“కాలోహి దురతిక్రమః” అనుకుంటాడు హనుమంతుడు, అశోకవనంలో దుఃఖార్తియై వున్న సీతమ్మను చూసి. ఎంతటి వారికైనా కాలం యొక్క ధర్మాన్ని అతిక్రమించటం సాధ్యంకాదు. కానీ ఈ క్షణాన మనతో నవ్వుతూ మాట్లాడిన వ్యక్తి మరికొన్ని క్షణాలలోనే శాశ్వతంగా మననుండి దూరమైపోతే, ఎన్నో ఏళ్ళ అనుబంధం ఒక్కసారిగా అకస్మాత్తుగా తెగిపోతే, నిబ్బరంగా, ధైర్యంగా, వేదాంతం చాటున ఉపశమనం పొందటం సామాన్యులకు అంత తేలిక కాదు.
అదే జరిగింది మే నెల 19వ తేదీ ఉదయం ఆరు గంటలకు మొబైల్ గణగణ మ్రోగటంతో, అందుకుంటే వినవచ్చిన వార్త అశనిపాతంలా తాకింది. ప్రియసోదరుడు, సఖుడు, సహచరుడు, జన్నాభట్ల వీరభద్రశాస్త్రి ఇక లేడు అన్న వార్త జీర్ణం చేసుకోవటం అంత తేలిక కాదు.
శాస్త్రి అనేక సద్గుణాల రాశి. సహృదయత, సచ్చీలత, స్నేహధర్మం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయన సొంతం. సంప్రదాయంపై తిరుగులేని గౌరవం, నమ్మకం ఆయన ఆస్తి. చీమకైనా అపకారం చేయని ఆయన సత్ప్రవర్తన. ఎంత కష్టం కలిగినా ఒక్క పరుషవాక్యం పలుకని దయార్ద్ర హృదయం. ఇవన్నీ కలగలిస్తే మా వీరభద్రశాస్త్రి.
శాస్త్రి ఆగర్భశ్రీమంతుడు కాడు. కానీ ఆర్తులను, పాత్రులను ఆదుకునే దానగుణ సంపన్నుడు. అతిథులను ఆదరించడంలో అపరప్రవరుడు. అతని భార్య కూడా “వండ నలయదు వేవురు వచ్చిరేని, అన్నపూర్ణకు ముద్దియో నతని గృహిణి…” అన్నరీతిలో అనుకూలవతి. జన్నాభట్ల వారి ఇల్లు మరో జిల్లెళ్ళమూడి అని ప్రసిద్ధి. ఆయనేమీ పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవాడు కాడు. కానీ తన చుట్టూవున్న మనుషుల మనసెరిగి మసలుకోగల సంస్కారవంతుడు. సంప్రదాయ పురాణేతిహాసాల సారమెరిగిన విద్యావంతుడు. అలాగే పెద్ద పెద్ద పదవులు నిర్వహించినవాడు కాడు. కానీ జగన్మాత అమ్మ కరుణారసభరిత హృదయంలో సుస్థిరస్థానం సంపాదించిన అదృష్ట వంతుడు. జీవితమంతా కష్టించిన శ్రామికుడు. తనను కన్నవారిని, తాను కన్నవారిని, తన తోబుట్టువులను తన కష్టంతో ఆదరించి సంతృప్తి పరచిన సార్థకజీవి. అన్నిటినీ మించి అమ్మతో ఆయనకున్న అనుబంధం అపూర్వమైనది.
ఎవరైనా అమ్మ దర్శనం కోసం వచ్చేటప్పుడు పూలో, పండ్ల తీసుకురావటం సహజం. అవన్నీ ఆయన పుష్కలంగా తెస్తూనే, అమ్మ ఆనందం కోసం, అమ్మను నవ్వించటం కోసం జోక్స్ కొన్ని మూటకట్టుకుని వచ్చేవాడు. సమయానుకూలంగా అవి ఒక్కొక్కటి అమ్మకు వినిపిస్తుంటే అమ్మ అమందానందంతో గలగలా నవ్వటం నాకు గుర్తు.
శాస్త్రి పరమనిష్ఠాగరిష్టుడు. సంధ్యావందనాది క్రియలు నిష్ఠగా ఆచరించేవాడు. పూర్ణ విద్యా పారంగతుడైన శ్రీ తంగిరాల కేశవశర్మ వద్ద పంచదశీ విద్య ఉపదేశం పొంది ఆజన్మాంతం ఉపాసించిన ధన్యుడు.
శివరాత్రి వచ్చిందంటే జిల్లెళ్ళమూడిలో శాస్త్రి లేకుండా అభిషేకాలు జరగటం అరుదు. అనేక రకాల అభిషేక ద్రవ్యాలు, ఫలాలు, తేనె, సుగంధ ద్రవ్యాలతో వచ్చేవాడు. లింగోద్భవకాలం నుండి తెల్లవారేదాకా మహన్యాసపూర్వక రుద్రాభిషేకంలో అత్యంత భక్తి శ్రద్ధలతో తాను పాల్గొనటమే గాక అందరి చేతా చేయించేవాడు.
చివరగా ఒక అద్భుత సంఘటన. అది 1985 అనుకుంటా. ఆ సంవత్సరం మహాశివరాత్రి మహావైభవో పేతంగా అనసూయేశ్వరాలయంలో అభిషేకాలు జరుగు తున్నాయి. అమ్మ కూడా స్వయంగా వచ్చి ఆలయంలో ఈశాన్యదిశలో పర్యంకంపై ఆశీనురాలై మొత్తం కార్యక్రమం తిలకిస్తున్నది. అభిషేకం పూర్తికాగానే అమ్మ గర్భాలయం చుట్టూ ప్రదక్షిణం చేసి సరాసరి శాస్త్రి దగ్గరికి వచ్చి కుడి అరచేతిని గోకర్ణంగా మడిచి మూడుసార్లు సమంత్రకంగా తీర్థాన్ని తీసుకున్నది. ఎంత అదృష్టవంతుడు శాస్త్రి!! ఏ జగన్మాత అనుగ్రహ ప్రసాద పాదతీర్థంతో సర్వరోగాలూ హరిస్తున్నాయో, ఆ జగన్మాతకే తీర్ధాన్ని ఇచ్చిన ధన్యజీవి శ్రీ వీరభద్రశాస్త్రి.