేను మోకలర్లటం, నా కంటి నుంచి అప్రయత్నంగా వెలువడిన కన్నీరు రాజరాజేశ్వరీదేవి కుడిపాదం మీద పడటం జరిగింది. తరువాత కాలంలో ఆ సంఘటనను దాదాపు మర్చిపోయాను. నేను అమ్మను మొదటి సారిగా దర్శించటానికి 5,6 ఏళ్ళకు పూర్వమే ఆ సంఘటన జరిగింది. ఆ తరువాత అమ్మను దర్శించిన మొదటిరోజుల్లో కూడా” పైసన్నివేశం నాకు గుర్తుకు రాలేదు. పూర్వం అమ్మ, హైమాలయం వెనక అలంకారమ ఉండే గదిలో ఉండేది. ఎక్కడెక్కడనుంచో వచ్చిన సోదరీ సోదరులు తమ కష్టాల్ని చెప్పుకోవటం కన్నీళ్ళు పెట్టుకోవడం చూసేవాడిని. నేనెప్పుడూ అమ్మ ముందు కన్నీళ్ళు విడువలేదు. అంతే కాక నాకు కన్నీళ్ళు రావనే గర్వం కూడా కొంత ఉండేది. ఆ రోజు వచ్చిన సోదరీ సోదరులంతా వెళ్ళిపోయారు. నేను ఉద్యోగరీత్యా గుంటూరునుండి చాలా దూరానికి వెళ్ళవలసి వచ్చిన సమయమది. ఇది వరకటిలా అమ్మను తరచు దర్శించటం కుదరదు కదా! అనే భావంతో మనసు విలవిలలాడిపోయింది. ఎప్పుడూ రాని కన్నీరు ఆరోజు ధారగా కురవడం ప్రారంభించింది. అమ్మకు ముందు మోకరిల్లిన నా కన్నీరు అమ్మ కుడిపాదం మీద పడుతోంది. అమ్మ నా కన్నీళ్ళు తుడిచి “నేనుండగా నీకు జీవితంలో కన్నీరు పెట్టవలసిన అవసరం లేదు నాన్నా!” అని హామీ ఇచ్చింది. అలాంటి హామీని ఎవరివ్వగలరు? ఎవరు దానిని నెరవేర్చగలరు? అమ్మ తప్ప. తిరిగి ప్రయాణమయి ఏడోమైలుకు నడుస్తున్నాను. సరిగ్గా 7వ మైలు కొచ్చేసరికి, ఎన్నో ఏళ్ళక్రితం నాకు కలలో రాజరాజేశ్శరీ కనపడిన సంఘటన మనస్సులో మెదిలింది. చాలా ఆశ్చర్యపోయాను. ఆకలలో నేను దర్శించిన సన్నివేశం ఏ మాత్రం తేడా లేకుండా అచ్చుగుద్దినట్లు ఎట్టఎదుట ప్రత్యక్షం కావటం – అమ్మ రాజరాజేశ్వరి అనటానికి నిదర్శనమే కదా!

దేవిని తెలుసుకోవడానికైనా ప్రత్యక్షానుభవంకంటే పరమ ప్రమాణం లేదు. అయితే ఒకరి అనుభవం మరొకరికి అనుభవం కాదు. నామీద, మా అబ్బాయికి విశ్వాసం ఉండొచ్చు అయినా నా అనుభవాలు వాడి అనుభవాలు కావు. మా వాడి నడిగితే- అమ్మ ఎంతోమంది విద్యార్థులకు యాత్రికులకు అన్నదానం చేస్తోంది. చదువుకొనే అవకాశం కల్పిస్తోంది. అది చాలా గొప్ప విషయం. మిగిలినవి నాకు తెలియవు- అంటాడు. మరొకతరం మారితే ఇదంతా నిజమేనా? అనే సందేహం ఏర్పడచ్చు. చివరకు అంతా బూటకమే అనే భావమూ బలపడవచ్చు. రామాయణ మహాభారతాలు నిజంగా జరిగాయా? అనే సందేహం కూడా ఇలాంటిదే. కనుకనే “అవి జరిగాయా లేదా అనేది ప్రధానం గాదు. అసలలాంటి భావం మనస్సులోకి రావటమే విశేషం. లోకంలో ఎవరైనా సమస్తగుణాలు కలిగిన వాడున్నాడా? అనే వాల్మీకి ప్రశ్నే అద్భుతమైనది” అంటుంది అమ్మ.

