1. Home
  2. Articles
  3. Viswajanani
  4. స్వర్ణోత్సవ విశేషాలు

స్వర్ణోత్సవ విశేషాలు

srimathi Garudadri
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 15
Month : December
Issue Number : 5
Year : 2015

నిన్నటి జన్మదిన మహోత్సవమునకు ముందు అమ్మకు స్వర్ణోత్సవము జరుపుకున్నామని సంతృప్తి పడుతున్నాం. నిజానికి అమ్మ తన అనంత సంతానానికి ఆమెయే స్వర్ణోత్సవము చేసినది. ఈ స్వర్ణోత్సవానికి ముందు ఎప్పుడు ఈ విషయం ఎవరు ప్రస్తావించినా అమ్మ మోమున మరింత ఆనందరేఖలు విరిసేవి. లక్షలాది జనం ఏక పంక్తిన భోజనం చేస్తే తాను చూడాలనీ చూచినంతగా అనుకొనీ సంబరపడేది. దాని మాధుర్యం అప్పుడు మాకవగతం కాలేదు. స్వర్ణోత్సవ సంరంభముతో అపార జనవాహిని నాటి ఉదయం జిల్లెళ్ళమూడిని సమీపించినది. అమ్మ హృదయ గతభావమేమిటో మరొక మారు వెల్లడి అయినది.

ఈ స్వర్ణోత్సవానికి చాలా ముందు నుంచే దీనికై మే మూహించిన జనం అప్పటికే లక్షలు దాటినవి. అసంఖ్యాకమైన యీ జనతను చూచి స్వర్ణోత్సవానికి ఎవరు మిగులుతారా? అని ఆశ్చర్యం కలిగింది. కాని స్వర్ణోత్సవము నాడు నేల యీనినదా? అనినట్లు ప్రజలు శతసహస్రంగా అంబరమందు లెక్కింప సాధ్యం కాని తారకలవలె నిండిపోయారు. 11వ తేదీ అర్ధరాత్రి దాటినది మొదలు గాడిపొయ్యి వెలిగించి వంట ప్రారంభించాలనుకున్నారు. దాదాపు మేమనుకున్న అంచనాకు వంట తయారు చేసేందుకు 12 గంటలకాలం అవసరమని శేషయ్య గారన్నారు. ఒక వైపున పదార్థాలను సేకరించుకొని పందిళ్ళలోనికి తరలిస్తున్నారు. ఉన్నట్లుండి హఠాత్తుగా విద్యుత్ నిలిచి పోయింది. పనిచేస్తున్న జనం విశ్రాంతిగా వుండాల్సి వచ్చింది. కరెంటు ఎక్కడ ఫెయిల్ అయిందో కనుగొనుటకు అరగంటకాలం పట్టినది. కరెంటు సమకూడిన పిదప వస్తువులను చేరవేయవలసిన జనం గాఢనిద్రా లోలమైనది. ఈ పనికై నాయకత్వం వహించిన వారిని కనుగొనుట దుర్లభమైనది. అనుకోకుండా ఆ సమయంలో వచ్చిన టూరిస్టు యాత్రికులు బడలికను లెక్కింపక పనిలో జొరబడినందున సామాను స్వస్థలం చేరినప్పటికి అరుణోదయ మైనది. ఇంతవరకు గాడిపొయ్యి వ్యర్థంగా సెగలు గక్కుతున్నది. టన్నుల వంటచెరకు కర్పూరహారతి అయినది. విచిత్రం ! వంట పరిసమాప్తి అగుటకు అయిదు గంటలు మాత్రమే పట్టినది. ఆవాలు, మెంతులు, జీలకర్ర లాంటివి బియ్యం బస్తాలలో కలసిపోవటం వలన వీటినీ వెదకుట ఒక పనియయినది. అమ్మ మిరకిల్ చేసి వుండ పోతే, వంట నిపుణుని లెక్కప్రకారం వంట పూర్తియవుటకు సూర్యాస్తమయం సమీపించేది.

కొన్ని సరకులను కొలిచేందుకు మానికలు కావాల్సి వచ్చింది. ఆ సమయంలో వీటిని సేకరించే దెట్లు? జగ్గులతోనే కొలుచుకొని సరిపెట్టుకోవలసి వచ్చింది. కొన్ని పదార్థాలు తూకం వేయుటకు కాటా కావాల్సి వచ్చింది. ఈ పనికై నియమింపబడిన మనుష్యులను వెదకుట కష్టమైనది. ఒక పందిరి నుండి మరొక పందిరికి వస్తువుల్ని తరలించవలెనంటే అరగంటకాలం పడుతుంది. చాలాచోట్ల నుండి వచ్చిన పాలు విరిగి పోకుండా చక్కటి పెరుగు తయారైనది. 13 చోట్ల తయారైన సాంబారు అంతటా ఒకే రుచి కనబడింది. దాదాపు ప్రతి మనిషినీ స్వర్ణోత్సవములో ఏదో ఒక అనుభవం ఆకట్టుకుంది. ఈ క్షీరధార చూచి తెల్ల ఏనుగు తొండంలా వుందన్నారు అమ్మ.

13వ తేదీ అర్ధరాత్రి వరకు జనాన్ని విసుగుకొనకుండా బలవంతంగా తినిపించారు. ఎంత తీసినా అన్నపురాశి పెరిగిందన్న వారున్నారు. జనం తాటాకులు పర్చుకొని పడుకున్న తీరును వెన్నెల పువ్వులా వుందన్నారు అమ్మ. స్వర్ణోత్సవాన్ని గూర్చి అమ్మ అన్నమాట – ఉత్సవాలలో పంచభూతాల సహకారం – ఎక్కువగా కనిపించింది. గాలి, ఎండ, నీరు – ఎక్కువా తక్కువా లేదు. పృథ్వి ఎంత సమర్థించింది?

మాగాణిలో రకరకాల పురుగులుంటాయి కదా? తేలు, పాములాంటివి ఏవీ రాలేదు. అంతా పూర్తి అయిన తర్వాత అవి బయలుదేరాయి. గాలి ఎక్కువగా విసిరితే గాడిపొయ్యిమీద మంట ఆనదు. ప్రకృతి సందేశమంటే అదే.

అమ్మ అప్పుడప్పుడు పిల్లలకు పెరుగు వేసి పెట్టాలంటుంది. లక్షలాది జనులు ఎంతగా గడ్డపెరుగు తిన్నా అదీ తరగలేదు – పులవలేదు. సోదరులు మల్లిఖార్జునరావు గారు స్వర్ణోత్సవ సంరంభాన్ని చూచి దీనిని ఒక ప్రత్యేక లోకంగా అభివర్ణించారు. ఎందరో యిట్టి మమతా మహోత్సవం కళ్ళారా చూచి ధన్యులమైనా మన్నారు. కదలివచ్చిన అన్నపూర్ణను చూచి చేతులు ముకుళించారు. ఒకనాడు అమ్మ కాలిమట్టెను చూచి అందు వడ్డన చేయుచున్నట్లు సుప్రతిష్ఠితమైన బొమ్మను చూపి యిదుగో అన్నపూర్ణ అన్నాను. నవ్వుతూ అమ్మపూర్ణంగా అన్నమే అన్నారు. ప్రాణికోటికి ఆ చల్లని ఆశీస్సు చాలదూ?

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!