అది యొక కాంతిమండలమునై అట చల్లని తేజ మెప్పుడున్
సదమలమైన విశ్వ జన సంభ్రమ శోభల నిండి యుండెడున్
పదముల నుండి దివ్య ముఖ పంకజ గంధ మదెల్ల వేళలన్
విదితముగాగ నంతటను వెల్గుచు అమ్మయి గోచరించెడున్.
కారుణ్యంబును నెల్ల వారల పయి న్నేకాకృతిన్ జూపగా
వీరున్ వారను భేద భావనకు తావేలేక నెల్లప్పుడున్
భారంబున్ తొలగించి యెల్లరకు ప్రాపై నిల్చి రక్షింపగా
మేరల్లేని విశాల భావమయి అమ్మే వచ్చె లాలింపగన్.
ఆ కారుణ్యమె అంతులేనిది కదా! ఆ నామమే పావనం
బే కాలంబును మాసిపోని దిలలో ఆ రూపముం గాంచగా
ఏకాకారపు చిత్తవృత్తి నదియే ఏవేళ వెల్గొందుచున్
మీకెంతో మది శాంతి అమ్మ యొసగున్; మీ భాగ్యమే భాగ్యమౌ.
పోషణంబును రక్షణంబును పూరణంబును జేయగా
తోషణంబున నెల్లవేళల దోహదంబులు కూర్చుచున్
భూషణంబుగ నెల్లవారికి భోగభాగ్యము లిచ్చుచున్
భాషణంబుల సంతసంబను భాగ్యమిచ్చును అమ్మయే.