జనమేజయుడు తన తాతగారైన వ్యాసభగవానుణ్ణి కలుసుకోవటం జరిగింది. “మిమ్మల్ని ఎదుట చూస్తూ ఉన్నాను. మీమీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. అయితే మీరు వ్రాసిన మహాభారతంలోని శ్రీకృష్ణ పరమాత్ముని విషయం మాత్రం నాకు సందేహం గానే ఉంది. ఎందుకంటే కళ్లులేని ధృతరాష్ట్రునికి దివ్యమైన నేత్రాల్ని ప్రసాదించి విశ్వరూపం చూపించిన తరువాత కూడా ధృతరాష్ట్రునికి విశ్వాసం కలగకపోవటం, తన కుమారుల్ని నివారించకపోవటం నమ్మశక్యం కావటంలేదు” అన్నాడు, జనమేజయుడు వ్యాసునితో వ్యాసుడు చిరునవ్వు నవ్వి, “దానికేముంది కాని నేను ఒకవిషయం చెపుతాను. దానిని నువ్వు తు.చ. తప్పకుండా చెయ్యాలి. నీ వెప్పుడూ దక్షిణంవేపుకు వేటకు వెళ్ళకు. వెళ్ళినా ఏడుబందిని వేటాడకు. వేటాడినా స్త్రీరూపం దాల్చిన ఆమెను పెండ్లాడకు. పెండ్లాడినా ఆమెతో కలిసి యజ్ఞం చేయకు. చేసినా జుట్టుముడి వేయకుండా ఉన్న ఆమెతో కూర్చోకు” అని జనమేజయుడికి చెప్పి వెళ్ళిపోతాడు. అయితే జనమే జయుడు అన్నీ ఆచరిద్దామనుకొంటూనే చివరకు అన్నిటినీ ఉల్లంఘిస్తాడు. తప్పనిసరిగా చెయ్యవలసివచ్చిన యజ్ఞంలో సౌందర్యారాశియైన తన భార్య కేశపాశం విడిపోయి ఎగురుతూ ఉండగా ఆశ్చర్య చకితుడై జనమేజయుడు ఆమెను చూడటం, ఋతిక్కులందరూ వీరిద్దరినీ చూస్తుండటం, పరాకుగా చేసిన హోమాలతో అగ్ని ప్రజ్వరిల్లి యజ్ఞశాల అంతా తగలబడటం, జనమేజయుడు శరీరమంతా కాలిపోవటం జరుగుతుంది. మళ్ళీవ్యాసుడు వచ్చినపుడు వ్యాసునిమీదేకాక మహాభారతం మీద, శ్రీకృష్ణునిమీద కూడా విశ్వాసం ప్రకటిస్తాడు జనమేజయుడు. వ్యాసుని అనుజ్ఞతో మంటలవల్ల ఏర్పడిన గాయాలను తొలగించుకోవటానికి 18 గొంగళ్ళు కప్పుకొని భక్తి విశ్వాసాలతో మహాభారతంలో ఒక్కొక్క పర్వం చదువుతూ ఒక్కొక్కొ గొంగళి తీసివేస్తాడు. ఆవిధంగా 17 పర్వాలు పారాయణం చేసిన తర్వాత నింజగా గాయాలు పోయాయా – అనే సందేహంతో 18వ పర్వంగూడ చదివి 18వ గొంగళి తీసివేస్తాడు. అయితే గాయాలన్నీ మానిపోయినా చిన్న మచ్చమాత్రం అలాగే ఉండి పోతుంది. అది జనమేజయునికి ఏర్పడిన సందేహానికి ఫలితం. కనుకనే అమ్మ అంటుంది. ‘విశ్వాసమే భగవంతుడు’ అని. సారాంశమేమిటంటే మరొకరికి సందేహం కలిగినంత మాత్రాన అనుభవం అనుభవం కాకపోదు. అమ్మ- రాజరాజేశ్వరి కాకపోదు.

