శ్రీ పి.ఎస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్. అందరూ ఆప్యాయంగా, సన్నిహితంగా, ప్రేమగా పిలుచుకునే పేరు మాత్రం పి.ఎస్.ఆర్. చిన్నవాళ్ళలో మరీ చిన్నవాడిగా, పెద్దవాళ్ళలో మరింత పెద్దవాడిగా ఏ అరమరికలు లేకుండా కలిసిపోయి, మన కుటుంబ సభ్యులలో ఒకడిగా మన యోగక్షేమాలు కనుక్కుంటూ మనలో ఒకడిగా కలిసిపోయిన పి.ఎస్.ఆర్. ఇక లేరంటే నమ్మశక్యం కాదు.
నిలువెత్తు మనిషి. గంభీరమైన విగ్రహం. పొడు గాటి లాల్చీ, పంచెకట్టు, జరీఅంచు పొడుగాటి ఉత్తరీయం – చూడగానే గౌరవం ఉట్టిపడే ఆహార్యం. పలకరిస్తే పద్యాలు రాలుతాయి. కదిలిస్తే కవిత్వం ఉబుకుతుంది.
ఆయన వ్యక్తిత్వం ప్రత్యేకం అని చెప్పక తప్పదు. ఆయన ఎవరిమీదా ద్వేషం ప్రదర్శించటం నాకున్న నలభై సంవత్సరాల సాన్నిహిత్యంలో నేను చూడలేదు. ఎవరిమీదన్నా కోపం రావచ్చేమో గాని అది క్షణికమే. గీతాచార్యుడు చెప్పినట్లు, “సర్వత్రాం నభిస్నేహః తత్తత్ర్పాప్ర్య శుభాశుభమ్ – నాభినన్దతి, నద్వేష్టి”. ఈ సూత్రం అక్షరాలా అనుష్ఠించిన వ్యక్తి శ్రీ పి.ఎస్.ఆర్.
పి.ఎస్.ఆర్. లాగా శుభాశుభాలను అంతా “అమ్మ నిర్ణయం” అనే నిశ్చితాభిప్రాయంతో సమానంగా స్వీకరించిన వ్యక్తిని నా జీవితంలో నేను ఇంతవరకూ చూడలేదంటే అందులో ఈషణ్మాత్రమూ అతిశయోక్తి లేదు. వారి పెద్దకుమారుడి అకాల మరణాన్ని గానీ, వారి జీవిత భాగస్వామి నిష్క్రమణాన్ని గాని ఆయన ఎంత నిబ్బరంగా స్వీకరించారో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు నా అభిప్రాయంతో సంపూర్ణంగా ఏకీభవిస్తారు.
“అమ్మ” మీద ఆయనకున్న విశ్వాసం అచంచలమైనది. నిరంతరం అమ్మ ధ్యాసే. ఆయనకు అమ్మ తప్ప వేరే లోకమే లేదు. వారి సోదరుడు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ఎప్పుడో వ్రాసిన పద్యాలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోక తప్పదు.
వ్రాతల్ వ్రాసెడి బ్రహ్మ ఎందుకిటులన్ భావించెనో గాని యీ
నా తమ్ముం డలనాటి అర్కపురి ఆనందాంగనాడింభుడై
మాతృశ్రీ పదపద్మ బంభరముగా మాధుర్యముంగ్రోలుచున్
నాతో చెప్పడు గాని వాని కదియే నాకమ్ము లోకమ్మునన్.
మాతృశ్రీ అనసూయ వాక్కులను సంభావించి తన్మూర్తిలో
జ్యోతిర్మండల కాంతిపూర రమణీయోంకార ఘంటార్భటుల్
శ్రీ తత్త్వంబులు దేవతామహిమలున్ జిల్లెళ్ళమూడిన్ కనెన్
నా తమ్ముండని కాదుకాని అతడంతర్లీను డా భూమికన్.
సాక్షాత్తూ జగన్మాత అమ్మచేత నువ్వు “ఈస్థాన కవివిరా” అనిపించుకున్నాడంటే అదేమీ సామాన్యమైన ప్రశంస కాదు. అలనాడు కంచి కామకోటి 20వ పీఠాధిపతికి కామాక్షీదేవి స్వయంగా తాంబూల వీటికను ప్రసాదించి మూకకవిని చేసిన అపూర్వ సంఘటన వంటిదే శ్రీ పి.ఎస్.ఆర్. గారి జీవితంలో కూడా జరగటం యాదృచ్ఛికం కాదు. “అమ్మ” తాంబూ లోచ్చిష్టము సేవించే మహత్తర అవకాశాన్ని రెండు చేతులా అంది పుచ్చుకున్న మహాభాగ్యశాలి ఆయన. ఆ సంఘటన సమయంలో అనేకమంది అమ్మ చుట్టూ వున్నా ఈయనకే ఆ భాగ్యం దక్కటం ఆయన భావి జీవితానికి అమ్మ నిర్దేశించిన గమ్యం. ఆయన కవిత్వం కూడా అదే విధంగా కాళిదాసు చెప్పినట్లు “ఘోటీ కులాదధిక ధాటీ ముదార ముఖ వీటీరసేన తనుతామ్” అన్న రీతిలోనే సాగింది మరి.
జిల్లెళ్లమూడిలో ఏ సాహిత్య సభ జరిగినా పి.ఎస్.ఆర్. లేనిదే ఆ సభకు నిండుదనం రాదు. ఎన్ని వందల సభలు ఆయన నిర్వహించాడో లెక్కలేదు. సభా నిర్వహణ ఆయనకు నల్లేరుమీద నడక. ఏ వక్త ఎంతసేపు సహజ ప్రజ్ఞతో మాట్లాడగలడో ఆయనకు నిర్దిష్టమైన అంచనా వుంటుంది. ఆ సమయపాలన నిర్మొహమాటంగా చేసేవారు.
అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలిని, సహృదయుడిని, ఆత్మీయుడిని కోల్పోవటం నా మటుకు నాకు జీవితంలో తీరని లోటు. ఆ అవేదన అక్షరరూపం దాల్చి, నాహృదయంలో పొంగిన వాక్యాలివి.
“ఈ నాడు జిల్లెళ్ళమూడి వాక్కు మూగవోయింది. ఈస్థాన కవిదిగ్గజం నేలకు ఒరిగింది
గణగణ మ్రోగే కవితా ఘంటారవం నిశ్శబ్దంగా రోదిస్తుంది.
గుండె గుండెలో గూడు కట్టుకున్న విషాదాశ్రువులు అమ్మ, హైమల ఆలయాల ముందు కాలువలైనాయి. నిత్యం అమ్మ పాదాలను ముద్దాడే సుకవి శిరస్సు ఆ తల్లి చల్లని ఒడిలో ప్రశాంతంగా నిదురిస్తున్నది. ఏ సాహితీ సభా నిర్వహణ కోసం అమ్మలోకం చేరుకున్నావో
ఖంగున మ్రోగే కంఠంతో హైమమ్మకు ఏ కవితలు వినిపిస్తున్నావో
నాన్నగారి వద్ద ఏ నాటకాలకి రచనలు చేస్తున్నావో? ఇన్నేళ్ళ మన స్నేహంలో, సాహచర్యంలో
శూన్యాన్ని మాకు మిగిల్చి, నువ్వు పరిపూర్ణుడవైనావా? అంతులేని శోకాన్ని మాకిచ్చి ఆనంద పరబ్రహ్మాన్ని నీవందుకున్నావా?
ఇదేనా న్యాయం? అమ్మా! వింటున్నావా?”