శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో –
‘శ్రేయాన్ స్స్వ ధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥ – (3-35)
అని ప్రబోధించారు.
అంటే – గుణములేనిదైనను తనకు యేర్పడిన ధర్మము చక్కగా ఆచరింపబడిన, ఇతరులు ఆచరించు ధర్మముకంటే వుత్తమమైనది. తన యాచరణయందు మరణము గలిగినను శ్రేయస్కరము. ఇతరుల ఆచారము భయమును కలుగజేయునది – అని వివరించారు శ్రీమలయాళ స్వామివారు.
‘స్వధర్మం’ అంటే ఏమిటో ‘అమ్మ’ చాలా నిష్కర్షగా స్పష్టంగా నిరూప మానంగా చాటింది. “సత్యం వధ – ధర్మం చెఱ” – అంటూ వాటి స్వరూప స్వభావాల్ని విశదీకరించింది. విన్నంత, కన్నంత, నాకు అందినంత వరకు సోదాహరణంగా వివరిస్తాను.
- శ్రీవల్లూరి వీరభద్రశర్మగారు టెలికమ్యూనికేషన్స్లో డివిజనల్ ఇంజనీరుగా పని చేస్తున్నారు. ఆయన ఉద్యోగంలోని బాధ్యతల ఒత్తిడివల్ల నిత్యం విధిగా చేయదలచిన దేవతార్చన నిర్వర్తించలేక ధర్మ సంకటానికి లోనై ఒకరోజు ‘అమ్మ’ వద్ద – ‘గాయత్రీజపమైనా చేయలేక పోతున్నానమ్మా! ప్రయాణం చేస్తూనో ఆఫీసులో కుర్చీలో కూర్చునో స్మరిస్తాను’ అని బాధపడ్డారు.
అందుకు అమ్మ “కాలం మారిపోయింది, నాన్నా! కాలాన్ని అనుసరించి మన ఆలోచనల పద్ధతులూ మారాలి. నువ్వు పుట్టిన కులాన్ని బట్టి జపతపాలే నీ స్వధర్మం అనుకుంటున్నావు. కులాలు వృత్తినిబట్టి ఏర్పడినై. ఇప్పుడు నీ వృత్తి వేరు. దానిని బట్టే నీ ధర్మం. నీ ఉద్యోగంలో నీతీ నిజాయితీలతో ఉండడమే నీ ధర్మం’ అన్నది. అంటే – వారి స్వధర్మం ఉద్యోగం అన్నమాట.
- స్వవిషయం. నేను ఒక వైదిక బ్రాహ్మణుడను. టీచర్ గా పనిచేస్తున్నాను. ‘వేదోనిత్యమధీయతాం – తదుదితం కర్మసు అనుష్ఠీయతాం’ అన్నారు శంకర భగవత్పాదులు. పెద్దలంతగా కాకపోయినా – సంధ్యావందనం, శివ పంచాయతన విధి, అగ్నికార్యం (ఔపాసన), అరుణం – ఉపనిషత్తుల పారాయణ చేస్తుంటా. కాగా అందుకు ఎక్కువ సమయం వెచ్చించలేను.
అదేమాట జిలెళ్ళమూడిలో ‘అమ్మ’తో అన్నాను. “నేనేమీ జపతపాలు నిత్యకర్మానుష్ఠానం చేయలేక పోతున్నాను” అని. తక్షణం అమ్మ అన్నది “నాన్నా! నీ పిల్లలే (విద్యార్ధులే) నీకు అన్నం పెడుతున్నారని నువ్వు పాఠాలు చెప్పు. నీకు ఇక ఏమీ అవసరం లేదు” అని.
నీ పిల్లలే అంటే నీ విద్యార్థులు అని రూఢ్యర్ధం. యదార్థం ఏమంటే నీ విద్యార్థులు అంటే – నీ కడుపున పుట్టిన పిల్లలు అని. నీకు జీతం ఇస్తున్నది డి.ఇ.ఒ. ఒక ఆఫీసర్ కాదు – నీ విద్యార్థులే నీకు అన్నం పెడుతున్నారు – అని. అంతే. ఆ రోజు నుంచి నాకు బడేగుడి – పంచాయతనం – చతుష్పాత్రం. ఇంగ్లీషు, మాథ్స్, సైన్సు బోధించే వాడిని. సెలవుల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించి శ్రద్ధ తీసుకున్నాను. నేను పిచ్చివాడినని తోటి ఉపాధ్యాయులు హేళన చేసేవారు. అమ్మ ఆశీస్సులే-నా డ్యూటీ నాకు శ్రీరామ రక్ష. 100 మందిలో ఒకడు అన్నట్లు నాకు లెక్చరర్ ప్రమోషన్ వచ్చింది. డ్యూటీ దేవుడు, ఆ దేవుడు అమ్మ, కనుకనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నన్ను చూసి గర్వపడే ఎత్తున నిలబెట్టింది. బాధ్యతలు పెరిగాయి. నా దోషం ఇసుమంత లేక పోయినా కోర్టు కేసులు, పోలీసు కేసులు ఆరోపించబడ్డాయి. కానీ సుడిగాలిలో దూది పింజల్లా ఎగిరిపోయాయి. కృష్ణపరమాత్మ స్వధర్మంలో మరణం సంభవించినా శ్రేయస్కరమే అన్నారు.
