అమ్మ అనుగ్రహంతో శాస్త్రాలు ఎరగ వచ్చునేమో కానీ, శాస్త్రాల ద్వారా అమ్మను తెలుసుకోవటం అసాధ్యం. అసలు అమ్మను తెలుసుకోవటం ఒక వృధా శ్రమ. అమ్మను అనుభవించటమే అసలు అనుభవం. అనుభవించటమంటే అమృత్వాన్ని ఆనందించటమే. అమృత్వమంటే అసలు తత్వమనేదే అర్థం. అంటే ఆత్మతత్వమనే కదా! కనుక అమ్మను తెలియటం ఆత్మానుభవమే ! నది మూలం, ఋషి మూలం వెదకకూడదంటే, అమ్మమూలాన్ని వెదకటమూ నిషిద్ధమే. వెదకటానికి, పట్టుకోవటానికి మనకో మూలం ఉన్నది. కనుక ఆ మూలాన్ని పట్టుకోగలిగి, పట్టువదలకుండా ఉండగలిగితే, మనమూ జీవన్ముక్తుల మవుతాం. మనం పట్టుకోనక్కరలేని దానిని అంటి పెట్టుకొని, దాన్నీ, మనల్నీ కలిపి పట్టుకోమని మరెవరినో అడుగుతున్నంత కాలం ఆశ్రయించినంత కాలం మనమూ బంధితులమే. ‘మీ కర్మలతో నాకేం సంబంధం లేదు. నేను కేవలం సాక్షినే’ అనే కృష్ణుడి నుండి అమ్మ వరకూ తత్వం ఒకటే! మార్పేమీ లేదు. మరి వీరందరూ, అమ్మతో సహా మనకెందుకు? ఎందుకంటే, మనల్ని మనం తెలుసుకోవటానికి, ఎరుకలో బతకటానికి జీవితాన్ని పండించుకోవటానికి, మరెన్నో జీవితాలని వెలిగించటానికి, మార్గం చూపించటానికి, ఆ మార్గం భద్ర మార్గమని స్పష్టం చేయటానికి వీరి అవసరం.
అమ్మ చూపిన దారి?
అమ్మ చెప్పిన దారి ఏది? చెప్పిన మాట ఏమి? చేసిన బోధ ఏమి? తాను చెప్పిన దాన్ని జీవించిందా? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం దొరికితేనే, అమ్మ అటూ ఇటూగా కాస్త అర్థమౌతుంది. అంతేగాని, అమ్మను ఆశ్రయించటం, అడగటం, అడిగి పొందటం. పొంది ఆనందించటం, మళ్లీ మళ్లీ అడుగుతూ ఉండటం. ఇది సాధనౌతుందా? నమ్మకం కలగటానికి ముందు జరిగే మానసిక క్రీడ తప్ప, ఇది మరొకటి కాదు. ఇంతకీ అమ్మ ఎటువంటి దారి చూపింది? తానేమి చూసిందో దాన్నే చూపింది. అన్ని దారుల లక్ష్యగమ్యాలు బ్రహ్మమే కనుక, బ్రహ్మం తప్ప అన్య వస్తువును తాను చూడలేదు. కనుక అమ్మ చూసిన దారి. చూపిన దారి నిర్వాణమార్గం! అంటే ముక్తి మార్గం. అంటే. బంధనలేని మార్గం. బంధనలుగా ఉన్న వాటి నన్నిటినీ, మనసును దాటుకుంటూ ఎడంగా, పెడగా చూడగలిగితే అదే ముక్తి. మోహక్షయమే. మోక్షం. జీవించి ఉండగానే ఆ స్థితిని అందుకోగలిగితే అదే నిర్మాణ యోగం. ఇది మరణానంతరస్థితి కాదు. ఈ దారిలో అందరూ నీవారే. నీవూ అందరివాడవే. సమన్వయము. సమభావము, సమదృష్టి.. వీటిని మించిన సిద్ధత్వం ఉన్నదా? లేదు. అమ్మ చూపిన దారి ఇదే. అందుకే అందరినీ తన బిడ్డలుగా భావించి, తానున్న ఇంటిని అందరిల్లుగా ప్రకటించిన అమ్మ దారే అసలు దారి. “నీకున్నది తృప్తిగా పెట్టుకో” అన్న మాటలో, పంచటమే పొందటంకన్నా మిన్న అన్న మహాబోధ ఇమిడి ఉన్నది. “పెట్టటం” సాత్వికాహారం, పెట్టుకోగలగటం నిరహంకారం. మొదటి మాట మానవత్వ పరిధిలోనిది. పెట్టుకోవటం దివ్యత్వసీమకు చెందిన రసార్ద్ర పరిధిలోనిది. పెట్టుకోవటం దివ్యత్వసీమకు చెందిన రసార్దభూమిక. అది హృదయంగమం. అందుకే అమ్మ “ఎవరి అన్నం వారు తిని వెళుతున్నారు” అన్నది. అకర్తృత్వ స్థితికి ఇదొక ఉదాహరణ పూర్వక బోధ.