అమ్మ సృష్టికర్తి. నా సోదరుడు శ్రీరామ్మూర్తికి వివాహమైన 5,6 సంవత్సరాలు పిల్లలు లేరు. పెద్ద పెద్ద డాక్టర్స్ను సంప్రదిస్తే గర్భకోశం చాలా చిన్నదిగా ఉంది. కనుక వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. వ్యథార్త హృదయంతో ఆ దంపతులు అమ్మను దర్శించారు. అమ్మ అనుజ్ఞతో హైమాలయంలో 40 రోజులు ప్రదక్షిణాలు చేశారు. ఆశ్చర్యం! వారికి వరుసగా నలుగురు పిల్లలు కలిగారు. చివరకు ఫామిలీప్లానింగ్ ఆపరేషన్ గూడా చేయించుకున్నారు. డాక్టర్లు నిర్ద్వంద్వంగా హేతుబద్ధంగా చెప్పినదానికి పూర్తిగా విరుద్ధంగా జరిగిదంటే, అమ్మ అనుగ్రహం, సృష్టికర్త అమ్మే కావటం కాక మరేమవుతుంది.

అమ్మ స్థితికారిణి. తాను ఆహారం తీసుకోకుండా, అందుబాటులో ఉన్న అందరికీ పశుపక్ష్యాదులతో సహా దివ్య ప్రేమను తిండీ గుడ్డను, ప్రసాదిస్తూ అనిర్వచనీయమైన శాంతి సౌభాగ్యాల నందిస్తున్న అమ్మ స్థితికారిణి కాదనగలమా? పరిమితమైన రూపంతో ఎంత చెయ్యటానికి వీలున్నదో అంతా అందరికీ అన్నివిధాలా అందిస్తూ ఉండటం స్థితికారిత్వానికి ప్రతీకేకదా! అందుకే అదే రూపంతో కాకపోయినా ఏదో ఒక రూపంలో సృష్టిపాలన చేసే రాజరాజేశ్వరియే ‘అమ్మ’ అనటానికి సందేహం లేదు.

అమ్మ లయకారిణి. ఈ విషయంలో ఎందరికో ఎన్నో అనుభవాలున్నాయి. అన్నీ అపురూపమైనవే. అన్నీ అసాధారణమైనవే. అన్నీ అమ్మ అసామాన్యశక్తికి ప్రతీకలే. అయినా నా అనుభవంలో ఉన్న దాన్నే ప్రస్తావిస్తాను. తల్లి లేని మాకు చిన్నతనంనుంచి తల్లిలా పెంచి పోషించింది మా నాయనమ్మ. ఆమె ఏనాడు క్షణంకూడా విశ్రాంతి లేకుండా పరిశ్రమిస్తూనే ఉండేది. ఒకరికి చెయ్యడమే కాని ఒకరి చేత చేయించుకోవడం ఆమె ఎరుగదు. ఆమెకు అమ్మపై కల భక్తి విశ్వాసాలకు అవధులు లేవు. ఆకస్మాత్తుగా ఆమెకు పక్షవాతం వచ్చింది. మంచం నుండి కదలలేని స్థితి ఏర్పడింది. 5,6 రోజులు మాత్రమే అయినా చేయించుకోవటం ఆమెకు చాతకానిది, భరించలేనిది. నేను జిల్లెళ్ళమూడి వస్తుంటే “నన్ను త్వరగా తీసుకెళ్ళమని అమ్మతో చెప్పరా” అని ఆవిడ అమ్మకు విన్నవించమన్నది. నేను జిల్లెళ్ళమూడి వచ్చినా అమ్మ సాన్నిధ్యంలో ఆ విషయాన్ని మర్చిపోయాను. అమ్మ ఎప్పుడూ ఆమె ఆరోగ్యాన్ని గురించి ప్రశ్నించలేదు. చిత్రం! ఆరోజు మాత్రం అమ్మ ‘మీ నాయనమ్మకు ఎట్లా ఉంది?” అంటూ పలకరించింది. విషయం చెప్పాను. నేను వెడతానంటుంటే అమ్మ ఎప్పుడూ ‘ఉండరా’ అని బలవంతం చేసేది. శివరాత్రిరోజు, “ఈరోజు మీ నాయనమ్మను పంపిద్దామా?” అన్నది అమ్మ. వద్దులే అమ్మా! నాన్న కూడా ఇంట్లో ఉండరు అన్నాను. మర్నాడు ఉదయం ఈరోజు మీనాన్న ఇంట్లోనే ఉంటాడు కదా! అన్నది అమ్మ. నేను పట్టించుకోలేదు. ఎప్పుడూ ఉండమనే అమ్మ ఆరోజు వెంటనే వెళ్ళమని బలవంతం చేసింది. అయిష్టంగానే బయలుదేరి ఇంటికి వెళ్ళాను. మా నాయనమ్మ పోయింది. నాకు కబురు పంపిద్దామని ఇంటిదగ్గర వాళ్ళు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కాని సరిగ్గా సమయానికి నేను అక్కడ ఉన్నాను. అమ్మ లయకారిణి అనడానికి ఇంకా ప్రమాణం ఏమి కావాలి? తరంగాలలోని ‘సంహారకారిణి’ అనే అధ్యాయంలోని సంఘటనలు ఇలాంటివే. 

అమ్మ శక్తి స్వరూపిణి, పంచభూతాలు ఆమె ఆజ్ఞాను వర్తులైన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఒక రోజు వెన్నెలలో పౌర్ణమిరోజున అమ్మ చుట్టూ నేను, మరి కొంతమందిమి కూర్చొని ఉన్నాము. భోజనాలకు రండని, మమ్మల్నందర్నీ పిలిచారు. ఆకాలంలో భోజనాలకు బెల్ (Bell) కొట్టడం లేదు. చాలామంది భోజనానికి వెళ్ళారు. ఒక పదిమందిమి మిగిలాము. అమ్మ- భోజనం చెయ్యరా? అన్నది ‘చెయ్యము’ అన్నాము. ఏ అర్థరాత్రో ఆకలితో బాధపడతారని

అమ్మకు తెలియంది కాదు. వెంటనే భోజనం పళ్ళాలతో అక్కడికే తెప్పించింది. అన్నం కలపబోతూ “వర్షం వస్తుందేమోరా లోపలికి పోదాం” అన్నది అమ్మ. ఆకాశం వేపు చూశాము. ఎక్కడా మేఘాలు లేవు. బ్రహ్మాండమైన వెన్నెల- వర్షం రావాలంటే కనీసం ఏవో మేఘాలైనా ఉండాలి కదమ్మా! అంటూ వర్షం రాదని గట్టిగా వాదించాము. వెంటనే ఆకాశంవైపు చూస్తూ “రారా నాన్నా!” అంటూ వానను ఆహ్వానించింది. క్షణంలో ధారాపాతంగా వర్షం పడింది. అమ్మ తడిసిపోతున్నదనే ఆలోచనకాని, భోజనం పళ్ళాలు తీసుకురావాలనే జ్ఞానం కాని లేకుండా మేమంతా ఇంట్లోకి పరిగెత్తాము. అన్నం తీసుకొని అమ్మ తరువాత వచ్చింది. వరుణునిపై అమ్మ ఆధిపత్యాన్ని కాదనగలమా?

మరొకసారి అమ్మ అన్నపూర్ణాలయం చూడటానికి వెళ్ళింది. అప్పుడు శ్రీ శేషయ్యగారు వంటచేస్తుండేవారు. గాడిపొయ్యిమీద సాంబారు కాగుతోంది. టమేటా ముక్కలు పై నుంచి కిందకూ, కిందనుంచి పైకీ తెర్లుతున్నాయి. అమ్మ సాంబారు రుచి చూద్దామనుకొంది. శేషయ్య గారు గరిట తీసుకురావటానికి పరిగెత్తారు. అమ్మ గంగాలంలో చెయ్యి పెట్టి పూర్తిగా ముంచి ఒక ముక్కను తీసి తాను రుచి చూచి అందరికీ చూపించింది. అప్పుడు సాంబారు మరుగుతున్న వేడిలో ఎంతటి వారి కైనా చేతుల్లో చర్మం ఊడిపోవటం నిర్వివాదం. అమ్మ చెయ్యిమాత్రం అతి సుకుమారమే అయినా కనీసం కందలేదు. అగ్నిహోత్రుని మీద అమ్మకు అధికారం లేకపోతే అలా ఎలా జరుగుతుంది?

అమ్మ జీవితమొక మహాసముద్రం అది రత్నాకరమే. కొందరికి కొన్ని రత్నాలు మాత్రమే దొరుకుతాయి. కొన్ని మాత్రమే దొరికిన వారు ఎందరో ఉన్నారు. దొరికినవాటి గురించైనా వారికి మాత్రమే తెలుస్తుంది. ఇతరులకు తెలియదు.

ఇన్ని అనుభవాలను ఇందరికి ప్రసాదించే అమ్మ రాజరాజేశ్వరియే కదా!

(సేకరణ శ్రీ ఇ.వి.సత్యనారాయణమూర్తి)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!