నన్ను ‘You are under suspension’ అన్న అధికారి కొన్ని క్షణాల్లోనే ‘you are doing perfectly. I am proud of your’ అని చేతులు పట్టుకున్నాడు. అది నా ప్రయోజకత్వం కాదు; అమ్మ సంభావనా గుణం. ఏది నాకు స్వధర్మం? ఉద్యోగ విధి, నిర్వహణ.
- స్వధర్మాచరణ ప్రాముఖ్యతని అమ్మ కొందరికే కాదు, అందరికీ చెప్పింది. ‘వైద్యో నారాయణో హరిః’ అంటే, “వైద్యునికి రోగి కూడా నారాయణ స్వరూపుడే” అన్నది. ‘గురుర్రహ్మా’ అంటే, “గురువుకి శిష్యుడూ పరబ్రహ్మ స్వరూపమే” అన్నది.
యుగయుగాలుగా స్త్రీ లోకానికి పాతివ్రత్యాన్ని నూరిపోస్తూ ‘భార్యకి భర్త దైవం’ (స్త్రీణాం ఆర్య స్వభావానాం పరమం దైవతం పతిః) అని ముక్త కంఠంతో నిర్దేశిస్తుంటే, ‘అమ్మ’ ‘భర్తకి భార్య దేవత’ – అంటూ సంపూర్ణత్వాన్ని వాస్తవికతని అమ్మ ఆవిష్కరించింది. అమ్మ మాటలు అర్థం చేసుకుంటే “ధర్మో రక్షతి రక్షితః” అనే ఆర్షవాక్యం అనుభవంలోకి వస్తుంది.
ఈ సందర్భంలో ‘స్వధర్మం’ – ‘పరధర్మం’ అనే పదాలపై దృష్టిని సారించాలి. సర్వాత్మున్ హరినే నమ్మటం, జననీ జనకులకు సేవలందిచటం, సాంసారిక బాధ్యతల్ని నిర్వర్తించటం, బాధ్యతగల పౌరునిలా జీవించటం మున్నగు వాని సమాహారమే స్వధర్మం. వీటినే విలువలు (VALUES) అంటారు.
‘శ్రేయాన్ స్వధర్మో విగుణ:’ అంటూ కృష్ణ పరమాత్మ ఒక అద్భుత సత్యాన్ని చాటారు. (వినాగుణం – విగుణం) గుణము లేనిదైనా స్వధర్మాన్ని అనుష్ఠించాలి. అని. పరమాత్మ దృష్టిలో విగుణం అని కాదు, సామాన్యుని దృష్టిలో అని అర్ధం. ఈశ్వరుని దృష్టిలో గుణ హీనమైన ధర్మం (వృత్తి) లేనే లేదు. శ్రీ రుద్రనమకంలో – ‘నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వోనమః’ అనీ, ‘నమఃపు – *స్టేభ్యో నిషాదేభ్యశ్చ వోనమః’.. అనీ చెప్పబడింది. అంటే ‘ఓ ఈశ్వరా! కుమ్మరిగా, వడ్రంగిగా, పక్షలు చేపలను చంపు వారి రూపముగా ఉన్న నీకు నమస్కారము’ అని.
ఇక ‘పరధర్మం’ అంటే ఏమిటి? collector ఉద్యోగం – bill collector ఉద్యోగం, పాకీ మనిషి ఉద్యోగ ధర్మం – మున్సిపల్ కమీషనర్ ఉద్యోగ ధర్మం వీటిలో ఏది ఎక్కువ? ఏది తక్కువ? ఏది ఉచ్చము? ఏది నీచము? అన్నీ ఉన్నతములే: చీమ స్థానం అస్తిత్వం ఎంత ఉన్నతమో బ్రహ్మస్థానం అస్తిత్వం
అంతే ఉన్నతం. పాకీ మనిషిని అమ్మ ‘సంఘమాత’ అని సన్మానించింది. అంతేకాదు. ‘సతీ సుమతి’ చరిత్ర సథ్యయనం చేస్తే ఒక పతివ్రత, ఒక వేశ్య ఇరువురూ తమ ధర్మాల్ని నిష్ఠగా ఆచరించారు. మహాభారతంలో ధర్మవ్యాధుడు అనే మాంస విక్రేత వలన కౌశికుడనే తాపసికి జ్ఞానబోధ కలిగింది. స్వధర్మాచరణ ఎన్నటికీ గుణ రహితం కాదు. కాగా పరధర్మం గొప్పదని, స్వధర్మం అల్పమని తలపోయటం అవివేకం.
“సంసార బాధ్యతలూ ఆధ్యాత్మిక సాధనే” అంటూ ఇహపరాలకు ఒక పసిడి వంతెన నిర్మించింది అమ్మ. “యద్యత్కర్మ కరోమి తత్త దఖిలం శంభోతవారా ధనమ్” అన్నట్లు ఏ వృత్తిని చేపట్టినా స్వకీయకృషి, స్వధర్మాచరణ రూపంగా జరుగుతున్నదంతా ఈశ్వరారాధనమే. ఈ సత్యాన్నే “ఆధ్యాత్మిక సాధన అంటే వేరే అదేదో కాదు. నువ్వు చేసే ప్రతీపని భగవత్సేవయనీ భగవదాజ్ఞానుసారమే ననీ అనుకో గలిగితే – యీ సంసారం ప్రతిబంధకం కానేరదు” అంటూ ఒక్క మాటలో ఉ మాటను తేటతెల్లం చేసింది ‘అమ్మ’.