”సరే” అన్నదే మహామంత్రం!
ముందుగా “సరే” అనటంతోనే స్పర్థలు, వ్యర్థబాధలు సమని, సుహృద్భావ స్థితిలో ప్రాపంచిక కార్యకలాపాలు సాగుతుంటాయ్. ముందుగానే “కాదు” అనటంలో వ్యథ మొలకెత్తి తదనంతర పరిణామాలు విషాదంతో ముగుస్తయ్. “నేను నేనైన నేను” అనటం తన ఆత్మనిష్ఠను సూచించే దివ్యసూచిక. మేనుగా కనిపిస్తున్న నేను, సర్వ సృష్టి నేనైన నేను, అసలు నేనుగా ఉన్న నేను అనటం, అవస్థాత్రయాతీత, గుణ త్రయాతీత, కాలత్రయాతీత స్థితిని ఎరుక పరచే మహితత్వ, మహతత్వత కల రూప, భావ, తత్వత్రయాతీత, స్థితి అమ్మది అని గ్రహించమన్న చిరు హెచ్చరిక.
చెప్పిందే చేసింది అమ్మ !
“అనుకున్నది జరుగదు. నీకున్నది తప్పదు” అనే మహావాక్యం అమ్మ జీవన కావ్యంలో ఆవిష్కృతమైన మహాపరిసత్యం. కలతల వంటి అలలు, కన్నీటి కెరటాలు. అనుభవాల తుంపరలు ఎన్ని పుట్టినా తనయందే లయం చేసుకున్న సాగర గంభీరత అమ్మ! దేనికీ పొంగని, కుంగని, లొంగని, ఒంగని అమ్మ జీవనశైలి, నిత్యప్రసారశీలమైన జడచైతన్యాల కలబోత అమ్మ మంత్రాల ద్వారా. తంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా అమ్మ మూలాన్ని పోల్చలేం. పట్టలేం. సర్వమంత్రాల బీజాక్షరాల వెనక ఉన్న సర్వాధిష్ఠానదేవతలకు మూలమైన జననీస్థానం అమ్మది. అమ్మే “అంఆ” అన్నదే మహామంత్రం. సృష్టి సంతటినీ తన బిడ్డలుగా భావించి, కోట్లాది జీవులకు వాత్సల్యామృతం కుడిపిన అమ్మే, ఆమె కదలికే, ఆమె మెదలికే, నిజానికి ఆమె సాగించిన అవనీ సంచారమే ఒక మహాతంత్రం తానున్న ప్రదేశం నుండి కదలక సర్వప్రపంచాన్ని తనవైపు కదిలించి, సమస్తాన్ని వాత్సల్యాలయంగా నడిపించిన అమ్మే మహాయంత్రం మహాత్రిపురసుందరిగా, లలితగా, రాజరాజేశ్వరిగా మనం ఎరిగిన దేవీ దేవతలతో అమ్మను సరిపోల్చి ఆనందించటం ఆత్మాశ్రయభావమే తప్ప అన్యం కాదు. మన పరిశీలనాశక్తికీ, స్వాధ్యాయంలో మనం గుర్తించిన కొన్ని విషయాల పట్ల అవగాహనకు, కవితాత్మక భావనకు పరిమితమైన ఊహాచిత్రమే, ఈ శ్రమంతా. అసలు బొమ్మను ఎదురుగా పెట్టుకొని అద్దంలో ప్రతిబింబానికి కుంకుమ అలదే వైనం కదా? కనుక వ్యక్తిని, సంఘాన్ని మారుస్తున్నట్లు ప్రకటించకుండానే, ఉదాత్త పరిణామ క్రమాన్ని అమ్మ తన చారణంలో ఒక నిశ్వబ్ధ సంగీతంగా వినిపించింది. మమత, మానవత, దివ్యతలు నిస్తంద్రమంద్రంగా, సన్నగా ప్రవహించిన కరుణే అమ్మ. తాను నిలిచిన కుగ్రామం జిల్లెళ్ళమూడిలోనే వర్ణసమన్వయం చేసిన సంస్కారిణి అమ్మ. అమ్మ రససిద్ధ? అమ్మ స్వయం సిద్ధ!!
(ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో)